ద్వితీయోపదేశకాండం 22:1-30

  • పొరుగువాళ్ల జంతువుల పట్ల గౌరవం (1-4)

  • స్త్రీ పురుషుడి వస్త్రాలు, పురుషుడు స్త్రీ వస్త్రాలు వేసుకోకూడదు (5)

  • జంతువుల పట్ల దయ (6, 7)

  • పైకప్పుకు పిట్టగోడ (8)

  • వేర్వేరు వాటిని కలపకూడదు (9-11)

  • బట్టలకు కుచ్చు ముడులు (12)

  • లైంగిక పాపాలకు సంబంధించిన నియమాలు (13-30)

22  “నీ సహోదరుని ఎద్దు గానీ, గొర్రె గానీ దారితప్పి తిరగడం నువ్వు చూస్తే, దాన్ని చూసి కూడా చూడనట్టు వదిలేయకూడదు.+ నువ్వు తప్పకుండా దాన్ని నీ సహోదరుని దగ్గరికి తీసుకెళ్లాలి.  కానీ నీ సహోదరుడు నీకు దగ్గర్లో నివసించకపోతుంటే లేదా అతను ఎవరో నీకు తెలియకపోతే నువ్వు ఆ జంతువును నీ ఇంటికి తెచ్చుకోవాలి. నీ సహోదరుడు దాని కోసం వెతుక్కుంటూ వచ్చేవరకు అది నీ దగ్గరే ఉంటుంది. అతను వచ్చినప్పుడు నువ్వు దాన్ని అతనికి తిరిగిచ్చేయాలి.+  నీ సహోదరుడు పోగొట్టుకున్న గాడిద గానీ, వస్త్రం గానీ, ఇంకేదైనా గానీ నీకు దొరికితే నువ్వు అలాగే చేయాలి. నువ్వు దాన్ని చూసీచూడనట్టు వదిలేయకూడదు.  “నీ సహోదరుని గాడిద గానీ, ఎద్దు గానీ దారిలో కింద పడిపోవడం నువ్వు చూస్తే, దాన్ని చూసి కూడా చూడనట్టు వదిలేయకూడదు. ఆ జంతువును లేపడానికి నువ్వు నీ సహోదరునికి తప్పకుండా సహాయం చేయాలి.+  “స్త్రీ పురుషుడి బట్టలు వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ బట్టలు వేసుకోకూడదు. అలా వేసుకునే ప్రతీ ఒక్కరు నీ దేవుడైన యెహోవాకు అసహ్యులు.  “నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు చెట్టు మీదే గానీ, నేల మీదే గానీ పక్షి పిల్లలు లేదా గుడ్లు ఉన్న ఒక పక్షిగూడు నీకు కనిపిస్తే, వాటి తల్లి ఆ పిల్లలమీద లేదా గుడ్ల మీద కూర్చొని ఉంటే, నువ్వు తల్లిని దాని పిల్లలతో పాటు తీసుకోకూడదు.+  నువ్వు ఖచ్చితంగా ఆ తల్లి పక్షిని పంపించేయాలి, అయితే దాని పిల్లల్ని నువ్వు తీసుకోవచ్చు. అలాచేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు ఎక్కువకాలం బ్రతుకుతావు.  “నువ్వు ఒక కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, ఎవరైనా దాని మీద నుండి కిందపడి నీ ఇంటిమీదికి రక్తాపరాధం రాకుండా ఉండేలా నీ ఇంటి పైకప్పుకు పిట్టగోడ కట్టాలి.+  “నీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాల్ని విత్తకూడదు.+ లేదంటే, నువ్వు విత్తిన విత్తనం నుండి, నీ ద్రాక్షతోట నుండి వచ్చిన ప్రతీది జప్తు చేయబడి పవిత్రమైన స్థలానికి ఇవ్వబడుతుంది. 10  “నువ్వు ఎద్దును, గాడిదను జతచేసి భూమి దున్నకూడదు.+ 11  “ఉన్ని, నార కలిపి నేయబడిన బట్టల్ని నువ్వు వేసుకోకూడదు.+ 12  “నువ్వు వేసుకునే బట్టలకు నాలుగు అంచుల్లో కుచ్చు ముడులు తయారుచేసుకోవాలి.+ 13  “ఒక వ్యక్తి ఒకామెను పెళ్లి చేసుకొని, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకొని, ఆ తర్వాత అతను ఆమెను ద్వేషించడం మొదలుపెట్టి,* 14  ఆమె తప్పుడు ప్రవర్తనకు పాల్పడిందని ఆమె మీద నిందలు వేసి, ‘నేను ఈ స్త్రీని పెళ్లి చేసుకున్నాను, కానీ ఈమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు, ఈమె కన్య అనడానికి రుజువు కనిపించలేదు’ అని అంటూ ఆమె పేరు పాడుచేశాడనుకోండి. 15  ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమె కన్య అనడానికి గల రుజువును నగర ద్వారం దగ్గరున్న పెద్దలకు చూపించాలి. 16  ఆ అమ్మాయి తండ్రి ఆ పెద్దలతో ఇలా చెప్పాలి: ‘నేను ఇతనికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాను, కానీ ఇతను ఆమెను ద్వేషిస్తున్నాడు.* 17  అంతేకాదు, “నీ కూతురు కన్య అనడానికి నాకు ఆమె దగ్గర రుజువు కనిపించలేదు” అని అంటూ ఆమె తప్పు చేసిందని నిందిస్తున్నాడు. ఇదిగోండి, నా కూతురు కన్య అనడానికి రుజువు ఇదే.’ తర్వాత వాళ్లు నగర పెద్దల ముందు ఆ బట్టను పరుస్తారు. 18  అప్పుడు ఆ నగర పెద్దలు+ అతన్ని పట్టుకొని, అతనికి క్రమశిక్షణ ఇస్తారు.+ 19  వాళ్లు అతనికి 100 వెండి షెకెల్‌ల* జరిమానా విధించి, ఆ సొమ్మును ఆ అమ్మాయి తండ్రికి ఇస్తారు. ఎందుకంటే అతను ఇశ్రాయేలులోని ఒక కన్య పేరు పాడుచేశాడు.+ తర్వాత ఆమె ముందులాగే అతనికి భార్యగా ఉంటుంది. అతను జీవించినంత కాలం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. 20  “కానీ ఒకవేళ ఆ నింద నిజమని తేలితే, ఆ అమ్మాయి కన్య అనడానికి రుజువేమీ లేకపోతే, 21  వాళ్లు ఆమెను ఆమె తండ్రి ఇంటి గుమ్మం దగ్గరికి తీసుకురావాలి. తర్వాత, ఆ నగరంలోని పురుషులు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి, ఎందుకంటే ఆమె తన తండ్రి ఇంట్లో లైంగిక పాపం చేసి*+ ఇశ్రాయేలులో అవమానకరమైన పని చేసింది.+ కాబట్టి నువ్వు నీ మధ్య నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి.+ 22  “ఒకవేళ ఒక వ్యక్తి ఇంకొకరి భార్యతో పడుకొని ఉన్నప్పుడు పట్టుబడితే, వాళ్లిద్దర్నీ అంటే అలా పడుకున్న వ్యక్తిని, ఆ స్త్రీని చంపేయాలి.+ ఆ విధంగా నువ్వు ఇశ్రాయేలులో నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి. 23  “పెళ్లి నిశ్చయమైన కన్యను ఇంకొక పురుషుడు నగరంలో చూసి, ఆమెతో పడుకుంటే, 24  మీరు వాళ్లిద్దర్నీ ఆ నగర ద్వారం దగ్గరికి తీసుకొచ్చి, నగరంలో గట్టిగా అరవనందుకు ఆ అమ్మాయిని, సాటిమనిషి భార్యను అవమానపర్చినందుకు అతన్ని రాళ్లతో కొట్టి చంపేయాలి.+ అలా నువ్వు నీ మధ్య నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి. 25  “కానీ ఒకవేళ అతను పెళ్లి నిశ్చయమైన ఆ అమ్మాయిని పొలంలో చూసి, బలవంతంగా ఆమెతో పడుకుంటే, ఆమెతో పడుకున్న ఆ వ్యక్తిని మాత్రమే చంపేయాలి; 26  కానీ ఆ అమ్మాయిని ఏమీ చేయకూడదు. ఎందుకంటే, ఆమె మరణశిక్షకు తగిన పాపం చేయలేదు. ఇది కూడా, ఒక వ్యక్తి తన సాటిమనిషి మీద దాడిచేసి హత్య చేయడం లాంటిదే.+ 27  ఎందుకంటే, అతను ఆమెను పొలంలో చూశాడు, పెళ్లి నిశ్చయమైన ఆ అమ్మాయి గట్టిగా అరిచింది, కానీ ఆమెను కాపాడడానికి అక్కడ ఎవరూ లేరు. 28  “ఒకవేళ ఒకతను పెళ్లి నిశ్చయంకాని ఒక కన్యను చూసి, ఆమెను పట్టుకొని, ఆమెతో పడుకున్నాడనుకోండి. ఆ విషయం బయటపడినప్పుడు+ 29  ఆమెతో పడుకున్న వ్యక్తి ఆ అమ్మాయి తండ్రికి 50 వెండి షెకెల్‌లు ఇవ్వాలి, అప్పుడామె అతని భార్య అవుతుంది.+ అతను ఆమెను అవమానపర్చాడు కాబట్టి, అతను తాను జీవించినంత కాలం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. 30  “ఎవ్వరూ తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలాచేస్తే అతను తన తండ్రిని అగౌరవపర్చినట్టే.*+

అధస్సూచీలు

లేదా “ఆమెను తిరస్కరించి.”
లేదా “తిరస్కరిస్తున్నాడు.”
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “వేశ్యలా ప్రవర్తించి.”
లేదా “తన తండ్రి వస్త్రం తీసినట్టే.”