ఆదికాండం 15:1-21

  • అబ్రాముతో దేవుని ఒప్పందం (1-21)

    • 400 ఏళ్ల బానిసత్వం గురించిన ​ప్రవచనం (13)

    • దేవుడు తన వాగ్దానాన్ని అబ్రాముకు మళ్లీ చెప్పడం (18-21)

15  ఆ తర్వాత ఒక దర్శనంలో యెహోవా* అబ్రాముతో ఇలా అన్నాడు: “అబ్రామూ, భయపడకు.+ నేను నీకు డాలును.+ నీ ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది.”+  దానికి అబ్రాము ఇలా అన్నాడు: “సర్వోన్నత ప్రభువైన యెహోవా, నువ్వు నాకు ఏమి ఇస్తావు? నాకు ఇప్పటికీ పిల్లలు లేరు, దమస్కువాడైన ఎలీయెజెరు+ నా ఇంటికి వారసుడు కాబోతున్నాడు.”  అబ్రాము ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు నాకు సంతానం*+ ఇవ్వలేదు. ఇదిగో! నా ఇంట్లోని సేవకుడు* నాకు వారసుడు కాబోతున్నాడు.”  కానీ యెహోవా అతనితో ఇలా అన్నాడు: “ఇతను నీకు వారసుడు అవ్వడు. నీ సొంత కుమారుడే నీకు వారసుడు అవుతాడు.”+  తర్వాత దేవుడు అబ్రామును బయటికి తీసుకొచ్చి, “దయచేసి, ఆకాశం వైపు చూసి నీకు చేతనైతే ఆ నక్షత్రాల్ని లెక్కపెట్టు” అన్నాడు. ఆ తర్వాత దేవుడు, “నీ సంతానం* కూడా వాటిలాగే అవుతుంది” అన్నాడు.+  అబ్రాము యెహోవా మీద విశ్వాసం ఉంచాడు,+ దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.*+  దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “నేను యెహోవాను, ఈ దేశాన్ని నీకు ఆస్తిగా ఇవ్వడానికి నిన్ను కల్దీయుల ప్రాంతమైన ఊరు నుండి ఇక్కడికి తీసుకొచ్చింది నేనే.”+  అందుకు అబ్రాము, “సర్వోన్నత ప్రభువైన యెహోవా, నేను ఈ దేశాన్ని ఆస్తిగా పొందుతానని నేనెలా నమ్మాలి?” అని అడిగాడు.  అప్పుడు దేవుడు అతనికి ఇలా చెప్పాడు: “నాకోసం ఒక మూడేళ్ల ఆవుదూడను, మూడేళ్ల మేకను, మూడేళ్ల పొట్టేలును, ఒక గువ్వను, ఒక పావురం పిల్లను తీసుకో.” 10  కాబట్టి అబ్రాము అవన్నీ తీసుకొని, వాటిని రెండుగా కోసి ఆ ముక్కల్ని ఎదురెదురుగా పెట్టాడు, కానీ పక్షుల్ని మాత్రం అతను కోయలేదు. 11  అప్పుడు, వేటాడే పక్షులు వాటి దగ్గరికి రావడం మొదలుపెట్టాయి, కానీ అబ్రాము ఆ పక్షుల్ని వెళ్లగొడుతూ ఉన్నాడు. 12  సూర్యాస్తమయం కాబోతుండగా, అబ్రాముకు గాఢనిద్ర పట్టింది. భయంకరమైన చిమ్మచీకటి అతన్ని అలుముకుంది. 13  తర్వాత దేవుడు అబ్రాముతో ఇలా అన్నాడు: “నువ్వు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి, నీ సంతానం* తమది కాని దేశంలో పరదేశులుగా జీవిస్తారు, అక్కడి ప్రజలు వీళ్లను బానిసలుగా చేసుకొని, 400 సంవత్సరాల పాటు వీళ్లను బాధిస్తారు.+ 14  కానీ వీళ్లు ఎవరి కిందైతే బానిసలుగా ఉంటారో ఆ జనానికి నేను తీర్పుతీరుస్తాను,+ తర్వాత వీళ్లు చాలా వస్తువులతో బయటికి వస్తారు.+ 15  నువ్వైతే, నెమ్మదితో నీ పూర్వీకుల దగ్గరికి వెళ్తావు; మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు.+ 16  అయితే నీ వంశస్థులు నాలుగో తరంలో ఇక్కడికి తిరిగొస్తారు,+ ఎందుకంటే అమోరీయుల పాపం ఇంకా సంపూర్ణం కాలేదు.”+ 17  సూర్యుడు అస్తమించి, చాలా చీకటైనప్పుడు పొగ లేస్తున్న ఒక కొలిమి కనిపించింది, అబ్రాము కోసి ఉంచిన భాగాల మధ్య నుండి ఒక దివిటీ* వెళ్లింది. 18  ఆ రోజు యెహోవా అబ్రాముతో ఒక ఒప్పందం చేశాడు.+ ఆయన ఇలా అన్నాడు: “ఐగుప్తు నది నుండి యూఫ్రటీసు మహానది+ వరకు ఈ దేశాన్ని నీ సంతానానికి* ఇస్తాను.+ 19  అంటే కేనీయుల+ ప్రాంతాన్ని, కనిజ్జీయుల ప్రాంతాన్ని, కద్మోనీయుల ప్రాంతాన్ని, 20  హిత్తీయుల ప్రాంతాన్ని,+ పెరిజ్జీయుల ప్రాంతాన్ని,+ రెఫాయీయుల ప్రాంతాన్ని,+ 21  అమోరీయుల ప్రాంతాన్ని, కనానీయుల ప్రాంతాన్ని, గిర్గాషీయుల ప్రాంతాన్ని, యెబూసీయుల ప్రాంతాన్ని+ నీ వంశస్థులకు ఇస్తాను.”

అధస్సూచీలు

అక్ష., “యెహోవా వాక్యం.”
అక్ష., “విత్తనం.”
అక్ష., “కుమారుడు.”
అక్ష., “విత్తనం.”
లేదా “లెక్కించాడు.”
అక్ష., “విత్తనం.”
లేదా “కాగడా.”
అక్ష., “విత్తనానికి.”