లూకా సువార్త 16:1-31

  • అన్యాయస్థుడైన గృహనిర్వాహకుడి ఉదాహరణ (1-13)

    • “చాలా చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్న వ్యక్తి, పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు” (10)

  • ధర్మశాస్త్రం, దేవుని రాజ్యం (14-18)

  • ధనవంతుడు, లాజరుల ఉదాహరణ (19-31)

16  తర్వాత యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “ఒక ధనవంతుడి కింద ఒక గృహనిర్వాహకుడు ఉండేవాడు. అయితే, అతను ఆస్తిని దుబారా చేస్తున్నాడని ఎవరో ఆ ధనవంతుడికి ఫిర్యాదు చేశారు.  కాబట్టి అతను ఆ గృహనిర్వాహకుడిని పిలిచి, ‘నీ గురించి నేను వింటున్నది ఏంటి? నీ పని గురించి నాకు లెక్క అప్పజెప్పు, ఇక నువ్వు నా గృహనిర్వాహకుడిగా ఉండవు’ అని చెప్పాడు.  అప్పుడు ఆ గృహనిర్వాహకుడు తనలోతాను ఇలా అనుకున్నాడు: ‘నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి? పొలంలో పనిచేసేంత బలం నాకు లేదు. భిక్షమెత్తుకోవాలంటే సిగ్గు.  ఆ! ఏం చేయాలో నాకు తెలుసు! అలాచేస్తే, యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేసినా ప్రజలు నన్ను తమ ఇళ్లలో చేర్చుకుంటారు.’  తర్వాత అతను తన యజమానికి అప్పు ఉన్న వాళ్లలో ఒక్కొక్కర్ని తన దగ్గరికి పిలిపించాడు. అతను మొదటి వ్యక్తిని, ‘నువ్వు నా యజమానికి ఎంత అప్పు ఉన్నావు?’ అని అడిగాడు.  అతను, ‘నేను 2,200 లీటర్ల* ఒలీవ నూనె అప్పు ఉన్నాను’ అని చెప్పాడు. అప్పుడు ఆ గృహనిర్వాహకుడు అతనితో, ‘నీ ఒప్పంద పత్రం వెనక్కి తీసుకొని, కూర్చొని త్వరగా 1,100 లీటర్లు అని రాయి’ అన్నాడు.  తర్వాత ఇంకో వ్యక్తిని, ‘నువ్వు ఎంత అప్పు ఉన్నావు?’ అని అడిగాడు. అతను, ‘170 క్వింటాళ్ల* గోధుమలు’ అని చెప్పాడు. అప్పుడా గృహనిర్వాహకుడు అతనితో, ‘నీ ఒప్పంద పత్రం వెనక్కి తీసుకొని, 136 క్వింటాళ్లు అని రాయి’ అన్నాడు.  అయితే, అతని యజమాని ఆ గృహనిర్వాహకుడిని మెచ్చుకున్నాడు. ఎందుకంటే, అతను అన్యాయస్థుడే అయినా తెలివిగా* నడుచుకున్నాడు. తమ తరంవాళ్లతో వ్యవహరించే విషయంలో ఈ వ్యవస్థకు* చెందినవాళ్లు వెలుగు పుత్రుల+ కన్నా తెలివిగా నడుచుకుంటారు.  “నేను మీతో చెప్తున్నాను, ఈ అవినీతి లోకంలోని సంపదలతో మీ కోసం స్నేహితుల్ని సంపాదించుకోండి.+ ఆ సంపదలు అయిపోయినప్పుడు వాళ్లు మిమ్మల్ని శాశ్వత నివాస స్థలాల్లో చేర్చుకుంటారు.+ 10  చాలా చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్న వ్యక్తి, పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. చాలా చిన్న విషయాల్లో నమ్మకంగా లేని వ్యక్తి, పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉండడు. 11  మీరు అవినీతి లోకంలోని సంపదల విషయంలోనే నమ్మకంగా లేకపోతే, నిజమైన సంపదల్ని ఎవరు మీకు అప్పగిస్తారు? 12  వేరేవాళ్లకు చెందినదాని విషయంలోనే మీరు నమ్మకంగా లేకపోతే, మీకు చెందినదాన్ని ఎవరు మీకు ఇస్తారు?+ 13  ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు; లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు. మీరు ఒకే సమయంలో దేవునికీ సంపదలకూ దాసులుగా ఉండలేరు.”+ 14  డబ్బును ప్రేమించే పరిసయ్యులు అవన్నీ వింటూ యేసును ఎగతాళి చేయడం మొదలుపెట్టారు.+ 15  కాబట్టి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు మనుషుల ముందు మిమ్మల్ని మీరు నీతిమంతులని ప్రకటించుకుంటారు,+ కానీ దేవునికి మీ హృదయాలు తెలుసు.+ మనుషులు గొప్పదని అనుకునేది దేవుని దృష్టిలో నీచమైనది.+ 16  “యోహాను వచ్చేవరకు ధర్మశాస్త్రం, ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. అప్పటినుండి దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించబడుతోంది. అన్నిరకాల ప్రజలు దానిలోకి ప్రవేశించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు.+ 17  నిజానికి ఆకాశం, భూమి నాశనమైనా, ధర్మశాస్త్రమంతా నెరవేరేవరకు దానిలోని ఒక చిన్న పొల్లు కూడా తప్పిపోదు.+ 18  “భార్యకు విడాకులు ఇచ్చి వేరే ఆమెను పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు. విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్లిచేసుకునే వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు.+ 19  “ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను ఊదారంగు వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు వేసుకునేవాడు. రోజూ సుఖభోగాలు అనుభవిస్తూ విలాసవంతంగా బ్రతికేవాడు. 20  లాజరు అనే ఒక అడుక్కునేవాడు కూడా ఉండేవాడు, అతని ఒళ్లంతా కురుపులే. కొంతమంది అతన్ని మోసుకొచ్చి ఆ ధనవంతుడి గుమ్మం దగ్గర పెట్టేవాళ్లు. 21  అతను ఆ ధనవంతుడి భోజనం బల్ల నుండి కింద పడేవాటితో తన పొట్ట నింపుకోవాలని ఆశపడేవాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి. 22  కొంతకాలానికి ఆ అడుక్కునేవాడు చనిపోయాడు. దేవదూతలు అతన్ని తీసుకెళ్లి అబ్రాహాము పక్కన* కూర్చోబెట్టారు. “తర్వాత ఆ ధనవంతుడు కూడా చనిపోయి, సమాధి చేయబడ్డాడు. 23  అతను సమాధిలో* వేదన పడుతూ తల ఎత్తి చూశాడు. అప్పుడు అతనికి దూరంగా అబ్రాహాము, అబ్రాహాము పక్కన* ఉన్న లాజరు కనిపించారు. 24  కాబట్టి అతను ఇలా అరిచాడు: ‘తండ్రివైన అబ్రాహామూ, నా మీద కరుణ చూపించు. నేను ఈ మంటల్లో ఎంతో వేదన పడుతున్నాను. కాబట్టి లాజరును పంపించి, తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లబర్చమని చెప్పు.’ 25  కానీ అబ్రాహాము ఇలా అన్నాడు: ‘బాబూ, నీకు గుర్తు లేదా? నువ్వు బ్రతికున్నప్పుడు ఎన్నో మంచివాటిని అనుభవించావు, కానీ లాజరు ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయితే ఇప్పుడతను ఇక్కడ ఊరట పొందుతున్నాడు, నువ్వేమో వేదన పడుతున్నావు. 26  పైగా, మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది. కాబట్టి ఇక్కడి నుండి మీ దగ్గరికి వెళ్లాలనుకునేవాళ్లు వెళ్లలేరు. అలాగే, అక్కడి నుండి ప్రజలు మా దగ్గరికి రాలేరు.’ 27  అప్పుడు ఆ ధనవంతుడు ఇలా అన్నాడు: ‘అలాగైతే తండ్రీ, అతన్ని మా నాన్నవాళ్ల ఇంటికి పంపించు. 28  నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు. అతను వెళ్లి వాళ్లకు పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తే, వాళ్లు నాలా ఇక్కడికి వచ్చి వేదన పడకుండా ఉంటారు.’ 29  కానీ అబ్రాహాము ఇలా చెప్పాడు: ‘వాళ్ల దగ్గర మోషే, అలాగే ప్రవక్తలు ఉన్నారు; నీ సహోదరుల్ని వాళ్ల మాట విననీ.’+ 30  అప్పుడతను, ‘తండ్రివైన అబ్రాహామూ, అలా కాదు; చనిపోయినవాళ్లలో నుండి ఎవరైనా వాళ్ల దగ్గరికి వెళ్తే, వాళ్లు పశ్చాత్తాపపడతారు’ అన్నాడు. 31  అయితే అబ్రాహాము అతనితో ఇలా చెప్పాడు: ‘వాళ్లు మోషే మాట, ప్రవక్తల మాట వినకపోతే,+ చనిపోయినవాళ్లలో నుండి ఒకడు బ్రతికి వచ్చినా వాళ్లకు నమ్మకం కుదరదు.’ ”

అధస్సూచీలు

లేదా “100 బాత్‌ కొలతల.” అప్పట్లో ఒక బాత్‌ 22 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “100 కొర్‌ కొలతల.” అప్పట్లో ఒక కొర్‌ 220 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “ఆచరణాత్మక తెలివితో.”
లేదా “యుగానికి.” పదకోశం చూడండి.
అక్ష., “అబ్రాహాము రొమ్మున.”
లేదా “హేడిస్‌​లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.
అక్ష., “అబ్రాహాము రొమ్మున.”