ఆదికాండం 13:1-18

  • అబ్రాము కనానుకు తిరిగెళ్లడం (1-4)

  • అబ్రాము, లోతు వేరైపోయారు (5-13)

  • దేవుడు తన వాగ్దానాన్ని అబ్రాముకు మళ్లీ చెప్పడం (14-18)

13  అప్పుడు అబ్రాము తన భార్యను, తనకున్న వాటన్నిటినీ, లోతును తీసుకొని ఐగుప్తు నుండి బయల్దేరి నెగెబుకు+ వచ్చాడు.  అబ్రాముకు పశువులు, వెండిబంగారాలు చాలా ఎక్కువగా ఉండేవి.+  అతను నెగెబు నుండి బేతేలుకు వచ్చేవరకు ఒకచోటి నుండి ఇంకోచోటికి తన నివాసాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. అలా వెళ్తూవెళ్తూ అంతకుముందు తాను బేతేలుకు, హాయికి మధ్య+ డేరా వేసుకున్న చోటికి వచ్చాడు,  అంతకుముందు అతను బలిపీఠం కట్టింది కూడా అక్కడే. అబ్రాము అక్కడ యెహోవా పేరును స్తుతించాడు.  అబ్రాముతో ప్రయాణం చేస్తున్న లోతుకు కూడా గొర్రెలు, పశువులు, డేరాలు ఉన్నాయి.  కాబట్టి అవన్నీ ఒకేచోట ఉండడానికి ఆ స్థలం సరిపోలేదు; వాళ్లిద్దరి దగ్గర ఎంత ఆస్తి ఉందంటే ఇక వాళ్లిద్దరూ కలిసి ఒకేచోట ఉండడం కుదరలేదు.  దానివల్ల, అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు మధ్య గొడవ వచ్చింది. (అప్పటికి ఆ దేశంలో కనానీయులు, పెరిజ్జీయులు నివసిస్తున్నారు.)+  కాబట్టి అబ్రాము లోతుతో+ ఇలా అన్నాడు: “దయచేసి నా మాట విను. నీకూ నాకూ మధ్య, నీ పశువుల కాపరులకూ నా పశువుల కాపరులకూ మధ్య గొడవలు ఉండకూడదు. ఎందుకంటే మనం బంధువులం.  ఇదిగో, ఈ దేశమంతా నీ ముందు ఉంది. కాబట్టి దయచేసి నా దగ్గర నుండి వెళ్లిపోయి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే, నేను కుడివైపు వెళ్తాను; నువ్వు కుడివైపు వెళ్తే, నేను ఎడమవైపు వెళ్తాను.” 10  అప్పుడు లోతు తల ఎత్తి యొర్దాను నదీ పరీవాహక ప్రాంతాన్ని+ చూశాడు. సోయరు+ వరకు ఆ ప్రాంతమంతా (యెహోవా సొదొమ, గొమొర్రా నగరాల్ని నాశనం చేయకముందు) చక్కగా నీళ్లు పారుతూ యెహోవా తోటలా,+ ఐగుప్తు దేశంలా ఉందని అతను గమనించాడు. 11  దాంతో లోతు యొర్దాను నదీ పరీవాహక ప్రాంతమంతటినీ ఎంచుకొని, తూర్పు వైపుకు తన నివాసాన్ని మార్చుకున్నాడు. అలా వాళ్లిద్దరూ వేరైపోయారు. 12  అబ్రాము కనాను దేశంలో నివసించాడు, కానీ లోతు మాత్రం యొర్దాను నదీ పరీవాహక ప్రాంతంలోని నగరాల మధ్య నివసించాడు.+ చివరికి లోతు సొదొమకు దగ్గర్లో తన డేరా వేసుకున్నాడు. 13  సొదొమలోని మనుషులు చాలా చెడ్డవాళ్లు, యెహోవా దృష్టిలో ఘోరమైన పాపులు.+ 14  లోతు అబ్రాము నుండి వేరైపోయిన తర్వాత యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “దయచేసి నీ తల ఎత్తి, నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు, పడమటి వైపు చూడు. 15  ఎందుకంటే, నీకు కనిపించే ఈ దేశాన్నంతటినీ నీకు, నీ సంతానానికి* శాశ్వతమైన ఆస్తిగా ఇస్తాను.+ 16  నేను నీ సంతానం* ఇసుక రేణువులంతమంది అయ్యేలా చేస్తాను; ఎవరైనా ఇసుక రేణువుల్ని లెక్కపెట్టగలిగితే, నీ సంతానాన్ని* కూడా లెక్కపెట్టవచ్చు.+ 17  లేచి, ఈ దేశమంతా* తిరిగి చూడు. ఎందుకంటే నేను దీన్ని నీకు ఇవ్వబోతున్నాను.” 18  కాబట్టి అబ్రాము డేరాల్లో నివసిస్తూ ఒక్కో చోటికి వెళ్లాడు. ఆ తర్వాత అతను హెబ్రోనులో+ ఉన్న మమ్రే+ మహా వృక్షాల దగ్గరికి వచ్చి అక్కడ నివసించాడు. అక్కడ అతను యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.+

అధస్సూచీలు

అక్ష., “విత్తనానికి.”
అక్ష., “విత్తనం.”
అక్ష., “విత్తనాన్ని.”
అక్ష., “దేశం పొడవు, వెడల్పు.”