కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘బోధించే విషయంలో జాగ్రత్తగా ఉండండి’

‘బోధించే విషయంలో జాగ్రత్తగా ఉండండి’

‘బోధించే విషయంలో జాగ్రత్తగా ఉండండి’

“బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.” (యోహా. 13:13) తన శిష్యులతో ఈ మాటలు చెప్పడం ద్వారా యేసు బోధకునిగా తనకున్న పాత్రను వివరించాడు. ఆ తర్వాత, పరలోకానికి ఆరోహణమయ్యే కొంతకాలం ముందు యేసు తన శిష్యులకు ఇలా ఆజ్ఞాపించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్త. 28:19, 20) ఆ తర్వాత పౌలు కూడా దేవుని వాక్య బోధకులుగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెప్పాడు. ఆయన క్రైస్తవ పెద్దయైన తిమోతికి ఇలా ఉపదేశించాడు: “చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము . . . నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.”—1 తిమో. 4:13-15.

అప్పటిలాగే ఇప్పుడు కూడా ఇటు పరిచర్యలో, అటు కూటాల్లో బోధించడమనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. బోధించే విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి? అలా జాగ్రత్తగా ఉండడం ద్వారా దేవుని వాక్య బోధకులమైన మనం మన అభివృద్ధిని ఏయే విధాలుగా అందరికీ తేటగా కనబరచగలుగుతాం?

గొప్ప బోధకుణ్ణి అనుకరించండి

యేసు బోధించిన తీరును చాలామంది శ్రోతలు ఇష్టపడ్డారు. నజరేతులోని సమాజమందిరానికి వచ్చిన వారిమీద ఆయన మాటలు ఎంతగా ప్రభావం చూపించాయో గమనించండి. దాని గురించి సువార్త రచయిత అయిన లూకా ఇలా రాశాడు: “అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యప[డ్డారు].” (లూకా 4:22) ప్రకటనా పనిలో యేసు శిష్యులు తమ యజమాని మాదిరిని అనుసరించారు. అంతెందుకు అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.” (1 కొరిం. 11:1) పౌలు యేసు బోధనా పద్ధతులను అనుసరించాడు కాబట్టే ఆయన ‘బహిరంగముగా, ఇంటింట’ ఎంతో సమర్థంగా ‘బోధించగలిగాడు.’—అపొ. 20:20.

‘సంతవీధిలో’ బోధించడం

బహిరంగంగా బోధించే విషయంలో పౌలుకున్న సామర్థ్యం గురించిన ఓ చక్కని ఉదాహరణను అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో చూస్తాం. గ్రీసులోని ఏథెన్సుకు ఆయన వెళ్లినప్పుడు ఏమి జరిగిందో మనం అక్కడ చదువుతాం. ఆ పట్టణంలో ఎటుచూసినా అటు వీధుల్లో, ఇటు బహిరంగ ప్రదేశాల్లో ఆయనకు విగ్రహాలే కనిపించాయి. అవి చూసి పౌలు ఎంతో కలవరపడివుంటాడు. అయినా ఆయన తన భావావేశాల్ని అణచుకుని, ‘సమాజమందిరములలో, ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలుసుకొను వారితో తర్కించుచు వచ్చెను.’ (అపొ. 17:16, 17) మనకు ఆయన ఎంత చక్కని మాదిరినుంచాడు! అన్నిరకాల ప్రజలతో విమర్శనాత్మకంగా కాక, గౌరవపూర్వకంగా మాట్లాడితే మనం చెప్పేది విని, అబద్ధ మత బంధకాల నుండి బయటికి వచ్చేలా కొందరికి సహాయం చేయగలుగుతాం.—అపొ. 10:34, 35; ప్రక. 18:4.

పౌలు సంతవీధిలో ప్రకటిస్తున్నప్పుడు ఆయన చెప్పిన విషయాలను చాలామంది ఇష్టపడలేదు. పౌలు ప్రకటించిన సత్యాలకు విరుద్ధమైన అభిప్రాయాలు కలిగివున్న తత్వవేత్తలు కూడా వారిలో ఉన్నారు. వారు తనతో ఏకీభవించనప్పుడు పౌలు వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నాడు. కొందరు ఆయనను “వదరుబోతు” (అక్షరార్థంగా “విత్తనాలను ఏరుకునేవాడు”) అని పిలిచారు. మరికొందరైతే “వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడు” అని చెప్పుకున్నారు.—అపొ. 17:18.

తన శ్రోతలు చేసిన అలాంటి అవమానకరమైన వ్యాఖ్యానాలను విని పౌలు నిరుత్సాహపడలేదు. బదులుగా తన బోధలను వివరించమని వారు కోరినప్పుడు పౌలు తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బోధనా నైపుణ్యాలతో తెలివిగా ప్రసంగాన్నిచ్చాడు. (అపొ. 17:19-22; 1 పేతు. 3:15) ఆయనిచ్చిన ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మనం క్షుణ్ణంగా పరిశీలించి, మన బోధనా సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు సహాయం చేయగల పాఠాలను నేర్చుకుందాం.

శ్రోతలు ఇష్టపడే అంశాలను ఎన్నుకోండి

పౌలు ఇలా చెప్పాడు: “ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై యున్నట్టు నాకు కనబడుచున్నది. నేను . . . మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద—తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.”—అపొ. 17:22, 23.

పౌలు తన చుట్టూవున్న పరిసరాలను జాగ్రత్తగా గమనించి తన శ్రోతల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. మనం కూడా పరిసరాలను గమనిస్తే గృహస్థుని గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం. ఉదాహరణకు, ఇంటి ఆవరణలో పడివున్న ఆటబొమ్మల్ని లేదా తలుపు మీదున్న గుర్తులను చూస్తే ఆ గృహస్థుల గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. గృహస్థుని పరిస్థితుల గురించి మనం అంచనా వేయగలిగితే ఏమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా జాగ్రత్తగా ఎంచుకోగలుగుతాం.—కొలొ. 4:6.

శ్రోతలను విమర్శించే విధంగా పౌలు మాట్లాడలేదు. ఏథెన్సువారికి ‘దైవభక్తి’ ఉన్నా దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానంలేదని పౌలు గ్రహించాడు. వారు సత్యదేవుణ్ణి ఎలా ఆరాధించవచ్చో పౌలు స్పష్టంగా వివరించాడు. (1 కొరిం. 14:8) కాబట్టి మనం రాజ్య సువార్తను స్పష్టంగా, సానుకూలంగా ప్రకటించడం ఎంత ప్రాముఖ్యం!

నేర్పుగా, నిష్పక్షపాతంగా వ్యవహరించండి

పౌలు ఇంకా ఇలా చెప్పాడు: “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.”—అపొ. 17:24, 25.

పౌలు చాలా నేర్పుగా యెహోవాను ‘ఆకాశమునకును భూమికిని ప్రభువు’ అని ప్రస్తావించడం ద్వారా యెహోవాయే జీవదాత అనే విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చాడు. యెహోవా జీవదాత అని గుర్తించేలా వివిధ మతాల, సంస్కృతుల నుండి వచ్చిన యథార్థ హృదయులకు సహాయం చేయడం ఎంత గొప్ప అవకాశం!—కీర్త. 36:9.

ఆ తర్వాత పౌలు ఇలా చెప్పాడు: “ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.”—అపొ. 17:26, 27.

బోధించే విధానం ద్వారా మనం ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఇతరులకు చూపించవచ్చు. ఎలాంటి పక్షపాతం చూపించకుండా ‘తన్ను తడవులాడి కనుగొనే’ అవకాశం యెహోవా అన్ని జనాంగాలవారికి ఇస్తున్నాడు. మనం కూడా పక్షపాతం చూపించకుండా ప్రజలందరితో మాట్లాడతాం. సృష్టికర్తను నమ్మేవారు ఆయనకు దగ్గరై, నిత్యమూ ఆశీర్వాదాలు అనుభవించేలా సహాయం చేయడానికి కృషిచేస్తాం. (యాకో. 4:8) అయితే, దేవుడు లేడనే వారికి మనం ఎలా సహాయం చేస్తాం? ఈ విషయంలో పౌలు మాదిరిని అనుకరిస్తాం. ఆ తర్వాత ఆయన ఏమి చెప్పాడో గమనించండి.

“మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె—మన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై యుండి . . . బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు.”—అపొ. 17:28, 29.

తాను చెప్పింది ఏథెన్సువారు ఇష్టపడి దాన్ని అంగీకరించేలా పౌలు వారికి పరిచయమున్న, వారు అంగీకరించిన కవుల మాటలను ఇక్కడ ఉల్లేఖించడానికి ప్రయత్నించాడు. అలాగే మనమూ మన శ్రోతలు అంగీకరిస్తారనుకునే విషయాల గురించి మాట్లాడడం ద్వారా వారిలో ఆసక్తిని రేకెత్తించడానికి ప్రయత్నిస్తాం. ఉదాహరణకు, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఉపయోగించిన ఉపమానం ఇప్పుడు కూడా ప్రజలను ఒప్పించేందుకు ఉపయోగపడుతుంది: “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.” (హెబ్రీ. 3:3, 4) ఈ చిన్న ఉపమానం గురించి గృహస్థులను ఆలోచింపజేయడం ద్వారా మన మాటలు నిజమని గుర్తించేందుకు వారికి సహాయం చేయవచ్చు. పౌలు తన ప్రసంగాన్ని అంత సమర్థంగా ఇవ్వడానికి మరో కారణం కూడా ఉంది. ఆయన శ్రోతలను ప్రేరేపించాడు.

మనం జీవించే కాలం ఎంత అపాయకరమైనదో నొక్కిచెప్పండి

పౌలు ఇలా చెప్పాడు: “ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు.”—అపొ. 17:30, 31.

దేవుడు దుష్టత్వాన్ని కొంతకాలంపాటు అనుమతించడం వల్ల మన హృదయాల్లో నిజంగా ఏముందో చూపించే అవకాశం మనందరికీ దొరికింది. మనం అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నామని నొక్కిచెబుతూ, త్వరలో దేవుని రాజ్య పరిపాలన ద్వారా వచ్చే ఆశీర్వాదాల గురించి ప్రజలను ఒప్పించే విధంగా మాట్లాడడం చాలా ప్రాముఖ్యం.—2 తిమో. 3:1-5.

ప్రజలు వివిధ రకాలుగా స్పందించవచ్చు

“మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి; మరికొందరు—దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి.”—అపొ. 17:32-34.

కొందరు మనం బోధించిన వాటిని వెంటనే నమ్మవచ్చు. మరికొందరు అలా నమ్మడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు. కానీ మనం సత్యాన్ని స్పష్టంగా, సరళంగా బోధించడం వల్ల కనీసం ఒక్క వ్యక్తి అయినా యెహోవా గురించి ఖచ్చితమైన జ్ఞానాన్ని తీసుకోవచ్చు. అలా తన ప్రియకుమారుని వైపు ప్రజల్ని ఆకర్షించడానికి యెహోవా మనల్ని ఉపయోగించుకున్నందుకు ఆయనకు ఎంత రుణపడివుంటాం!—యోహా. 6:44.

మనం ఈ పాఠాలు నేర్చుకోవచ్చు

పౌలు ప్రసంగం గురించి ఆలోచించేకొద్దీ మనం ఇతరులకు బైబిలు సత్యాలను ఎలా వివరించవచ్చనే దాని గురించి మరింతగా తెలుసుకుంటాం. సంఘంలో బహిరంగ ప్రసంగాలు ఇస్తున్నట్లయితే, నేర్పుగా మాట్లాడడం ద్వారా పౌలును అనుకరించడానికి కృషి చేయవచ్చు. అలా మాట్లాడితే అవిశ్వాసులు బైబిలు సత్యాలను అర్థం చేసుకొని, వాటిని అంగీకరిస్తారు. మనం బైబిలు సత్యాలను స్పష్టంగా తెలియజేయాలనుకుంటాం. అయితే కూటాలకు వచ్చిన అవిశ్వాసుల నమ్మకాలను కించపరిచే విధంగా మాట్లాడకుండా జాగ్రత్తపడతాం. అలాగే ప్రకటనా పనిలో ఉన్నప్పుడు మనం ఒప్పించే విధంగా, నేర్పుగా మాట్లాడడానికి కృషిచేస్తాం. ఇలా చేయడం ద్వారా ‘బోధించే విషయంలో జాగ్రత్తగా ఉండండి’ అని పౌలు ఇచ్చిన సలహాను నిజంగా పాటించగలుగుతాం.

[30వ పేజీలోని చిత్రం]

పౌలు స్పష్టంగా, సరళంగా, నేర్పుగా బోధించాడు

[31వ పేజీలోని చిత్రం]

గృహస్థుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మనం పౌలును అనుకరిస్తాం