ఫిలిప్పీయులు 3:1-21

  • శరీరం విషయంలో గొప్పలు చెప్పుకోను (1-11)

    • క్రీస్తు కోసం అన్నిటినీ నష్టంగా ఎంచాను (7-9)

  • లక్ష్యం వైపే పరుగెత్తుతున్నాను (12-21)

    • పరలోకంలో పౌరసత్వం (20)

3  చివరిగా, నా సహోదరులారా, ప్రభువు సేవలో ఆనందిస్తూ ఉండండి.+ రాసిన విషయాల్నే మీకు మళ్లీ రాయడం నాకు కష్టమేమీ కాదు, నేను రాసేది మీ మంచి కోసమే.  కుక్కల* విషయంలో జాగ్రత్త; హాని తలపెట్టేవాళ్ల విషయంలో జాగ్రత్త; సున్నతి చేయించుకోవాలని పట్టుబట్టేవాళ్ల*+ విషయంలో జాగ్రత్త.  ఎందుకంటే, మనం చేసుకున్నదే అసలైన సున్నతి;+ మనం దేవుని పవిత్రశక్తితో పవిత్రసేవ చేస్తున్నాం, శరీరం విషయంలో కాకుండా క్రీస్తుయేసు విషయంలో గొప్పలు చెప్పుకుంటున్నాం.+  శరీరం విషయంలో గొప్పలు చెప్పుకోవాలనుకుంటే నేను కూడా చెప్పుకోగలను. ఆ మాటకొస్తే, గొప్పలు చెప్పుకోవడానికి వేరే ఎవ్వరి కన్నా నాకే ఎక్కువ కారణాలు ఉన్నాయి.  నేను ఎనిమిదో రోజున సున్నతి పొందాను,+ ఇశ్రాయేలీయుణ్ణి, బెన్యామీను గోత్రం వాణ్ణి, అసలైన హెబ్రీయుణ్ణి,+ ధర్మశాస్త్రం పాటించే విషయానికొస్తే, పరిసయ్యుణ్ణి;+  ఉత్సాహం మాటకొస్తే, సంఘాన్ని హింసించాను;+ ధర్మశాస్త్రం ద్వారా కలిగే నీతి విషయానికొస్తే, నిందలేనివాణ్ణి.  అయితే, ఏవేవి నాకు లాభంగా ఉన్నాయో వాటిని నేను క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకున్నాను.*+  చెప్పాలంటే, నా ప్రభువైన క్రీస్తుయేసు గురించిన సాటిలేని జ్ఞానం కోసం నేను అన్నిటినీ నష్టంగా ఎంచుకుంటున్నాను. ఆయన కోసం నేను అన్నీ వదులుకున్నాను, వాటిని చెత్తతో సమానంగా ఎంచుతున్నాను. ఎందుకంటే నేను క్రీస్తు అనుగ్రహం పొందాలని,  ఆయనతో ఐక్యంగా ఉండాలని అనుకుంటున్నాను; ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కలిగే నా సొంత నీతిని బట్టి కాదుగానీ క్రీస్తు మీద విశ్వాసం వల్ల దేవుడు అనుగ్రహించే నీతిని+ బట్టి అలా ఉండాలని నా కోరిక. 10  నా లక్ష్యం ఏమిటంటే క్రీస్తును, ఆయన పునరుత్థానానికి ఉన్న శక్తిని+ తెలుసుకోవాలి, ఆయనలా బాధలు అనుభవించాలి,+ ఆయనలా చనిపోవాలి.+ 11  సాధ్యమైతే నేను మొదటి పునరుత్థానంలో ఉండాలన్నదే నా ఉద్దేశం.+ 12  నేను ఇప్పటికే బహుమతిని పొందాననో, పరిపూర్ణుడిని అయ్యాననో అనుకోవట్లేదు. బదులుగా, క్రీస్తుయేసు దేని కోసమైతే నన్ను ఎంచుకున్నాడో* దాన్ని పట్టుకోవడానికి+ నేను కృషిచేస్తూ ఉన్నాను.+ 13  సహోదరులారా, నేను ఇప్పటికే దాన్ని పట్టుకున్నానని అనుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వెనక ఉన్నవాటిని మర్చిపోయి,+ ముందున్న వాటి కోసం పరుగెత్తుతున్నాను. 14  క్రీస్తుయేసు ద్వారా దేవుడు తాను పిలిచినవాళ్లకు ఇచ్చే బహుమతిని, అంటే పరలోక జీవితాన్ని పొందాలని నేను లక్ష్యం వైపే పరుగెత్తుతున్నాను.+ 15  కాబట్టి, మనలో పరిణతి చెందినవాళ్లం+ ఇదే మనస్తత్వాన్ని కలిగివుందాం. ఒకవేళ ఏ విషయంలోనైనా మీ ఆలోచన వేరుగా ఉంటే, మీరు సరైన మనస్తత్వాన్ని కలిగివుండడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. 16  ఏదేమైనా, మనం ప్రగతి సాధించినమేరకు ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉందాం. 17  సహోదరులారా, మీరందరూ నన్ను ఆదర్శంగా తీసుకోండి.+ మేము ఉంచిన ఆదర్శానికి తగ్గట్టు నడుచుకునేవాళ్లను గమనిస్తూ ఉండండి. 18  ఎందుకంటే క్రీస్తు హింసాకొయ్యకు* శత్రువుల్లా నడుచుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ల గురించి నేను తరచూ చెప్పేవాణ్ణి, ఇప్పుడు కూడా కన్నీళ్లతో చెప్తున్నాను. 19  నాశనమే వాళ్ల అంతం; వాళ్ల కోరికలే* వాళ్ల దేవుడు; సిగ్గుపడాల్సిన విషయాల గురించి వాళ్లు గర్వపడుతున్నారు; వాళ్ల మనసంతా లోకసంబంధ విషయాల పైనే ఉంది.+ 20  కానీ మన పౌరసత్వం+ పరలోకంలో ఉంది;+ అక్కడి నుండి వచ్చే రక్షకుని కోసం, అంటే ప్రభువైన యేసుక్రీస్తు కోసం మనం ఆతురతతో ఎదురుచూస్తున్నాం.+ 21  అన్నిటినీ లోబర్చుకోగల+ తన గొప్పశక్తితో ఆయన మన బలహీనమైన శరీరాన్ని తన మహిమాన్విత శరీరంలా మారుస్తాడు.+

అధస్సూచీలు

అంటే, అపవిత్రుల.
లేదా “శరీరాన్ని కోసుకునేవాళ్ల.”
లేదా “ఇష్టపూర్వకంగా వదులుకున్నాను” అయ్యుంటుంది.
అక్ష., “పట్టుకున్నాడో.”
పదకోశం చూడండి.
అక్ష., “కడుపే.”