కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లోకస్థుల్లా ఆలోచించకండి

లోకస్థుల్లా ఆలోచించకండి

“ఈ లోకంలోని . . . తత్త్వజ్ఞానంతో, మోసపూరితమైన వట్టి మాటలతో ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేసుకోకుండా జాగ్రత్తపడండి.”కొలొ. 2:8.

పాటలు: 38, 31

1. అపొస్తలుడైన పౌలు కొలొస్సయిలోని క్రైస్తవులకు దేని గురించి రాశాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

 దాదాపు క్రీ.శ. 60-61 సంవత్సరాల్లో, రోములో ఖైదీగా ఉన్న అపొస్తలుడైన పౌలు కొలొస్సయిలోని క్రైస్తవులకు ఉత్తరం రాశాడు. అక్కడి క్రైస్తవులు “పవిత్రశక్తి ఇచ్చే అవగాహనను” అంటే విషయాల్ని యెహోవా చూసినట్లు చూసే సామర్థ్యాన్ని ఎందుకు కలిగివుండాలో పౌలు వివరించాడు. (కొలొ. 1:9) అంతేకాదు, “ఎవ్వరి మాయమాటలకూ మీరు మోసపోకూడదని ఈ విషయం చెప్తున్నాను. క్రీస్తు బోధల ప్రకారం కాకుండా మనుషుల సంప్రదాయాల ప్రకారం, ఈ లోకంలోని ప్రాథమిక విషయాల ప్రకారం ఉన్న తత్త్వజ్ఞానంతో, మోసపూరితమైన వట్టి మాటలతో ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేసుకోకుండా జాగ్రత్తపడండి” అని ఆయన అన్నాడు. (కొలొ. 2:4, 8) ప్రసిద్ధి చెందిన కొన్ని సిద్ధాంతాలు ఎందుకు తప్పో, అయినాసరే ప్రజలు వాటిని ఎందుకు ఇష్టపడుతున్నారో పౌలు వివరించాడు. ఉదాహరణకు కొన్ని సిద్ధాంతాలు, తాము అందరికన్నా తెలివైనవాళ్లం లేదా గొప్పవాళ్లం అనే భావనను ప్రజల్లో కలిగిస్తాయి. కాబట్టి సహోదరులు లోకస్థుల్లా ఆలోచించకుండా, తప్పుడు ఆచారాలను పాటించకుండా సహాయం చేసేందుకు పౌలు వాళ్లకు ఉత్తరం రాశాడు.—కొలొ. 2:16, 17, 23.

2. ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

2 లోకస్థుల్లా ఆలోచించే వాళ్లు యెహోవా ప్రమాణాల్ని లెక్కచేయరు. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే, వాళ్ల ఆలోచనలు దేవుని జ్ఞానం మీద మనకున్న నమ్మకాన్ని మెల్లమెల్లగా నీరుగారుస్తాయి. టీవీలో, ఇంటర్నెట్‌లో, ఆఫీస్‌లో లేదా స్కూల్‌లో లోకస్థుల్లా ఆలోచించే ప్రజల్ని చూస్తుంటాం. వాళ్ల చెడు ప్రభావం మనమీద పడకూడదంటే ఏమి చేయాలి? లోకస్థుల ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అర్థంచేసుకోవడానికి ఐదు ఉదాహరణల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అంతేకాదు అలాంటి ఆలోచనలకు మనమెలా దూరంగా ఉండవచ్చో చూస్తాం.

మనం దేవున్ని నమ్మాలా?

3. చాలామంది ఎలాంటి ఆలోచనను ఇష్టపడుతున్నారు? ఎందుకు?

3 “దేవున్ని నమ్మకపోయినా నేను మంచి వ్యక్తిలా ఉండగలను.” నేడు చాలా దేశాల్లో ఇలాంటి ఆలోచన సర్వసాధారణం అయిపోయింది. ఇలా అనుకునేవాళ్లు దేవుని ఉనికిని తెలియజేసే రుజువుల గురించి లోతుగా ఆలోచించి ఉండకపోవచ్చు. కేవలం తమకు నచ్చింది చేసే స్వేచ్ఛ ఉందని మాత్రమే ఆలోచించి ఉంటారు. (కీర్తన 10:4 చదవండి.) ఇంకొంతమంది, “దేవున్ని నమ్మకపోయినా నాకంటూ కొన్ని ప్రమాణాలు ఉన్నాయి” అని చెప్తూ తాము తెలివైన వాళ్లమని అనుకుంటారు.

4. సృష్టికర్త లేడని నమ్మేవాళ్లకు మనమేమి చెప్పవచ్చు?

4 సృష్టికర్త లేడని నమ్మడం సరైనదేనా? జవాబు కోసం సైన్స్‌ వైపు చూసినప్పుడు కొంతమంది అయోమయంలో పడతారు. కానీ వాస్తవం చాలా సింపుల్‌. ఒక ఇల్లు దానంతటదే వస్తుందా? ఖచ్చితంగా రాదు! దాన్ని ఎవరో ఒకరు కట్టాలి. అయితే, ప్రాణులు ఇల్లు కన్నా చాలా సంశ్లిష్టమైనవి. అంతెందుకు ఒక ప్రాణిలో ఉండే జీవ కణం దానిలాంటి కణాల్ని పుట్టించగలదు, కానీ ఇల్లు మరో ఇల్లును పుట్టించలేదు. ఒక కణం, సమాచారాన్ని నిల్వచేసుకోగలదు, దాన్ని కొత్త కణాల్లోకి పంపించగలదు. అప్పుడు ఆ కొత్త కణాలు మరికొన్ని కణాల్ని తయారుచేస్తాయి. మరి ఇలాంటి సామర్థ్యంతో కణాన్ని సృష్టించింది ఎవరు? బైబిలు ఇలా చెప్తుంది, “ప్రతీ ఇంటిని ఎవరో ఒకరు కడతారు; అయితే అన్నిటినీ నిర్మించింది దేవుడే.”—హెబ్రీ. 3:4.

5. దేవుడు ఉన్నాడని నమ్మకపోయినా మంచి ఏమిటో తెలుసుకోగలమనే ఆలోచన గురించి ఏమి చెప్పవచ్చు?

5 దేవుడు ఉన్నాడని నమ్మకపోయినా మంచేదో చెడేదో తెలుసుకోగలమని కొంతమంది అనుకుంటారు. మరి అలాంటి ఆలోచన సంగతేంటి? నిజమే దేవున్ని నమ్మనివాళ్లకు కూడా మంచి ప్రమాణాలు ఉండవచ్చని బైబిలు చెప్తుంది. (రోమా. 2:14, 15) ఉదాహరణకు, వాళ్లు తమ అమ్మానాన్నల్ని గౌరవించవచ్చు, ప్రేమించవచ్చు. కానీ యెహోవా ప్రమాణాలు పాటించకపోతే జీవితంలో చాలా చెడ్డ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. (యెష. 33:22) లోకంలోని పెద్దపెద్ద సమస్యల్ని దేవుని సహాయంతోనే పరిష్కరించుకోగలమని నేడు చాలామంది తెలివైనవాళ్లు సహితం ఒప్పుకుంటున్నారు. (యిర్మీయా 10:23 చదవండి.) కాబట్టి దేవున్ని నమ్మకుండా, ఆయన ప్రమాణాలు పాటించకుండా మంచేదో తెలుసుకోగలమని మనమెన్నడూ అనుకోకూడదు.—కీర్త. 146:3.

మనకు మతం అవసరమా?

6. మతం గురించి చాలామంది ఏమనుకుంటున్నారు?

6 “ఏ మతాన్ని పాటించకపోయినా సంతోషంగా ఉండవచ్చు.” మతం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, అది విసుగు పుట్టిస్తుందని చాలామంది అనుకుంటారు. నరకం గురించి బోధిస్తున్నాయని, చందాలు ఇవ్వమని బలవంతం చేస్తున్నాయని లేదా రాజకీయ నాయకులకు మద్దతిస్తున్నాయని కొంతమంది మతాన్ని ఇష్టపడకపోవచ్చు. ఏ మతాన్ని పాటించకపోయినా సంతోషంగా ఉన్నామని చెప్పేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంలో ఆశ్చర్యంలేదు! “నాకు దేవుడంటే ఇష్టమే, కానీ ఒక మతాన్ని పాటించడం నాకు ఇష్టంలేదు” అని ఆలాంటివాళ్లు అనవచ్చు.

7. నిజమైన మతం వల్ల మనమెలా సంతోషంగా ఉండవచ్చు?

7 అయితే ఏ మతాన్ని పాటించకపోయినా మనం నిజంగా సంతోషంగా ఉండగలమా? అబద్ధ మతాన్ని పాటించనప్పుడు ఒక వ్యక్తి ఖచ్చితంగా సంతోషంగా ఉండగలడు. కానీ ‘సంతోషంగల దేవుడైన’ యెహోవాకు స్నేహితుడు కాకుండా ఎవ్వరూ నిజమైన సంతోషాన్ని పొందలేరు. (1 తిమో. 1:11) యెహోవా చేసే ప్రతీది ఇతరులకు మేలు చేస్తుంది. ఆయన సేవకులముగా మనం కూడా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం కాబట్టి సంతోషంగా ఉంటాం. (అపొ. 20:35) ఉదాహరణకు, ఒక కుటుంబం సంతోషంగా ఉండడానికి నిజమైన మతం ఎలా సహాయం చేస్తుందో ఆలోచించండి. వివాహ జతను గౌరవించాలని, వాళ్లకు నమ్మకంగా ఉండాలని, పిల్లల్ని బాధ్యతగల వ్యక్తులుగా పెంచాలని, కుటుంబ సభ్యుల్ని నిజంగా ప్రేమించాలని నేర్చుకున్నాం. భూవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజలు శాంతియుతంగా కలిసి పనిచేయడానికి, సంఘంలో ప్రేమ చూపించుకోవడానికి నిజమైన మతం సహాయం చేస్తుంది.—యెషయా 65:13, 14 చదవండి.

8. మత్తయి 5:3 ప్రకారం, నిజమైన సంతోషానికి కారణం ఏమిటి?

8 లోకస్థులు అనుకుంటున్నట్లు, దేవున్ని ఆరాధించకుండా నిజమైన సంతోషాన్ని పొందవచ్చా? అసలు ప్రజలకు సంతోషాన్నిచ్చేది ఏమిటి? కొంతమంది తమ ఉద్యోగంలో, క్రీడల్లో, లేదా హాబీల్లో సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇంకొందరు తమ కుటుంబ సభ్యుల, స్నేహితుల బాగోగులు చూసుకుంటూ సంతోషిస్తారు. ఇవన్నీ మనకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ, ప్రాముఖ్యమైనది మరొకటి ఉంది. మనం మన సృష్టికర్తను తెలుసుకోగలం, ఆరాధించగలం. మనమలా చేసి సంతోషాన్ని పొందేలా ఆయన మనల్ని సృష్టించాడు. అదే జంతువులకూ మనకూ ఉన్న తేడా. (మత్తయి 5:3 చదవండి.) ఉదాహరణకు, తోటి సహోదరసహోదరీలతో కలిసి యెహోవాను ఆరాధించినప్పుడు మనం సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతాం. (కీర్త. 133:1) అంతేకాదు, ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో భాగంగా ఉన్నందుకు, మంచి జీవన విధానం కలిగి ఉన్నందుకు, భవిష్యత్తు గురించి అద్భుతమైన నిరీక్షణతో ఉన్నందుకు మనం ఎంతో సంతోషిస్తాం.

మనకు నైతిక ప్రమాణాలు అవసరమా?

9. (ఎ) శారీరక సంబంధాల గురించి చాలామంది ఏమనుకుంటున్నారు? (బి) వివాహజతతో కాకుండా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం తప్పని బైబిలు ఎందుకు చెప్తుంది?

9 “వివాహజతతో కాకుండా వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవడంలో తప్పేంటి?” కొంతమంది మనల్ని, “మీరు అంత నిష్ఠగా ఎందుకు ఉంటారు? జీవితాన్ని ఎంజాయ్‌ చేయండి” అని అనవచ్చు. కానీ “లైంగిక పాపాలకు” a దూరంగా ఉండమని బైబిలు చెప్తుంది. (1 థెస్సలొనీకయులు 4:3-8 చదవండి.) యెహోవా మనల్ని సృష్టించాడు కాబట్టి నియమాలు పెట్టే హక్కు ఆయనకు ఉంది. పెళ్లి చేసుకున్న ఒక పురుషునికి, స్త్రీకి మధ్య మాత్రమే శారీరక సంబంధాలు ఉండాలని ఆయన చెప్తున్నాడు. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనకు నియమాలు ఇస్తున్నాడు. వాటిని పాటిస్తే మన జీవితం బాగుంటుందని ఆయనకు తెలుసు. దేవుని నియమాలు పాటించే కుటుంబం ప్రేమకు, గౌరవానికి నిలయంగా ఉంటుంది. అంతేకాదు ఆ కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. కానీ దేవుని నియమాలు తెలిసి కూడా పాటించని వాళ్లను ఆయన శిక్షిస్తాడు.—హెబ్రీ. 13:4.

10. క్రైస్తవులు లైంగిక పాపాలకు ఎలా దూరంగా ఉండవచ్చు?

10 లైంగిక పాపాలకు దూరంగా ఉండాలంటే ఏమి చేయాలో బైబిలు చెప్తుంది. మనం ఏమి చూస్తున్నామో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. యేసు ఇలా చెప్పాడు, “ఒక స్త్రీ మీద మోహంతో అదేపనిగా ఆమెను చూస్తుండేవాడు తన హృదయంలో అప్పటికే ఆమెతో వ్యభిచారం చేశాడు. కాబట్టి నీ కుడి కన్ను నువ్వు పాపం చేయడానికి కారణమౌతుంటే, దాన్ని పీకేసి నీ నుండి దూరంగా పడేయి.” (మత్త. 5:28, 29) కాబట్టి మనం అశ్లీల చిత్రాలకు, అనైతిక సంగీతానికి దూరంగా ఉండాలి. పౌలు ఇలా రాశాడు, “భూమ్మీద ఉన్న మీ శరీర అవయవాల్ని చంపేసుకోండి. లైంగిక పాపాలు . . . వాటిలో నుండే పుడతాయి.” (కొలొ. 3:5) అంతేకాదు మనం మన ఆలోచనల్ని, మాటల్ని అదుపులో పెట్టుకోవాలి.—ఎఫె. 5:3-5.

ఉద్యోగానికి ప్రాముఖ్యత ఇవ్వాలా?

11. మంచి ఉద్యోగం సంపాదించాలని చాలామంది ఎందుకు ప్రయత్నిస్తున్నారు?

11 “మంచి ఉద్యోగం ఉంటే మీరు సంతోషంగా ఉంటారు.” మన సమయాన్ని, శక్తిని ధారపోసి మంచి ఉద్యోగాన్ని సంపాదించమని ప్రజలు చెప్పవచ్చు. ముఖ్యంగా పేరుప్రఖ్యాతల్ని, అధికారాన్ని, డబ్బును తెచ్చిపెట్టే ఉద్యోగాల మీద మనసుపెట్టమని వాళ్లు చెప్తారు. సంతోషానికి రహస్యం మంచి ఉద్యోగమేనని చాలామంది అనుకుంటున్నారు, కాబట్టి మనం కూడా వాళ్లలాగే ఆలోచించే అవకాశం ఉంది.

12. మంచి ఉద్యోగం మీకు సంతోషాన్ని ఇవ్వగలదా?

12 అధికారాన్ని లేదా పేరుప్రఖ్యాతల్ని తెచ్చిపెట్టే ఉద్యోగం నిజమైన సంతోషాన్ని కూడా ఇవ్వగలదా? లేదు. ఒకసారి ఆలోచించండి: సాతాను అధికారం, పేరుప్రఖ్యాతల కోసం ప్రాకులాడాడు, ఒకవిధంగా వాటిని చేజిక్కించుకున్నాడు కూడా. అవి అతనికి సంతోషాన్ని ఇవ్వలేదుగానీ, అతనిలో కోపాన్ని పెంచాయి. (మత్త. 4:8, 9; ప్రక. 12:12) దానికి భిన్నంగా మనం దేవుని గురించి, ఆయన మాటిచ్చిన అద్భుతమైన భవిష్యత్తు గురించి ఇతరులకు చెప్తున్నప్పుడు ఎంత సంతోషాన్ని పొందుతున్నామో ఆలోచించండి. ఈ లోకంలోని వేరే ఏ ఉద్యోగం అలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు. మరోవైపు ప్రజలు మంచి ఉద్యోగం సంపాదించడానికి ఇతరులతో పోటీపడతారు, కోపాన్ని లేదా అసూయను పెంచుకుంటారు. అంత చేసినా వాళ్ల జీవితంలో ఏదో వెలితి ఉంటుంది. అందుకే వాళ్లు, ‘గాలిని పట్టుకోవడానికి’ ప్రయత్నిస్తున్నారని బైబిలు చెప్తుంది.—ప్రసం. 4:4.

13. (ఎ) మన జీవితంలో ఉద్యోగానికి ఏ స్థానం ఇవ్వాలి? (బి) పౌలుకు నిజమైన సంతోషాన్నిచ్చింది ఏమిటి?

13 నిజమే, మనం బ్రతకడానికి ఉద్యోగం చేయాలి. పైగా మనకు నచ్చిన ఉద్యోగం చేయడంలో తప్పులేదు. కానీ ఉద్యోగమే మనకు అన్నిటికన్నా ప్రాముఖ్యం అవ్వకూడదు. యేసు ఇలా చెప్పాడు, “ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు, లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు. మీరు ఒకే సమయంలో దేవునికీ డబ్బుకూ దాసులుగా ఉండలేరు.” (మత్త. 6:24) యెహోవా సేవచేయడం, బైబిలు గురించి ఇతరులకు బోధించడం కన్నా మించిన సంతోషం మరొకటి లేదు. అపొస్తలుడైన పౌలు ఆ సంతోషాన్ని రుచిచూశాడు. ఆయన యౌవనంలో ఉన్నప్పుడు మంచి ఉద్యోగం సంపాదించడం మీదే దృష్టిపెట్టాడు. కానీ ఆ తర్వాత, బైబిలు సందేశం ప్రజల జీవితాన్ని ఎలా మార్చిందో చూసినప్పుడు నిజమైన సంతోషాన్ని పొందాడు. (1 థెస్సలొనీకయులు 2:13, 19, 20 చదవండి.) యెహోవా సేవచేయడం వల్ల, ఆయన గురించి ఇతరులకు బోధించడం వల్ల వచ్చే సంతోషం మీకు మరే ఉద్యోగంలో దొరకదు.

ఇతరులకు దేవుని గురించి నేర్పించినప్పుడు సంతోషంగా ఉంటాం (12, 13 పేరాలు చూడండి)

లోకంలోని సమస్యల్ని మనం పరిష్కరించగలమా?

14. మనుషులు తమ సమస్యల్ని తాము పరిష్కరించుకోగలరని చాలామంది ఎందుకు అభిప్రాయపడుతున్నారు?

14 “మనుషులు తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోగలరు.” చాలామంది ఈ మాటలతో ఏకీభవిస్తారు. ఎందుకు? ఒకవేళ అదే నిజమైతే మనకు దేవుని నిర్దేశం అవసరంలేదు, మనకు నచ్చినట్లు జీవించవచ్చు. యుద్ధాలు, నేరాలు, రోగాలు, పేదరికం రోజురోజుకు తగ్గిపోతున్నాయని ప్రజలు చెప్పడం మీరు వినేవుంటారు. ఒక నివేదిక ప్రకారం, “మానవత్వం పెరగడానికి కారణం, ఈ లోకాన్ని మార్చాలని మనుషులు నిర్ణయించుకోవడమే.” అది నిజమేనా? మనుషులు తమ సమస్యల్ని పరిష్కరించగలుగుతున్నారా? ఇప్పుడు వాస్తవాలను పరిశీలిద్దాం.

15. లోకంలోని సమస్యలు ఎందుకంత గంభీరమైనవి?

15 మనుషులు యుద్ధాలు లేకుండా చేయగలిగారా? మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో 6 కోట్ల కన్నా ఎక్కువమంది చనిపోయారు. 2015వ సంవత్సరం నాటికి యుద్ధం లేదా హింస వల్ల శరణార్థులుగా వెళ్లిపోయిన వాళ్ల సంఖ్య 6 కోట్ల 50 లక్షలకు చేరింది. కేవలం 2015 సంవత్సరంలోనే దాదాపు 1 కోటి 24 లక్షలమంది శరణార్థులుగా వెళ్లిపోయారని ఒక నివేదిక చెప్తుంది. నేరాల్ని ఆపగలిగారా? అక్కడక్కడ కొన్ని నేరాలు తగ్గాయి. కానీ అదేసమయంలో సైబర్‌ నేరాలు, గృహ హింస, తీవ్రవాదం, అవినీతి రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రోగాలను నయం చేయగలిగారా? కొన్ని రోగాలకైతే మందులు కనిపెట్టారు. కానీ 2013లోని ఒక నివేదిక ప్రకారం, ప్రతీ సంవత్సరం 60 కన్నా తక్కువ వయసున్న దాదాపు 90 లక్షలమంది గుండెజబ్బులతో, పక్షవాతంతో, క్యాన్సర్‌తో, ఊపిరితిత్తుల సమస్యలతో, మధుమేహంతో చనిపోతున్నారు. పేదరికాన్ని నిర్మూలించగలిగారా? ఒక్క ఆఫ్రికా దేశంలోనే 1990 నాటికి పేదవాళ్ల సంఖ్య 28 కోట్లు ఉండేది, 2012 నాటికి అది 33 కోట్లకు పెరిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక చెప్తుంది.

16. (ఎ) లోకంలోని సమస్యల్ని కేవలం దేవుని రాజ్యమే ఎందుకు పరిష్కరించగలదు? (బి) దేవుని రాజ్యం ఏమి చేస్తుందని యెషయా, ఒక కీర్తనకర్త చెప్పారు?

16 ఈ వాస్తవాల్ని బట్టి మనం ఆశ్చర్యపోం. నేడు ఆర్థిక, రాజకీయ సంస్థలన్నీ స్వార్థపరుల చేతుల్లో ఉన్నాయి. వాళ్లు యుద్ధాల్ని, నేరాల్ని, రోగాల్ని, పేదరికాన్ని తీసివేయలేరు. దేవుని రాజ్యం మాత్రమే వాటన్నిటినీ తీసివేయగలదు. మనుషుల కోసం యెహోవా చేసేవాటి గురించి ఆలోచించండి. దేవుని రాజ్యం యుద్ధాలకు కారణమయ్యే వాటన్నిటినీ అంటే స్వార్థాన్ని, అవినీతిని, దేశాభిమానాన్ని, అబద్ధమతాన్ని నిర్మూలిస్తుంది. సాతానును కూడా నాశనం చేస్తుంది. (కీర్త. 46:8, 9) అంతేకాదు నేరాన్ని తీసివేస్తుంది. నేడు కూడా ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని, నమ్మాలని దేవుని రాజ్యం లక్షలమందికి నేర్పిస్తుంది. వేరే ఏ ప్రభుత్వం ఈ పని చేయలేదు. (యెష. 11:9) యెహోవా రోగాలు లేకుండా చేసి, అందరూ పూర్తి ఆరోగ్యంతో ఉండేలా చేస్తాడు. (యెష. 35:5, 6) ఆయన పేదరికాన్ని కూడా తీసేసి, అందరూ సంతోషంగా, తనతో దగ్గరి సంబంధం కలిగివుండేలా చేస్తాడు. ఇది డబ్బు కన్నా ఎంతో విలువైనది.—కీర్త. 72:12, 13.

ఎలా జవాబివ్వాలో తెలుసుకోండి

17. లోకస్థుల్లా ఆలోచించకుండా ఎలా ఉండవచ్చు?

17 మీ విశ్వాసాన్ని పరీక్షించే ఏ విషయం విన్నా, దానిగురించి బైబిలు ఏమి చెప్తుందో తెలుసుకోండి. పరిణతిగల సహోదరునితో లేదా సహోదరితో ఆ విషయం మాట్లాడండి. ప్రజలు దాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారో, అది ఎందుకు తప్పో, ఆ ఆలోచనకు మీరెలా దూరంగా ఉండవచ్చో ఆలోచించండి. లోకస్థుల్లా ఆలోచించకుండా ఉండడానికి పౌలు చెప్పిన ఈ మాటలు మనకు సహాయం చేస్తాయి, “బయటివాళ్లతో తెలివిగా మసలుకోండి . . . ప్రతీ ఒక్కరికి ఎలా జవాబివ్వాలో” తెలుసుకోండి.—కొలొ. 4:5, 6.

a కొన్ని బైబిలు అనువాదాల్లో కనిపించే యోహాను 7:53-8:11 వచనాలు నిజానికి ప్రాచీన రాతప్రతుల్లో లేవు. ఆ వచనాల్ని చదివిన కొంతమంది, పాపంలేని వ్యక్తి మాత్రమే వ్యభిచారం చేసినవాళ్లకు తీర్పు తీర్చగలడని తప్పుగా అర్థంచేసుకున్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ నియమం ఇచ్చాడు, ‘ఒకవేళ ఒక వ్యక్తి ఇంకొకరి భార్యతో పడుకొని ఉన్నప్పుడు పట్టుబడితే, వాళ్లిద్దర్నీ అంటే అలా పడుకున్న వ్యక్తిని, ఆ స్త్రీని చంపేయాలి.’—ద్వితీ. 22:22, NW.