కీర్తనలు 73:1-28

 • దైవభక్తి ఉన్న ఒకతను మళ్లీ సరిగ్గా ఆలోచించడం మొదలుపెడతాడు

  • “నా పాదాలు దాదాపు దారితప్పాయి” (2)

  • “రోజంతా నేను శ్రమ అనుభవించాను” (14)

  • ‘దేవుని పవిత్రమైన స్థలంలోకి అడుగుపెట్టే వరకు’ (17)

  • దుష్టులు జారుడు నేలమీదే ఉన్నారు (18)

  • దేవునికి దగ్గరవ్వడం మంచిది (28)

ఆసాపు+ శ్రావ్యగీతం. 73  ఇశ్రాయేలు ప్రజలకు, స్వచ్ఛమైన హృదయం గలవాళ్లకు దేవుడు నిజంగా మంచి చేస్తున్నాడు.+   నా విషయానికొస్తే, నా పాదాలు దాదాపు దారితప్పాయి;నా అడుగులు జారినంత పనైంది.   దుష్టులు వర్ధిల్లడం చూసినప్పుడు,ఆ అహంకారుల్ని* బట్టి నేను ఈర్ష్యపడ్డాను.+   చనిపోయేటప్పుడు వాళ్లకు ఎలాంటి వేదనలూ ఉండవు;వాళ్లు పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటారు.*+   మిగతావాళ్లకు వచ్చే కష్టాలు వాళ్లకు రావు,+అందరూ పడే బాధలు వాళ్లు పడరు.+   అందుకే వాళ్లు అహంకారాన్ని హారంలా,+దౌర్జన్యాన్ని వస్త్రంలా ధరిస్తున్నారు.   తమ సమృద్ధి* వల్ల వాళ్ల కళ్లు ఉబ్బిపోయాయి;వాళ్లు తాము ఊహించినదానికన్నా ఎక్కువే సంపాదించారు.   వాళ్లు ఎగతాళి చేస్తూ చెడ్డమాటలు మాట్లాడతారు.+ అణచివేస్తామంటూ పొగరుతో బెదిరిస్తారు.+   వాళ్ల మాటలు ఆకాశాన్ని అంటుతున్నాయి,వాళ్లు తమ నాలుకతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ భూమంతా తిరుగుతారు. 10  కాబట్టి దేవుని* ప్రజలు వాళ్ల వైపు తిరుగుతారు,పొంగిపొర్లుతున్న వాళ్ల నీళ్లను తాగుతారు. 11  “దేవునికి ఇదంతా ఎలా తెలుస్తుంది?+ సర్వోన్నతునికి ఈ విషయాలు తెలుసా?” అని వాళ్లు అంటారు. 12  అవును వాళ్లు దుష్టులు, వాళ్లు ఎప్పుడూ నిశ్చింతగా ఉంటారు.+ వాళ్లు తమ ఆస్తులు పెంచుకుంటూ ఉంటారు.+ 13  నిజంగా, నేను నా హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం,నిర్దోషినని నా చేతులు కడుక్కోవడం వృథా.+ 14  రోజంతా నేను శ్రమ అనుభవించాను;+ప్రతీ ఉదయం శిక్షించబడ్డాను.+ 15  కానీ నేను ఇలా మాట్లాడివుంటే,నీ ప్రజలకు* ద్రోహం చేసినట్టు అయ్యేది. 16  నేను దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు,అది నా మనసును తొలిచేసేది. 17  దేవుని మహిమాన్విత పవిత్రమైన స్థలంలోకి అడుగుపెట్టి,వాళ్ల భవిష్యత్తు ఏమిటో గ్రహించే వరకు నా పరిస్థితి అలానే ఉంది. 18  ఖచ్చితంగా నువ్వు వాళ్లను జారుడు నేలమీదే ఉంచావు.+ వాళ్లు పడిపోయి, నాశనమవ్వాలని అలా చేశావు.+ 19  ఎంత హఠాత్తుగా వాళ్లు నాశనమైపోయారు!+ ఉన్నట్టుండి విపత్తు రావడంతో వాళ్లు ఘోరంగా అంతమయ్యారు! 20  ఒకవ్యక్తి నిద్ర లేవగానే తన కలను మర్చిపోయినట్టు,యెహోవా, నువ్వు లేచినప్పుడు వాళ్లను తిరస్కరిస్తావు. 21  కానీ నా హృదయం దుఃఖంతో నిండిపోయింది,+నా అంతరంగంలో* తీవ్రమైన నొప్పి కలిగింది. 22  నాకు బుద్ధి, అవగాహన లేకుండా పోయాయి;నేను నీ ముందు తెలివిలేని పశువులా ఉన్నాను. 23  ఇప్పుడు మాత్రం నేను నీతోనే ఉంటున్నాను;నువ్వు నా కుడిచేతిని పట్టుకున్నావు.+ 24  నీ సలహాతో నువ్వు నాకు నిర్దేశమిస్తావు,+తర్వాత మహిమ వైపు నన్ను నడిపిస్తావు.+ 25  పరలోకంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? భూమ్మీద నేను నిన్ను తప్ప దేన్నీ కోరుకోను.+ 26  నా శరీరం, మనసు బలహీనపడవచ్చు,కానీ దేవుడే నా హృదయానికి ఆశ్రయదుర్గం,* ఆయనే ఎప్పటికీ నా భాగం.+ 27  నీకు దూరంగా ఉండేవాళ్లు ఖచ్చితంగా నశించిపోతారు. నమ్మకద్రోహులై నిన్ను విడిచివెళ్లే వాళ్లందర్నీ నువ్వు అంతం చేస్తావు.+ 28  నా విషయానికొస్తే, దేవునికి దగ్గరవ్వడం నాకు మంచిది.+ ఆయన పనులన్నిటి గురించి ప్రకటించేలా,+నేను సర్వోన్నత ప్రభువైన యెహోవాను నా ఆశ్రయంగా చేసుకున్నాను.

అధస్సూచీలు

లేదా “గొప్పలు చెప్పుకునేవాళ్లను.”
లేదా “వాళ్ల పొట్టలు పెద్దగా ఉన్నాయి.”
అక్ష., “కొవ్వు.”
అక్ష., “ఆయన.”
అక్ష., “నీ కుమారుల తరానికి.”
అక్ష., “నా మూత్రపిండాల్లో.”
అక్ష., “బండరాయి.”