నిర్గమకాండం 18:1-27

  • యిత్రో, సిప్పోరా వస్తారు (1-12)

  • న్యాయమూర్తుల్ని నియమించమని యిత్రో సలహా ఇస్తాడు (13-27)

18  దేవుడు మోషే కోసం, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం చేసిందంతా, అంటే యెహోవా ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడో మిద్యాను పూజారి, మోషే మామ అయిన యిత్రో+ విన్నాడు.+  మోషే తన భార్య సిప్పోరాను వెనక్కి పంపించినప్పుడు అతని మామ యిత్రో ఆమె బాగోగులు చూసుకున్నాడు.  ఆమె ఇద్దరు కుమారుల్ని+ కూడా అతనే చూసుకున్నాడు. మోషే, “నేను వేరే దేశంలో పరదేశిని అయ్యాను” అంటూ ఒక కుమారుడికి గెర్షోము* అని పేరు పెట్టాడు.+  అలాగే, “నన్ను ఫరో కత్తి నుండి కాపాడిన దేవుడే,+ నా తండ్రి ఆరాధించిన దేవుడే నా సహాయకుడు” అంటూ ఇంకో కుమారుడికి ఎలీయెజెరు* అని పేరు పెట్టాడు.  మోషే మామ యిత్రో మోషే కుమారుల్ని, అతని భార్యను తీసుకొని, ఎడారిలో సత్యదేవుని పర్వతం+ దగ్గర డేరా వేసుకున్న మోషే దగ్గరికి వచ్చాడు.  అతను, “నేను నీ మామ యిత్రోను.+ నేను నీ భార్యను, ఆమె ఇద్దరు కుమారుల్ని తీసుకొని నీ దగ్గరికి వస్తున్నాను” అని మోషేకు కబురు పంపాడు.  వెంటనే మోషే వెళ్లి తన మామను కలుసుకొని, అతనికి వంగి నమస్కారం చేసి, అతన్ని ముద్దుపెట్టుకున్నాడు. వాళ్లిద్దరూ ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకొని, ఆ తర్వాత డేరాలోకి వెళ్లారు.  యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున ఫరోకూ ఐగుప్తుకూ ఏమి చేశాడో,+ దారిలో వాళ్లకు ఏమేం కష్టాలు ఎదురయ్యాయో,+ యెహోవా వాళ్లను ఎలా విడిపించాడో మోషే తన మామకు చెప్పాడు.  ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు* నుండి విడిపించడం ద్వారా యెహోవా వాళ్లకు చేసిన మంచి అంతటిని బట్టి యిత్రో చాలా సంతోషించాడు. 10  తర్వాత యిత్రో ఇలా అన్నాడు: “ఐగుప్తు నుండి, ఫరో నుండి మిమ్మల్ని కాపాడి, ఐగుప్తు గుప్పిట్లో నుండి ఈ ప్రజల్ని విడిపించిన యెహోవా స్తుతించబడాలి. 11  తన ప్రజలతో అహంకారంగా ప్రవర్తించినవాళ్లకు ఆయన చేసినదాన్ని బట్టి, మిగతా దేవుళ్లందరి కన్నా యెహోవానే గొప్పవాడని+ ఇప్పుడు నాకు అర్థమైంది.” 12  తర్వాత మోషే మామ యిత్రో, దేవుని కోసం దహనబలిని, వేరే బలుల్ని తీసుకొచ్చాడు; అహరోనూ, ​ఇశ్రాయేలు ​పెద్దలందరూ సత్యదేవుని సన్నిధిలో మోషే మామతో కలిసి భోజనం చేయడానికి వచ్చారు. 13  తర్వాతి రోజు మోషే ఎప్పటిలాగే ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు మోషే దగ్గరికి వస్తూ, అతని ముందు నిలబడుతూ ఉన్నారు. 14  మోషే ఆ ప్రజల కోసం చేస్తున్నదంతా అతని మామ చూసి, “ఈ ప్రజల కోసం నువ్వు చేస్తున్నదేంటి? న్యాయం తీర్చడానికి నువ్వు ఒక్కడివే ఇక్కడ కూర్చోవడం, ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజలంతా నీ ముందు నిలబడి ఉండడం ఎందుకు?” అన్నాడు. 15  అప్పుడు మోషే తన మామతో ఇలా అన్నాడు: “ఎందుకంటే, ప్రజలు దేవుని నిర్దేశమేంటో అడిగి తెలుసుకోవడానికి నా దగ్గరికి వస్తూ ఉంటారు. 16  ఏదైనా వివాదం తలెత్తితే, వాళ్లు దాన్ని నా దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు నేను వాళ్లిద్దరి మధ్య న్యాయం తీర్చాలి. అంతేకాదు నేను సత్యదేవుని నిర్ణ​యాల్ని, ఆయన నియమాల్ని వాళ్లకు చెప్తాను.”+ 17  అప్పుడు మోషే మామ అతనితో ఇలా అన్నాడు: “ఇది సరైన పద్ధతి కాదు. 18  ఇలా చేస్తే నువ్వు తప్పకుండా అలసిపోతావు. నువ్వే కాదు నీతోపాటు ఉన్న ఈ ప్రజలు కూడా అలసిపోతారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద పని, నువ్వు ఒక్కడివే ఈ భారమంతా మోయలేవు. 19  కాబట్టి నా మాట విను. నేను నీకొక సలహా ఇస్తాను, దేవుడు నీకు తోడుగా ఉంటాడు.+ నువ్వు సత్యదేవుని ముందు ప్రజలకు ప్రతినిధిగా ఉంటూ,+ వివాదాల్ని సత్యదేవుని దగ్గరికి తీసుకురావాలి.+ 20  నువ్వు దేవుని ఆజ్ఞల్ని, నియమాల్ని వాళ్లకు నేర్పించాలి;+ వాళ్లు ఏ మార్గంలో నడవాలో, ఏమేం పనులు చేయాలో వాళ్లకు తెలియజేయాలి. 21  అయితే నువ్వు ప్రజల్లో నుండి సమర్థులైన పురుషుల్ని ఎంచుకోవాలి.+ వాళ్లు దేవునికి భయపడేవాళ్లు, నమ్మదగినవాళ్లు, అక్రమ లాభాన్ని అసహ్యించుకునేవాళ్లు అయ్యుండాలి.+ నువ్వు వాళ్లను వెయ్యిమంది మీద, వందమంది మీద, యాభైమంది మీద, పదిమంది మీద ప్రధానులుగా నియమించాలి.+ 22  వివాదాలు తలెత్తినప్పుడు* వాళ్లు ప్రజలకు న్యాయం తీర్చాలి. కష్టమైన ప్రతీ వివాదాన్ని వాళ్లు నీ దగ్గరికి తీసుకొస్తారు.+ అయితే చిన్నచిన్న వివాదాల విషయంలో వాళ్లే నిర్ణయం చెప్తారు. అలా వాళ్లతో నీ భారం పంచుకొని నీ పని తేలిక చేసుకో.+ 23  నువ్వు ఇలా చేస్తే, దేవుడు దీన్ని ఆమోదిస్తే, నువ్వు ఈ భారం మోయగలుగుతావు. అంతేకాదు, ప్రతీ ఒక్కరు సంతృప్తితో ఇంటికి వెళ్తారు.” 24  మోషే వెంటనే తన మామ మాట విన్నాడు, అతను చెప్పిందంతా చేశాడు. 25  మోషే ఇశ్రాయేలీయులందరిలో నుండి సమర్థులైన పురుషుల్ని ఎంచుకొని వాళ్లను ప్రజల మీద పెద్దలుగా నియమించాడు; అతను వాళ్లను వెయ్యిమంది మీద, వందమంది మీద, యాభైమంది మీద, పదిమంది మీద ప్రధానులుగా నియమించాడు. 26  కాబట్టి వివాదాలు తలెత్తినప్పుడు వాళ్లు ​ప్రజలకు న్యాయం తీర్చారు. ఏదైనా వివాదం కష్టంగా ఉంటే, వాళ్లు దాన్ని మోషే దగ్గరికి తీసుకొచ్చేవాళ్లు.+ కానీ చిన్నచిన్న వివాదాల విషయంలో వాళ్లే న్యాయం తీర్చేవాళ్లు. 27  తర్వాత మోషే తన మామను సాగనంపాడు,+ అతను తన దేశానికి వెళ్లిపోయాడు.

అధస్సూచీలు

“అక్కడ నివసించే ఒక పరదేశి” అని అర్థం.
“నా దేవుడే సహాయకుడు” అని అర్థం.
అక్ష., “ఐగుప్తు చేతి.”
అక్ష., “ప్రతీ సమయంలో.”