యిర్మీయా 11:1-23

  • యూదా దేవుని ఒప్పందాన్ని మీరడం (1-17)

    • నగరాలు ఎన్ని ఉన్నాయో, అంతమంది దేవుళ్లు (13)

  • యిర్మీయాను వధకు తేబడుతున్న గొర్రెపిల్లతో పోల్చడం (18-20)

  • సొంతూరు వాళ్లే యిర్మీయాను వ్యతిరేకించారు (21-23)

11  యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “ప్రజలారా, ఈ ఒప్పంద మాటలు వినండి! “నువ్వు* యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో మాట్లాడి,  వాళ్లకు ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ఒప్పంద మాటలకు లోబడని వ్యక్తి శాపగ్రస్తుడు,+  ఐగుప్తు అనే ఇనుప కొలిమి నుండి మీ పూర్వీకుల్ని బయటికి రప్పించిన+ రోజున నేను ఆ మాటల్ని వాళ్లకు ఆజ్ఞాపించాను,+ అప్పుడు నేను ఇలా అన్నాను: ‘నా మాటకు లోబడండి, నేను ఆజ్ఞాపించేవన్నీ చేయండి; అప్పుడు మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవునిగా ఉంటాను,+  పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని నేను మీ పూర్వీకులకు ఒట్టేసి చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాను.’+ ఈ రోజు వరకు మీరు అక్కడే నివసిస్తున్నారు.” ’ ” అప్పుడు నేను ఇలా అన్నాను: “ఆమేన్‌,* యెహోవా.”  తర్వాత యెహోవా నాకు ఇలా చెప్పాడు: “యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో ఈ మాటలన్నీ ప్రకటించు: ‘ఈ ఒప్పంద మాటలు వినండి, వాటిని పాటించండి.  నేను మీ పూర్వీకుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన రోజు, “నా మాటకు లోబడండి” అంటూ వాళ్లను హెచ్చరించాను. ఈ రోజు వరకు వాళ్లను పదేపదే* హెచ్చరిస్తూ ఉన్నాను.+  కానీ వాళ్లు వినలేదు, పట్టించుకోలేదు; బదులుగా ప్రతీ ఒక్కరు తమ దుష్ట హృదయాన్ని మొండిగా అనుసరిస్తూ వచ్చారు.+ కాబట్టి నేను ఏ ఒప్పందాన్ని పాటించమని వాళ్లకు చెప్పానో, ఏ ఒప్పందాన్ని వాళ్లు పాటించలేదో ఆ ఒప్పంద మాటలన్నీ వాళ్లమీదికి రప్పించాను.’ ”  తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు కుట్ర పన్నుతున్నారు. 10  వాళ్లు, గతంలో తమ పూర్వీకులు చేసిన తప్పుల వైపు తిరిగారు. వాళ్ల పూర్వీకులు నా మాటలకు లోబడడానికి ఇష్టపడలేదు.+ వాళ్లు కూడా వేరే దేవుళ్లను అనుసరించారు, పూజించారు.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లు, యూదా ఇంటివాళ్లు తమ పూర్వీకులతో నేను చేసిన ఒప్పందాన్ని మీరారు.+ 11  కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను వాళ్లమీదికి ఒక విపత్తును తీసుకొస్తున్నాను,+ దాన్నుండి వాళ్లు తప్పించుకోలేరు. వాళ్లు సహాయం కోసం నాకు మొరపెట్టినప్పుడు, నేను వినను.+ 12  అప్పుడు యూదా నగరాలు, యెరూషలేము నివాసులు తాము బలులు అర్పిస్తున్న దేవుళ్ల దగ్గరికి వెళ్లి సహాయం కోసం మొరపెడతారు,+ కానీ విపత్తు సమయంలో అవి ఏవిధంగానూ వాళ్లను కాపాడలేవు. 13  ఎందుకంటే యూదా, నీ నగరాలు ఎన్ని ఉన్నాయో నీకు అంతమంది దేవుళ్లు ఉన్నారు; యెరూషలేములో ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని బలిపీఠాల్ని ఆ పనికిరాని* దేవుని కోసం కట్టావు, వాటిమీద బయలుకు బలులు అర్పించావు.’+ 14  “నువ్వైతే,* ఈ ప్రజల కోసం ప్రార్థించకు. వాళ్ల కోసం మొరపెట్టకు, ప్రార్థన చేయకు,+ ఎందుకంటే విపత్తును బట్టి వాళ్లు పెట్టే మొరను నేను వినను. 15  వాళ్లలో ఇంతమంది దుష్ట పన్నాగాలు పన్నాక,ఇక నా మందిరంలో ఉండే హక్కు నా ప్రియమైన ప్రజలకు ఎక్కడుంది? విపత్తు వచ్చినప్పుడు పవిత్ర మాంసంతో* నువ్వు దాన్ని తప్పించగలవా? ఆ సమయంలో నువ్వు ఉల్లసిస్తావా? 16  యెహోవా ఒకప్పుడు నిన్ను శ్రేష్ఠమైన పండ్లు ఉన్నఅందమైన, పచ్చని ఒలీవ చెట్టు అని పిలిచాడు. ఇప్పుడు మహా గర్జన శబ్దంతో ఆయన దానికి నిప్పంటించాడు,వాళ్లు దాని కొమ్మల్ని విరగ్గొట్టారు. 17  “నిన్ను నాటిన+ సైన్యాలకు అధిపతైన యెహోవా నీమీదికి విపత్తు వస్తుందని ప్రకటించాడు. బయలుకు బలులు అర్పించి ఆయనకు కోపం తెప్పించిన ఇశ్రాయేలు ఇంటివాళ్లు, యూదా ఇంటివాళ్లు చేసిన చెడును బట్టి ఆ విపత్తు నీమీదికి వస్తుంది.”+ 18  యెహోవా చెప్పడం వల్ల అది నాకు తెలిసింది;ఆ సమయంలో, వాళ్లు ఏం చేస్తున్నారో నువ్వు నాకు చూపించావు. 19  నేను వధకు తేబడుతున్న సాధువైన గొర్రెపిల్లలా ఉన్నాను. వాళ్లు నా మీద ఇలా కుట్ర పన్నుతున్నారని నాకు తెలీదు:+ “పండ్లతో సహా చెట్టును నాశనం చేద్దాం,అతని పేరు ఇక వినిపించకుండాసజీవుల దేశంలో నుండి అతన్ని నిర్మూలిద్దాం.” 20  కానీ సైన్యాలకు అధిపతైన యెహోవా నీతితో తీర్పు తీరుస్తాడు;ఆయన అంతరంగాన్ని,* హృదయాన్ని పరిశీలిస్తాడు.+ నువ్వు వాళ్లమీద పగ తీర్చుకోవడం నన్ను చూడనివ్వు,ఎందుకంటే, నీకే నా వ్యాజ్యాన్ని అప్పగించాను. 21  కాబట్టి నీ ప్రాణం తీయాలని చూస్తూ, “యెహోవా పేరున నువ్వు ప్రవచించకూడదు,+ లేదంటే నువ్వు మా చేతుల్లో చస్తావు” అని అంటున్న అనాతోతు+ మనుషుల గురించి యెహోవా ఇలా అంటున్నాడు: 22  సైన్యాలకు అధిపతైన యెహోవా ఏమంటున్నాడంటే, “నేను వాళ్లను లెక్క అడగబోతున్నాను. వాళ్ల యువకులు కత్తి వల్ల చనిపోతారు,+ వాళ్ల కుమారులూ కూతుళ్లూ కరువు వల్ల చనిపోతారు.+ 23  వాళ్లలో ఎవ్వరూ మిగలరు, ఎందుకంటే అనాతోతు+ వాళ్లను నేను లెక్క అడిగే సంవత్సరంలో వాళ్లమీదికి విపత్తు తీసుకొస్తాను.”

అధస్సూచీలు

యిర్మీయాతో అంటున్నాడని తెలుస్తోంది.
లేదా “అలాగే జరగాలి.”
అక్ష., “పెందలకడే లేచి.”
లేదా “అవమానకరమైన.”
అంటే, యిర్మీయా.
అంటే, ఆలయంలో అర్పించే బలులతో.
లేదా “లోతైన భావోద్వేగాల్ని.” అక్ష., “మూత్రపిండాల్ని.”