ఆదికాండం 34:1-31

  • దీనా చెరచబడడం (1-12)

  • యాకోబు కుమారులు మోసపూరితంగా ప్రవర్తించడం (13-31)

34  యాకోబు, లేయాల కూతురు దీనా+ ఆ దేశంలోని అమ్మాయిలతో+ సమయం గడపడానికి* వెళ్తూ ఉండేది.  ఆ దేశ ప్రధానుల్లో హివ్వీయుడైన+ హమోరు ఒకడు. అతని కుమారుడు షెకెము దీనాను చూసినప్పుడు ఆమెను తీసుకెళ్లి, ఆమెతో పడుకొని, ఆమెను చెరిచాడు.  అతను యాకోబు కూతురు దీనా మీద మనసు పారేసుకున్నాడు. అతను ఆ యువతిని ప్రేమించి, ఆమెను ఒప్పించేలా* మాట్లాడాడు.  చివరికి షెకెము, “ఈ యువతితో నాకు పెళ్లి చేయి” అని వాళ్ల నాన్న హమోరును+ అడిగాడు.  షెకెము తన కూతురు దీనాను చెరిపాడనే సంగతి యాకోబుకు తెలిసింది. ఆ సమయంలో అతని కుమారులు అతని మందను కాస్తూ పచ్చిక మైదానంలో ఉన్నారు. కాబట్టి వాళ్లు ఇంటికి వచ్చే వరకు యాకోబు ఆ సంగతి గురించి ఎవ్వరికీ చెప్పలేదు.  తర్వాత షెకెమువాళ్ల నాన్న హమోరు యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాడు.  అయితే యాకోబు కుమారులు ఆ సంగతి గురించి విని, వెంటనే పచ్చిక మైదానం నుండి తిరిగొచ్చారు. అతను చేయకూడని పని చేసి+ అంటే యాకోబు కూతురితో పడుకొని ఇశ్రాయేలును అవమానించాడు కాబట్టి వాళ్లు బాగా నొచ్చుకున్నారు, వాళ్లకు చాలా కోపం వచ్చింది.+  హమోరు వాళ్లతో ఇలా అన్నాడు: “మా అబ్బాయి షెకెము మీ కూతుర్ని ఎంతగానో కోరుకుంటున్నాడు. దయచేసి, ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయండి.  మాతో పెళ్లి సంబంధాలు కలుపుకోండి. మీ కూతుళ్లను మాకు ఇవ్వండి, మా కూతుళ్లను మీరు తీసుకోండి.+ 10  ఇదిగో, మా దేశమంతా మీ ముందు ఉంది. మాతోపాటు నివసించండి, ఇక్కడే వ్యాపారం చేయండి, స్థిరపడండి.” 11  తర్వాత షెకెము దీనావాళ్ల నాన్నతో, సహోదరులతో ఇలా అన్నాడు: “నా మీద అనుగ్రహం చూపించండి, మీరు నన్ను ఏమి అడిగినా ఇస్తాను. 12  కట్న* కానుకలు+ ఎంతైనా అడగండి, ఇవ్వడానికి నేను సిద్ధమే. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి చాలు.” 13  షెకెము తమ సహోదరి దీనాను చెరిచాడు కాబట్టి యాకోబు కుమారులు షెకెముకు, వాళ్ల నాన్న హమోరుకు మోసపూరితంగా జవాబిచ్చారు. 14  యాకోబు కుమారులు వాళ్లతో ఇలా అన్నారు: “అది కుదరకపోవచ్చు, సున్నతి చేయించుకోని వ్యక్తికి+ మా సహోదరిని ఇచ్చి పెళ్లి చేయలేం, ఎందుకంటే అది మాకు అవమానం. 15  అయితే ఈ ఒక్క షరతు మీద మేము ఒప్పుకోగలం: మీరు కూడా మాలా అవ్వాలి, మీ పురుషులందరూ సున్నతి చేయించుకోవాలి.+ 16  అప్పుడు మేము మా కూతుళ్లను మీకు ఇస్తాం, మీ కూతుళ్లను మేము చేసుకుంటాం. మేము మీతోపాటు నివసించి, ఒకే జనం అవుతాం. 17  కానీ మేము చెప్పినట్టు మీరు సున్నతి చేయించుకోకపోతే, మా సహోదరిని తీసుకొని వెళ్లిపోతాం.” 18  వాళ్ల మాటలు హమోరుకు,+ అతని కుమారుడు షెకెముకు+ నచ్చాయి. 19  ఆ యువకుడు వాళ్లు చెప్పినట్టు చేయడానికి వెంటనే చర్యలు తీసుకున్నాడు.+ ఎందుకంటే అతను యాకోబు కూతుర్ని చాలా ఇష్టపడ్డాడు; అంతేకాదు అతను వాళ్ల నాన్న ఇంటివాళ్లందరిలో అత్యంత గౌరవనీయుడు. 20  కాబట్టి హమోరు, అతని కుమారుడు షెకెము వాళ్ల నగర ద్వారం దగ్గరికి వెళ్లి, నగరంలోని పురుషులతో+ ఇలా అన్నారు: 21  “ఈ ప్రజలు మనతో శాంతిగా ఉండాలనుకుంటున్నారు. వాళ్లను మన దేశంలో ఉండనిద్దాం, ఇక్కడ వ్యాపారం చేసుకోనిద్దాం, ఎందుకంటే మన దేశం వాళ్లకు కూడా సరిపోయేంత పెద్దది. వాళ్ల కూతుళ్లను మనం పెళ్లి చేసుకోవచ్చు, మన కూతుళ్లను వాళ్లకు ఇవ్వవచ్చు.+ 22  వాళ్లు మన మధ్య నివసించి ఒకే జనం అవ్వడానికి ఈ ఒక్క షరతు పెట్టారు: వాళ్లలాగే మనలో ప్రతీ పురుషుడు సున్నతి చేయించుకోవాలి.+ 23  తర్వాత వాళ్ల ఆస్తిపాస్తులు, పశువులు అన్నీ మనవే కదా? కాబట్టి వాళ్లు మనతో పాటు నివసించేలా వాళ్ల షరతుకు ఒప్పుకుందాం.” 24  అతని నగర ద్వారం గుండా వెళ్లేవాళ్లంతా హమోరు మాట, అతని కుమారుడు షెకెము మాట విన్నారు. ఆ నగర ద్వారం గుండా బయటికి వెళ్తున్న పురుషులందరూ సున్నతి చేయించుకున్నారు. 25  అయితే మూడో రోజున, ఆ పురుషులు ఇంకా నొప్పితో బాధపడుతున్నప్పుడు, యాకోబు ఇద్దరు కుమారులు అంటే దీనా సహోదరులైన+ షిమ్యోను, లేవి తమ కత్తులు తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా నగరంలోకి ప్రవేశించి, ప్రతీ పురుషుణ్ణి చంపేశారు.+ 26  వాళ్లు హమోరును, అతని కుమారుడు షెకెమును కత్తితో చంపి, తమ సహోదరి దీనాను షెకెము ఇంటి నుండి తీసుకెళ్లిపోయారు. 27  యాకోబు మిగతా కుమారులు చచ్చిపడివున్న వాళ్ల దగ్గరికి వచ్చి నగరాన్నంతా దోచుకున్నారు, ఎందుకంటే వాళ్లు తమ సహోదరిని అపవిత్రపర్చారు.+ 28  యాకోబు కుమారులు వాళ్ల మందల్ని, పశువుల్ని, గాడిదల్ని, అలాగే నగరంలో, పొలంలో ఉన్నదంతా తీసుకెళ్లిపోయారు. 29  అంతేకాదు వాళ్ల ఆస్తిపాస్తులన్నీ తీసుకుపోయారు; వాళ్ల చిన్నపిల్లలందర్నీ, వాళ్ల భార్యల్ని చెరపట్టుకుపోయారు; వాళ్ల ఇళ్లలో ఉన్నదంతా దోచుకున్నారు. 30  అప్పుడు షిమ్యోనుతో, లేవితో+ యాకోబు ఇలా అన్నాడు: “ఈ దేశవాసులైన కనానీయులు, పెరిజ్జీయులు నన్ను అసహ్యించుకునేలా చేసి, మీరు నా మీదికి పెద్ద కష్టం తెచ్చిపెట్టారు. నా దగ్గర కొద్దిమందే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్లందరూ ఒక్కటై నా మీద దాడి చేస్తారు; అప్పుడు నేను నాశనమౌతాను, నా కుటుంబం నాశనమౌతుంది.” 31  దానికి వాళ్లు, “ఎవరైనా వేశ్యతో వ్యవహరించినట్టు మా చెల్లితో వ్యవహరించవచ్చా?” అన్నారు.

అధస్సూచీలు

లేదా “అమ్మాయిల్ని చూడడానికి.”
లేదా “ఆమె మనసు గెలుచుకునేలా.”
లేదా “కన్యాశుల్కం.”