కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను “ఎరుగు హృదయము” మీకుందా?

యెహోవాను “ఎరుగు హృదయము” మీకుందా?

“వారు నా జనులగునట్లు . . . నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను.”—యిర్మీ. 24:7.

1, 2. కొందరు అంజూరపు పండ్లను ఎందుకు ఇష్టపడతారు?

 తాజా లేదా ఎండు అంజూరపు పండ్లంటే మీకు ఇష్టమేనా? చాలామంది వాటిని ఇష్టపడతారు. అందుకే వాటిని చాలా ప్రదేశాల్లో పండిస్తారు. పూర్వకాలంలోని యూదులకు అవంటే ఎంతో మక్కువ. (నహూ. 3:12; లూకా 13:6-9) వాటిలో పీచు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్స్‌ అనే సహజ రసాయనాలు ఉంటాయి కాబట్టి అవి గుండెకు మంచివని కొందరు చెబుతారు.

2 ఒక సందర్భంలో, హృదయం గురించి మాట్లాడుతూ యెహోవా అంజూరపు పండ్లను ప్రస్తావించాడు. ఆ సందర్భంలో యెహోవా, అంజూరపు పండ్ల పోషక విలువల గురించి వివరించలేదు. కానీ, వాటిని ఒక ఉదాహరణగా మాత్రమే ఉపయోగించాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన మాటలు మన హృదయాలకు, మన ఆత్మీయుల హృదయాలకు కూడా వర్తిస్తాయి. యెహోవా చెప్పిన మాటలను పరిశీలిస్తూ, అవి నేటి క్రైస్తవులకు ఎలా అన్వయిస్తాయో ఆలోచించండి.

3. యిర్మీయా 24వ అధ్యాయంలో ప్రస్తావించిన అంజూరపు పండ్లు ఎవరిని సూచిస్తున్నాయి?

3 మనం ముందుగా, యిర్మీయా కాలంలో అంజూరపు పండ్ల గురించి యెహోవా ఏమి చెప్పాడో పరిశీలిద్దాం. సా.శ.పూ. 617 నాటికి యూదా జనాంగం ఆధ్యాత్మికంగా భ్రష్టుపట్టింది. భవిష్యత్తులో యూదా ప్రజలకు జరగబోయే దాన్ని వివరించడానికి దేవుడు యిర్మీయాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అందులో “మిక్కిలి మంచివిగా,” “మిక్కిలి జబ్బువిగా” ఉన్న రెండు రకాల అంజూరపు పండ్లను చూపించాడు. (యిర్మీయా 24:1-3 చదవండి.) రాజైన నెబుకద్నెజరు నేతృత్వంలోని సైన్యాల చేతిలో చిత్ర హింసలు అనుభవించిన సిద్కియా రాజును, అతని అనుచరులను మిక్కిలి జబ్బువైన పండ్లు సూచిస్తున్నాయి. మరి మంచి అంజూరపు పండ్లు ఎవరిని సూచిస్తున్నాయి? అప్పటికే బబులోనులో ఉన్న యెహెజ్కేలును, దానియేలును, ఆయన ముగ్గురు స్నేహితులను, త్వరలోనే బబులోనుకు చెరగా వెళ్లబోయే కొందరు యూదులను సూచిస్తున్నాయి. అలా చెరగా వెళ్లిన యూదుల్లో మిగిలినవాళ్లు కొంతకాలానికి స్వదేశానికి తిరిగి వచ్చి యెరూషలేమును, దాని ఆలయాన్ని మళ్లీ కట్టారు.—యిర్మీ. 24:8-10; 25:11, 12; 29:10.

4. మంచి అంజూరపు పండ్ల గురించి దేవుడు చెప్పిన దాని నుండి మనం ఎలాంటి ప్రోత్సాహాన్ని పొందవచ్చు?

4 మంచి అంజూరపు పండ్లు సూచిస్తున్న వాళ్ల గురించి యెహోవా ఇలా చెప్పాడు: “వారు నా జనులగునట్లు . . . నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను.” (యిర్మీ. 24:7) ఈ ఆర్టికల్‌కు ఇదే ముఖ్య వచనం. అది మనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తోంది. ఎందుకంటే, తనను “ఎరుగు హృదయమును” ఇవ్వడానికి దేవుడు ఎంతో సుముఖంగా ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో, “హృదయము” అనే పదం ఒకరి మనోవైఖరికి సంబంధించినది. అలాంటి హృదయం కావాలని, ఆయన ప్రజలుగా ఉండాలని మనం తప్పక కోరుకుంటాం. ఆ కోరిక నెరవేరాలంటే మనం ఆయన వాక్యాన్ని అధ్యయనం చేసి దాన్ని పాటించాలి, పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందాలి, దేవునికి సమర్పించుకోవాలి. అంతేకాక తండ్రి నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి. (మత్త. 28:19, 20; అపొ. 3:19, 20) బహుశా ఇప్పటికే మీరు అవన్నీ చేసివుండవచ్చు లేదా అవన్నీ చేయడానికి ప్రస్తుతం క్రమం తప్పకుండా యెహోవాసాక్షులతో సహవసిస్తుండవచ్చు.

5. యిర్మీయా ముఖ్యంగా ఎవరి హృదయం గురించి రాశాడు?

5 పైన చెప్పుకున్న వాటన్నిటినీ ఇప్పటికే పూర్తి చేసినా లేదా ఆ క్రమంలో ఉన్నా మన మనోవైఖరి, ప్రవర్తన ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకు? హృదయం గురించి యిర్మీయా రాసిన మిగతా సమాచారాన్ని పరిశీలిస్తే అది అర్థమౌతుంది. యిర్మీయా పుస్తకంలోని కొన్ని అధ్యాయాలు చుట్టుపక్కల ఉన్న అన్య జనాంగాల గురించి మాట్లాడుతున్నాయి. అయినప్పటికీ అవి ముఖ్యంగా ఐదుగురు యూదా రాజుల పరిపాలనలో యూదా జనాంగం ఉన్న పరిస్థితి గురించే నొక్కి చెబుతున్నాయి. (యిర్మీ. 1:15, 16) అవును, యెహోవాకు సమర్పితమైన పురుషులు, స్త్రీలు, పిల్లల గురించే యిర్మీయా మాట్లాడాడు. అలా యెహోవా సమర్పిత జనాంగంగా ఉంటామని వాళ్ల పూర్వీకులు తమంతట తామే ఒప్పుకున్నారు. (నిర్గ. 19:3-8) యిర్మీయా కాలంలోని ప్రజలు కూడా తాము సమర్పిత జనాంగంగా ఉన్నామని ఒప్పుకుంటూ ఇలా అన్నారు: “నీవే మా దేవుడవైన యెహోవావు, నీయొద్దకే మేము వచ్చుచున్నాము.” (యిర్మీ. 3:22) అయితే, అప్పుడు వాళ్ల హృదయ పరిస్థితి ఎలా ఉంది?

హృదయానికి శస్త్రచికిత్స అవసరమా?

6. హృదయం గురించి దేవుడు చెప్పిన దాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి?

6 నేటి వైద్యులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుండె పరిస్థితిని, పని తీరును తెలుసుకుంటున్నారు. అయితే, యెహోవా అంతకన్నా ఎక్కువే చేయగలడు. యిర్మీయా కాలంలో అలా చేసి చూపించాడు కూడా. ఆ విషయంలో యెహోవాకు తిరుగులేదని ఆయన చెప్పిన ఈ మాటల్ని బట్టి తెలుస్తోంది: “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను.” (యిర్మీ. 17:9, 10) ‘హృదయమును పరిశోధించడం’ అంటే 70-80 ఏళ్లలో మూడు వందల కోట్లసార్లు కొట్టుకునే గుండెకు వైద్య పరీక్షలు చేయడం లాంటిది కాదు. ఎందుకంటే ఆ లేఖనంలో యెహోవా చెబుతున్న “హృదయం” మన కోరికలు, ఆలోచనలు, మనో వైఖరి, లక్షణాలు, లక్ష్యాలు అన్నీ కలగలసిన పూర్తి అంతరంగాన్ని సూచిస్తుంది. మనకు అలాంటి హృదయమే ఉంది. దేవుడు దాన్ని పరిశీలించగలడు. కొంతమేరకు మనం కూడా పరిశీలించుకోవచ్చు.

7. తన కాలంలోని యూదుల్లో ఎక్కువమంది హృదయ పరిస్థితి ఎలా ఉందని యిర్మీయా వివరించాడు?

7 ఆ పరీక్షకు సిద్ధపడడం కోసం ఈ ప్రశ్న వేసుకోవచ్చు: ‘యిర్మీయా కాలంలోని యూదుల్లో ఎక్కువమంది హృదయ పరిస్థితి ఎలా ఉండేది?’ దాని జవాబు కోసం, యిర్మీయా వాడిన ఓ అసాధారణమైన పదబంధాన్ని పరిశీలిద్దాం. “ఇశ్రాయేలీయులందరు హృదయ సంబంధమైన సున్నతినొందిన వారుకారు” అని ఆయన అన్నాడు. యూదుల్లోని మగవాళ్లకు చేయించే సాధారణమైన సున్నతి గురించి ఆయనిక్కడ చెప్పడం లేదు. ఎందుకంటే ఆ తర్వాతి మాటలను గమనించండి: “రాబోవుదినములలో సున్నతి పొందియు సున్నతిలేని . . . వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.” సున్నతిపొందిన యూదా పురుషులు కూడా “హృదయ సంబంధమైన సున్నతినొందినవారుకారు” అని ఆ మాటల్ని బట్టి తెలుస్తోంది. (యిర్మీ. 9:25, 26) ఇంతకీ దాని భావం ఏమిటి?

8, 9. చాలామంది యూదులు తమ హృదయానికి సంబంధించి ఏమి చేయాల్సి ఉందని యెహోవా చెప్పాడు?

8 యూదులను దేవుడు ఏమి చేయమని అడిగాడో పరిశీలిస్తే “హృదయ సంబంధమైన సున్నతినొందినవారుకారు” అనే పదబంధాన్ని కొంతమేరకు అర్థంచేసుకోవచ్చు. దేవుడు వాళ్లకు ఇలా చెప్పాడు: “మీ హృదయములకు ఛేదనసంస్కారము చేసికొనుడి; మీ దుష్టక్రియలనుబట్టి . . . నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి.” అయితే వారి దుష్టక్రియలు ఎక్కడనుండి వచ్చాయి? వారిలోనుండే, వారి హృదయంలోనుండే. (మార్కు 7:20-23 చదవండి.) అవును, యూదుల దుష్టక్రియలకు ఖచ్చితమైన కారణాన్ని యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చూపించాడు. వాళ్ల హృదయాలు మొండిగా తిరుగుబాటు చేశాయి. వాళ్ల ఉద్దేశాలు, ఆలోచనలు దేవునికి నచ్చలేదు. (యిర్మీయా 5:23, 24; 7:24-26 చదవండి.) అందుకే దేవుడు వాళ్లకు ఇలా చెప్పాడు: “మీ హృదయములకు ఛేదనసంస్కారము చేసికొనుడి . . . యెహోవాకు లోబడియుండుడి.”—యిర్మీ. 4:4, అథఃస్సూచి; 18:11, 12.

9 మోషే కాలంలోని వాళ్లకు అవసరమైనట్లే, యిర్మీయా కాలంలోని యూదులకు కూడా “హృదయమునకు సున్నతి” అవసరమైంది. (ద్వితీ. 10:16; 30:6) “హృదయములకు ఛేదనసంస్కారము” చేసుకోవడం అంటే హృదయమును మొద్దుబారేలా చేసిన తప్పుడు ఆలోచనలను, ఇష్టాలను, ఉద్దేశాలను తీసేసుకోవడమే.—అపొ. 7:51, అథఃస్సూచి.

నేడు ఆయనను “ఎరుగు హృదయము”

10. దావీదులా మనం కూడా ఏమి చేయాలి?

10 హృదయం గురించి దేవుడు అన్ని వివరాలు ఇచ్చినందుకు మనం ఎంతో కృతజ్ఞులం. అయితే, ‘నేటి యెహోవాసాక్షులకు అది ఎలా వర్తిస్తుంది?’ అని కొంతమంది ప్రశ్నించవచ్చు. సంఘాల్లోని చాలామంది క్రైస్తవులు అప్పటి యూదుల్లా చెడు మార్గంలో నడుచుకోవడం లేదు లేదా “జబ్బైన అంజూరపు” పండ్లలా లేరు. కానీ, నేటి దేవుని సేవకులు భక్తిగల, పరిశుద్ధమైన ప్రజలుగా ఉన్నారు. అయినప్పటికీ యెహోవాకు దావీదు చేసిన ఈ విన్నపం గురించి ఆలోచించండి: “దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము.”—కీర్త. 17:3; 139:23, 24.

11, 12. (ఎ) ప్రతి ఒక్కరూ హృదయాన్ని ఎందుకు పరిశోధించుకోవాలి? (బి) దేవుడు ఏమి చేయడు?

11 మనలో ప్రతి ఒక్కరూ తనకు ఇష్టమైన హృదయ స్థితి సంపాదించుకుని, దాన్ని కాపాడుకోవాలని యెహోవా కోరుతున్నాడు. నీతిమంతుల గురించి యిర్మీయా ఇలా అన్నాడు: “సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే.” (యిర్మీ. 20:12) సర్వశక్తివంతుడైన దేవుడు నీతిమంతుల హృదయాన్నే పరిశోధిస్తున్నాడంటే, మనల్ని మనం కాస్త పరిశోధించుకోవాల్సిన అవసరం లేదా? (కీర్తన 11:5 చదవండి.) అలా చేసినప్పుడు ఒకానొక లక్షణాన్ని, లక్ష్యాన్ని, భావోద్వేగాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని మనం గుర్తించవచ్చు. మన హృదయాన్ని మొద్దుబారేటట్లు చేసే కొన్నిటిని మనం గుర్తించి, వాటిని ‘ఛేదించాల్సిన’ అవసరం ఉందని గ్రహించవచ్చు. అదే మన హృదయానికి చేసే శస్త్రచికిత్స. మీ హృదయాన్ని పరిశోధించుకోవడం మంచిదని మీరు ఒప్పుకుంటే, మీరు వేటి కోసం చూడవచ్చు? ఆ తర్వాత మీరు అవసరమైన సర్దుబాట్లు ఎలా చేసుకోవచ్చు?—యిర్మీ 4:4, అథఃస్సూచి.

12 ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. యెహోవా మనల్ని బలవంతంగా మార్చాలని మనం ఆశించకూడదు. “మంచి అంజూరపు” పండ్ల లాంటి వాళ్లకు తనను ‘ఎరుగు హృదయం ఇస్తాను’ అని యెహోవా చెప్పాడు. బలవంతంగా వాళ్ల హృదయాన్ని మారుస్తానని ఆయన చెప్పలేదు. తాము దేవుణ్ణి ఎరిగిన ప్రజలమని చూపించేలా ఆయన నిర్దేశాలకు స్పందించే హృదయాన్ని వాళ్లు కోరుకోవాలి. మరి మనమూ అదే కోరుకోవద్దా?

హృదయాన్ని పరిశీలించుకొని, చెడు కోరికలను తీసేసుకుంటే దీవెనలు పొందుతాం

13, 14. ఏ విధంగా ఒక క్రైస్తవుని హృదయం అతనికి హానికరంగా తయారవ్వచ్చు?

13 యేసు ఇలా అన్నాడు: “దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధసాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును.” (మత్త. 15:19) మొద్దుబారిన హృదయం వల్ల వ్యభిచారానికి లేదా జారత్వానికి పాల్పడిన ఒక సహోదరుడు, పశ్చాత్తాపపడకపోతే ఆయన దేవుని అనుగ్రహాన్ని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఓ వ్యక్తి అలాంటి పాపం చేయకపోయినా తన హృదయంలో చెడు కోరికలకు చోటు ఇస్తుండవచ్చు. (మత్తయి 5:27, 28 చదవండి.) అలాంటప్పుడే అతను తన హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఒకవేళ మీరు మీ హృదయాన్ని పరీక్షించుకుంటే అందులో మీకేమి కనిపిస్తాయి? పరాయి వాళ్ల మీద చెడు కోరికలా? దేవుడు ఖండించే రహస్య వాంఛలా? తీసిపారేయాల్సిన చెడ్డ ఆలోచనలా?

14 అలాగే, ఓ సహోదరుడు “నరహత్య” చేయకపోయినా, తన తోటి క్రైస్తవుని మీద పగ పెంచుకుంటూ తన హృదయంలో అతణ్ణి ద్వేషిస్తుండవచ్చు. (లేవీ. 19:17) హృదయాన్ని మొద్దుబారేటట్లు చేసే ప్రతీకారేచ్ఛలను తీసేసుకునేందుకు ఆ సహోదరుడు ప్రయత్నిస్తాడా?—మత్త. 5:21, 22.

15, 16. (ఎ) ఓ క్రైస్తవుడు ‘హృదయ సంబంధమైన సున్నతి పొందని’ వ్యక్తిగా తయారయ్యే అవకాశం ఉందని చూపించే ఉదాహరణ చెప్పండి. (బి) ‘సున్నతి పొందని హృదయాన్ని’ యెహోవా ఎందుకు అసహ్యించుకుంటాడు?

15 సంతోషకరమైన విషయమేమిటంటే, చాలామంది క్రైస్తవులకు అలాంటి సమస్య లేదు. అయితే యేసు ‘దురాలోచనల’ గురించి కూడా మాట్లాడాడు. మన జీవితంలోని ఎన్నో విషయాల్ని మలినపర్చే అభిప్రాయాలను లేదా వైఖరులను ఉద్దేశించి ఆయన ఆ మాట అన్నాడు. ఉదాహరణకు, బంధువులకు నమ్మకంగా ఉండాలనే విషయాన్ని ఒక వ్యక్తి తప్పుగా అర్థంచేసుకునే అవకాశం ఉంది. ఈ ‘అంత్యదినాల్లోని అనురాగరహితుల్లా’ కాకుండా, క్రైస్తవులు తమ బంధువుల పట్ల ప్రేమాప్యాయతలు చూపించాలన్నది నిజమే. (2 తిమో. 3:1, 3) అయితే, ఒక్కోసారి ఈ అనురాగం మితిమీరిపోయే అవకాశం ఉంది. అన్నిటికన్నా రక్తసంబంధమే గొప్పదని చాలామంది అనుకుంటారు. కాబట్టి, ఎవరైనా తమ కుటుంబ సభ్యుల్ని లేదా రక్తసంబంధీకుల్ని నొప్పిస్తే, తమనే నొప్పించినట్లు బాధపడిపోతూ ఎలాగైనా వారి తరఫున పోరాడడానికి లేదా వాదించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఆలోచనా తీరు వల్ల, దీనా సహోదరులు ఏమి చేశారో గుర్తుచేసుకోండి. (ఆది. 34:13, 25-30) అబ్షాలోము తన హృదయంలోని ఎలాంటి ఆలోచనల వల్ల తన సహోదరుడైన అమ్నోనును హత్య చేశాడో జ్ఞాపకం చేసుకోండి. (2 సమూ. 13:1-30) ఆ దురాగతాలకు కారణం “దురాలోచనలు” కావా?

16 నిజక్రైస్తవులు ఇతరులను చంపరు. కానీ, కొన్నిసార్లు తమ బంధువుల్లో ఒకరితో అమర్యాదగా ప్రవర్తించిన వాళ్లపట్ల లేదా అలా ప్రవర్తించారని తమకు అనిపించిన వాళ్లపట్ల పగను పెంచుకునే ప్రమాదం ఉంది. అంతేకాదు, బహుశా ఆతిథ్యం కోసం ఆ సహోదరులు పిలిస్తే వెళ్లరు లేదా వాళ్లను తమ ఇంటికి పిలవరు. (హెబ్రీ. 13:1, 2) అలాంటి ధోరణి కనబర్చడం, ఆతిథ్యం ఇచ్చే లక్షణం లోపించడం వంటివి మనలో ప్రేమ కొరవడిందని చూపిస్తాయి. దాన్ని మనం తేలికగా తీసుకోకూడదు. హృదయాలను పరిశోధించే యెహోవాకు, అలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు ‘హృదయ సంబంధమైన సున్నతి పొందని వారిగా’ కనిపించే అవకాశం ఉంది. (యిర్మీ. 9:25, 26) “మీ హృదయములకు ఛేదనసంస్కారము చేసికొనుడి” అని యెహోవా సలహా ఇచ్చిన వాళ్లను జ్ఞాపకం చేసుకోండి.—యిర్మీ. 4:4, అథఃస్సూచి.

దేవుణ్ణి ‘ఎరుగు హృదయాన్ని’ సంపాదించుకొని, దాన్ని కాపాడుకోండి

17. యెహోవా పట్ల భయభక్తులు ఉంటే చక్కగా స్పందించే హృదయాన్ని ఎలా కలిగివుండవచ్చు?

17 మీ హృదయాన్ని పరిశోధించుకున్నప్పుడు, అది యెహోవా ఉపదేశానికి పూర్తిగా స్పందించడం లేదని, కొంతమేరకు ‘సున్నతిపొందని’ దానిగా ఉందని గ్రహిస్తే ఏమి చేయాలి? బహుశా మనుష్యుల భయం, అధికార దాహం, విలాసాలపై వ్యామోహం, మొండితనం లేదా మితిమీరిన స్వేచ్ఛ కావాలనే కోరిక వంటివి మీలో ఉన్నాయని మీరు గమనించవచ్చు. గతంలోని చాలామంది కూడా అలాగే ఉన్నారు. (యిర్మీ. 7:24; 11:8) తన కాలంలోని విశ్వాసఘాతకులైన యూదులు, “తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సుగల” వారిగా ఉన్నారని యిర్మీయా రాశాడు. ఆయన ఇలా అన్నాడు: “వారు—రండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరివర్షమును దానిదాని కాలమున కురిపించువాడు గదా . . . అని తమ మనస్సులో అనుకొనరు.” (యిర్మీ. 5:23, 24) యెహోవా పట్ల మరింత భయభక్తుల్ని, కృతజ్ఞతను పెంచుకుంటే ‘హృదయానికి ఛేదనసంస్కారము’ చేసుకోవచ్చని ఆ మాటలు చూపించడం లేదా? అలాంటి భయభక్తుల వల్ల మనలో ప్రతి ఒక్కరూ దేవుని ఉపదేశానికి చక్కగా స్పందించే హృదయాన్ని కలిగివుండవచ్చు.

18. కొత్త నిబంధనలోని వాళ్లకు యెహోవా ఏమని వాగ్దానం చేశాడు?

18 యెహోవా, తనను ‘ఎరుగు హృదయము’ మనకు ఇస్తున్నప్పుడు మన ప్రయత్నాలు మనం చేస్తుండాలి. కొత్త నిబంధనలోని అభిషిక్త క్రైస్తవులకు ఆయన అదే వాగ్దానం చేశాడు. ఆయన ఇలా అన్నాడు: “వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను . . . నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు.” ఆయన గురించి నిజంగా తెలుసుకోవడం మాటేమిటి? యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “వారు మరి ఎన్నడును—యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు.”—యిర్మీ. 31:31-34. a

19. నిజ క్రైస్తవులకు ఎలాంటి అద్భుతమైన అవకాశం ఉంది?

19 ఆ కొత్త నిబంధన వల్ల పరలోకంలో లేదా భూమ్మీద ఎల్లప్పుడూ ప్రయోజనం పొందాలని ఎదురుచూస్తున్నవాళ్లు, యెహోవా గురించి తెలుసుకోవాలి, ఆయన ప్రజలుగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా యేసుక్రీస్తు విమోచనా క్రయధన బలి ఆధారంగా పాపాలకు క్షమాపణ పొందాలి. యెహోవా మిమ్మల్ని క్షమిస్తాడు కాబట్టి మీరు కూడా మిమ్మల్ని బాధపెట్టిన వారితో సహా అందరినీ క్షమించాలి. ఇతరుల పట్ల ఉన్న ఎలాంటి కోపాన్నైనా తీసేసుకోవడానికి సిద్ధంగా ఉంటే, మీ హృదయానికే మంచిది. అలా, మీరు యెహోవాను సేవించడంతో పాటు ఆయన గురించి మరింత బాగా తెలుసుకుంటున్నారని చూపిస్తారు. ఆ విధంగా మీరు యిర్మీయా కాలంలోని కొందరిలా ఉంటారు. వాళ్ల గురించి యెహోవా ఇలా చెప్పాడు: “మీరు నన్ను వెదకినయెడల, పూర్ణ మనస్సుతో [“హృదయంతో,” NW] నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరచుకొందును.”—యిర్మీ. 29:13, 14.

a కొత్త నిబంధన గురించి కావలికోట జనవరి 15, 2012 సంచికలోని 26-30 పేజీల్లో సవివరంగా ఉంది.