అపొస్తలుల కార్యాలు 18:1-28

  • కొరింథులో పౌలు పరిచర్య (1-17)

  • సిరియాలోని అంతియొకయకు తిరిగిరావడం (18-22)

  • పౌలు గలతీయ, ఫ్రుగియలకు వెళ్లడం (23)

  • మంచి ప్రసంగీకుడైన అపొల్లోకు సహాయం (24-28)

18  ఆ తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయల్దేరి కొరింథుకు వచ్చాడు.  అతనికి అకుల+ అనే యూదుడు కలిశాడు. అతని సొంత ఊరు పొంతు. క్లౌదియ చక్రవర్తి యూదులందర్నీ రోము విడిచివెళ్లమని ఆజ్ఞాపించడంతో అతను ఈమధ్యే తన భార్య ప్రిస్కిల్లతో పాటు ఇటలీ నుండి అక్కడికి వచ్చాడు. అందుకే పౌలు వాళ్లను కలవడానికి వెళ్లాడు.  వాళ్ల వృత్తి కూడా డేరాలు తయారుచేయడమే కాబట్టి పౌలు వాళ్లింట్లో ఉండి వాళ్లతో కలిసి పనిచేశాడు.+  ప్రతీ విశ్రాంతి రోజున పౌలు సమాజమందిరంలో ప్రసంగం ఇస్తూ+ యూదుల్ని, గ్రీకువాళ్లను ఒప్పించేవాడు.  సీల,+ తిమోతి+ మాసిదోనియ నుండి వచ్చాక, పౌలు తన సమయాన్నంతా వాక్యాన్ని ప్రకటించడంలోనే గడిపాడు, యేసే క్రీస్తని రుజువు చేయడానికి యూదులకు సాక్ష్యమిస్తూ ఉన్నాడు.+  కానీ ఆ యూదులు పౌలును వ్యతిరేకిస్తూ, దూషిస్తూ వచ్చారు. కాబట్టి పౌలు తన వస్త్రాల్ని దులిపేసుకొని,+ “మీకు ఏం జరిగినా ఆ బాధ్యత మీదే.+ మీ రక్తం విషయంలో నేను నిర్దోషిని.+ ఇప్పటినుండి నేను అన్యజనుల దగ్గరికి వెళ్తాను”+ అని వాళ్లతో అన్నాడు.  తర్వాత పౌలు సమాజమందిరాన్ని విడిచిపెట్టి, భక్తిపరుడైన తీతియు యూస్తు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నాడు. అతని ఇల్లు సమాజమందిరం పక్కనే ఉంది.  సమాజమందిరం అధికారి క్రిస్పు,+ అతని ఇంటివాళ్లందరూ ప్రభువు మీద విశ్వాసముంచారు. మంచివార్త విన్న కొరింథీయుల్లో చాలామంది విశ్వాసముంచి, బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు.  అంతేకాదు రాత్రిపూట పౌలుకు ఒక దర్శనం వచ్చింది. అందులో ప్రభువు అతనితో ఇలా చెప్పాడు: “భయపడకు. మాట్లాడుతూనే ఉండు, ఆపకు. 10  ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను,+ నీకు హాని జరిగేలా ఎవరూ నీ మీద దాడిచేయరు. ఈ నగరంలో నా మీద విశ్వాసం ఉంచబోయేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు.” 11  కాబట్టి పౌలు ఒకటిన్నర సంవత్సరాల పాటు అక్కడే ఉండి, వాళ్ల మధ్య దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. 12  గల్లియోను అకయ ప్రాంతానికి స్థానిక అధిపతిగా* ఉన్నప్పుడు, యూదులు పౌలు మీద మూకుమ్మడిగా దాడిచేసి, అతన్ని న్యాయపీఠం ముందుకు తీసుకెళ్లి, 13  “ఇతను చట్ట వ్యతిరేకమైన పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించమని ప్రజలకు నేర్పిస్తున్నాడు” అన్నారు. 14  పౌలు మాట్లాడబోతున్నప్పుడు గల్లియోను ఆ యూదులతో ఇలా అన్నాడు: “యూదులారా, ఇతను చేసింది తప్పో, ఘోరమైన నేరమో అయితే నేను మీ మాటల్ని ఓపిగ్గా వినడం సరైనదే. 15  కానీ అది మాటల గురించిన, పేర్ల గురించిన లేదా మీ ధర్మశాస్త్రం గురించిన వివాదమైతే+ దాన్ని మీరే చూసుకోవాలి. ఈ విషయాల్లో న్యాయమూర్తిగా ఉండడం నాకు ఇష్టంలేదు.” 16  ఆ మాటలు అన్నాక, అతను వాళ్లను న్యాయపీఠం ముందు నుండి వెళ్లగొట్టాడు. 17  అప్పుడు వాళ్లందరూ సమాజమందిరం అధికారైన సొస్తెనేసును+ పట్టుకొని, న్యాయపీఠం ముందు అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. అయితే గల్లియోను ఈ విషయాల్లో ఏమాత్రం కలగజేసుకోలేదు. 18  పౌలు ఇంకా చాలా రోజులు అక్కడున్నాక, అక్కడి సహోదరులకు వీడ్కోలు చెప్పి ఓడలో సిరియాకు బయల్దేరాడు. అతనితో పాటు ప్రిస్కిల్ల, అకుల కూడా ఉన్నారు. కెంక్రేయలో+ పౌలు తన మొక్కుబడి తీర్చుకోవడానికి తలవెంట్రుకలు కత్తిరించుకున్నాడు. 19  వాళ్లు ఎఫెసుకు చేరుకున్నప్పుడు పౌలు వాళ్లను అక్కడ విడిచిపెట్టి, సమాజమందిరంలోకి వెళ్లి లేఖనాలు అర్థంచేసుకునేలా యూదులకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు.+ 20  వాళ్లు పౌలును ఇంకొన్ని రోజులు అక్కడే ఉండమని బ్రతిమాలినా అతను ఒప్పుకోలేదు. 21  అతను వాళ్లకు వీడ్కోలు చెప్పి, “యెహోవాకు* ఇష్టమైతే మళ్లీ మీ దగ్గరికి వస్తాను” అన్నాడు. తర్వాత, ఓడలో ఎఫెసు నుండి బయల్దేరి 22  కైసరయకు వచ్చాడు. తర్వాత అతను వెళ్లి* సంఘాన్ని పలకరించి, అంతియొకయకు వచ్చాడు.+ 23  పౌలు కొంతకాలం అక్కడున్న తర్వాత గలతీయ, ఫ్రుగియ+ దేశాల్లో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తూ శిష్యులందర్నీ బలపర్చాడు.+ 24  అపొల్లో+ అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతని సొంతూరు అలెక్సంద్రియ. అతను మంచి ప్రసంగీకుడు, లేఖనాల మీద అతనికి మంచి పట్టు ఉంది. 25  అతను యెహోవా* మార్గం గురించి ఉపదేశించబడ్డాడు. పవిత్రశక్తి నింపిన ఉత్సాహంతో అతను యేసుకు సంబంధించిన విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడుతూ, బోధిస్తూ ఉన్నాడు. అయితే, యోహాను ప్రకటించిన బాప్తిస్మం గురించి మాత్రమే అతనికి తెలుసు. 26  అతను సమాజమందిరంలో ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రిస్కిల్ల, అకుల+ అతను చెప్పేది విన్నప్పుడు అతన్ని తమతో పాటు తీసుకెళ్లి దేవుని మార్గం గురించి ఇంకా ఖచ్చితంగా అతనికి వివరించారు. 27  తర్వాత, అపొల్లో అకయకు వెళ్లాలనుకున్నాడు కాబట్టి సహోదరులు అక్కడి శిష్యులకు ఉత్తరం రాసి, అతన్ని ప్రేమతో చేర్చుకోమని ప్రోత్సహించారు. అతను అక్కడికి వెళ్లాక, దేవుని అపారదయ ద్వారా విశ్వాసులైన వాళ్లకు ఎంతో సహాయం చేశాడు. 28  అతను యేసే క్రీస్తని లేఖనాల నుండి చూపిస్తూ, యూదులు బోధించేది తప్పు అని శక్తివంతమైన మాటలతో అందరిముందు సంపూర్ణంగా రుజువు చేశాడు.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అనుబంధం A5 చూడండి.
అక్ష., “ఎక్కివెళ్లి.” యెరూషలేముకు అని తెలుస్తోంది.
అనుబంధం A5 చూడండి.