కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ప్రభువు రాత్రి భోజనాన్ని ఎందుకు ఆచరిస్తాం?

మనం ప్రభువు రాత్రి భోజనాన్ని ఎందుకు ఆచరిస్తాం?

“నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి.” —1 కొరిం. 11:24.

1, 2. యేసు సా.శ. 33, నీసాను 14 రాత్రి ఏమి చేశాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

 అది సా.శ. 33, నీసాను 14. యెరూషలేములో చంద్రుడు నిండుగా ప్రకాశిస్తున్నాడు. యేసు, ఆయన అపొస్తలులు అప్పుడే పస్కా ఆచరణను ముగించారు. సుమారు 1500 సంవత్సరాల క్రితం, యెహోవా తమను ఐగుప్తు నుండి విడిపించినందుకు గుర్తుగా ఇశ్రాయేలీయులు పస్కాను ఆచరించేవాళ్లు. తర్వాత, యేసు తన నమ్మకమైన 11 మంది అపొస్తలులతో ఒక ప్రత్యేకమైన భోజనం చేశాడు. యేసు శిష్యులు ఆయన మరణాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతీ సంవత్సరం దాన్ని ఆచరించాలి. aమత్త. 26:1, 2.

2 యేసు ప్రార్థన చేసి, పులియని రొట్టెను తన అపొస్తలులకు ఇచ్చి “తీసికొని తినుడి” అని చెప్పాడు. తర్వాత ఆయన ద్రాక్షారసం ఉన్న గిన్నె పట్టుకుని, మళ్లీ ప్రార్థించి, “దీనిలోనిది మీరందరు త్రాగుడి” అన్నాడు. (మత్త. 26:26, 27) ఆ రొట్టె, ద్రాక్షారసం చాలా ప్రత్యేకమైనవి. ఆ ప్రాముఖ్యమైన రాత్రి యేసు తన నమ్మకమైన అపొస్తలులకు ఎన్నో విషయాలు చెప్పాడు.

3. మనం ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 తన మరణాన్ని శిష్యులు ప్రతీ సంవత్సరం గుర్తుచేసుకోవాలని యేసు కోరుకున్నాడు. దాన్నే ఆ తర్వాత “ప్రభువు రాత్రి భోజనము” లేదా జ్ఞాపకార్థ ఆచరణ అని పిలిచారు. (1 కొరిం. 11:20) అయితే మనకు కొన్ని ప్రశ్నలు రావచ్చు. మనం యేసు మరణాన్ని ఎందుకు గుర్తుచేసుకుంటాం? రొట్టె, ద్రాక్షారసం వేటికి సూచనగా ఉన్నాయి? జ్ఞాపకార్థ ఆచరణకు మనం ఎలా సిద్ధపడవచ్చు? రొట్టె, ద్రాక్షారసం ఎవరు తీసుకోవాలి? తమ నిరీక్షణను విలువైనదిగా ఎంచుతున్నామని క్రైస్తవులు ఎలా చూపించవచ్చు?

మనం యేసు మరణాన్ని ఎందుకు గుర్తుచేసుకుంటాం?

4. చనిపోవడం ద్వారా యేసు ఏ మార్గాన్ని తెరిచాడు?

4 ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆయన పిల్లలుగా మనం పాపాన్ని, మరణాన్ని పొందాం. (రోమా. 5:12) ఏ అపరిపూర్ణ మనిషీ పాపమరణాల నుండి తనను విడిపించుకోలేడు, వేరేవాళ్లను కూడా విడిపించలేడు. (కీర్త. 49:6-9) అయితే యేసు తన పరిపూర్ణ ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించి, ఆ బలి విలువను దేవునికి ఇచ్చాడు. అలా మనం పాపమరణాల నుండి విడుదల పొంది నిత్యం జీవించే మార్గాన్ని యేసు తెరిచాడు.—రోమా. 6:23; 1 కొరిం. 15:21, 22.

5. (ఎ) యెహోవా, యేసు మనల్ని ప్రేమిస్తున్నారని మనకెలా తెలుసు? (బి) మనం జ్ఞాపకార్థ ఆచరణకు ఎందుకు హాజరవ్వాలి?

5 మన కోసం తన కుమారుణ్ణి బలిగా అర్పించి మనమీద తనకు ఎంత ప్రేమ ఉందో యెహోవా చూపించాడు. (యోహా. 3:16) మన కోసం తన ప్రాణాన్నిచ్చి యేసు కూడా తన ప్రేమను చూపించాడు. భూమ్మీదకు రాకముందు నుండే యేసుకు మనుషులంటే చాలా ఇష్టం. (సామె. 8:30, 31) యెహోవా, యేసు మన కోసం చేసిన దానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. అందుకే “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి, జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతాం.—1 కొరిం. 11:23-25.

రొట్టె, ద్రాక్షారసం వేటికి సూచనగా ఉన్నాయి?

6. రొట్టె, ద్రాక్షారసం గురించి మనం ఏం తెలుసుకున్నాం?

6 ప్రభువు రాత్రి భోజనాన్ని మొదలుపెట్టినప్పుడు, యేసు అద్భుతరీతిలో తన శరీరాన్ని రొట్టెగా, తన రక్తాన్ని ద్రాక్షారసంగా మార్చలేదు. ఆయన రొట్టె గురించి ఇలా చెప్పాడు, “ఇది నా శరీరము.” తర్వాత ద్రాక్షారసం గురించి ఇలా అన్నాడు, “ఇది నిబంధన విషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము.” (మార్కు 14:22-24) కాబట్టి రొట్టె, ద్రాక్షారసం కేవలం చిహ్నాలు మాత్రమే.

7. జ్ఞాపకార్థ ఆచరణలో ఉపయోగించే పులియని రొట్టె దేనికి సూచనగా ఉంది?

7 పస్కా భోజనంలోని పులియని రొట్టెలనే ప్రభువు రాత్రి భోజనం కోసం యేసు ఉపయోగించాడు. (నిర్గ. 12:8) బైబిలు కొన్నిసార్లు పులిసిన పిండిని, పాపాన్ని సూచించడానికి ఉపయోగిస్తుంది. (మత్త. 16:6, 11, 12; లూకా 12:1) యేసు ఉపయోగించిన పులియని రొట్టె, ఏ పాపంలేని ఆయన శరీరాన్ని సూచించింది. (హెబ్రీ. 7:26) అందుకే మనం జ్ఞాపకార్థ ఆచరణలో పులియని రొట్టెను ఉపయోగిస్తాం.

8. ద్రాక్షారసం దేనికి సూచనగా ఉంది?

8 యేసు ఉపయోగించిన ద్రాక్షారసం ఆయన రక్తాన్ని లేదా ప్రాణాన్ని సూచించింది. అలాగే జ్ఞాపకార్థ ఆచరణలో మనం ఉపయోగించే ద్రాక్షారసం కూడా ఆయన రక్తానికి సూచనగా ఉంది. యెరూషలేముకు బయట ఉన్న గొల్గొతా అనే ప్రాంతంలో మన “పాపక్షమాపణ నిమిత్తము” ఆయన తన రక్తాన్ని చిందించాడు. (మత్త. 26:28; 27:33) ఈ బహుమానం ఎంత విలువైనదో మనం అర్థంచేసుకుంటే, ప్రతీ సంవత్సరం జరిగే జ్ఞాపకార్థ ఆచరణ కోసం మనలో ప్రతి ఒక్కరం సిద్ధపడతాం. మరి మనం ఎలా సిద్ధపడవచ్చు?

మనం ఎలా సిద్ధపడవచ్చు?

9. (ఎ) జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో చదవాల్సిన లేఖనాలను ఎందుకు ధ్యానించాలి? (బి) విమోచన క్రయధనం గురించి మీకు ఏమనిపిస్తుంది?

9 ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం చిన్నపుస్తకంలో జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో చదవాల్సిన లేఖనాల పట్టిక ఉంటుంది. వాటిని చదువుతూ, యేసు చనిపోయే ముందు చేసినవాటి గురించి ధ్యానిస్తూ మనం జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడవచ్చు. b ఒక సహోదరి ఇలా రాసింది, ‘మేము జ్ఞాపకార్థ ఆచరణ కోసం ఎంతో ఎదురుచూస్తాం. సంవత్సరాలు గడిచేకొద్దీ అది మాకు మరింత ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది. చనిపోయిన మా నాన్నగారి వైపు చూస్తూ, విమోచన క్రయధనం ఎంత విలువైనదో అర్థం చేసుకున్న ఆ క్షణం నాకింకా గుర్తుంది. విమోచన క్రయధనం గురించిన లేఖనాలన్నీ నాకు తెలుసు, వాటిని ఎలా వివరించాలో కూడా తెలుసు. కానీ, మరణం ఎంత భయంకరమైనదో చూసిన తర్వాతే, విమోచన క్రయధనం వల్ల వచ్చే ప్రయోజనాలను అర్థంచేసుకుని ఎంతో సంతోషించాను.’ యేసు అర్పించిన బలి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో ధ్యానించడం ద్వారా మనం కూడా సిద్ధపడవచ్చు.

జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో చదవాల్సిన లేఖనాలను చదువుతూ ఆచరణకు సిద్ధపడండి (9వ పేరా చూడండి)

10. జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడడానికి ఇంకో మార్గం ఏంటి?

10 జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడడానికి ఇంకో మార్గం, పరిచర్యలో ఎక్కువ సమయం గడుపుతూ, సాధ్యమైనంత ఎక్కువ మందిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించడం. వీలైతే సహాయ పయినీరు సేవ కూడా చేయవచ్చు. యెహోవా గురించి, యేసు గురించి, నిత్యజీవం గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు, దేవున్ని సంతోషపెట్టే పని చేస్తున్నామనే సంతృప్తి మనకు ఉంటుంది.—కీర్త. 148:12, 13.

11. కొరింథు సంఘంలోని కొంతమంది జ్ఞాపకార్థ చిహ్నాలపట్ల ఎలా అగౌరవాన్ని చూపించారు?

11 జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతున్నప్పుడు, పౌలు కొరింథులోని క్రైస్తవులకు చెప్పిన విషయాలను ధ్యానించండి. (1 కొరింథీయులు 11:27-34 చదవండి.) ఎవరైనా అర్హత లేకుండా లేదా అగౌరవంగా రొట్టె తిని, ద్రాక్షారసం తాగితే, వాళ్లు “ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు” అపరాధులౌతారని పౌలు చెప్పాడు. కాబట్టి తప్పు చేసిన ఓ అభిషిక్తుడు రొట్టె-ద్రాక్షారసం తీసుకుంటే, ‘శిక్షకు గురౌతాడు’. [పరిశుద్ధ బైబల్‌, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌] మొదటి శతాబ్దంలో కొరింథు సంఘంలోని చాలామంది గంభీరమైన తప్పు చేశారు. బహుశా వాళ్లలో కొంతమంది ప్రభువు రాత్రి భోజనానికి ముందుగానీ దాన్ని ఆచరిస్తున్న సమయంలోగానీ అతిగా తిని, తాగివుంటారు. దానివల్ల ఆ ఆచరణ జరుగుతున్నప్పుడు వాళ్లు నిద్రమత్తులో ఉండవచ్చు. అలా వాళ్లు ఆ ఆచరణకు ఏమాత్రం గౌరవం చూపించలేదు కాబట్టి వాళ్లు రొట్టె, ద్రాక్షారసం తీసుకున్నప్పుడు, దేవుడు వాళ్లను అంగీకరించలేదు.

12. (ఎ) జ్ఞాపకార్థ ఆచరణను పౌలు దేనితో పోల్చాడు? రొట్టె, ద్రాక్షారసం తీసుకునే వాళ్లకు ఆయన ఏ హెచ్చరిక ఇచ్చాడు? (బి) అలాంటి వాళ్లు ఏదైనా పెద్ద తప్పు చేస్తే ఏమి చేయాలి?

12 జ్ఞాపకార్థ ఆచరణను భోజనంతో పోలుస్తూ పౌలు ఇలా హెచ్చరించాడు, “మీరు ప్రభువు పాత్ర లోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్న దానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.” (1 కొరిం. 10:16-21) రొట్టె, ద్రాక్షారసం తీసుకునే వ్యక్తి ఏదైనా పెద్ద తప్పు చేస్తే, సంఘ పెద్దల సహాయం తీసుకోవాలి. (యాకోబు 5:14-16 చదవండి.) నిజంగా పశ్చాత్తాపపడి తన ప్రవర్తన మార్చుకోవాలి. అలా చేస్తేనే రొట్టె, ద్రాక్షారసం తీసుకునేటప్పుడు యేసు బలిపట్ల తనకు ఎంతో గౌరవం ఉందని చూపిస్తాడు.—లూకా 3:8.

13. దేవుడు మనకు ఇవ్వబోయే భవిష్యత్తు గురించి ప్రార్థిస్తూ ఆలోచించడం ఎందుకు ప్రాముఖ్యం?

13 జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడడానికి మరో మార్గం ఏంటంటే, దేవుడు మనకు ఇవ్వబోయే భవిష్యత్తు గురించి ప్రార్థిస్తూ ఆలోచించడం. మనలో కొంతమంది పరలోకానికి వెళ్తారు, ఇంకొంతమంది ఇదే భూమ్మీద నిత్యం జీవిస్తారు. కాబట్టి, తనకు పరలోక నిరీక్షణ ఉందో లేదో స్పష్టంగా తెలియకుండా ఓ వ్యక్తి రొట్టె, ద్రాక్షారసం తీసుకుంటే, యేసు బలిపట్ల అగౌరవం చూపించినవాడౌతాడు. మరి వాటిని ఎవరు తీసుకోవాలి?

రొట్టె, ద్రాక్షారసం ఎవరు తీసుకోవాలి?

14. రొట్టె, ద్రాక్షారసం ఎవరు తీసుకోవాలి? ఎందుకు?

14 క్రొత్త నిబంధనలో సభ్యులుగా ఉన్నవాళ్లు మాత్రమే రొట్టె, ద్రాక్షారసం తీసుకోవాలి. ద్రాక్షారసం గురించి యేసు ఇలా చెప్పాడు, “యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన.” (1 కొరిం. 11:25) యెహోవా ఇశ్రాయేలీయులతో ఒకప్పుడు ధర్మశాస్త్ర నిబంధన చేశాడు. అయితే తర్వాత, దాని బదులు ఒక క్రొత్త నిబంధన చేస్తానని యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. (యిర్మీయా 31:31-34 చదవండి.) యెహోవా ఆ క్రొత్త నిబంధనను లేదా ఒప్పందాన్ని అభిషిక్తులతో చేశాడు. (గల. 6:15, 16) అది యేసు మరణం ద్వారా అమలులోకి వచ్చింది. (లూకా 22:20) యేసు ఆ నిబంధనకు మధ్యవర్తి. దానిలో సభ్యులుగా ఉన్న నమ్మకమైన అభిషిక్తులు యేసుతో పాటు పరలోకంలో జీవిస్తారు.—హెబ్రీ. 8:6; 9:15.

15. ఎవరు రాజ్య నిబంధనలో సభ్యులుగా ఉంటారు? వాళ్లు నమ్మకంగా ఉంటే ఏ గొప్ప అవకాశాన్ని పొందుతారు?

15 తాము రాజ్య నిబంధనలో కూడా సభ్యులమని అభిషిక్తులకు తెలుసు. (లూకా 12:32 చదవండి.) ‘తన శ్రమల్లో’ తనను నమ్మకంగా అంటిపెట్టుకున్న అభిషిక్త అనుచరులతో యేసు ఈ నిబంధన చేశాడు. (ఫిలి. 3:10, 11) ఇప్పుడున్న నమ్మకమైన అభిషిక్తులు కూడా ఆ నిబంధనలో సభ్యులే. వాళ్లు యేసుతో పాటు పరలోకంలో ఎల్లప్పుడూ రాజులుగా పరిపాలిస్తారు. (ప్రక. 22:5) ప్రభువు రాత్రి భోజనం సమయంలో రొట్టె, ద్రాక్షారసం తీసుకోవడానికి వాళ్లు అర్హులు.

16. రోమీయులు 8:15-17లో ఏముందో క్లుప్తంగా వివరించండి.

16 తాము దేవుని పిల్లలమనీ రొట్టె-ద్రాక్షారసం తీసుకోవచ్చనీ అభిషిక్తులకు ఖచ్చితంగా తెలుసు. (రోమీయులు 8:15-17 చదవండి.) వాళ్లు దేవుణ్ణి “అబ్బా తండ్రీ” అని పిలుస్తారని పౌలు అన్నాడు. “అబ్బా” అనేది అరామిక్‌ భాషా పదం. ఆ పిలుపులో “నాన్నా” అని ప్రేమగా పిలవడం, “తండ్రీ” అని గౌరవంగా పిలవడం రెండూ ఉన్నాయి. ‘దేవుని కుమారులయ్యే ఆత్మను’ పొందిన అభిషిక్తులకు, యెహోవాతో ఎంత ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందో ఆ పిలుపు సూచిస్తుంది. [పరిశుద్ధ బైబల్‌, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌] దేవుని ఆత్మ వాళ్లకు ‘సాక్ష్యమిస్తుంది’ కాబట్టి తాము దేవుని అభిషిక్త కుమారులమని వాళ్లకు అర్థమౌతుంది. అంటే దానర్థం వాళ్లకు ఈ భూమ్మీద జీవించడం ఇష్టం లేదని కాదు. కానీ, మరణం వరకు నమ్మకంగా ఉంటే, తాము పరలోకంలో యేసుతో పాటు పరిపాలిస్తామని వాళ్లకు తెలుసు. అంతేకాదు, తాము ‘పరిశుద్ధుడైన’ యెహోవా చేత “అభిషేకము” పొందామని కూడా వాళ్లకు తెలుసు. దేవుని కుమారులైన ఈ 1,44,000 మందిలో ఇప్పుడు కొద్దిమంది అభిషిక్తులు మాత్రమే భూమ్మీద ఉన్నారు. (1 యోహా. 2:20; ప్రక. 14:1) వాళ్లకు యెహోవాతో ఎంతటి అనుబంధం ఉందంటే, వాళ్లు ఆయనను “అబ్బా తండ్రీ” అని పిలుస్తారు.

మీ నిరీక్షణను విలువైనదిగా చూడండి

17. అభిషిక్త క్రైస్తవులకు ఏ నిరీక్షణ ఉంది? తాము అభిషిక్తులమని వాళ్లకు ఎలా తెలుస్తుంది?

17 మీరు అభిషిక్తులైతే, మీ పరలోక నిరీక్షణ గురించి ఎన్నోసార్లు ప్రార్థించివుంటారు. అంతేకాదు, బైబిల్లోని కొన్ని లేఖనాలు మీకోసమే అన్నట్లు మీకనిపిస్తాయి. ఉదాహరణకు, పరలోకంలో యేసుకు ‘పెళ్లి కుమార్తెతో’ జరిగే వివాహం గురించి బైబిల్లో చదువుతున్నప్పుడు, అది మీ గురించే చెప్తుందని మీకు తెలుసు. కాబట్టి దానికోసం మీరు ఆశతో ఎదురుచూస్తారు. (2 కొరిం. 11:2; యోహా. 3:27-29; ప్రక. 21:2, 9-14) అలాగే అభిషిక్తుల మీద యెహోవాకున్న ప్రేమ గురించి బైబిల్లో చదువుతున్నప్పుడు, అదీ మీ గురించేనని మీకు తెలుసు. అంతేకాదు ప్రత్యేకంగా అభిషిక్తులకు దేవుడిచ్చిన నిర్దేశాలను బైబిల్లో చదువుతున్నప్పుడు, వాటికి లోబడేలా పరిశుద్ధాత్మ మిమ్మల్ని కదిలిస్తుంది. మీకు పరలోక నిరీక్షణ ఉందని పరిశుద్ధాత్మ మీకు ‘సాక్ష్యమిస్తుంది.’

18. ‘వేరే గొర్రెలకు’ ఏ నిరీక్షణ ఉంది? దాని గురించి మీకు ఏమనిపిస్తుంది?

18 మీరు ‘వేరే గొర్రెలకు’ చెందిన ‘గొప్పసమూహంలో’ ఒకరైతే, మీకు పరదైసు భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణ ఉంది. (ప్రక. 7:9; యోహా. 10:16) దాని గురించి మీకు ఏమనిపిస్తుంది? పరదైసు గురించి బైబిల్లో చదువుతున్నప్పుడు మీరు ఎంతో సంతోషిస్తారు. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి శాంతియుతమైన నూతనలోకంలో జీవించాలని మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆకలి, పేదరికం, బాధలు, జబ్బులు, మరణం ఉండని రోజు కోసం మీరు ఎదురుచూస్తున్నారు. (కీర్త. 37:10, 11, 29; 67:6; 72:7, 16; యెష. 33:24) చనిపోయిన మీ వాళ్లను మళ్లీ చూడాలని ఎంతో ఆత్రుతతో ఉన్నారు. (యోహా. 5:28, 29) ఇలాంటి అద్భుతమైన నిరీక్షణను ఇచ్చినందుకు యెహోవాకు మీరు ఎంత రుణపడి ఉన్నారో! మీరు రొట్టె, ద్రాక్షారసం తీసుకోకపోయినా, యేసు బలిపట్ల మీకు కృతజ్ఞత ఉంది కాబట్టి జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతారు.

మీరూ హాజరౌతారా?

19, 20. (ఎ) నిత్యజీవం పొందాలంటే మీరు ఏమి చేయాలి? (బి) జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు?

19 మీరు భూమ్మీదైనా, పరలోకంలోనైనా నిత్యం జీవించాలంటే, యెహోవా మీద, యేసుక్రీస్తు మీద, విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచాలి. మీరు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనప్పుడు, మీ నిరీక్షణ గురించి, యేసు మరణానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎక్కువగా ఆలోచించగలుగుతారు. 2015 ఏప్రిల్‌ 3, శుక్రవారం సూర్యాస్తమయం తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ప్రజలు రాజ్యమందిరాల్లో, ఇతర ప్రదేశాల్లో జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతారు.

20 మనం బాగా సిద్ధపడి జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనప్పుడు, యేసు బలిపట్ల మన కృతజ్ఞత పెరుగుతుంది. అక్కడ ఇచ్చే ప్రసంగాన్ని శ్రద్ధగా వింటే, ఇతరులను ప్రేమించాలనే ప్రోత్సాహాన్ని పొందుతాం. అంతేకాదు వాళ్లకు యెహోవా ప్రేమ గురించి, మనుషుల విషయంలో ఆయన సంకల్పం గురించి చెప్పాలని కోరుకుంటాం. (మత్త. 22:34-40) కాబట్టి ఏదేమైనా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వాలని నిర్ణయించుకోండి.

a హెబ్రీయులు, సూర్యుడు అస్తమించిన సమయం నుండి తర్వాతి రోజు సూర్యాస్తమయం వరకు ఒక రోజుగా లెక్కించేవాళ్లు.

b దేవుని వాక్యం అధ్యయనం చేయడానికి మార్గదర్శి అనే చిన్నపుస్తకంలో 16వ భాగం చూడండి.