కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునియందు మీ నమ్మకం ఎంత స్థిరంగా ఉంది?

దేవునియందు మీ నమ్మకం ఎంత స్థిరంగా ఉంది?

దేవునియందు మీ నమ్మకం ఎంత స్థిరంగా ఉంది?

“రాజ్యమును . . . మొదట వెదకుడి.”​—⁠మత్తయి 6:33.

ఒక యౌవనుడు తాను తన సంఘానికి మరింత ప్రయోజనకరంగా ఉండాలని కోరుకున్నాడు. సమస్యేమిటంటే, కూటాలకు క్రమంగా హాజరవడానికి తన ఉద్యోగం ఆటంకంగా ఉంది. ఆ సమస్యను ఆయనెలా పరిష్కరించాడు? తన జీవితాన్ని సరళం చేసుకొని, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, కొద్దిరోజుల్లోనే తన క్రైస్తవ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోని వేరే ఉద్యోగం చూసుకున్నాడు. నేడు ఆయన గతంలోకన్నా చాలా తక్కువ సంపాదిస్తున్నా, తన కుటుంబ అవసరాలు తీరుస్తూ సంఘానికి మరింత ప్రయోజనకరంగా ఉండగలుగుతున్నాడు.

2 ఆ యౌవనుడు ఎందుకలా సర్దుబాటు చేసుకున్నాడో మీరు అర్థం చేసుకున్నారా? అతనిలాంటి పరిస్థితిలో మీరుంటే అలాంటి సర్దుబాట్లు చేసుకోవడం గురించి ఆలోచిస్తారా? మెచ్చుకోదగిన రీతిలో చాలామంది క్రైస్తవులు అలా చేయడమే కాక, వారి క్రియలు “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని యేసు ఇచ్చిన వాగ్దానంలో వారి నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నాయి. (మత్తయి 6:​33) భద్రత కోసం వారు లౌకిక ప్రపంచాన్ని కాక యెహోవాను నమ్ముతున్నారు.​—⁠సామెతలు 3:​23, 26.

3 మనం జీవిస్తున్న క్లిష్టకాలాల దృష్ట్యా కొందరు ఆ యౌవనుడు తెలివైన నిర్ణయమే తీసుకున్నాడా అని ఆశ్చర్యపోవచ్చు. నేడు మానవుల్లో ఒక వర్గంవారు తీవ్ర బీదరికంతో జీవిస్తుండగా, మరోవర్గం వారు చరిత్రలోనే అత్యున్నత జీవన ప్రమాణాన్ని అనుభవిస్తున్నారు. బీద దేశాల్లోని చాలామంది తమ జీవితాన్ని కాస్త సులభతరం చేసే ఏ అవకాశమొచ్చినా దానిని ఆత్రంగా సద్వినియోగం చేసుకుంటారు. మరోవైపున, సంపన్న దేశాల్లో జీవిస్తున్న అనేకులు బలహీన ఆర్థిక వ్యవస్థలు, మారుతున్న ఉద్యోగ విపణులు, పీల్చి పిప్పిచేసే యజమానులు ఉన్న పరిస్థితుల మధ్య తమ జీవిత ప్రమాణాన్ని కాపాడుకునే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జీవనోపాధి సంబంధిత ఒత్తిడి దృష్ట్యా ‘రాజ్యాన్ని మొదట వెదకడం ఇంకా ఆచరణయోగ్యమేనా?’ అని కొందరు ఆలోచించవచ్చు. ఆ ప్రశ్నకు జవాబిచ్చేందుకు, యేసు మాట్లాడిన ప్రేక్షకులను పరిశీలించండి.

“చింతించడం మానండి”

4 యేసు చాలా ప్రాంతాలనుండి వచ్చిన పెద్ద జనసమూహంతో మాట్లాడుతూ గలిలయలో ఉన్నాడు. (మత్తయి 4:​25) ఒకవేళ ఉన్నా, వారిలో చాలా కొద్దిమందే ధనవంతులుండి ఉండవచ్చు. అధికశాతం బహుశా బీదవారై ఉంటారు. అయినప్పటికీ, యేసు వస్తుపరమైన సంపదను సంపాదించుకోవడానికి కాదుగానీ, మరెంతో విలువైన ఆధ్యాత్మిక ధనాన్ని కూర్చుకోవడానికి ప్రాధాన్యతనివ్వమని వారికి ఉద్బోధించాడు. (మత్తయి 6:​19-21, 24) ఆయనిలా అన్నాడు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి [“చింతించడం మానండి,” NW]; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?”​—⁠మత్తయి 6:​25.

5 ఆ శ్రోతల్లో చాలామందికి యేసు మాటలు ఆచరణయోగ్యం కానట్లనిపించి ఉండవచ్చు. కష్టపడి పనిచేయకపోతే, తమ కుటుంబాలు కష్టాలపాలవుతాయని వారికి తెలుసు. అయితే యేసు వారికి పక్షుల గురించి గుర్తుచేశాడు. పక్షులు ఏ రోజుకారోజు ఆహారాన్ని, నీడను వెతుక్కోవాలి, అయినా యెహోవా వాటిని సంరక్షిస్తున్నాడు. అంతేకాక, యెహోవా అడవిపువ్వులకు, సొలొమోను సమస్త వైభవాన్ని మించిన అందాన్ని దయచేస్తున్న తీరును కూడా ఆయన వారికి గుర్తుచేశాడు. యెహోవా పక్షులపట్ల, పువ్వులపట్ల శ్రద్ధ చూపిస్తుంటే, ఆయన మనపట్ల ఇంకెంత శ్రద్ధ చూపిస్తాడో కదా? (మత్తయి 6:​26-30) యేసు చెప్పినట్లుగా, పోషణకై మనం కొనే ఆహారంకన్నా, దేహాలను కప్పుకునేందుకు మనం సమకూర్చుకునే వస్త్రాలకన్నా మన ప్రాణాలు, మన దేహాలు మరింత ప్రాముఖ్యమైనవి. మన ప్రయత్నాలన్నింటిని కేవలం పోషణార్థం, దేహ సంరక్షణకు కేటాయించి యెహోవా సేవ చేయడానికి మనదగ్గర ఏమీ మిగలకపోతే, ఇక మన జీవితాలకు అర్థమే లేకుండా పోతుంది.​—⁠ప్రసంగి 12:​13.

సమతుల్యమైన దృక్కోణం

6 అయితే తన శ్రోతలు పని మానేసి, దేవుడు ఏదోవిధంగా తమ కుటుంబాలకు సహాయం చేస్తాడని వేచి ఉండమని యేసు వారిని ప్రోత్సహించలేదు. పక్షులు సహితం తమ కోసం, తమ పిల్లల కోసం ఆహారం వెతుక్కోవాలి. కాబట్టి ఆహారం కావాలంటే నిజ క్రైస్తవులు కష్టపడి పనిచేయాలి. వారు తమ కుటుంబ బాధ్యతలపట్ల శ్రద్ధ వహించాలి. క్రైస్తవ సేవకులు, దాసులు తమ యజమానుల దగ్గర శ్రద్ధగా పనిచేయాలి. (2 థెస్సలొనీకయులు 3:10-12; 1 తిమోతి 5:8; 1 పేతురు 2:18) అపొస్తలుడైన పౌలు తనను పోషించుకోవడానికి తరచూ డేరాలు కుట్టే పనిచేశాడు. (అపొస్తలుల కార్యములు 18:1-4; 1 థెస్సలొనీకయులు 2:⁠9) అయితే ఆ క్రైస్తవులు తమ భద్రత కోసం లోకసంబంధ ఉద్యోగంపై ఆధారపడలేదు. వారు యెహోవాపై నమ్మకముంచారు. ఫలితంగా వారు ఇతరులకు తెలియని అంతరంగ మనశ్శాంతిని అనుభవించారు. కీర్తనకర్త ఇలా అన్నాడు: “యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.”​—⁠కీర్తన 125:⁠1.

7 యెహోవాను స్థిరంగా నమ్మని వ్యక్తి మరోవిధంగా ఆలోచించవచ్చు. భద్రతకు వస్తుసంపదే కీలకమని మానవుల్లో అధికశాతం దృష్టిస్తున్నారు. అందువల్ల, ఎక్కువ జీతం లభించే ఉద్యోగాలకు పిల్లలను సిద్ధం చేస్తుందనే ఆశతో తల్లిదండ్రులు పిల్లలు తమ యౌవన కాలాన్ని ఉన్నతవిద్యకే ధారపోయాలని వారిని ప్రోత్సహించారు. ఉన్నత విద్య కోసం విరివిగా సమయం, డబ్బు వెచ్చించిన కొన్ని క్రైస్తవ కుటుంబాలు, తమ పిల్లలు ఆధ్యాత్మిక దృష్టి మందగించి వస్తుసంపదల మీదే దృష్టి నిలుపుతున్న కారణంగా గొప్ప నష్టం అనుభవించడం శోచనీయం.

8 కాబట్టి, జ్ఞానవంతులైన క్రైస్తవులు యేసు ఉపదేశం మొదటి శతాబ్దంలో అన్వయించినట్లే నేడు కూడా అన్వయిస్తుందని గ్రహించి, సమతుల్యతతో ఉండేందుకు ప్రయత్నిస్తారు. తమ లేఖనాధార బాధ్యతలపట్ల శ్రద్ధ చూపించేందుకు ఉద్యోగంలో ఎక్కువ గంటలు పనిచేయవలసి వచ్చినా, మరి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాల్ని నిర్లక్ష్యం చేసేంతగా డబ్బు సంపాదనలో ఎన్నటికీ మునిగిపోరు.​—⁠ప్రసంగి 7:​12.

‘ఎన్నడూ చింతింపకుడి’

9 యేసు తన కొండమీది ప్రసంగంలో తన శ్రోతలకు ఇలా ఉద్బోధించాడు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని [‘ఎన్నడూ,’ NW] చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.” (మత్తయి 6:​31, 32) ఎంతటి ప్రోత్సాహకరమైన మాటలో కదా! మనం యెహోవాను పూర్తిగా నమ్మితే, ఆయన అన్ని సందర్భాల్లోనూ మనల్ని బలపరుస్తాడు. అయితే యేసు మాటలు ఆలోచన రేకెత్తించేవిగా కూడా ఉన్నాయి. వస్తుపరమైన వాటినే మనం ‘విచారిస్తే’ మన ఆలోచన కూడా నిజ క్రైస్తవులుకాని ‘అన్యజనుల’ ఆలోచనలాగే ఉంటుంది.

10 ఒక సందర్భంలో, సంపన్నుడైన ఒక యౌవనుడు తాను నిత్యజీవం పొందేందుకు ఏమి చేయాలని యేసును అడిగాడు. ఆ కాలంలో ఇంకా అమల్లోవున్న ధర్మశాస్త్ర నియమాల గురించి యేసు ఆయనకు గుర్తుచేశాడు. అప్పుడా యౌవనుడు, ‘ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమి?’ అని యేసును అడిగాడు. యేసు ఇచ్చిన జవాబు చాలామందికి ఆచరణయోగ్యం కానట్లనిపించి ఉండవచ్చు. ఆయన ఇలా అన్నాడు: “నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుము.” (మత్తయి 19:​16-21) ఆ యౌవనుడు సంపద పోగొట్టుకోవడమనే ఆ ఆలోచనను అంగీకరించలేక విచారవదనంతో వెళ్లిపోయాడు. యెహోవాను ఎంత ప్రేమించినా, అంతకంటే ఎక్కువగా ఆయన తన ఆస్తిని ప్రేమించాడు.

11 ఆ సంఘటన ఎవరూ ఊహించని ఈ విషయాన్ని యేసు చెప్పేందుకు దారితీసింది: “ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట దుర్లభము. . . . ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభము.” (మత్తయి 19:​23, 24) ఏ సంపన్నుడూ రాజ్యములో ప్రవేశించడని యేసు భావమా? కాదు, ఎందుకంటే ఆయనింకా ఇలా చెప్పాడు: “దేవునికి సమస్తమును సాధ్యము.” (మత్తయి 19:​25, 26) అవును, యెహోవా సహాయంతో ఆ కాలంలో కొందరు సంపన్నులు అభిషిక్త క్రైస్తవులయ్యారు. (1 తిమోతి 6:​17) అయితే యేసు మంచి కారణంతోనే ఆ ఆశ్చర్యకరమైన మాటలను పలికాడు. ఆయన ఒక హెచ్చరిక ఇస్తున్నాడు.

12 ఒక వ్యక్తి ఆ సంపన్న యౌవనునిలా తన ఆస్తినే అంటిపెట్టుకుంటే, అతడు పూర్ణహృదయంతో యెహోవాను సేవించడానికి అదొక అడ్డంకుగా తయారుకావచ్చు. అది అప్పటికే సంపన్నునిగా ఉన్న వ్యక్తికీ, ‘ధనవంతుడగుటకు ఆపేక్షించే’ వ్యక్తికీ సంభవించగలదు. (1 తిమోతి 6:​9, 10) వస్తుపరమైన విషయాలనే అధికంగా నమ్ముకోవడం, ఒక వ్యక్తి ‘తన ఆధ్యాత్మిక అవసరతను’ తక్కువగా గుర్తించేందుకు దారితీయగలదు. (మత్తయి 5:​3, NW) ఫలితంగా, ఆ వ్యక్తి యెహోవా సహాయం తనకు అంతగా అవసరం లేదని భావించవచ్చు. (ద్వితీయోపదేశకాండము 6:​10-12) సంఘంలో తనను ప్రత్యేకంగా చూడాలని అతడు అపేక్షించవచ్చు. (యాకోబు 2:1-4) ఆయన యెహోవాను సేవించడానికి బదులు తన సంపదను అనుభవించడానికే ఎక్కువ సమయం కేటాయించే అవకాశముంది.

సరైన దృక్కోణం అలవరచుకోండి

13 ఆస్తిసంపదల విషయంలో తప్పుడు దృక్కోణమున్న ఒక గుంపు లవొదికయలో ఉన్న మొదటి శతాబ్దపు సంఘం. యేసు వారికిలా చెప్పాడు: “నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక​—⁠నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.” లవొదికయ సంఘస్థులను అలాంటి దీన ఆధ్యాత్మిక స్థితికి తీసుకువచ్చింది వారి సంపద కాదు. వాస్తవమేమిటంటే, వారు యెహోవాకు బదులు సంపదనే నమ్ముకున్నారు. ఫలితంగా, వారు ఆధ్యాత్మికంగా నులివెచ్చగా ఉండి ‘యేసు నోటనుండి ఉమ్మివేయబడే’ స్థితిలో ఉన్నారు.​—⁠ప్రకటన 3:​14-17.

14 మరోవైపున, అంతకుముందు హింస కలిగిన కాలంలో హెబ్రీ క్రైస్తవులు కనబరచిన దృక్పథాన్నిబట్టి పౌలు వారిని మెచ్చుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.” (హెబ్రీయులు 10:​34) ఆ క్రైస్తవులు తమ ఆస్తుల నష్టాన్నిబట్టి కృంగిపోలేదు. అత్యంత విలువైన ఆస్తికి అంటే ‘మరి శ్రేష్ఠమైన, స్థిరమైన స్వాస్థ్యానికి’ అంటిపెట్టుకున్న కారణంగా వారు తమ ఆనందాన్ని పోగొట్టుకోలేదు. ఒక విలువైన ముత్యం కోసం సమస్తాన్ని త్యాగంచేసిన యేసు ఉపమానంలోని వ్యాపారిలా వారు దేనికైనా వెనుకాడక రాజ్య నిరీక్షణకు గట్టిగా హత్తుకునేందుకే తీర్మానించుకున్నారు. (మత్తయి 13:​45, 46) ఎంత చక్కని దృక్పథమో కదా!

15 నేడు చాలామంది అలాంటి చక్కని దృక్పథం అలవరచుకున్నారు. ఉదాహరణకు, లైబీరియాలో ఒక క్రైస్తవ యువతికి విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం ఇవ్వబడింది. అలాంటి అవకాశాన్ని ఆ దేశంలో సురక్షిత భవిష్యత్తుకు ఒక మార్గంగా దృష్టిస్తారు. అయితే, పూర్తికాల సువార్తికురాలిగా పయినీరు సేవచేస్తున్న ఆమె తాత్కాలిక ప్రత్యేక పయినీరుగా సేవ చేసే ఆహ్వానం అందుకుంది. ఆమె దేవుని రాజ్యాన్ని మొదట వెదకి, పూర్తికాల సేవలో ఉండేందుకే నిర్ణయించుకుంది. ఆమె తన నియామక ప్రాంతానికి వెళ్లి మూడు నెలల్లో 21 బైబిలు అధ్యయనాలు ఆరంభించింది. ఈ యౌవన సహోదరీ, ఆమెలా వేలాదిమందీ భౌతిక ప్రయోజనాల్ని కూడా వదులుకొని రాజ్యాన్ని మొదట వెదకుతున్నారు. ఐశ్వర్యాసక్తి నిండిన ఈ లోకంలో అలాంటి దృక్పథాన్ని వారెలా కాపాడుకుంటున్నారు? వారనేక చక్కని లక్షణాలు అలవరచుకున్నారు. వాటిలో కొన్నింటిని మనం పరిశీలిద్దాం.

16అణకువ: బైబిలు ఇలా చెబుతోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు.” (సామెతలు 3:​5-7) లోక దృక్కోణం నుండి చూస్తే, కొన్ని సందర్భాల్లో ఫలాని పద్ధతి ఆచరణయోగ్యంగా కనిపించవచ్చు. (యిర్మీయా 17:⁠9) అయినప్పటికీ, యథార్థ క్రైస్తవుడు నిర్దేశం కోసం యెహోవాను ఆశ్రయిస్తాడు. (కీర్తన 48:​14) ‘తన ప్రవర్తన అంతటిలో’ అంటే సంఘ విషయాల్లో, విద్య లేదా ఉద్యోగం, విశ్రాంతి లేదా మరే విషయమైనా ఆయన అణకువతో యెహోవా ఉపదేశం వెదకుతాడు.​—⁠కీర్తన 73:​24.

17యెహోవా వాగ్దానాలందు నమ్మకం: పౌలు ఇలా అన్నాడు: “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.” (హెబ్రీయులు 11:⁠6) యెహోవా తన వాగ్దానాల్ని నెరవేర్చడాన్ని మనం సందేహిస్తే, ‘ఈ లోకాన్ని అమితంగా అనుభవించడం’ మనకు న్యాయసమ్మతంగా అనిపించవచ్చు. (1 కొరింథీయులు 7:​31) దానికి భిన్నంగా మన విశ్వాసం బలంగావుంటే, రాజ్యాన్ని మొదట వెదికేందుకే మనం దృఢంగా నిర్ణయించుకుంటాం. బలమైన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు? స్థిరమైన, హృదయపూర్వక ప్రార్థనతోపాటు, క్రమమైన వ్యక్తిగత అధ్యయనంతో యెహోవాకు సన్నిహితమవడం ద్వారానే. (కీర్తన 1:1-3; ఫిలిప్పీయులు 4:6, 7; యాకోబు 4:⁠8) రాజైన దావీదులాగే మనమూ ఇలా ప్రార్థించవచ్చు: “యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను​—⁠నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నీవు దాచియుంచిన మేలు యెంతో గొప్పది.”​—⁠కీర్తన 31:​14, 19.

18యెహోవా సేవలో శ్రద్ధగా పనిచేయడం: యెహోవా వాగ్దానాలపై నమ్మకాన్ని కష్టపడి పనిచేసే స్వభావంతో ముడిపెడుతూ పౌలు ఇలా వ్రాశాడు: “మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని [“కష్టపడి పనిచేసే స్వభావాన్ని,” NW] తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.” (హెబ్రీయులు 6:​11) మనం యెహోవా సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన మద్దతును మనం చవిచూసిన ప్రతీసారి, ఆయనపై మన నమ్మకం బలపడడమే కాక, మనం ‘స్థిరులుగా, కదలనివారిగా’ తయారవుతాం. (1 కొరింథీయులు 15:​58) మన విశ్వాసం నూతనపర్చబడి, మన నిరీక్షణ స్థిరపరచబడుతుంది.​—⁠ఎఫెసీయులు 3:​15-19.

19త్యాగాలు చేసేందుకు ఇష్టపడడం: యేసును అనుసరించేందుకు పౌలు ప్రయోజనాత్మక వృత్తిని త్యాగం చేశాడు. వస్తుపరమైన దృక్కోణంతో చూసినప్పుడు ఆయన జీవితం కష్టాలనెదుర్కొన్నప్పటికీ, ఆయన సరైన నిర్ణయం తీసుకున్నాడనేది స్పష్టం. (1 కొరింథీయులు 4:​11-13) యెహోవా విలాసవంతమైన జీవితాన్ని వాగ్దానం చేయడం లేదు, అంతేగాక ఆయన సేవకులు కొన్నిసార్లు కష్టాలను సహించక తప్పదు. మన జీవనశైలిని నిరాడంబరం చేసుకోవడానికి, త్యాగాలు చేయడానికి సుముఖత చూపించడం యెహోవాను సేవించాలనే మన నిర్ణయపు బలాన్ని నిరూపిస్తుంది.​—⁠1 తిమోతి 6:​6-8.

20ఓపిక: శిష్యుడైన యాకోబు తోటి క్రైస్తవులకు ఇలా ఉద్బోధించాడు: “సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి.” (యాకోబు 5:⁠7) వేగంగా పరుగెడుతున్న ఈ లోకంలో ఓపిక ప్రదర్శించడం కష్టం. త్వరగా పనులు జరిగిపోవాలని మనం కోరుకుంటాం. కానీ, “విశ్వాసము చేతను, ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొనువారిని” అనుకరించమని పౌలు మనకు ఉద్బోధిస్తున్నాడు. (హెబ్రీయులు 6:​11-12) యెహోవాపై ఆధారపడేందుకు సుముఖంగా ఉండండి. పరదైసు భూమిపై నిత్యజీవమనేది నిజంగా మనం అపేక్షించదగిన ప్రతిఫలం!

21 అవును, రాజ్యాన్ని మొదట వెదకమని యేసు ఇచ్చిన ఉపదేశం ఆచరణాత్మకమైనది. మనమలా వెదకినప్పుడు, మనం నిజంగా యెహోవాను నమ్ముతున్నామని చూపిస్తూ, ఒక క్రైస్తవుడు జీవించేందుకున్న ఏకైక భద్రతా మార్గాన్ని ఎంచుకుంటాం. అలాగే “[దేవుని] నీతిని మొదట వెదకుడి” అని కూడా యేసు చెప్పాడు. తర్వాతి ఆర్టికల్‌లో, ఆ ప్రోత్సాహం ప్రత్యేకంగా నేడు ఎందుకు అవసరమో మనం చూస్తాం.

మీరు వివరించగలరా?

• వస్తుపరమైన విషయాలకు సంబంధించి మనమెలాంటి సమతుల్యం కలిగివుండాలని యేసు ప్రోత్సహించాడు?

• ఒంటె, సూదిబెజ్జానికి సంబంధించిన యేసు ఉపమానం నుండి మనమేమి నేర్చుకుంటాం?

• దేవుని రాజ్యాన్ని మొదట వెదికేందుకు మనకు ఏ క్రైస్తవ లక్షణాలు సహాయం చేస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ఉద్యోగం విషయంలో ఒక యౌవనుడు ఎలాంటి చర్య తీసుకున్నాడు, ఎందుకు?

3. దేవుని రాజ్యానికి ప్రథమస్థానమివ్వడం నేడింకా ఆచరణయోగ్యమేనా అని కొందరెందుకు ఆలోచించవచ్చు?

4, 5. దేవుని ప్రజలు తమ దైనందిన విషయాల గురించి అధికంగా చింతించనక్కర్లేదని యేసు ఎలా సోదాహరణంగా చెప్పాడు?

6. (ఎ) క్రైస్తవులకు దేని విషయంలో బాధ్యత ఉంది? (బి) క్రైస్తవులు ఎక్కడ తమ పూర్తి నమ్మకాన్ని ఉంచుతారు?

7. యెహోవాను స్థిరంగా నమ్మని వ్యక్తి దృక్కోణం ఎలా ఉండవచ్చు?

8. క్రైస్తవులు ఎలాంటి సమతుల్యాన్ని కాపాడుకుంటారు?

9. యెహోవాను పూర్తిగా నమ్మేవారికి యేసు ఎలాంటి అభయమిస్తున్నాడు?

10. ఒక యౌవనుడు సలహా కోసం యేసు దగ్గరకు వచ్చినప్పుడు, ఆ యౌవనుడు అధికంగా ప్రేమించేదేమిటో యేసు ఎలా వెల్లడించాడు?

11, 12. (ఎ) సంపద విషయంలో ఆలోచన రేకెత్తించే ఏ మాటలు యేసు పలికాడు? (బి) యెహోవాను సేవించడానికి ఆస్తిసంపదలు ఎలా ఒక అడ్డంకుగా ఉండగలవు?

13. లవొదికయ సంఘస్థులకు ఎలాంటి తప్పుడు దృక్కోణముంది?

14. పౌలు ప్రశంసకు హెబ్రీ క్రైస్తవులు ఎందుకు అర్హులయ్యారు?

15. లైబీరియాలోని ఒక క్రైస్తవ యువతి రాజ్య సంబంధ విషయాలకు ఎలా ప్రథమస్థానమిచ్చింది?

16, 17. (ఎ) యెహోవాపై నమ్మకముంచేందుకు అణకువ ఎందుకు ప్రాముఖ్యం? (బి) దేవుని వాగ్దానాల్లో మనమెందుకు దృఢమైన నమ్మకం పెంపొందించుకోవాలి?

18, 19. (ఎ) కష్టపడి పనిచేసే స్వభావం యెహోవాపై మన నమ్మకాన్ని ఎలా బలపరుస్తుంది? (బి) ఒక క్రైస్తవుడు త్యాగాలు చేయడానికి ఎందుకు సుముఖంగా ఉండాలి?

20. రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానమిచ్చే వ్యక్తికి ఓపిక ఎందుకు ఆవశ్యకం?

21. (ఎ) రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానమిచ్చినప్పుడు మనమేమి ప్రదర్శిస్తాం? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

[21వ పేజీలోని చిత్రం]

యేసు శ్రోతల్లో చాలామంది బీదవారే

[23వ పేజీలోని చిత్రం]

యౌవన సంపన్నుడు దేవునికంటే తన వస్తుసంపదనే ఎక్కువ ప్రేమించాడు

[23వ పేజీలోని చిత్రం]

యేసు ఉపమానంలోని వ్యాపారి ఒకే ఒక విలువైన ముత్యం కోసం సర్వం త్యాగం చేశాడు

[24వ పేజీలోని చిత్రం]

మనం యెహోవా సేవలో నిమగ్నమైవుంటే, ఆయన మనల్ని బలపరుస్తాడు