కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దుష్టత్వం వెనకున్నది ఎవరో బహిర్గతమైంది!

దుష్టత్వం వెనకున్నది ఎవరో బహిర్గతమైంది!

దుష్టత్వం వెనకున్నది ఎవరో బహిర్గతమైంది!

మొదటి శతాబ్దంలో చాలామంది యూదులు, వాగ్దానం చేయబడిన మెస్సీయ రాక కోసం ఎదురుచూస్తున్నారు. (యోహాను 6:​14) యేసు భూమ్మీదికి వచ్చినప్పుడు ప్రజలకు ఓదార్పునిచ్చి, దేవుని వాక్యాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేశాడు. ఆయన రోగులను స్వస్థపరిచాడు, ఆకలిగొన్నవారికి ఆహారమిచ్చాడు, వాతావరణ పరిస్థితులను నియంత్రించాడు, చివరికి చనిపోయినవారిని తిరిగి బ్రతికించాడు. (మత్తయి 8:​26; 14:​14-21; 15:​30, 31; మార్కు 5:​38-43) ఆయన యెహోవా మాటలనే పలికాడు, నిత్యజీవ నిరీక్షణ గురించి తెలియజేశాడు. (యోహాను 3:​33, 34) మానవజాతిని పాపం నుండి, దానివల్ల కలిగే చెడు పర్యవసానాలన్నిటి నుండి విడిపించే మెస్సీయను తానేనని యేసు తన మాటల ద్వారా, చేతల ద్వారా స్పష్టంగా చూపించాడు.

న్యాయంగా చెప్పాలంటే, అందరికన్నా ముందు యూదా మతనాయకులే యేసును అంగీకరించి, ఆయన చెప్పిన విషయాలను విని, ఆయన నిర్దేశాన్ని సంతోషంగా స్వీకరించాల్సింది. అయితే, వారలా చేయలేదు. బదులుగా, వారాయనను ద్వేషించి, హింసించి, ఆయనను చంపడానికి కుట్రపన్నారు!​—⁠మార్కు 14:⁠1; 15:​1-3, 10-15.

యేసు సహేతుకంగానే ఆ దోషులను ఖండించాడు. (మత్తయి 23:​33-35) అయితే, వారి దుష్టాలోచనలకు, దుష్టక్రియలకు వారితోపాటు మరో వ్యక్తి కూడా బాధ్యుడని ఆయన గుర్తించాడు. ఆయన వారితో ఇలా అన్నాడు: “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.” (యోహాను 8:​44) మానవులు దుష్టకార్యాలు చేయగలరని యేసు అంగీకరించినా, దుష్టత్వం వెనకున్నది అపవాదియగు సాతానేనని ఆయన వెల్లడిచేశాడు.

సాతాను “సత్యమందు నిలిచినవాడు కాడు” అని చెప్పడం ద్వారా యేసు ఆ ఆత్మప్రాణి ఒకప్పుడు దేవుని నమ్మకమైన సేవకునిగా ఉండేవాడనీ అయితే ఆ తర్వాత ఆ సరైన మార్గం నుండి తొలగిపోయాడనీ వెల్లడిచేశాడు. సాతాను యెహోవాకు ఎందుకు ఎదురుతిరిగాడు? ఎందుకంటే అతడు అహంకారపూరిత భావాలను ఎంతగా పెంచుకున్నాడంటే, దేవునికి మాత్రమే చెందాల్సిన ఆరాధన తనకు కావాలని కోరుకున్నాడు.​—⁠మత్తయి 4:​8, 9.

సాతాను ఏదెను తోటలో, నిషేధించబడిన పండు తినేలా హవ్వను మోసగించినప్పుడు అతడి తిరుగుబాటు బహిర్గతమైంది. అతడు మొట్టమొదటిసారిగా అబద్ధం చెప్పడం ద్వారా, యెహోవాపై కొండెములు చెప్పడం ద్వారా ‘అబద్ధానికి జనకుడయ్యాడు.’ అంతేకాక, అతడు ఆదాముహవ్వలు అవిధేయత చూపించేలా వారిని ప్రలోభపెట్టడం ద్వారా పాపం వారిపై ఆధిపత్యం చేసేందుకు, చివరకు వారు, భవిష్యత్‌ తరాలవారు మరణించడానికి కారణమయ్యాడు. అలా సాతాను ‘నరహంతకుడిగా’ కూడా మారాడు, నిజానికి అతడు అత్యంత క్రూరమైన నరహంతకుడు!​—⁠ఆదికాండము 3:​1-6; రోమీయులు 5:⁠12.

సాతాను దుష్టప్రభావం పరలోకానికి కూడా చేరుకుంది, అక్కడ అతడు ఇతర దేవదూతలు తనతోపాటు తిరుగుబాటులో పాల్గొనేలా వారిని మభ్యపెట్టాడు. (2 పేతురు 2:⁠4) సాతానులాగే, ఆ దుష్ట దేవదూతలు మానవులపట్ల అనుచిత ఆసక్తి కనబరిచారు. అయితే, వారు తుచ్ఛమైన లైంగికాసక్తి కనపర్చారు, దానివల్ల నాశనకరమైన దుష్పరిణామాలు ఎదురయ్యాయి.

దుష్టత్వం భూవ్యాప్తంగా విస్తరించడం

బైబిలు మనకిలా చెబుతోంది: “నరులు . . . విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.” (ఆదికాండము 6:​1, 2) ఇక్కడ పేర్కొనబడిన “దేవుని కుమారులు” ఎవరు? వారు మానవులు కాదు, ఆత్మప్రాణులు. (యోబు 1:⁠6; 2:⁠1) అలాగని మనకెలా తెలుసు? ఒక విషయమేమిటంటే, దాదాపు 1,500 సంవత్సరాలుగా మానవుల మధ్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి, మానవ రూపం దాల్చిన ‘దేవుని కుమారులు నరుల కుమార్తెలతో’ పెట్టుకున్న లైంగికసంబంధాల గురించి ప్రస్తావించినప్పుడు, ఆ వృత్తాంతం ముందెప్పుడూ జరగనిదాని గురించి, అసహజమైనదాని గురించి పేర్కొన్నది.

వారి కలయిక అసహజమైనదని, ఆ కలయిక వల్ల వారికి పుట్టిన సంతానం ధృవీకరించింది. నెఫీలులు అని పిలువబడిన ఆ సంకరజాతి సంతానం భారీకాయులుగా తయారయ్యారు. వారు ఇతరులను క్రూరంగా హింసించేవారు కూడా. నిజానికి, “నెఫీలులు” అనే పదానికి “బలాత్కారులు” లేదా “ఇతరులపై తమ బలాన్ని ప్రదర్శించేవారు” అని అర్థం. ఆ క్రూరులు “పూర్వకాలమందు పేరు పొందిన శూరులు” అని వర్ణించబడ్డారు.​—⁠ఆదికాండము 6:⁠4, అధస్సూచి.

నెఫీలులు, వారి తండ్రులు దుష్టత్వాన్ని ముందెప్పుడూ లేనంత ఎక్కువచేశారు. “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను” అని ఆదికాండము 6:​11 చెబుతోంది. అవును, మానవులు తమ మధ్యకు కొత్తగా వచ్చినవారి దౌర్జన్యపూరిత, అనైతిక మార్గాలనే అనుసరించడం మొదలుపెట్టారు.

నెఫీలులు, వారి తండ్రులు మానవులపై అంత శక్తివంతమైన దుష్టప్రభావాన్ని ఎలా చూపించారు? పాపభరిత ప్రవృత్తి, కోరికలు ఉన్న మానవజాతికి ఆకర్షణీయమైన పనులు చేసి చూపించడం ద్వారా వారు అలాంటి ప్రభావం చూపించారు. దాని ఫలితమేమిటి? ‘భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి.’ చివరకు యెహోవా భూవ్యాప్త జలప్రళయం రప్పించి ఆ లోకాన్ని నాశనం చేశాడు, కానీ నీతిమంతుడైన నోవహును, ఆయన కుటుంబాన్ని మాత్రం రక్షించాడు. (ఆదికాండము 6:​5, 12-22) అయితే, మానవ శరీరాలు దాల్చిన ఆ దేవదూతలు అవమానభారంతో పరలోకానికి తిరిగివెళ్లారు. తమ స్థానాన్ని కోల్పోయిన ఆ దుష్టదేవదూతలు దేవుణ్ణి, నమ్మకమైన దేవదూతల ఆయన నీతిగల కుటుంబాన్ని వ్యతిరేకించడంలో కొనసాగారు. అప్పటినుండే ఆ దుష్టాత్మలు మళ్లీ మానవ శరీరాలు దాల్చడాన్ని దేవుడు నిషేధించాడని స్పష్టమౌతోంది. (యూదా 6) అయినా, వారు మానవ వ్యవహారాలను ఎంతగానో ప్రభావితం చేస్తూనే ఉన్నారు.

దుష్టుడు పూర్తిగా బహిర్గతం చేయబడ్డాడు!

సాతాను దుష్టప్రభావం ఎంత విస్తృతంగా ఉందనే విషయం గురించి 1 యోహాను 5:⁠19 ఇలా చెబుతోంది: “లోకమంతయు దుష్టుని యందున్నది.” అపవాది మానవజాతి అంతకంతకూ ఎక్కువౌతున్న కష్టాల ఊబిలోకి కూరుకుపోయేలా చేస్తున్నాడు. నిజానికి, అతడు ముందెప్పటికన్నా ఇప్పుడు మానవులకు హాని చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ఎందుకు? ఎందుకంటే 1914లో దేవుని రాజ్యం స్థాపించబడిన తర్వాత అతడు, అతడి దయ్యాలు పరలోకం నుండి వెలివేయబడ్డారు. అలా వెలివేయబడడం గురించి బైబిలు ముందుగానే ఇలా తెలియజేసింది: ‘భూమీ నీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై నీయొద్దకు దిగివచ్చియున్నాడు.’ (ప్రకటన 12:​7-12) మరి సాతాను నేడు మానవజాతిపై ఎలా ప్రభావం చూపిస్తున్నాడు?

సాతాను ముఖ్యంగా ప్రజల ఆలోచనా విధానాన్ని, వారి క్రియల్ని నియంత్రించే వైఖరిని వారిలో పెంపొందించడం ద్వారా అలా చేస్తున్నాడు. అందుకే ఎఫెసీయులు 2:2 అపవాదిని ‘వాయుమండల సంబంధమైన అధిపతి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి [లేదా, ప్రబల వైఖరికి] అధిపతి’ అని పిలుస్తోంది. దయ్యాల సంబంధమైన ఆ ‘వాయువు’ దైవభక్తిని, నీతిని ప్రోత్సహించే బదులు దేవునికి, ఆయన ప్రమాణాలకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రేరేపిస్తుంది. అలా సాతాను, అతడి దయ్యాలు మానవుల దుష్టకార్యాలను ప్రోత్సహించి, వాటి తీవ్రతను పెంచుతున్నారు.

“నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము”

ఆ ‘వాయువు’ ప్రధానంగా, అనుచిత లైంగిక కోరికలను రేకెత్తించి, జుగుప్సాకరమైన ప్రవర్తన ఆకర్షణీయంగా కనిపించేలా చేసే అశ్లీల చిత్రాల ద్వారా, అశ్లీల సాహిత్యం ద్వారా మనల్ని ప్రభావితం చేస్తుంది. (1 థెస్సలొనీకయులు 4:​3-5) అత్యాచారం, క్రూరమైన కామవికారం, సామూహిక అత్యాచారం, జంతువులతో లైంగికానందం, పిల్లలపై అత్యాచారం వంటి కొన్ని విషయాలు అశ్లీల చిత్రాల్లో, అశ్లీల సాహిత్యంలో వినోదాంశాలుగా అందించబడుతున్నాయి. అంత హానికరం కాదని భావించబడే అశ్లీల చిత్రాలు, అశ్లీల సాహిత్యం కూడా వాటికి బానిసలుగా మారేలా చేయవచ్చు, అంతేకాక వాటిని చూసేవారు, చదివేవారు అవి లేనిదే లైంగికానందం పొందలేని స్థితికి చేరుకునేలా చేసి వారికి హాని చేయవచ్చు. * అవి మానవ బాంధవ్యాలను, అలాగే దేవునితో ఒక వ్యక్తికున్న సంబంధాన్ని నాశనం చేసే చెడుక్రియలు. అవి, వాటిని ప్రోత్సహించే దయ్యాల తుచ్ఛమైన మానసిక వైఖరిని ప్రతిబింబిస్తాయి, జలప్రళయానికి ముందు నోవహు కాలంలో అనుచిత లైంగిక వాంఛలను పెంపొందించుకున్న దయ్యాలు ఇవే. *

జ్ఞానియైన సొలొమోను మంచి కారణంతోనే ఇలా ఉపదేశించాడు: “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.” (సామెతలు 4:​23) మీ హృదయాన్ని అశ్లీలమైనవాటి నుండి కాపాడుకోవడానికి మీరు వాస్తవంగా ఏమి చేయాలంటే, జుగుప్సాకరమైన చిత్రాలు కనిపించినప్పుడు టీవీ ఛానెల్లను మార్చేయాలి లేదా కంప్యూటర్‌ను ఆఫ్‌ చేసేయాలి, అంతేకాదు మీరు ఏమాత్రం తటపటాయించకుండా వెంటనే చర్య తీసుకోవడం ప్రాముఖ్యం! తన హృదయంపైకి గురిపెట్టబడిన క్షిపణిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక సైనికుని స్థానంలో మీరు ఉన్నట్లు ఊహించుకోండి. సాతాను ప్రేరణకు, కోరికలకు మూలమైన మీ సూచనార్థక హృదయంపైకి గురిపెట్టి, దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు.

అంతేగాక దౌర్జన్యాన్ని ఇష్టపడకుండా మీరు మీ హృదయాన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే ‘దౌర్జన్యాన్ని ఇష్టపడేవాళ్లను యెహోవా ద్వేషిస్తాడు’ అని అపవాదికి తెలుసు. (కీర్తన 11:⁠5, పవిత్ర గ్రంథం​—⁠వ్యాఖ్యాన సహితం) మిమ్మల్ని దేవునికి శత్రువుగా చేయడానికి, సాతాను మిమ్మల్ని రక్తదాహంగల దుష్టునిగా మార్చాల్సిన అవసరమేమీ లేదు; మీరు దౌర్జన్యాన్ని ఇష్టపడేలా మిమ్మల్ని పురికొల్పితే చాలు. అందుకే ప్రజాదరణ పొందిన ప్రచారమాధ్యమాల్లో దౌర్జన్యం అధికంగా చూపించబడడం, అదీ తరచూ మానవాతీత శక్తులకు సంబంధించిన అంశాలతో చూపించబడడం యాదృచ్ఛికమేమీ కాదు. నెఫీలులు ఇప్పుడిక ఉనికిలో లేకుండా పోయినా వారి ప్రవృత్తి, ప్రవర్తన నేటికీ సజీవంగానే ఉన్నాయి. వినోదం కోసం మీరు ఎంపికచేసుకునేవి మీరు సాతాను తంత్రాలకు మోసపోవడం లేదని చూపిస్తున్నాయా?​—⁠2 కొరింథీయులు 2:​11.

సాతాను దుష్టప్రభావం నుండి ఎలా తప్పించుకోవచ్చు?

దుష్టశక్తులతో పోరాడడం చాలా కష్టమనిపించవచ్చు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి కృషి చేసేవారందరూ తమ స్వంత అపరిపూర్ణ శరీరాలతో పోరాడాలి, అంతేగాక వారు ‘ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడాలి’ అని బైబిలు చెబుతోంది. ఆ పోరాటాన్ని గెలిచి, దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే, మనం దేవుడు చేసిన అనేక ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందాలి.​—⁠ఎఫెసీయులు 6:​12; రోమీయులు 7:​21-25.

ఆ ఏర్పాట్లలో ఒకటి, విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన దేవుని పరిశుద్ధాత్మ. అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.” (1 కొరింథీయులు 2:​12) దేవుని ఆత్మచేత నడిపించబడేవారు దేవుడు ఇష్టపడేవాటిని ఇష్టపడడం, ఆయన ద్వేషించేవాటిని ద్వేషించడం ప్రారంభిస్తారు. (ఆమోసు 5:​15) ఒకరు పరిశుద్ధాత్మను ఎలా పొందవచ్చు? ముఖ్యంగా ప్రార్థన ద్వారా, బైబిలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడింది కాబట్టి దాన్ని అధ్యయనం చేయడం ద్వారా, దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారితో ప్రోత్సాహకరమైన విధంగా సహవసించడం ద్వారా దానిని పొందవచ్చు.​—⁠లూకా 11:​13; 2 తిమోతి 3:​16, 17; హెబ్రీయులు 10:​24, 25.

ఆ దైవిక ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందడం ద్వారా మీరు “దేవుడిచ్చు సర్వాంగకవచమును” ధరించుకోవడం ప్రారంభిస్తారు, అది మాత్రమే “అపవాది తంత్రముల” నుండి తప్పక రక్షణనిస్తుంది. (ఎఫెసీయులు 6:​11-18) ఆ ఏర్పాట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ముందెప్పటికన్నా ఇప్పుడు మరింత అత్యవసరం. ఎందుకు?

దుష్టత్వానికి అంతం సమీపించింది!

“నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు, చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు” అని కీర్తనకర్త అన్నాడు. (కీర్తన 92:⁠7) అవును, నోవహు కాలంలోలాగే ప్రస్తుతం పెరిగిపోతున్న దుష్టత్వం దేవుని తీర్పు రాబోతోందనడానికి సూచనగా ఉంది. ఆ తీర్పు కేవలం దుష్ట మానవులపైనే కాదు కానీ సాతానుపై, అతడి దయ్యాలపై కూడా అమలుచేయబడుతుంది, వీరు చివరకు నాశనం చేయబడేముందు మానవులను ఏమాత్రం ప్రభావితం చేయలేని స్థితి అనే అగాధంలో పడవేయబడతారు. (2 తిమోతి 3:​1-5; ప్రకటన 20:​1-3, 7-10) ఆ తీర్పును ఎవరు అమలుచేస్తారు? మరెవరో కాదు యేసుక్రీస్తే అమలుచేస్తాడు, ఆయన గురించి మనమిలా చదువుతాం: “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.”​—⁠1 యోహాను 3:⁠8.

దుష్టత్వం అంతం కావాలని మీరు ఆకాంక్షిస్తున్నారా? అలాగైతే, బైబిల్లోవున్న వాగ్దానాల నుండి మీరు ఓదార్పు పొందవచ్చు. దుష్టత్వానికి జనకుడు సాతానని మరే పుస్తకమూ వెల్లడిచేయడం లేదు. అంతేగాక, అతడు ఎలా నాశనం చేయబడతాడో, అతడి దుష్టక్రియలు చివరకు ఎలా నిర్మూలించబడతాయో కూడా మరే పుస్తకమూ తెలియజేయడంలేదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు సాతాను దుష్టప్రభావం నుండి రక్షించుకోవడానికి, భవిష్యత్తులో దుష్టత్వంలేని లోకంలో జీవించే నిరీక్షణను కలిగివుండడానికి బైబిలు నుండి ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకోమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.​—⁠కీర్తన 37:​9, 10.

[అధస్సూచీలు]

^ పేరా 17 సాతానుగా మారిన దూత అసలు పేరేమిటో తెలీదు. ఆదిమ భాషల్లో “సాతాను” అనే పదానికి “ఎదిరించువాడు” అనీ, “అపవాది” అనే పదానికి “కొండెములు చెప్పువాడు” అనీ అర్థం. సాతాను అనుసరించిన మార్గం, కొన్ని విషయాల్లో ప్రాచీన తూరు రాజు అనుసరించిన మార్గంలానే ఉంది. (యెహెజ్కేలు 28:​12-19) వారిద్దరూ మొదట్లో నిర్దోషులుగానే ఉన్నా ఆ తర్వాత అహంకారాన్ని పెంచుకున్నారు.

^ పేరా 17 యెహోవాసాక్షులు ప్రచురించిన తేజరిల్లు! జూలై-సెప్టెంబరు 2003వ సంచికలోని “పోర్నోగ్రఫీ​—⁠హానిరహితమా, హానికరమా?” శీర్షికల పరంపరను చూడండి.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఒకింత సత్యమున్న పురాణగాథలు

ప్రపంచవ్యాప్త ప్రాచీన పురాణగాథల్లో దివ్యపురుషుల, రాక్షసుల, వినాశనకరమైన ఒక జలప్రళయం గురించిన కథలున్నాయి. ఉదాహరణకు, గిల్గామేషును గురించిన అక్కేడియన్‌ భాషలోని పురాణగాథలో ఒక జలప్రళయం గురించి, ఒక ఓడ గురించి, దాని నుండి తప్పించుకుని బయటపడినవారి గురించి ప్రస్తావించబడింది. అందులో గిల్గామేషు కామోద్రేకమున్న, దౌర్జన్యపూరిత దివ్యపురుషునిగా అంటే సగం దేవుడు సగం మానవునిగా ఉన్నట్లు వర్ణించబడ్డాడు. అజ్టెక్‌ పురాణగాథ రాక్షసులు జీవించిన ఒక ప్రాచీన లోకం గురించి, ఒక గొప్ప జలప్రళయం గురించి చెబుతుంది. నార్వేదేశపు భాషలోని పురాణగాథ ఒక జాతి రాక్షసుల గురించి, పెద్ద ఓడను నిర్మించి తనను, తన భార్యను రక్షించుకున్న జ్ఞానియైన బర్జెల్మిర్‌ గురించి వర్ణిస్తుంది. అలాంటి పురాణగాథలన్నీ, మానవులందరూ ప్రాచీన దుష్టలోకాన్ని నాశనం చేసిన జలప్రళయం నుండి తప్పించుకున్న వారి సంతతేనని బైబిలు చెబుతున్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.

[చిత్రం]

గిల్గామేషు పురాణగాథ చెక్కబడిన ఒక రాతిఫలకం

[చిత్రసౌజన్యం]

The University Museum, University of Pennsylvania (neg. # 22065)

[5వ పేజీలోని చిత్రం]

నెఫీలుల ప్రవృత్తిని నేటి ప్రజల్లో చూడవచ్చు

[7వ పేజీలోని చిత్రం]

మనం దుష్టప్రభావాలకు లొంగిపోకుండా ఖచ్చితమైన జ్ఞానం మనల్ని బలపరుస్తుంది