ఆదికాండం 21:1-34

  • ఇస్సాకు పుట్టడం (1-7)

  • ఇష్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేయడం (8, 9)

  • హాగరును, ఇష్మాయేలును ​పంపించేయడం (10-21)

  • అబీమెలెకుతో అబ్రాహాము ఒప్పందం (22-34)

21  యెహోవా తాను చెప్పినట్టే శారాను గుర్తుచేసుకున్నాడు. ఆమె విషయంలో యెహోవా తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.+  కాబట్టి ఆమె గర్భవతి అయ్యి,+ అబ్రాహాము ముసలితనంలో అతనికి ఒక కుమారుణ్ణి కన్నది. దేవుడు చెప్పిన సమయంలోనే అది జరిగింది.+  అబ్రాహాము అప్పుడే పుట్టిన తన కుమారునికి, అంటే శారా తనకు కనిన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు.+  దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టే, అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకుకు ఎనిమిదో రోజున సున్నతి చేయించాడు.+  తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయసు 100 ఏళ్లు.  తర్వాత శారా ఇలా అంది: “దేవుడు నన్ను సంతోషంతో నవ్వేలా చేశాడు; ఇది విన్నవాళ్లంతా నాతో కలిసి నవ్వుతారు.”*  ఆమె ఇంకా ఇలా అంది: “ ‘శారా తప్పకుండా పిల్లలకు పాలిస్తుంది’ అని అబ్రాహాముతో ఎవరు అనివుండగలిగేవాళ్లు? అయినా, నేను అతని ముసలితనంలో అతని కోసం ఒక కుమారుణ్ణి కన్నాను.”  తర్వాత ఆ పిల్లవాడు పెరిగి, పాలు విడిచాడు. ఆ పిల్లవాడు పాలు విడిచిన రోజున అబ్రాహాము పెద్ద విందు ఏర్పాటు చేశాడు.  అయితే, ఐగుప్తీయురాలైన హాగరు అబ్రాహాముకు కన్న కుమారుడు,+ ఇస్సాకును ఎగతాళి చేస్తుండడం+ శారా చాలాసార్లు గమనించింది. 10  కాబట్టి శారా అబ్రాహాముతో ఇలా అంది: “ఈ దాసురాలిని, ఈమె కుమారుణ్ణి వెళ్లగొట్టు. ఎందుకంటే ఈ దాసురాలి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతోపాటు వారసుడిగా ఉండబోడు.”+ 11  కానీ అబ్రాహాముకు, తన కుమారుని గురించి శారా చెప్పింది అస్సలు నచ్చలేదు.+ 12  అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నాడు: “ఆ అబ్బాయి గురించి, నీ దాసురాలి గురించి శారా నీకు చెప్తున్న మాటను బట్టి నొచ్చుకోకు. ఆమె మాట విను. ఎందుకంటే ఇస్సాకు ద్వారా వచ్చేదే నీ సంతానం* అనబడుతుంది.+ 13  ఆ దాసురాలి కుమారుని+ విషయానికొస్తే, అతను కూడా నీ సంతానమే* కాబట్టి అతని వంశస్థుల్ని కూడా ఒక జనం అయ్యేలా చేస్తాను.”+ 14  కాబట్టి అబ్రాహాము తెల్లవారుజామునే లేచి రొట్టెను, నీళ్లున్న తోలుసంచిని తీసుకొని హాగరుకు ఇచ్చాడు. వాటిని ఆమె భుజం మీద పెట్టి ఆ అబ్బాయితో పాటు ఆమెను పంపించేశాడు.+ కాబట్టి ఆమె అక్కడి నుండి వెళ్లిపోయి, బెయేర్షెబా+ ఎడారిలో తిరుగుతూ ఉంది. 15  చివరికి, ఆ తోలుసంచిలోని నీళ్లు అయిపోయాయి. అప్పుడామె ఆ అబ్బాయిని అక్కడున్న పొదల్లో ఒకదాని కిందికి నెట్టింది. 16  ఆ తర్వాత ఆమె, “వీడు చనిపోతుంటే నేను చూడలేను” అనుకొని, బాణం వెళ్లేంత దూరం వెళ్లి ఒక్కతే కూర్చొని గట్టిగట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది. 17  అప్పుడు దేవుడు ఆ అబ్బాయి ఏడ్పును విన్నాడు.+ పరలోకం నుండి ఒక దేవదూత హాగరును పిలిచి ఇలా అన్నాడు:+ “హాగరూ, ఎందుకు ఏడుస్తున్నావు? భయపడకు. ఆ అబ్బాయి ఏడ్పును దేవుడు విన్నాడు. 18  లే, ఆ అబ్బాయిని పైకి లేపి, గట్టిగా పట్టుకో. ఎందుకంటే నేను అతన్ని ఒక గొప్ప జనంగా చేస్తాను.”+ 19  తర్వాత దేవుడు ఆమె కళ్లను తెరిచినప్పుడు, ఆమె అక్కడ ఒక నీళ్ల బావిని చూసింది. అప్పుడు ఆమె అక్కడికి వెళ్లి తన తోలుసంచిలో నీళ్లు నింపి, ఆ అబ్బాయికి తాగించింది. 20  ఆ అబ్బాయి+ పెరిగి పెద్దవాడౌతుండగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను ఎడారిలో నివసిస్తూ విలుకాడు అయ్యాడు. 21  అతను పారాను ఎడారిలో+ నివాసం ఏర్పర్చుకున్నాడు. వాళ్ల అమ్మ ఒక ఐగుప్తీయురాలితో అతనికి పెళ్లి చేసింది. 22  ఆ సమయంలో అబీమెలెకు తన సైన్యాధిపతి ఫీకోలుతో కలిసి అబ్రాహాముతో ఇలా అన్నాడు: “నువ్వు చేసే ప్రతీ పనిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.+ 23  కాబట్టి నువ్వు నాతో, నా సంతానంతో, నా వంశస్థులతో మోసపూరితంగా వ్యవహరించననీ; నేను నీతో వ్యవహరించినట్టే+ నువ్వు కూడా నాతో, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలోని ప్రజలతో విశ్వసనీయ ప్రేమతో వ్యవహరిస్తాననీ దేవుని ముందు నాకు ప్రమాణం చేయి.” 24  దానికి అబ్రాహాము, “నేను ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు. 25  అయితే, అబీమెలెకు సేవకులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్న నీళ్ల బావి+ గురించి అబ్రాహాము అబీమెలెకుకు ఫిర్యాదు చేశాడు. 26  అందుకు అబీమెలెకు ఇలా అన్నాడు: “ఈ పని ఎవరు చేశారో నాకు తెలీదు; నువ్వు కూడా దాని గురించి నాకు చెప్పలేదు, ఈ రోజు వరకు దాని గురించి ఎవ్వరూ నాతో ఒక్కమాట కూడా అనలేదు.” 27  అప్పుడు అబ్రాహాము గొర్రెల్ని, పశువుల్ని తీసుకొని అబీమెలెకుకు ఇచ్చాడు. అలా వాళ్లిద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు. 28  అబ్రాహాము, మందలో నుండి ఏడు ఆడ గొర్రెపిల్లల్ని పక్కకు తీసి ఉంచాడు. 29  అప్పుడు అబీమెలెకు, “ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని ఎందుకు పక్కకు తీసి ఉంచావు?” అని అబ్రాహామును అడిగాడు. 30  దానికి అబ్రాహాము, “ఈ బావిని నేనే తవ్వాను అనడానికి సాక్ష్యంగా నువ్వు ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని నా దగ్గర నుండి తీసుకోవాలి” అన్నాడు. 31  అక్కడ వాళ్లిద్దరు ప్రమాణం చేసుకున్నారు కాబట్టి అతను ఆ చోటును బెయేర్షెబా* అని పిలిచాడు.+ 32  అలా వాళ్లు బెయేర్షెబా దగ్గర ఒప్పందం చేసుకున్న+ తర్వాత అబీమెలెకు తన సైన్యాధిపతి ఫీకోలుతో కలిసి ఫిలిష్తీయుల+ దేశానికి వెళ్లిపోయాడు. 33  తర్వాత అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల చెట్టును నాటి, నిత్య దేవుడైన+ యెహోవా పేరును స్తుతించాడు.+ 34  అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలాకాలం* ఉన్నాడు.*+

అధస్సూచీలు

లేదా “నన్ను చూసి నవ్వుతారు” అయ్యుంటుంది.
అక్ష., “విత్తనం.”
అక్ష., “విత్తనమే.”
“ప్రమాణపు బావి” లేదా “ఏడిటి బావి” అని అర్థం అయ్యుంటుంది.
అక్ష., “చాలా రోజులు.”
లేదా “పరదేశిగా నివసించాడు.”