యిర్మీయా 7:1-34

  • యెహోవా ఆలయం మీద తప్పుడు నమ్మకం (1-11)

  • ఆలయం షిలోహులా తయారౌతుంది (12-15)

  • అబద్ధ ఆరాధనను ఖండించడం (16-34)

    • ‘ఆకాశరాణిని’ పూజించడం (18)

    • బెన్‌హిన్నోములో పిల్లల్ని బలి ఇవ్వడం (31)

7  యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2  “నువ్వు యెహోవా మందిర ద్వారంలో నిలబడి, అక్కడ ఈ సందేశం ప్రకటించు: ‘యెహోవాకు వంగి నమస్కారం చేయడానికి ఈ ద్వారాల గుండా ప్రవేశించే యూదా ప్రజలారా, మీరంతా యెహోవా మాట వినండి. 3  ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు: “మీ ప్రవర్తనను, మీ పనుల్ని సరిదిద్దుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని ఈ స్థలంలో ఉండనిస్తాను.+ 4  మోసకరమైన మాటల మీద నమ్మకం పెట్టుకుని, ‘ఇది* యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం!’ అని అనకండి.+ 5  మీరు నిజంగా మీ ప్రవర్తననూ మీ పనుల్నీ సరిదిద్దుకుంటే, ఒక మనిషికీ అతని పొరుగువాడికీ మధ్య న్యాయం చేస్తే,+ 6  పరదేశుల్ని, అనాథల్ని,* విధవరాళ్లను అణచివేయకుండా ఉంటే,+ ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించకుండా ఉంటే, మీ స్వనాశనానికి దారితీసే వేరే దేవుళ్లను అనుసరించకుండా ఉంటే,+ 7  ఈ స్థలంలో, అంటే మీ తండ్రులకు నేను శాశ్వతంగా* ఇచ్చిన దేశంలో మిమ్మల్ని ఉండనిస్తాను.” ’ ” 8  “కానీ మీరు మోసకరమైన మాటల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు,+ దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. 9  మీరు దొంగతనాలు,+ హత్యలు, వ్యభిచారం, అబద్ధ ప్రమాణాలు చేసి,+ బయలుకు బలులు అర్పించి,+ మీకు తెలియని దేవుళ్లను అనుసరించి, 10  తర్వాత వచ్చి, నా పేరు పెట్టబడిన ఈ మందిరంలో నా ముందు నిలబడి, అసహ్యమైన ఈ పనులన్నీ చేసి కూడా, ‘మేం కాపాడబడతాం’ అని మీరు అనుకోవచ్చా? 11  నా పేరు పెట్టబడిన ఈ మందిరం మీ కళ్లకు దోపిడీదొంగల గుహలా కనిపిస్తుందా?+ మీరు చేసిందంతా నేను చూశాను” అని యెహోవా అంటున్నాడు. 12  “ ‘అయితే ఇప్పుడు షిలోహులో నేను ఎంచుకున్న చోటుకు,+ అంటే నా పేరును మహిమపర్చడానికి నేను మొదట్లో ఎంచుకున్న చోటుకు+ వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చెడుతనాన్ని బట్టి నేను దానికి ఏమి చేశానో చూడండి.+ 13  అయినాసరే మీరు ఇవన్నీ చేస్తూ వచ్చారు’ అని యెహోవా అంటున్నాడు. ‘నేను పదేపదే* మీతో మాట్లాడాను, కానీ మీరు వినలేదు.+ నేను మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను, కానీ మీరు పలకలేదు.+ 14  కాబట్టి నేను నా పేరు పెట్టబడిన ఈ మందిరానికి, మీరు నమ్మకం పెట్టుకుంటున్న ఈ మందిరానికి,+ మీకూ మీ పూర్వీకులకూ నేను ఇచ్చిన ఈ స్థలానికి షిలోహుకు చేసినట్టే+ చేస్తాను.+ 15  మీ సహోదరులైన ఎఫ్రాయిము వంశస్థులందర్నీ వెళ్లగొట్టినట్టే మిమ్మల్ని కూడా నా కళ్లముందు నుండి వెళ్లగొడతాను.’+ 16  “నువ్వైతే, ఈ ప్రజల కోసం ప్రార్థించకు. వాళ్లకోసం మొరపెట్టకు, ప్రార్థన చేయకు, నన్ను వేడుకోకు;+ ఎందుకంటే నేను వినను.+ 17  యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో వాళ్లు ఏం చేస్తున్నారో నువ్వు చూస్తున్నావు కదా? 18  కుమారులు కట్టెలు ఏరుతున్నారు, తండ్రులు మంట వెలిగిస్తున్నారు, వాళ్ల భార్యలేమో ఆకాశరాణికి* రొట్టెలు అర్పించడానికి పిండి పిసుకుతున్నారు,+ వేరే దేవుళ్లకు పానీయార్పణలు అర్పిస్తున్నారు; నాకు కోపం తెప్పించడానికే వాళ్లు ఇవన్నీ చేస్తున్నారు.+ 19  ‘వాళ్లు నన్ను దుఃఖపెడుతున్నారా?’* అని యెహోవా అంటున్నాడు. ‘కాదు, తమను తామే దుఃఖపెట్టుకుంటున్నారు, తమకే అవమానం తెచ్చుకుంటున్నారు.’+ 20  కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో! నా కోపం, నా ఉగ్రత ఈ స్థలం మీద కుమ్మరించబడుతుంది; మనుషుల మీద, జంతువుల మీద, పొలంలోని చెట్ల మీద, భూమి పంట మీద కుమ్మరించబడుతుంది; అది ఆరిపోకుండా మండుతూనే ఉంటుంది.’+ 21  “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇలాగే చేయండి, వేరే బలులతో పాటు సంపూర్ణ దహనబలులు కూడా అర్పించండి, ఆ మాంసం మీరే తినండి.+ 22  ఐగుప్తు దేశం నుండి నేను మీ పూర్వీకుల్ని బయటికి తీసుకొచ్చిన రోజున సంపూర్ణ దహనబలుల గురించి, బలుల గురించి నేను వాళ్లకు చెప్పలేదు, వాటి గురించి ఆజ్ఞాపించలేదు.+ 23  కానీ నేను వాళ్లకు ఈ ఆజ్ఞ ఇచ్చాను: “నా మాటకు లోబడండి, అప్పుడు నేను మీకు దేవునిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు.+ నేను మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిట్లో మీరు నడవాలి, అప్పుడు మీకు మంచి జరుగుతుంది.” ’+ 24  కానీ వాళ్లు వినలేదు, పట్టించుకోలేదు;+ బదులుగా తమ దుష్ట హృదయాన్ని మొండిగా అనుసరిస్తూ+ సొంత ఆలోచనల ప్రకారం నడుచుకున్నారు, ముందుకు కాదు వెనక్కే వెళ్లారు, 25  మీ పూర్వీకులు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు వాళ్లు అలాగే చేశారు.+ కాబట్టి నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ రోజూ, పదేపదే* మీ దగ్గరికి పంపిస్తూ వచ్చాను.+ 26  కానీ వాళ్లు నా మాటలు వినడానికి ఇష్టపడలేదు, పట్టించుకోలేదు.+ బదులుగా, వాళ్లు మొండిగా ప్రవర్తించారు, తమ పూర్వీకుల కన్నా ఘోరంగా నడుచుకున్నారు! 27  “ఈ మాటలన్నీ నువ్వు వాళ్లకు చెప్తావు,+ కానీ వాళ్లు వినరు; నువ్వు వాళ్లను పిలుస్తావు, కానీ వాళ్లు పలకరు. 28  నువ్వు వాళ్లతో ఇలా అంటావు: ‘తమ దేవుడైన యెహోవా స్వరానికి లోబడని, క్రమశిక్షణను స్వీకరించడానికి ఇష్టపడని దేశం ఇదే. నమ్మకత్వం నశించిపోయింది, దాని గురించి ఎవ్వరూ కనీసం మాట్లాడుకోవట్లేదు కూడా.’+ 29  “పొడవైన నీ వెంట్రుకల్ని కత్తిరించి, పారేయి; చెట్లులేని కొండల మీద శోకగీతం పాడు. ఎందుకంటే, తనకు కోపం తెప్పించిన ఈ తరాన్ని యెహోవా తిరస్కరించాడు, ఆయన దాన్ని విడిచిపెట్టేస్తాడు. 30  ‘ఎందుకంటే, యూదా ప్రజలు నా దృష్టిలో చెడ్డవైనవి చేశారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. ‘నా పేరు పెట్టబడిన మందిరంలో తమ అసహ్యమైన విగ్రహాల్ని పెట్టి, దాన్ని అపవిత్రపర్చారు.+ 31  వాళ్లు బెన్‌హిన్నోము* లోయలో+ తోఫెతు దగ్గర ఉన్నత స్థలాలు నిర్మించి తమ కుమారుల్ని, కూతుళ్లను మంటల్లో కాల్చారు;+ అలా చేయమని నేను వాళ్లకు ఆజ్ఞాపించలేదు, కనీసం ఆ ఆలోచన కూడా ఎప్పుడూ నా హృదయంలో రాలేదు.’+ 32  “ ‘కాబట్టి ఇదిగో! అది ఇక తోఫెతు అని గానీ, బెన్‌హిన్నోము* లోయ అని గానీ కాకుండా వధ లోయ అని పిలవబడే రోజులు వస్తున్నాయి’ అని యెహోవా అంటున్నాడు. ‘తోఫెతులో ఇక స్థలం లేకుండా పోయేవరకు శవాల్ని పాతిపెడుతూ ఉంటారు.+ 33  ఈ ప్రజల శవాలు ఆకాశపక్షులకు, భూమ్మీది జంతువులకు ఆహారమౌతాయి, వాటిని అదిలించి వెళ్లగొట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+ 34  యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో సంతోష ధ్వని, ఉల్లాస ధ్వని, పెళ్లికుమారుడి స్వరం, పెళ్లికూతురి స్వరం ఇక వినిపించకుండా చేస్తాను,+ ఎందుకంటే దేశం శిథిలాలుగా మారుతుంది.’ ”+

అధస్సూచీలు

అక్ష., “అవి,” ఈ పదం ఆలయ భవన సముదాయంలోని భవనాలన్నిటినీ సూచిస్తుంది.
లేదా “తండ్రిలేని పిల్లల్ని.”
లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”
అక్ష., “పెందలకడే లేచి.”
మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు పూజించిన ఒక దేవత బిరుదు; సంతాన సాఫల్య దేవత కావచ్చు.
లేదా “కోపం తెప్పిస్తున్నారా; రెచ్చగొడుతున్నారా.”
అక్ష., “పెందలకడే లేచి.”
అక్ష., “హిన్నోము కుమారుడి.” పదకోశంలో “గెహెన్నా” చూడండి.
అక్ష., “హిన్నోము కుమారుడి.” పదకోశంలో “గెహెన్నా” చూడండి.