కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“భయపడకుము, నేను నీకు సహాయము చేసెదను”

“భయపడకుము, నేను నీకు సహాయము చేసెదను”

“భయపడకుము, నేను నీకు సహాయము చేసెదను”

యేసు తన అనుచరులను ముందే ఇలా హెచ్చరించాడు: “ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు.” అయితే, ఆ హెచ్చరిక ఇచ్చే ముందు ఆయన, “నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము” అని చెప్పాడు. రాజ్య ప్రకటనా పనిని ఆపుచేయాలనే ఉద్దేశంతో, జైల్లో వేయబడతారనే బెదిరింపును సాతాను ఇప్పటికీ ఉపయోగిస్తున్నాడు. కాబట్టి, కొన్ని ప్రభుత్వాలు నిజ క్రైస్తవులను హింసించే అవకాశముందనేది వాస్తవమే. (ప్రక. 2:9, 10; 12:17) అలాగైతే సాతాను పన్నాగాలను తిప్పికొట్టేందుకు సిద్ధపడి యేసు చెప్పినట్లు ‘భయపడకుండా’ ఎలా ఉండగలుగుతాం?

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో భయపడే ఉంటాం. అయినా యెహోవా సహాయంతో భయాలను అధిగమించవచ్చని దేవుని వాక్యం మనకు హామీనిస్తోంది. మరి యెహోవా ఎలా సహాయం చేస్తాడు? సాతాను, అతని ప్రతినిధులు ఏయే కుయుక్తులు ఉపయోగిస్తారో యెహోవా తెలియజేస్తున్నాడు. అలా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు ఆయన మనల్ని సంసిద్ధుల్ని చేస్తున్నాడు. (2 కొరిం. 2:11) దీన్ని అర్థం చేసుకోవడానికి బైబిలు కాలాల్లో జరిగిన ఒక సంఘటనను పరిశీలిద్దాం. అంతేకాక, “అపవాది తంత్రములను ఎదిరిం[చిన]” ఆధునిక కాలంలోని కొంతమంది నమ్మకస్థులైన తోటి విశ్వాసుల ఉదాహరణలను కూడా చూద్దాం.—ఎఫె. 6:11-13.

దైవభయంగల ఓ రాజు దుష్ట పాలకుణ్ణి ఎదుర్కొన్నాడు

సా.శ.పూ. 8వ శతాబ్దంలో అష్షూరీయుల దుష్ట రాజైన సన్హెరీబు అనేక దేశాలపై దండెత్తి తన విజయ పరంపరను కొనసాగిస్తూ వచ్చాడు. ఆత్మవిశ్వాసం పెరగడంతో ఆయన కళ్లు యెహోవా ప్రజల మీద, వారి ముఖ్య పట్టణమైన యెరూషలేము మీద పడ్డాయి. అప్పుడు దాన్ని దైవభయంగల హిజ్కియా రాజు పరిపాలిస్తున్నాడు. (2 రాజు. 18:1-3, 13) ఈ పరిస్థితిని సొమ్ము చేసుకొని భూమి మీద సత్యారాధన లేకుండా చేయాలనే కుయుక్తితో సాతానే ఖచ్చితంగా సన్హెరీబును ప్రేరేపించివుంటాడు.—ఆది. 3:15.

లొంగిపొమ్మని బెదిరించేందుకు సన్హెరీబు యెరూషలేము పట్టణానికి తన ప్రతినిధుల బృందాన్ని పంపించాడు. అలా పంపించబడిన వారిలో రబ్షాకే కూడా ఉన్నాడు, ఆయన రాజు ముఖ్య ప్రతినిధిగా వ్యవహరించాడు. a (2 రాజు. 18:17) యూదుల ధైర్యం చెడేలా చేసి యుద్ధం లేకుండానే వారిని లొంగదీసుకోవడమే రబ్షాకే లక్ష్యం. యూదులను భయపెట్టడానికి రబ్షాకే ఏ పద్ధతులను ఉపయోగించాడు?

ఒంటరివారైనా యథార్థంగా ఉన్నారు

హిజ్కియా ప్రతినిధులతో రబ్షాకే ఇలా చెప్పాడు: ‘మహా రాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా—నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? నలిగిన రెల్లు వంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును.’ (2 రాజు. 18:19, 21) నిజానికి, హిజ్కియా ఐగుప్తుతో సంధి చేసుకోలేదు కాబట్టి, రబ్షాకే మోపిన నింద అబద్ధం. తమను రక్షించడానికి ఎవరూ ముందుకురారనే, తాము ఒంటరివాళ్లమనే విషయాన్ని యూదులకు గుర్తుచేసేందుకే రబ్షాకే ఆ నిందమోపాడు.

ఇటీవలి సంవత్సరాల్లో, సత్యారాధనను వ్యతిరేకించేవారు కూడా నిజక్రైస్తవులు ఒంటరివారౌతారని బెదిరించి వారిలో భయం పుట్టించడానికి ప్రయత్నించారు. తన విశ్వాసం వల్ల జైల్లో పెట్టబడిన ఓ క్రైస్తవ సహోదరి ఎన్నో సంవత్సరాలపాటు తోటి విశ్వాసుల నుండి దూరంగా ఉండాల్సివచ్చింది. ఆ సమయంలో తాను భయపడకుండా ఉండేందుకు తనకు సహాయం చేసిన విషయం గురించి ఆమె ఇలా గుర్తుచేసుకుంటోంది: “ప్రార్థన వల్ల నేను యెహోవాకు దగ్గరయ్యాను . . . ‘నలిగిన హృదయంగల దీనులను’ దేవుడు ఆదుకుంటాడు అని యెషయా 66:2లో ఉన్న అభయాన్ని నేను గుర్తుంచుకున్నాను. ఇది ఎల్లప్పుడూ నాకు బలాన్ని, ఎంతో ఓదార్పును ఇచ్చింది.” ఈ సహోదరిలాగే చాలా సంవత్సరాలు ఒంటరిగా జైల్లో గడిపిన ఓ సహోదరుడు ఇలా అన్నాడు: “యెహోవాతో దగ్గరి సంబంధం ఉంటే నాలుగు గోడల మధ్య బందీగావున్నా సరే పెద్ద ప్రపంచంలో ఉన్నట్లే అనిపిస్తుంది.” యెహోవాతో దగ్గరి సంబంధాన్ని కలిగివుండడం వల్ల ఆ ఇద్దరు క్రైస్తవులు ఒంటరిగా ఉండాల్సి వచ్చినా దాన్ని సహించడానికి కావాల్సిన బలాన్ని పొందారు. (కీర్త. 9:9, 10) కుటుంబం నుండి, స్నేహితుల నుండి, తోటి విశ్వాసుల నుండి వ్యతిరేకులు తమను దూరం చేయగలరేమో కానీ యెహోవా నుండి మాత్రం దూరం చేయలేరని ఖైదు చేయబడిన సాక్షులకు తెలుసు.—రోమా. 8:35-39.

యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపరచుకోవడానికి మనకు దొరికే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యం! (యాకో. 4:8) ఎప్పుడూ మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘యెహోవా నాకు ఎంత వాస్తవమైన వ్యక్తిగా ఉన్నాడు? దైనందిన జీవితంలో నేను తీసుకునే చిన్నా పెద్దా నిర్ణయాలు పూర్తిగా దేవుని వాక్య ప్రకారంగా ఉన్నాయా?’ (లూకా 16:10) యెహోవాతో మనకున్న బంధాన్ని కాపాడుకోవడానికి శాయశక్తులా కృషిచేస్తే భయపడాల్సిన అవసరంలేదు. కష్టాలను అనుభవిస్తున్న యూదుల తరఫున మాట్లాడుతూ యిర్మీయా ప్రవక్త ఇలా అన్నాడు: “యెహోవా, అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమునుబట్టి మొరవిడగా . . . నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు వచ్చితివి—భయపడకుమీ అని నీవు చెప్పితివి.”—విలా. 3:55-57.

అనుమాన బీజాలు నాటేందుకు చేసే ప్రయత్నాలు తప్పక విఫలమౌతాయి

ప్రజల మనసుల్లో అనుమానాలు నాటేందుకు రబ్షాకే మోసకరమైన తర్కాన్ని ఉపయోగించాడు. అతడు ఇలా అన్నాడు: “హిజ్కియా యెవని ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా? . . . ఆ దేశముమీదికి పోయి దాని పాడు చేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను.” (2 రాజు. 18:22, 25) యెహోవాకు తన ప్రజల మీద కోపముంది కాబట్టి ఆయన వారి పక్షాన పోరాడడని రబ్షాకే వాదించాడు. కానీ ఆయన వాదన నిజం కాదు. ఎందుకంటే హిజ్కియాను బట్టి, సత్యారాధనను తిరిగి చేపట్టిన యూదులను బట్టి యెహోవా సంతోషించాడు.—2 రాజు. 18:3-7.

నేడు కూడా, మనం వారి మాట వినేలా చేసేందుకు కుట్ర పన్నే వ్యతిరేకులు కొన్ని సత్యాలను చెబుతారు. అదే సమయంలో మనలో అనుమాన బీజాల్ని నాటేందుకు కుయుక్తిగా వాటికి కొన్ని అబద్ధాలను కూడా చేరుస్తారు. ఉదాహరణకు, తమ దేశంలో నాయకత్వం వహిస్తున్న ఓ సహోదరుడు తన విశ్వాసాన్ని వదిలేశాడు కాబట్టి వారు కూడా తమ విశ్వాసాన్ని, నమ్మకాలను వదిలేయడం తప్పుకాదని జైల్లో పెట్టబడిన సహోదర సహోదరీలకు వ్యతిరేకులు కొన్నిసార్లు చెప్పారు. అయితే, అలాంటి తర్కాలు విని వివేచనగల క్రైస్తవులు మోసపోరు.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఓ క్రైస్తవ సహోదరికి ఏమి జరిగిందో చూడండి. జైల్లో ఉన్నప్పుడు ఓ రాతపూర్వక వాంగ్మూలాన్ని ఆమెకు చూపించారు. అందులో బాధ్యతగల ఓ సహోదరుడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టేసినట్లు ఉంది. ‘ఆ సాక్షిని నమ్ముతున్నావా?’ అని సహోదరిని విచారణ చేసిన వ్యక్తి అడిగాడు. దానికి ఆమె ఇలా చెప్పింది: “[అతడు] ఓ అపరిపూర్ణ మానవుడు మాత్రమే.” అతడు బైబిలు సూత్రాలను పాటించినంత కాలం యెహోవా అతణ్ణి ఉపయోగించుకున్నాడు. “కానీ, అతడు రాసిచ్చిన వాంగ్మూలం బైబిలు సూత్రాల ప్రకారం లేదు కాబట్టి అతడు ఇక ఎంతమాత్రం నా సహోదరుడు కాడు” అని కూడా చెప్పింది. ఆ నమ్మకమైన సహోదరి తెలివిగా, “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి” అనే బైబిలు ఉపదేశాన్ని పాటించింది.—కీర్త. 146:3.

దేవుని వాక్యం గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని కలిగివుండడంతోపాటు, దాని ఉపదేశాన్ని పాటించినప్పుడు సహనంతో ఉండాలనే మన కృతనిశ్చయాన్ని బలహీనపర్చగల మోసపూరిత తర్కాల విషయంలో జాగ్రత్తగా ఉండగలుగుతాం. (ఎఫె. 4:13, 14; హెబ్రీ. 6:19) ఒత్తిళ్లు ఎదురైనప్పుడు సరిగ్గా ఆలోచించగలిగేలా ముందే సిద్ధపడాలంటే మనం మన జీవితాల్లో బైబిలు పఠనానికి, వ్యక్తిగత అధ్యయనానికి ప్రాముఖ్యతనివ్వాలి. (హెబ్రీ. 4:12) జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఇదే మంచి తరుణం. చాలా సంవత్సరాలు జైల్లో ఒంటరి జీవితాన్ని గడిపిన ఓ సహోదరుడు ఇలా చెబుతున్నాడు: “మనకు అందించబడుతున్న అన్నిరకాల ఆధ్యాత్మిక ఆహారం ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తించి, దాన్ని సద్వినియోగం చేసుకోమని నేను ప్రతీ ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే ఆ సమాచారం మనకు ఎప్పుడు, ఎలా ఉపయోగపడుతుందో చెప్పలేం.” దేవుని వాక్యాన్ని, నేడు దాసుని తరగతి ద్వారా అందించబడుతున్న ప్రచురణలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే జీవితంలో తీవ్రమైన కష్టాలు ఎదురైనప్పుడు మనం గతంలో నేర్చుకున్న విషయాలను పరిశుద్ధాత్మ ‘జ్ఞాపకము చేస్తుంది.’—యోహా. 14:26.

భయపెట్టబడినా కాపాడబడ్డారు

రబ్షాకే యూదులను భయపెట్టడానికి ప్రయత్నించాడు. అతడు ఇలా అన్నాడు: “చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెమువేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి యున్న యెడల నేను వాటిని నీకిచ్చెదను. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు?” (2 రాజు. 18:23, 24) మానవ దృక్కోణం నుండి చూస్తే హిజ్కియాకు, ఆయన ప్రజలకు శక్తివంతమైన ఆ అష్షూరు సైన్యాన్ని ఎదిరించడం సాధ్యంకాని పని.

నేడు మనల్ని హింసించేవారు కూడా చాలా శక్తివంతులుగా కనిపించవచ్చు, మరిముఖ్యంగా పాలకుల అండదండలు వారికున్నప్పుడు అలా అనిపించవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ హింసకుల విషయంలో సరిగ్గా అలాగే అనిపించింది. చాలామంది దేవుని సేవకులను భయపెట్టడానికి వారు ప్రయత్నించారు. చాలా ఏళ్లు జైల్లో గడిపిన ఓ సహోదరుడు అక్కడి అధికారులు తనను ఎలా బెదిరించారో ఆ తర్వాత వివరించాడు. ఒకసారి ఓ అధికారి ఆయనతో ఇలా అన్నాడు: “నీ సహోదరుణ్ణి ఎలా కాల్చేశారో చూశావా? దాన్నిబట్టి నీకు ఏమి అర్థమౌతుంది?” దానికి ఆ సహోదరుడు ఇలా అన్నాడు: “నేను ఓ యెహోవాసాక్షిని, ఎప్పటికీ అలాగే ఉంటాను.” “అలాగైతే తర్వాత కాల్చేది నిన్నే” అని ఆ అధికారి బెదిరించాడు. అయినా మన సహోదరుడు వెనకడుగు వేయలేదు, దాంతో శత్రువు ఆయనను భయపెట్టడం ఆపేశాడు. అలాంటి బెదిరింపును ఆయనెలా ఎదుర్కోగలిగాడు? దానికి ఆయన, “యెహోవా నామంపై నమ్మకముంచాను” అని జవాబిచ్చాడు.—సామె. 18:10.

యెహోవాపై పూర్తి విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆధ్యాత్మిక హాని తలపెట్టడానికి సాతాను ఉపయోగించే విధానాలన్నిటి నుండి కాపాడే పెద్ద డాలును పట్టుకుంటాం. (ఎఫె. 6:16) కాబట్టి, మన విశ్వాసాన్ని బలపరచమని యెహోవాకు ప్రార్థించాలి. (లూకా 17:5) అంతేకాక, మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి నమ్మకమైన దాసుని తరగతి చేసిన ఏర్పాట్లను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. బెదిరింపులు ఎదురైనప్పుడు, ప్రవక్తయైన యెహెజ్కేలుకు యెహోవా ఇచ్చిన అభయాన్ని గుర్తుంచుకుంటే మనం బలాన్ని పొందుతాం. ఆ కాలంలో యెహెజ్కేలు మొండి ప్రజలకు వర్తమానాన్ని అందించాల్సి వచ్చింది. అయితే యెహోవా ఆయనకు ఇలా చెప్పాడు: “వారి ముఖమువలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను. నీ నుదురు చెకుముకి రాతికంటె కఠినముగా ఉండు వజ్రమువలె చేసెదను.” (యెహె. 3:8, 9) యెహెజ్కేలు వజ్రమంత కఠినంగా ఉండాల్సి వచ్చింది. అవసరమైతే మనం కూడా యెహెజ్కేలులా ఉండడానికి యెహోవా సహాయం చేయగలడు.

శోధనలను ఎదిరించండి

వేరే విధానాలేమీ పనిచేయనప్పుడు, ఏదైనా ఆశ చూపిస్తే కొన్నిసార్లు క్రైస్తవులు తమ యథార్థతను కోల్పోతారని వ్యతిరేకులు గుర్తించారు. రబ్షాకే కూడా ఆ విధానాన్నే పాటించాడు. అతడు యెరూషలేమువాసులతో ఇలా చెప్పాడు: “అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా—నాతో సంధిచేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల . . . అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షరసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లును గల దేశమునకును, ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును.” (2 రాజు. 18:31, 32) మంచి ఆహారం తినగలుగుతారని, కొత్త ద్రాక్షారసాన్ని తాగగలుగుతారని రబ్షాకే చెప్పినప్పుడు ముట్టడి వేయబడిన ఆ పట్టణంలో ఉన్నవారికి అదెంతో ఆకర్షణీయంగా అనిపించి ఉండవచ్చు.

జైల్లోవున్న ఓ మిషనరీ కృతనిశ్చయాన్ని బలహీనపరచడానికి ఒకసారి అలాంటి ఆశనే చూపించారు. ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునే విషయంలో ఆలోచించేందుకు ఆయనను “అందమైన తోట”లో ఉన్న ఓ “మంచి ఇంట్లో” ఆరునెలలు ఉంచుతామని చెప్పారు. అయితే ఆ సహోదరుడు మాత్రం తన విశ్వాసాన్ని వదులుకోకూడదని తీర్మానించుకున్నాడు కాబట్టి క్రైస్తవ సూత్రాలను విడిచిపెట్టలేదు. ఆయన ఎలా స్థిరంగా ఉండగలిగాడు? ఆ తర్వాత ఆయన ఇలా చెప్పాడు: “రాజ్యం వాస్తవమైన నిరీక్షణ అని అనుకునేవాణ్ణి. . . . దేవుని రాజ్యానికి సంబంధించిన జ్ఞానంతో నా విశ్వాసం బలపడింది, అది తప్పక వస్తుందని నమ్మాను, దాని గురించి ఎప్పుడూ సందేహపడలేదు. కాబట్టే నేను విశ్వాసంలో స్థిరంగా ఉండగలిగాను.”

దేవుని రాజ్యం వాస్తవమైనదని మనం నమ్ముతున్నామా? పూర్వీకుడైన అబ్రాహాము, అపొస్తలుడైన పౌలు, చివరికి యేసు కూడా దేవుని రాజ్యం వాస్తవమైనదని నమ్మారు కాబట్టే కష్టమైన పరీక్షలను సహించగలిగారు. (ఫిలి. 3:13, 14; హెబ్రీ. 11:8-10; 12:1, 2) మన జీవితంలో రాజ్యానికి ప్రథమస్థానం ఇస్తూ, దానివల్ల వచ్చే నిరంతర ఆశీర్వాదాలను మనసులో ఉంచుకోవాలి. అలా చేస్తే, పరీక్షల నుండి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తామని ఎవరైన ఆశ చూపించినప్పుడు, మనం ఆ శోధనకు లొంగిపోకుండా ఉండగలుగుతాం.—2 కొరిం. 4:16-18.

యెహోవా మనల్ని విడిచిపెట్టడు

యూదులను భయపెట్టాలని రబ్షాకే ఎంత ప్రయత్నించినప్పటికీ హిజ్కియా, ఆయన ప్రజలు మాత్రం యెహోవాపై గట్టి నమ్మకాన్ని ఉంచారు. (2 రాజు. 19:15, 19; యెష. 37:5-7) సహాయం కోసం వారు చేసిన ప్రార్థనలకు జవాబుగా యెహోవా ఒక దేవదూతను పంపించి ఒక్క రాత్రిలోనే అష్షూరు దండులోని 1,85,000 మంది సైనికులను హతం చేయించాడు. ఆ తర్వాతి రోజే సన్హెరీబు అవమాన భారంతో మిగిలిన సైన్యాన్ని తీసుకొని తన దేశ రాజధానియైన నీనెవెకు తిరిగి వెళ్లిపోయాడు.—2 రాజు. 19:35, 36.

తనను నమ్ముకున్నవారిని యెహోవా నిజంగానే విడిచిపెట్టలేదు. పరీక్షలు వచ్చినా స్థిరంగా నిలబడిన ఆధునిక కాల సహోదర సహోదరీల ఉదాహరణలు కూడా అదే చూపిస్తున్నాయి. అందుకే పరలోక తండ్రియైన యెహోవా మనకు, “నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను” అనే అభయాన్నిస్తున్నాడు.—యెష. 41:13.

[అధస్సూచి]

a “రబ్షాకే” అనేది అష్షూరు సామ్రాజ్యంలో ఓ ముఖ్య అధికారికి ఇవ్వబడే బిరుదు. ఆ వ్యక్తి అసలు పేరు బైబిల్లో ఇవ్వబడలేదు.

[13వ పేజీలోని బ్లర్బ్‌]

యెహోవా తన వాక్యంలో 30కన్నా ఎక్కువసార్లు తన సేవకులకు, “భయపడకుము” అనే అభయాన్నిచ్చాడు

[12వ పేజీలోని చిత్రం]

రబ్షాకే ఉపయోగించిన పన్నాగాలు, నేడు దేవుని ప్రజల శత్రువులు ఉపయోగించే పన్నాగాలు ఒకేలా ఉన్నాయని ఎలా చెప్పవచ్చు?

[15వ పేజీలోని చిత్రాలు]

యెహోవాతో దగ్గరి సంబంధాన్ని కలిగివుంటే పరీక్షలు వచ్చినా యథార్థంగా ఉండగలుగుతాం