ద్వితీయోపదేశకాండం 10:1-22

  • మళ్లీ రెండు రాతి పలకల్ని చెక్కడం (1-11)

  • యెహోవా కోరేవి (12-22)

    • యెహోవాకు భయపడడం, ఆయన్ని ప్రేమించడం (12)

10  “ఆ సమయంలో యెహోవా నాతో ఇలా అన్నాడు: ‘నువ్వు మొదటి పలకల లాంటి రెండు రాతి పలకల్ని చెక్కుకొని,+ పర్వతం ఎక్కి నా దగ్గరికి రా; అలాగే నువ్వు తుమ్మ కర్రతో ఒక మందసాన్ని* తయారు చేసుకోవాలి. 2  నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీదున్న మాటల్ని నేను ఆ పలకల మీద రాస్తాను; నువ్వు వాటిని మందసంలో పెట్టాలి.’ 3  కాబట్టి నేను తుమ్మ కర్రతో ఒక మందసాన్ని తయారుచేసి, మొదటి పలకల లాంటి రెండు రాతి పలకల్ని చెక్కి, ఆ రెండు పలకల్ని నా చేతిలో పట్టుకొని పర్వతం మీదికి వెళ్లాను.+ 4  మీరు సమావేశమైన రోజున,+ పర్వతం మీద అగ్నిలో నుండి యెహోవా మీతో మాట్లాడిన మాటల్ని,+ అంటే ఆయన అంతకుముందు రాసిన ఆ పది ఆజ్ఞల్ని*+ వాటిమీద రాశాడు;+ ఆ తర్వాత యెహోవా వాటిని నాకు ఇచ్చాడు. 5  అప్పుడు నేను వెనక్కి తిరిగి పర్వతం మీద నుండి కిందికి దిగి,+ యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టే వాటిని నేను తయారుచేసిన మందసంలో పెట్టాను, అవి ఇప్పటికీ అందులోనే ఉన్నాయి. 6  “తర్వాత ఇశ్రాయేలీయులు బెయేరోతు బెనేయాకాను నుండి మోసేరుకు బయల్దేరారు. అక్కడే అహరోను చనిపోయి పాతిపెట్టబడ్డాడు,+ అతని కుమారుడైన ఎలియాజరు అతని స్థానంలో యాజకునిగా సేవచేయడం మొదలుపెట్టాడు.+ 7  వాళ్లు అక్కడి నుండి గుద్గోదకు బయల్దేరారు, ఆ తర్వాత గుద్గోద నుండి యొత్బాతాకు+ బయల్దేరారు, ఈ యొత్బాతా నీటి ప్రవాహాలు* పారే ప్రదేశం. 8  “ఆ సమయంలో, యెహోవా దేవుని ఒప్పంద మందసాన్ని మోయడానికి,+ యెహోవాకు సేవచేసేలా ఆయన ముందు నిలబడడానికి, ఆయన పేరున దీవించడానికి+ యెహోవా లేవి గోత్రాన్ని ప్రత్యేకపర్చాడు.+ వాళ్లు నేటివరకు అలాగే చేస్తున్నారు. 9  అందుకే లేవీయులకు తమ సహోదరులతో పాటు భాగం గానీ స్వాస్థ్యం గానీ ఇవ్వబడలేదు. నీ దేవుడైన యెహోవా వాళ్లకు చెప్పినట్టు యెహోవాయే వాళ్ల స్వాస్థ్యం.+ 10  మొదటిసారిలాగే నేను 40 పగళ్లు, 40 రాత్రులు పర్వతం మీద ఉండిపోయాను.+ ఆ సమయంలో కూడా యెహోవా నా మనవి విన్నాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేయకూడదనుకున్నాడు.+ 11  అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: ‘నేను ఈ ప్రజలకు ఇస్తానని వాళ్ల పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశంలోకి వాళ్లు అడుగుపెట్టి దాన్ని స్వాధీనం చేసుకునేలా నువ్వు వాళ్లకు ముందుగా నడుస్తూ ఇక్కడి నుండి బయల్దేరడానికి వాళ్లను సిద్ధపర్చు.’ 12  “ఓ ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా నిన్ను ఇంతకన్నా ఏమి అడుగుతున్నాడు:+ నీ దేవుడైన యెహోవాకు భయపడడం, ఆయన మార్గాలన్నిట్లో నడవడం, ఆయన్ని ప్రేమించడం, నీ నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* నీ దేవుడైన యెహోవాను సేవించడం,+ 13  నీ మంచి కోసం నేడు నేను నీకు ఇస్తున్న యెహోవా ఆజ్ఞల్ని, శాసనాల్ని పాటించడం, ఇంతే కదా. 14  ఇదిగో, ఆకాశ మహాకాశాలు,* భూమి, అందులోని సమస్తం నీ దేవుడైన యెహోవావే.+ 15  అయితే యెహోవా నీ పూర్వీకులకు దగ్గరై, వాళ్ల మీద తన ప్రేమ చూపించాడు; జనాలన్నిట్లో వాళ్ల సంతానమైన మిమ్మల్ని ఎంచుకున్నాడు. నేడు మీరు ఆయన ప్రజలు. 16  ఇప్పుడు మీరు మీ హృదయాల్ని శుద్ధి చేసుకొని,*+ ఇంత మొండిగా ఉండడం మానుకోవాలి.+ 17  ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా దేవుళ్లకు దేవుడు,+ ప్రభువులకు ప్రభువు, గొప్పవాడూ బలవంతుడూ అయిన దేవుడు, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే దేవుడు; ఆయన ఎవ్వరి విషయంలోనూ పక్షపాతం చూపించడు,+ లంచం తీసుకోడు. 18  ఆయన తండ్రిలేని పిల్లలకు,* విధవరాళ్లకు న్యాయం తీరుస్తాడు;+ పరదేశులకు ఆహారాన్ని, బట్టల్ని ఇస్తూ వాళ్లను ప్రేమిస్తాడు.+ 19  మీరు కూడా పరదేశుల్ని ప్రేమించాలి, ఎందుకంటే ఒకప్పుడు ఐగుప్తు దేశంలో మీరు పరదేశులుగా ఉన్నారు.+ 20  “నువ్వు నీ దేవుడైన యెహోవాకు భయపడాలి, ఆయన్నే సేవించాలి,+ ఆయన్ని అంటిపెట్టుకొని ఉండాలి, ఆయన పేరున ప్రమాణం చేయాలి. 21  నువ్వు ఆయన్నే స్తుతించాలి.+ నువ్వు కళ్లారా చూసిన ఈ గొప్ప కార్యాల్ని, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే పనుల్ని నీ కోసం చేసిన నీ దేవుడు ఆయనే.+ 22  నీ పూర్వీకులు ఐగుప్తుకు వెళ్లినప్పుడు వాళ్లు 70 మంది మాత్రమే,+ కానీ ఇప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను ఆకాశ నక్షత్రాలంతమందిని చేశాడు.

అధస్సూచీలు

లేదా “పెద్దపెట్టెను.”
అక్ష., “ఆ పది మాటల్ని.”
లేదా “నీటి వాగులు.”
పదకోశం చూడండి.
లేదా “అత్యున్నతమైన ఆకాశాలు.”
లేదా “హృదయాలకు సున్నతి చేసుకొని.”
లేదా “అనాథలకు.”