యిర్మీయా 5:1-31

  • ప్రజలు యెహోవా క్రమశిక్షణను తిరస్కరించడం (1-13)

  • నాశనమే, కానీ సమూలనాశనం కాదు (14-19)

  • యెహోవా ప్రజల్ని లెక్క అడుగుతాడు (20-31)

5  యెరూషలేము వీధుల్లో సంచరించండి. చుట్టూ చూడండి, తెలుసుకోండి. ఆమె సంతవీధుల్లో వెదకండి,న్యాయంగా నడుచుకునే వ్యక్తి,నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించే వ్యక్తి ఒక్కరైనా ఉన్నారేమో చూడండి.+ఉంటే, నేను ఆమెను క్షమిస్తాను.   వాళ్లు, “యెహోవా జీవం తోడు!” అని అంటారు, కానీ అబద్ధ ప్రమాణాలు చేస్తారు.+   యెహోవా, నీ కళ్లు నమ్మకమైనవాళ్ల కోసం వెదుకుతాయి కదా?+ నువ్వు వాళ్లను శిక్షించావు, కానీ వాళ్లలో ఏ మార్పూ రాలేదు.* నువ్వు వాళ్లను తుడిచిపెట్టేశావు, కానీ వాళ్లు క్రమశిక్షణను అంగీకరించలేదు.+ వాళ్లు తమ ముఖాల్ని బండరాయి కన్నా గట్టిగా చేసుకున్నారు,+నీ వైపు తిరగడానికి ఇష్టపడలేదు.+   అయితే నేను ఇలా అనుకున్నాను: “ఖచ్చితంగా వీళ్లు సామాన్యులు అయ్యుంటారు. వీళ్లు తెలివితక్కువగానే ప్రవర్తిస్తారు,ఎందుకంటే వీళ్లకు యెహోవా మార్గం, తమ దేవుని తీర్పు తెలీదు.   నేను ప్రముఖుల దగ్గరికి వెళ్లి మాట్లాడతాను,ఎందుకంటే యెహోవా మార్గం, తమ దేవుని తీర్పువాళ్లకు తెలిసే ఉంటుంది.+ అయితే వాళ్లంతా తమ కాడిని విరగ్గొట్టుకున్నారు,తమ కట్లు తెంచేసుకున్నారు.”   అందుకే అడవిలో నుండి సింహం వచ్చి వాళ్లమీద దాడిచేస్తుంది,ఎడారి మైదానాల్లో నుండి తోడేలు వచ్చి వాళ్లను చీల్చేస్తుంది,చిరుతపులి వాళ్ల నగరాల దగ్గర పొంచి ఉంటుంది. వాటిలో నుండి బయటికి వచ్చే వాళ్లంతా ముక్కలుముక్కలుగా చీల్చేయబడతారు. ఎందుకంటే, వాళ్ల అపరాధాలకు లెక్కేలేదు;వాళ్లు ఎన్నోసార్లు నమ్మకద్రోహం చేశారు.+   ఇలా చేసినందుకు నేను నిన్ను ఎలా క్షమించగలను? నీ కుమారులు నన్ను విడిచిపెట్టారు,వాళ్లు దేవుడుకాని వాటి తోడని ప్రమాణం చేస్తున్నారు.+ నేను వాళ్ల అవసరాల్ని తీర్చాను,కానీ వాళ్లు వ్యభిచారం చేస్తూ వచ్చారు,గుంపులుగుంపులుగా వేశ్యాగృహాలకు వెళ్లారు.   కామోద్రేకంతో ఉన్న గుర్రాల్లా,వాళ్లలో ప్రతీ ఒక్కరు సకిలించుకుంటూ వేరేవాళ్ల భార్య వెంట వెళ్తున్నారు.+   “ఇలాంటి పనులు చేసినందుకు నేను వాళ్లను లెక్క అడగవద్దా? ఇలాంటి దేశం మీద నేను పగతీర్చుకోవద్దా?” అని యెహోవా అంటున్నాడు.+ 10  “ఆమె ద్రాక్షతోటల్లోకి వెళ్లి నాశనం చేయండి,అయితే పూర్తిగా తుడిచిపెట్టేయకండి.+ విస్తరిస్తున్న కొమ్మల్ని తీసేయండి,అవి యెహోవాకు చెందినవి కావు. 11  ఎందుకంటే, ఇశ్రాయేలు ఇంటివాళ్లు, యూదా ఇంటివాళ్లునాకు చాలా నమ్మకద్రోహం చేశారు” అని యెహోవా అంటున్నాడు.+ 12  “వాళ్లు యెహోవాను తిరస్కరించి ఇలా అంటూ ఉన్నారు:‘ఆయన ఏమీ చేయడు.*+ మన మీదికి ఏ విపత్తూ రాదు;కత్తిని గానీ కరువును గానీ మనం చూడం.’+ 13  ప్రవక్తలు గాలి మాటలు మాట్లాడుతున్నారు,దేవుని వాక్యం వాళ్లలో లేదు. వాళ్ల మాటల్లాగే వాళ్లు కూడా వ్యర్థులవ్వాలి!” 14  కాబట్టి సైన్యాలకు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ మనుషులు ఇలా అంటున్నారు కాబట్టి,నీ నోట నా మాటల్ని అగ్నిలా చేస్తున్నాను,+ఈ ప్రజలే కలప,అది వాళ్లను దహించేస్తుంది.”+ 15  “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను దూరం నుండి మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తున్నాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. “అది చాలాకాలం నుండి ఉన్న దేశం, పురాతన దేశం.దాని భాష నీకు తెలీదు,వాళ్లు మాట్లాడేది నీకు అర్థం కాదు.+ 16  వాళ్ల అంబులపొది తెరచి ఉన్న సమాధి;వాళ్లంతా యోధులు. 17  వాళ్లు నీ పంటను, రొట్టెను, కుమారుల్ని, కూతుళ్లను, మందల్ని, పశువుల్ని, ద్రాక్షచెట్లను, అంజూర చెట్లను మింగేస్తారు.+ నువ్వు నమ్ముకున్న ప్రాకారాలుగల నీ నగరాల్ని కత్తితో నాశనం చేస్తారు.” 18  యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “చివరికి ఆ రోజుల్లో కూడా నేను నిన్ను పూర్తిగా తుడిచిపెట్టను.+ 19  వాళ్లు, ‘మన దేవుడైన యెహోవా మనకు ఎందుకు ఇలా చేశాడు?’ అని అడిగినప్పుడు నువ్వు వాళ్లతో ఇలా చెప్పాలి: ‘మీరు నన్ను విడిచిపెట్టి మీ దేశంలో వేరే దేవుణ్ణి సేవించారు కదా. కాబట్టి మీది కాని దేశంలో మీరు విదేశీయులకు సేవలు చేస్తారు.’ ”+ 20  యాకోబు ఇంటివాళ్లకు,యూదా ప్రజలకు ఇలా ప్రకటించండి: 21  “తెలివి, వివేచన* లేని ప్రజలారా,+ కళ్లు ఉండీ చూడలేని,+ చెవులు ఉండీ వినలేని ప్రజలారా,+ ఇది వినండి: 22  ‘మీరు నాకు భయపడరా?’ అని యెహోవా అంటున్నాడు,‘మీరు నా ముందు వణకవద్దా? సముద్రానికి ఇసుకను సరిహద్దుగా,అది దాటలేని నిత్య నియమంగా పెట్టింది నేనే. దాని అలలు పైకి ఎగసినా, అవి జయించలేవు;అవి ఘోషించినా సరే, దాన్ని దాటి వెళ్లలేవు.+ 23  కానీ ఈ ప్రజల హృదయం మొండిది, ఎదురుతిరిగేది;వాళ్లు పక్కకు తొలగి తమ సొంత దారిలో వెళ్లిపోయారు.+ 24  వాళ్లు, “మన దేవుడైన యెహోవాకు భయపడదాం, సకాలంలో వర్షాన్ని కురిపించేది,తొలకరి వానను,* కడవరి వానను* ఇచ్చేది ఆయనే.మనకోసం కోతకాలపు వారాల్ని నియమించింది ఆయనే”+ అని తమ హృదయంలో అనుకోరు. 25  ఇవి రాకపోవడానికి కారణం మీ తప్పులే;మీ పాపాలే మీకు మంచి జరగకుండా చేశాయి.+ 26  నా ప్రజల్లో దుష్టులు ఉన్నారు. వేటగాడు పొంచివున్నట్టు వాళ్లు పొంచివుంటారు. వాళ్లు ప్రాణాంతకమైన ఉచ్చు పెడతారు. దానితో మనుషుల్ని పట్టుకుంటారు. 27  పంజరం పక్షులతో నిండివున్నట్టు,వాళ్ల ఇళ్లు మోసంతో నిండివుంటాయి.+ అందుకే వాళ్లు శక్తిమంతులు, ధనవంతులు అయ్యారు. 28  వాళ్లు కొవ్వుపట్టి నున్నగా తయారయ్యారు;వాళ్లలో దుష్టత్వం పొంగిపొర్లుతుంది. తాము గెలవాలనే ఉద్దేశంతోవాళ్లు తండ్రిలేని పిల్లల వ్యాజ్యాన్ని వాదించరు;+పేదవాళ్లకు న్యాయం జరగనివ్వరు.’ ”+ 29  యెహోవా ఇలా అంటున్నాడు: “ఇలాంటి పనులు చేసినందుకు నేను వాళ్లను లెక్క అడగవద్దా? ఇలాంటి దేశం మీద నేను పగతీర్చుకోవద్దా? 30  దేశంలో ఘోరమైన, భయంకరమైన ఒక విషయం జరిగింది, అదేంటంటే: 31  ప్రవక్తలు అబద్ధాల్ని ప్రవచిస్తున్నారు,+యాజకులు తమ అధికారంతో ఇతరుల్ని అణగదొక్కుతున్నారు. అలా జరగడం నా ప్రజలకు ఇష్టం.+ అయితే అంతం వచ్చినప్పుడు మీరు ఏంచేస్తారు?”

అధస్సూచీలు

అక్ష., “వాళ్లు బలహీనపడలేదు.”
లేదా “ఆయన ఉనికిలోనే లేడు” అయ్యుంటుంది.
అక్ష., “హృదయం.”
తొలకరి వానలు దాదాపు అక్టోబరు మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
కడవరి వానలు దాదాపు ఏప్రిల్‌ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.