యిర్మీయా 20:1-18

  • పషూరు యిర్మీయాను కొట్టడం (1-6)

  • యిర్మీయా ప్రకటించకుండా ఉండలేకపోవడం (7-13)

    • దేవుని సందేశం మండే అగ్ని (9)

    • యెహోవా పరాక్రమంగల యోధుడు (11)

  • యిర్మీయా ఫిర్యాదు (14-18)

20  యిర్మీయా ఈ మాటలు ప్రవచిస్తున్నప్పుడు ఇమ్మేరు కుమారుడూ యాజకుడూ అయిన పషూరు విన్నాడు. అతను యెహోవా మందిరంలో ముఖ్య అధికారి కూడా.  పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, అతన్ని యెహోవా మందిరంలో బెన్యామీను పైద్వారం దగ్గరున్న బొండలో బిగించాడు.+  తర్వాతి రోజు పషూరు యిర్మీయాను బొండలో నుండి విడిపించినప్పుడు యిర్మీయా అతనితో ఇలా అన్నాడు: “యెహోవా నీకు పషూరు అని కాదు, మాగోర్‌మిస్సాబీబ్‌*+ అని పేరుపెట్టాడు.  ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వూ, నీ స్నేహితులంతా నిన్ను చూసి భయపడిపోయేలా చేస్తాను. నీ కళ్లముందే వాళ్లు తమ శత్రువుల ఖడ్గానికి చిక్కి చనిపోతారు;+ నేను యూదా అంతటినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతను వాళ్లను బబులోనుకు బందీలుగా తీసుకెళ్లి ఖడ్గంతో చంపేస్తాడు.+  నేను ఈ నగరంలోని సంపదంతటినీ, దాని వనరులన్నిటినీ, అమూల్యమైన వాటన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను.+ వాళ్లు వాటిని కొల్లగొట్టి, లాక్కుని బబులోనుకు తీసుకెళ్తారు.+  అయితే పషూరూ, నువ్వూ, నీ ఇంట్లో నివసించే వాళ్లంతా బందీలుగా వెళ్తారు. నువ్వు బబులోనుకు వెళ్లి అక్కడే చనిపోతావు, అక్కడే నీ స్నేహితులందరితో పాటు పాతిపెట్టబడతావు, ఎందుకంటే నువ్వు వాళ్లకు అబద్ధాలు ప్రవచించావు.’ ”+   యెహోవా, నువ్వు నన్ను వెర్రివాణ్ణి చేశావు, నేను వెర్రివాణ్ణి అయ్యాను. నాకు వ్యతిరేకంగా నీ బలాన్ని ఉపయోగించావు, గెలిచావు.+ ప్రజలు రోజంతా నన్ను చూసి నవ్వుకుంటున్నారు;ప్రతీ ఒక్కరు నన్ను ఎగతాళి చేస్తున్నారు.+   ఎందుకంటే నేను మాట్లాడే ప్రతీసారి,“దౌర్జన్యం, నాశనం!” అని అరుస్తూ ప్రకటించాల్సి వస్తోంది. యెహోవా వాక్యం వల్ల నేను రోజంతా అవమానాలపాలు అవుతున్నాను, ఎగతాళికి గురౌతున్నాను.+   కాబట్టి నేను, “ఇక ఆయన గురించి మాట్లాడను,ఆయన పేరున ప్రకటించను” అని అనుకున్నాను.+ కానీ అది నా ఎముకల్లో మూయబడిన అగ్నిలానా హృదయంలో మండుతోంది,దాన్ని ఓర్చుకునీ ఓర్చుకునీ అలసిపోయాను; ఇక మౌనంగా ఉండలేకపోయాను.+ 10  నేను చెడ్డ పుకార్లు చాలా విన్నాను;నా చుట్టూ భయం అలుముకుంది.+ “అతన్ని నిందించండి; రండి, అతన్ని నిందిద్దాం!” నేను క్షేమంగా ఉండాలని కోరుకునేవాళ్లంతా నా పతనం కోసం చూస్తూ,+ “అతను మోసపోయి ఏదోక తప్పు చేస్తాడేమో,అప్పుడు మనం అతనిమీద గెలిచి, పగ తీర్చుకోవచ్చు” అని అనుకుంటున్నారు. 11  అయితే పరాక్రమంగల యోధునిలా యెహోవా నాతో ఉన్నాడు.+ కాబట్టి నన్ను హింసిస్తున్నవాళ్లు తడబడతారు, గెలవలేరు.+ వాళ్లు ఘోరంగా అవమానించబడతారు, ఎందుకంటే వాళ్లు విజయం సాధించలేరు. వాళ్లకు శాశ్వత అవమానం కలుగుతుంది, అది ఎప్పటికీ మరవబడదు.+ 12  కానీ సైన్యాలకు అధిపతివైన యెహోవా, నువ్వు నీతిమంతుణ్ణి పరిశీలిస్తావు;అంతరంగాన్ని,* హృదయాన్ని చూస్తావు.+ నువ్వు వాళ్లమీద పగతీర్చుకోవడం నన్ను చూడనివ్వు,+ఎందుకంటే, నీకే నా వ్యాజ్యాన్ని అప్పగించాను.+ 13  యెహోవాకు పాటలు పాడండి! యెహోవాను స్తుతించండి! ఎందుకంటే ఆయన, కీడు చేసేవాళ్ల చేతిలో నుండి దీనుణ్ణి కాపాడాడు. 14  నేను పుట్టిన రోజు శపించబడాలి! మా అమ్మ నన్ను కన్న రోజును ఎవరూ దీవించకూడదు!+ 15  “నీకు కుమారుడు పుట్టాడు, మగబిడ్డ పుట్టాడు!” అనే తీపి కబురు తెచ్చి మా నాన్నకు ఎంతో సంతోషం కలిగించిన వ్యక్తి శపించబడాలి! 16  అతను, యెహోవా ఏమాత్రం విచారపడకుండా నాశనం చేసిన నగరాల్లా అవ్వాలి. అతను పొద్దున ఆర్తనాదాలు, మధ్యాహ్నం యుద్ధ ధ్వని వినాలి. 17  నేను గర్భంలోనే ఎందుకు చనిపోలేదు?అప్పుడు నా తల్లే నాకు సమాధి స్థలం అయ్యేది,నేను అసలు గర్భంలో నుండి బయటికి వచ్చేవాణ్ణే కాదు.+ 18  కష్టాన్ని, దుఃఖాన్ని చూడడానికి,అవమానంతో చనిపోవడానికినా తల్లి గర్భంలో నుండి అసలు ఎందుకు బయటికి వచ్చాను?+

అధస్సూచీలు

“అంతటా భయం” అని అర్థం.
లేదా “లోతైన భావోద్వేగాల్ని.” అక్ష., “మూత్రపిండాల్ని.”