కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘పైనున్న వాటిమీద మనసుపెట్టండి’

‘పైనున్న వాటిమీద మనసుపెట్టండి’

“పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి.”—కొలొ. 3:2.

1, 2. (ఎ) మొదటి శతాబ్దంలోని కొలొస్సీ సంఘం ఎందుకు ప్రమాదంలో పడింది? (బి) కొలొస్సీలోని సహోదరులు విశ్వాసంలో స్థిరంగా ఉండేలా సహాయం చేసేందుకు పౌలు ఏ సలహా ఇచ్చాడు?

 మొదటి శతాబ్దంలోని కొలొస్సీ సంఘం ప్రమాదంలో పడింది! సంఘంలోని కొంతమంది మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందేనని బోధిస్తూ సంఘంలో విభజనలు సృష్టిస్తున్నారు. మరికొంతమంది, అన్నిటినీ విడిచిపెట్టి సన్యాసుల్లా జీవించాలని చెబుతూ అబద్ధమత ఆలోచనా విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ అబద్ధ సిద్ధాంతాలను తిప్పికొట్టేందుకు అపొస్తలుడైన పౌలు కొలొస్సయులను ఇలా హెచ్చరించాడు, “ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”—కొలొ. 2:8.

2 అప్పట్లో అభిషిక్తులు “లోకముయొక్క మూలపాఠముల” మీద మనసు పెట్టివుంటే, దేవుని కుమారులుగా ఉండే గొప్ప అవకాశాన్ని వద్దనుకునేవాళ్లు. (కొలొ. 2:20-23) అందుకే, దేవునితో వాళ్లకున్న అమూల్యమైన బంధాన్ని కాపాడుకునేలా సహాయం చేయడానికి, “పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి” అని పౌలు వాళ్లను ప్రోత్సహించాడు. (కొలొ. 3:2) అవును, క్రీస్తు సహోదరులు ‘పరలోకంలో వాళ్లకోసం ఉంచబడిన’ అమర్త్యమైన బహుమానాన్ని పొందడం పైనే మనసు నిలపాలి.—కొలొ. 1:3-5.

3. (ఎ) అభిషిక్తులు ఏ నిరీక్షణపై మనసు నిలుపుతారు? (బి) మనం ఇప్పుడు ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 వాళ్లలాగే నేటి అభిషిక్త క్రైస్తవులు కూడా దేవుని పరలోక రాజ్యంపై, ‘క్రీస్తు తోటి వారసులుగా’ ఉండబోయే తమ నిరీక్షణపై మనసు నిలుపుతారు. (రోమా. 8:14-17) మరి భూనిరీక్షణగల వాళ్ల విషయం ఏమిటి? పౌలు మాటలు వాళ్లకెలా వర్తిస్తాయి? “వేరే గొఱ్ఱెలు” ఏ విధంగా “పైనున్న వాటిమీద” మనసు పెట్టవచ్చు? (యోహా. 10:16) అబ్రాహాము, మోషే వంటి నమ్మకమైన పురుషులు ఎన్నో కష్టాలు పడినా, పైనున్న వాటిమీద మనసు నిలిపారు. వాళ్లను మనమెలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

పైనున్న వాటిమీద మనసు పెట్టడం అంటే ఏమిటి?

4. వేరే గొర్రెలు పైనున్న వాటిమీద ఎలా మనసు పెట్టవచ్చు?

4 వేరే గొర్రెలకు పరలోక నిరీక్షణ లేకపోయినా, వాళ్లుకూడా పైనున్న వాటిమీద మనసు పెట్టవచ్చు. ఏ విధంగా? యెహోవా దేవునికి, రాజ్యానికి సంబంధించిన విషయాలకు తమ జీవితాల్లో మొదటిస్థానం ఇవ్వడం ద్వారానే. (లూకా 10:25-27) అందుకోసం మనం యేసును ఆదర్శంగా తీసుకుంటాం. (1 పేతు. 2:21) మొదటి శతాబ్దపు సహోదరుల్లాగే మనం కూడా సాతాను దుష్టలోకంలోని తప్పుడు వాదనలను, తత్వ సిద్ధాంతాలను, వస్తుసంపదల మోజును ఎదుర్కొంటున్నాం. (2 కొరింథీయులు 10:5 చదవండి.) మనం యేసును అనుకరిస్తూ, యెహోవాతో మనకున్న సంబంధాన్ని ప్రమాదంలో పడేసే ప్రతీదానికి దూరంగా ఉండాలి.

5. వస్తుసంపదల విషయంలో మన ఆలోచనా తీరును ఎలా పరిశీలించుకోవచ్చు?

5 డబ్బు, ఆస్తిపాస్తుల విషయంలో మనం లోకంలోని వాళ్లలా ఆలోచించడం మొదలుపెట్టామా? మనం వేటినైతే ప్రేమిస్తామో వాటిగురించే ఆలోచిస్తాం, వాటినే చేస్తాం. “నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును” అని యేసు అన్నాడు. (మత్త. 6:21) మన హృదయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే, మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి, ‘డబ్బుకు సంబంధించిన విషయాల గురించి ఎంత సమయం ఆలోచిస్తున్నాను? వ్యాపార విషయాలు, పెట్టుబడుల గురించి లేదా మరింత సౌకర్యవంతమైన జీవితం పొందడం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నానా? లేక, నిరాడంబరంగా జీవిస్తూ ఆధ్యాత్మిక విషయాలపై మనసు పెట్టడానికి కృషి చేస్తున్నానా?’ (మత్త. 6:22) ‘భూమ్మీద ధనం కూర్చుకోవడమే’ ధ్యేయంగా బ్రతికేవాళ్లు ఆధ్యాత్మిక ప్రమాదంలో చిక్కుకుంటారని యేసు చెప్పాడు.—మత్త. 6:19, 20, 24.

6. శరీర కోరికలతో చేసే పోరాటాన్ని మనం ఎలా గెలవవచ్చు?

6 మనం అపరిపూర్ణులం కాబట్టి, సాధారణంగా తప్పు చేయడానికే మొగ్గుచూపుతాం. (రోమీయులు 7:21-25 చదవండి.) దేవుని పరిశుద్ధాత్మ మనపై పనిచేయకపోతే మనం ‘అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుతనం, కామవిలాసాలు, పోకిరిచేష్టలు’ వంటి “అంధకార క్రియలు” చేసే ప్రమాదం ఉంది. (రోమా. 13:12, 13) ‘భూసంబంధమైన వాటితో’ అంటే శరీరం ఇష్టపడేవాటితో పోరాడి గెలవాలంటే మనం పైనున్న వాటిమీద మనసు నిలపాలి. దానికోసం మనం కృషి చేయాలి. అందుకే “నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (1 కొరిం. 9:27) అవును, జీవాన్నిచ్చే పరుగుపందెంలోనే ఎప్పటికీ ఉండాలంటే మన విషయంలో మనం కాస్త కఠినంగా ఉండాలి! ‘దేవునికి ఇష్టులుగా’ ఉండడానికి ఇద్దరు నమ్మకస్థులైన పురుషులు ఏమి చేశారో ఇప్పుడు చూద్దాం.—హెబ్రీ. 11:6.

అబ్రాహాము “యెహోవాను నమ్మెను”

7, 8. (ఎ) అబ్రాహాము శారాలు ఎలాంటి కష్టాలు అనుభవించారు? (బి) అబ్రాహాము వేటిమీద మనసు నిలిపాడు?

7 సొంతూరిని విడిచిపెట్టి కుటుంబంతోసహా కనాను దేశానికి వెళ్లమని యెహోవా చెప్పినప్పుడు, అబ్రాహాము సంతోషంగా లోబడ్డాడు. అబ్రాహాము చూపించిన విశ్వాసం, విధేయతవల్ల యెహోవా ఆయనతో ‘నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను’ అని చెబుతూ ఒక నిబంధన చేశాడు. (ఆది. 12:2) అయితే సంవత్సరాలు గడుస్తున్నా అబ్రాహాము శారాలకు పిల్లలు పుట్టలేదు. యెహోవా తనకిచ్చిన మాటను మర్చిపోయాడని అబ్రాహాము అనుకున్నాడా? పైగా, కనానులో జీవించడం అంత సులభమేమీ కాదు. అబ్రాహాము, ఆయన కుటుంబ సభ్యులు మెసొపొతమియలోని సంపన్న పట్టణమైన ‘ఊరులోని’ సొంతింటిని, బంధువులను విడిచిపెట్టి వచ్చారు. కనాను చేరుకోవడానికి 1,600 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించారు. వాళ్లు గుడారాల్లో నివసించారు, కరువువల్ల, దొంగలవల్ల ఇబ్బందులు పడ్డారు. (ఆది. 12:5, 10; 13:18; 14:10-16) అయినా, సొంతూరికి తిరిగి వెళ్లి సౌకర్యంగా జీవించాలని వాళ్లు కోరుకోలేదు.—హెబ్రీయులు 11:8-12, 15 చదవండి.

8 అబ్రాహాము ‘భూసంబంధమైన వాటిమీద’ మనసు పెట్టలేదుగానీ, ‘యెహోవాను నమ్మాడు.’ (ఆది. 15:6) ఆయన పైనున్న వాటిమీద మనసుపెట్టాడు, అంటే దేవుని వాగ్దానాల మీద దృష్టి నిలిపాడు. అందుకే యెహోవా అబ్రాహాము విశ్వాసాన్ని గమనించి, “నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి—నీ సంతానము ఆలాగవును” అని చెప్పాడు. (ఆది. 15:5) ఆ మాట అబ్రాహామును ఎంతగా బలపర్చివుంటుందో! అబ్రాహాము నక్షత్రాలను చూసిన ప్రతీసారి, తన సంతానం అలా వృద్ధి అవుతుందని చెప్పిన యెహోవా వాగ్దానాన్ని గుర్తుతెచ్చుకునేవాడు. యెహోవా అనుకున్న సమయంలో ఆయన మాటిచ్చినట్లు అబ్రాహాము శారాలకు కొడుకు పుట్టాడు.—ఆది. 21:1, 2.

9. మనం అబ్రాహామును ఎలా అనుకరించవచ్చు?

9 అబ్రాహాములా మనం కూడా దేవుని వాగ్దానాలు నిజమయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నాం. (2 పేతు. 3:13) మనం ఒకవేళ పైనున్న వాటిమీద మనసు పెట్టకపోతే, ఆ వాగ్దానాల నెరవేర్పు ఆలస్యమవుతున్నట్టుగా అనిపించవచ్చు, మనం ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో వెనుకబడవచ్చు. ఉదాహరణకు, మీరు పయినీరు సేవ చేసేందుకు లేదా మీ సేవను విస్తృతపర్చుకునేందుకు గతంలో కొన్ని త్యాగాలు చేశారా? చేసివుంటే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. మరి ఇప్పటి సంగతేంటి? అబ్రాహాము ‘పునాదులుగల ఆ పట్టణం కోసం ఎదురుచూస్తూ’ ఉన్నాడని గుర్తుంచుకోండి. (హెబ్రీ. 11:10) “అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.”—రోమా. 4:3.

మోషే “అదృశ్యుడైనవానిని” చూశాడు

10. మోషే బాల్యం ఎలా గడిచింది?

10 పైనున్న వాటిమీదే మనసు పెట్టిన మరో నమ్మకస్థుడు మోషే. ఆయన చిన్నప్పుడే ‘ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు.’ అది మామూలు విద్యాభ్యాసం కాదు. ఎందుకంటే ఐగుప్తు అప్పటికే ప్రపంచాధిపత్యం, పైగా మోషే రాజకుటుంబంలో పెరిగాడు. ఆ విద్యాభ్యాసం వల్ల మోషే “మాటలయందును కార్యములయందును ప్రవీణునిగా” మారాడంటే ఆశ్చర్యం లేదు. (అపొ. 7:22) దానివల్ల మోషేకు ఎలాంటి అవకాశాలు ఉండివుంటాయో ఒక్కసారి ఆలోచించండి. అయితే, మోషే మరింత గొప్పదాని మీద అంటే దేవుని చిత్తం చేయడం మీద మనసు పెట్టాడు.

11, 12. మోషే ఏ జ్ఞానాన్ని విలువైనదిగా ఎంచాడు? ఆ విషయం మనకెలా తెలుసు?

11 చిన్నతనంలో మోషే తల్లి యోకెబెదు హెబ్రీయుల దేవుని గురించి తప్పకుండా బోధించివుంటుంది. మోషే ఇతర సంపదలన్నిటికన్నా యెహోవా దేవుని గురించిన జ్ఞానాన్ని ఎంతో విలువైనదిగా ఎంచాడు. అందుకే ఫరో కుటుంబ సభ్యునిగా ఉండడంవల్ల వచ్చే హక్కులను, అవకాశాల్ని ఆయన వదులుకున్నాడు. (హెబ్రీయులు 11:24-27 చదవండి.) చిన్నప్పుడు దేవుని గురించి నేర్చుకున్న విషయాలు, యెహోవాపై ఆయనకున్న విశ్వాసం, పైనున్న వాటిమీద మనసు పెట్టేలా మోషేను పురికొల్పాయి.

12 మోషే తన కాలంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ విద్యాభ్యాసం పొందినా, ఐగుప్తులో గొప్ప హోదా పొందడానికి, పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి లేదా ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడానికి దాన్ని ఉపయోగించలేదు. ఆయన ఒకవేళ వాటికోసం తాపత్రయపడివుంటే, “అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు” అని అనుకునేవాడు కాదు, అంతేకాక “ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు” ఒప్పుకుని ఉండేవాడు. అవును, యెహోవా జ్ఞానంతో మోషే దేవుని ప్రజలను నడిపించాడు.

13, 14. (ఎ) యెహోవా అప్పగించిన పనికి మోషే ఎలా అర్హుడయ్యాడు? (బి) మనం కూడా వేటిని వృద్ధి చేసుకోవాలి?

13 మోషే యెహోవాను, ఆయన ప్రజలను ప్రేమించాడు. మోషేకు 40 ఏళ్లున్నప్పుడు, ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అనుకున్నాడు. (అపొ. 7:23-25) అయితే మోషే ఇంకా సిద్ధంగా లేడని యెహోవాకు తెలుసు. ఆయన వినయం, సహనం, సాత్వికం, ఆశానిగ్రహం వంటి లక్షణాలను వృద్ధి చేసుకోవాల్సివుంది. (సామె. 15:33) ముందుముందు రాబోయే కష్టాలను తట్టుకునేలా సిద్ధపడాలంటే ఆయనకు మరింత శిక్షణ అవసరం. 40 సంవత్సరాలు గొర్రెలకాపరిగా మోషే గడిపిన జీవితం, ఆయనలో ఆ లక్షణాలను వృద్ధిచేసింది.

14 కాపరిగా గడిపిన జీవితం మోషే వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చిందా? నిస్సందేహంగా! “మోషే భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు” అయ్యాడని దేవుని వాక్యం చెబుతుంది. (సంఖ్యా. 12:3) ఆయన వినయం వృద్ధి చేసుకున్నాడు, దానివల్ల ఆయన రకరకాల మనుషులతో, వాళ్ల సమస్యలతో ఓపిగ్గా వ్యవహరించగలిగాడు. (నిర్గ. 18:26) “మహాశ్రమలను” దాటి, దేవుడు వాగ్దానం చేసిన కొత్త లోకంలోకి ప్రవేశించాలంటే మనం కూడా ఆధ్యాత్మిక లక్షణాలను వృద్ధి చేసుకోవాలి. (ప్రక. 7:14) మనం అందరితో, ముఖ్యంగా కొంచెం కోపం ఎక్కువని లేదా తొందరగా నొచ్చుకుంటారని మనం అనుకునేవాళ్లతో కూడా స్నేహంగా ఉంటున్నామా? “అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి” అని అపొస్తలుడైన పేతురు రాసిన మాటల్ని మనం పాటించాలి.—1 పేతు. 2:17.

పైనున్న వాటిమీద మనసుపెడదాం

15, 16. (ఎ) మనం సరైన విషయాలమీద మనసు పెట్టడం ఎందుకు ముఖ్యం? (బి) క్రైస్తవులు ఎందుకు మంచిగా ప్రవర్తించాలి?

15 మనం అపాయకరమైన “అంత్యదినములలో” జీవిస్తున్నాం. (2 తిమో. 3:1) కాబట్టి ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండాలంటే, సరైన విషయాలమీద మనసు పెట్టడం చాలా ముఖ్యం. (1 థెస్స. 5:6-9) మనం అలా చేయాల్సిన మూడు విధానాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

16 మన ప్రవర్తన: మంచి ప్రవర్తన ఎంత ముఖ్యమో పేతురు అర్థం చేసుకున్నాడు. అందుకే ‘అన్యజనులు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దేవుని మహిమపరచునట్లు, వారి మధ్య మంచి ప్రవర్తనగలవారై ఉండండి’ అని ఆయన చెప్పాడు. (1 పేతు. 2:12) మనం ఇంట్లోఉన్నా, పనిస్థలంలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఆటలు ఆడుతున్నా లేదా పరిచర్య చేస్తున్నా, మన మంచి ప్రవర్తన ద్వారా యెహోవాకు మహిమ తీసుకురావడానికి ఎంతో కృషిచేస్తాం. నిజమే, మనందరం అపరిపూర్ణులం కాబట్టి తప్పులు చేస్తాం. (రోమా. 3:23) అయినా, “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము” చేస్తూ ఉంటే, మన అపరిపూర్ణ శరీరంపై విజయం సాధించవచ్చు.—1 తిమో. 6:12.

17. క్రీస్తు చూపించిన వైఖరిని మనం ఎలా అనుకరించవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

17 మన వైఖరి: ఎల్లప్పుడూ మంచిగా ప్రవర్తించాలంటే మనకు సరైన వైఖరి ఉండాలి. “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఫిలి. 2:5) యేసుకు ఎలాంటి మనస్తత్వం ఉంది? ఆయన వినయస్థుడు. ఆ వినయం, పరిచర్య కోసం ఎన్నో త్యాగాలు చేసేలా ఆయన్ను కదిలించింది. దేవుని రాజ్య సువార్తను ఇతరులకు ప్రకటించడం గురించే ఆయన ఎక్కువగా ఆలోచించాడు. (మార్కు 1:38; 13:10) అంతేకాదు, దేవుని వాక్యానికే అంతిమ అధికారం ఉందని యేసు భావించాడు. (యోహా. 7:16; 8:28) ఆయన పరిశుద్ధ లేఖనాల్ని శ్రద్ధగా అధ్యయనం చేశాడు కాబట్టే వాటిని ఎత్తి చెప్పగలిగాడు, సమర్థించగలిగాడు, వివరించగలిగాడు. మనం కూడా వినయంగా ఉంటూ పరిచర్యను, వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని ఉత్సాహంగా చేస్తుంటే క్రీస్తులా ఎక్కువగా ఆలోచించగలుగుతాం.

దేవుని రాజ్య సువార్త ప్రకటించడం గురించే యేసు ఎక్కువగా ఆలోచించాడు (17వ పేరా చూడండి)

18. మనం యెహోవా పనికి ఏ ప్రాముఖ్యమైన విధానంలో మద్దతివ్వవచ్చు?

18 మన మద్దతు: “పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని . . . ప్రతివాని మోకాలును యేసునామమున” వంగాలని యెహోవా సంకల్పించాడు. (ఫిలి. 2:9-11) యేసు అంత గొప్పస్థానంలో ఉన్నా, వినయంగా తన తండ్రి చిత్తానికి లోబడతాడు, మనం కూడా అలాగే చేయాలి. (1 కొరిం. 15:28) ఏ విధంగా? మనకు అప్పగించిన పనికి అంటే, “సమస్త జనులను శిష్యులనుగా” చేసే పనికి హృదయపూర్వకంగా మద్దతివ్వడం ద్వారా అలా చేయవచ్చు. (మత్త. 28:19) దానితోపాటు, మనం ‘అందరికీ మేలు చేయాలి’ అంటే మన పొరుగువాళ్లకు, సహోదరసహోదరీలకు మంచి చేయాలి.—గల. 6:10.

19. మనం ఏమని నిశ్చయించుకోవాలి?

19 పైనున్న వాటిమీద మనసు పెట్టమని మనకు గుర్తు చేస్తున్నందుకు యెహోవాకు ఎంత రుణపడివున్నామో కదా! అందుకే “మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో” పరుగెత్తాలి. (హెబ్రీ. 12:1, 2) కాబట్టి మనమందరం యెహోవా కోసం “మనస్ఫూర్తిగా” పనిచేద్దాం, అప్పుడు మన పరలోక తండ్రి మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు.—కొలొ. 3:23, 24.