మొదటి తిమోతి 1:1-20

  • శుభాకాంక్షలు (1, 2)

  • అబద్ధ బోధకుల విషయంలో హెచ్చరిక (3-11)

  • పౌలు మీద అపారదయ చూపించ​బడింది (12-16)

  • యుగయుగాలకు రాజు (17)

  • ‘మంచి పోరాటం పోరాడుతూ ఉండు’ (18-20)

1  మన రక్షకుడైన దేవుడూ మన నిరీక్షణైన క్రీస్తుయేసూ+ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడినైన పౌలు అనే నేను,  విశ్వాసంలో నా నిజమైన కుమారుడు+ తిమోతికి*+ రాస్తున్న ఉత్తరం. తండ్రైన దేవుడు, అలాగే మన ప్రభువైన క్రీస్తుయేసు నీకు అపారదయను, కరుణను, శాంతిని అనుగ్రహించాలి.  నేను మాసిదోనియకు బయల్దేరే ముందు ఎఫెసులో ఉండమని నీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు అక్కడ ఉండి భిన్నమైన సిద్ధాంతాల్ని బోధించేవాళ్లను అలా చేయొద్దని ఆజ్ఞాపించు.  అలాగే కట్టుకథల మీద, వంశావళుల మీద మనసు పెట్టొద్దని+ వాళ్లను ఆజ్ఞాపించు. ఎందుకంటే వాటివల్ల ఒరిగేదేమీ లేదు;+ అవి అనవసరమైన ఊహాగానాలకే దారితీస్తాయి తప్ప, మన విశ్వాసాన్ని బలపర్చడానికి దేవుడు ఇస్తున్నవాటిలో అవి లేవు.  మనం స్వచ్ఛమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో, వేషధారణలేని విశ్వాసంతో+ ప్రేమ చూపించాలని+ నేను ఈ నిర్దేశం* ఇస్తున్నాను.  కొందరు వీటి నుండి పక్కకుమళ్లి అర్థంపర్థంలేని ముచ్చట్ల వైపు తిరిగారు.+  వాళ్లకు ధర్మశాస్త్ర బోధకులు అవ్వాలని+ ఉంది కానీ వాళ్లేం చెప్తున్నారో, వేటి గురించి గట్టిగా పట్టుబట్టుతున్నారో వాళ్లకే తెలీదు.  ధర్మశాస్త్రం మంచిదని మనకు తెలుసు, అయితే దాన్ని సరిగ్గా అన్వయించాలి.  అలాగే ఈ వాస్తవాన్ని మనసులో ఉంచుకోవాలి, ధర్మశాస్త్రం నీతిమంతుల కోసం రూపొందించబడలేదు కానీ అక్రమంగా నడుచుకునే వాళ్లకోసం,+ తిరుగుబాటుచేసే వాళ్లకోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం, విశ్వసనీయంగాలేని* వాళ్లకోసం, పవిత్రమైనవాటిని లెక్కచేయని వాళ్లకోసం, తల్లిదండ్రుల్ని చంపే వాళ్లకోసం, హంతకుల కోసం, 10  లైంగిక పాపం* చేసేవాళ్ల కోసం, స్వలింగ సంపర్కులైన పురుషుల కోసం, మనుషుల్ని అపహరించేవాళ్ల కోసం, అబద్ధాలకోరుల కోసం, బూటకపు ప్రమాణాలు చేసేవాళ్ల కోసం, మంచి* బోధకు+ విరుద్ధంగా ఉన్న దేన్నైనా చేసేవాళ్ల కోసం రూపొందించబడింది. 11  ఈ మంచి బోధ, సంతోషంగల దేవుడు నాకు అప్పగించిన మహిమగల మంచివార్తకు+ అనుగుణంగా ఉంది. 12  నాకు బలాన్నిచ్చిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు నేను కృతజ్ఞుణ్ణి. ఎందుకంటే, ఆయన తన పరిచర్య కోసం నన్ను నియమించి నన్ను నమ్మకమైనవానిగా ఎంచాడు.+ 13  నిజానికి ఒకప్పుడు నేను దైవదూషణ చేసేవాణ్ణి, హింసించేవాణ్ణి, తలబిరుసుగా ప్రవర్తించేవాణ్ణి.+ అయితే నేను తెలియక, విశ్వాసం లేక అలా ప్రవర్తించాను కాబట్టి ఆయన నా మీద కరుణ చూపించాడు. 14  మన ప్రభువు నామీద ఎంతో అపారదయ చూపించాడు, క్రీస్తుయేసు నుండి నేను విశ్వాసాన్ని, ప్రేమను పొందాను. 15  ఈ మాట నమ్మదగినది, దీన్ని పూర్తిగా అంగీకరించవచ్చు: పాపుల్ని రక్షించడానికి క్రీస్తుయేసు ఈ లోకంలోకి వచ్చాడు.+ వాళ్లందరిలో నేనే పెద్ద పాపిని.+ 16  అయినాసరే, నా ద్వారా తన ఓర్పును పూర్తిస్థాయిలో చూపించాలని, అలాంటి పెద్ద పాపినైన నా మీద క్రీస్తుయేసు కరుణ చూపించాడు. శాశ్వత జీవితం కోసం తన మీద విశ్వాసం ఉంచబోయే వాళ్లకు+ నేను ఒక ఉదాహరణగా ఉండాలని అలా చేశాడు. 17  యుగయుగాలకు రాజు,+ అక్షయుడు,* అదృశ్యుడు అయిన ఏకైక దేవునికి+ యుగయుగాలు ఘనత, మహిమ కలగాలి. ఆమేన్‌​. 18  నా కుమారుడా, తిమోతీ, నీ గురించి చెప్పబడిన ప్రవచనాలకు అనుగుణంగా నేను ఈ నిర్దేశాన్ని* నీకు అప్పగిస్తున్నాను. వీటిని బట్టి నువ్వు మంచి పోరాటం పోరాడుతూ+ 19  నీ విశ్వాసాన్ని, మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలని నా ఉద్దేశం.+ అలాంటి మనస్సాక్షిని పక్కకు నెట్టేయడం వల్ల కొందరి విశ్వాసం ఓడ బద్దలైనట్టు బద్దలైంది. 20  వాళ్లలో హుమెనైయు,+ అలెక్సంద్రు కూడా ఉన్నారు. దైవదూషణ చేయకూడదనే విషయాన్ని వాళ్లు క్రమశిక్షణ ద్వారా తెలుసుకోవాలని నేను వాళ్లను సాతానుకు అప్పగించాను.+

అధస్సూచీలు

“దేవుణ్ణి ఘనపర్చే వ్యక్తి” అని అర్థం.
లేదా “ఆదేశం; ఆజ్ఞ.”
లేదా “విశ్వసనీయ ప్రేమ లేని.”
పదకోశం చూడండి.
లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”
లేదా “నశించిపోనివాడు.”
లేదా “ఆదేశాన్ని; ఆజ్ఞను.”