కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అవకాశాల కోసం కనిపెట్టుకొనివుంటే మంచి ఫలితాలొస్తాయి

అవకాశాల కోసం కనిపెట్టుకొనివుంటే మంచి ఫలితాలొస్తాయి

అవకాశాల కోసం కనిపెట్టుకొనివుంటే మంచి ఫలితాలొస్తాయి

మీ సంఘ క్షేత్రంలో సాక్ష్యమిచ్చే అవకాశాలు అనుకోకుండా మీకు ఎదురుకావచ్చు. అలాంటి అవకాశాల కోసం మీరు కనిపెట్టుకొని ఉంటున్నారా? ఫిన్‌లాండ్‌లోని చారిత్రక ఓడరేవు పట్టణమైన టర్కులో ఉన్న మన క్రైస్తవ సహోదరులు అలా కనిపెట్టుకొని ఉండడంవల్ల మంచి ఫలితాలు సాధించారు.

స్థానిక ఓడరేవులో తయారౌతున్న ఓ పెద్ద ఓడకు తుది మెరుగులు దిద్దడానికి ఆసియా నుండి కొంతమంది టర్కు పట్టణానికి వచ్చారని అక్కడి సహోదరులు తెలుసుకున్నారు. తర్వాత ఆ విదేశీ పనివారు పట్టణంలోని ఏ హోటళ్లలో దిగారో ఓ సహోదరుడు తెలుసుకున్నాడు. అంతేకాదు, ఉదయాన్నే వారిని హోటళ్ల నుండి ఓడరేవుకు బస్సుల్లో తీసుకువెళ్తారని కూడా ఆయన తెలుసుకున్నాడు. వెంటనే ఆ సహోదరుడు టర్కులోని ఆంగ్ల భాషా సంఘానికి ఈ విషయాన్ని తెలియజేశాడు.

చాలామంది విదేశీయులు రావడం వల్ల వారితో రాజ్య సందేశాన్ని పంచుకునే అవకాశం అనుకోకుండా లభించిందని ఆ సంఘంలోని పెద్దలు గ్రహించారు. కాబట్టి వెంటనే వారు ఆ విదేశీయులకు ప్రకటించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆ వారంలోని ఆదివారం పదిమంది ప్రచారకులు ఉదయం ఏడు గంటలకు బస్‌స్టాపు దగ్గరకు చేరుకున్నారు. మొదట అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ‘మనం ఆలస్యంగా వచ్చామా? లేక వారు టర్కు నుండి వెళ్లిపోయారా?’ అని సహోదరులు అనుకున్నారు. అంతలోనే ఒక వ్యక్తి పని దుస్తులతో వీధి చివరి నుండి రావడాన్ని వారు చూశారు. అలా ఒకొక్కరు రాసాగారు. కొద్దిసేపటికే చాలామంది పనివాళ్లు ఆ బస్‌స్టాపు దగ్గరికి వచ్చి చేరారు. వెంటనే ప్రచారకులు ఆంగ్లభాషా ప్రచురణలతో వారికి ప్రకటించడం మొదలుపెట్టారు. సంతోషకరమైన విషయమేమిటంటే, వారంతా బస్సుల్లోకి ఎక్కి కూర్చోవడానికి దాదాపు గంటసేపు పట్టింది. దానివల్ల, సహోదరులు వారిలో చాలామందితో మాట్లాడగలిగారు. బస్సులు కదిలే సమయానికల్లా మన సహోదరులు వారికి 126 చిన్న పుస్తకాలను, 329 పత్రికలను ఇవ్వగలిగారు!

మంచి ఫలితం రావడంతో ఆ తర్వాతి వారంలో కూడా అంటే తమ సంఘాన్ని ప్రయాణ పైవిచారణకర్త సందర్శించే వారంలో కూడా సహోదరులు అక్కడికి వెళ్లి ప్రకటించాలనుకున్నారు. వర్షం కురుస్తున్న రోజున ఉదయం ఆరున్నరకు ప్రాంతీయ పైవిచారణకర్త క్షేత్రసేవా కూటాన్ని నిర్వహించాడు. ఆ తర్వాత 24 మంది ప్రచారకులు ఆ బస్‌స్టాపుకు వెళ్లారు. ఆ విదేశీయుల్లో చాలామంది ఫిలిప్పీన్స్‌ దేశానికి చెందినవారు కాబట్టి ఈసారి ఆ ప్రచారకులు తమతోపాటు తగాలోగ్‌ భాషా ప్రచురణలను కూడా తీసుకెళ్లారు. బస్సులు కదిలే సమయానికల్లా సహోదరులు ఆ విదేశీయులకు 7 పుస్తకాలను, 69 చిన్న పుస్తకాలను, 479 పత్రికలను ఇవ్వగలిగారు. ఆ ప్రత్యేక పనిలో పాల్గొని ఉత్సాహంగా తిరిగి వచ్చిన మన సహోదర సహోదరీల ఆనందానికి అవధుల్లేవు!

వారు తమ స్వదేశాలకు తిరిగివెళ్లేలోపు సహోదరులు వాళ్లుంటున్న హోటళ్లకు వెళ్లి వారిలో కొందరిని కలుసుకోగలిగారు, రాజ్య సందేశాన్ని మరింత వివరించగలిగారు. అంతకుముందే వేరే దేశాల్లో యెహోవాసాక్షులు తమను కలుసుకున్నారని వారిలో కొందరు చెప్పారు. ఫిన్‌లాండ్‌లో ఉన్నప్పుడు తమను కలుసుకోవడానికి చొరవతీసుకున్నందుకు ఆ విదేశీయులు సహోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ సంఘ క్షేత్రంలో సాక్ష్యమిచ్చే అవకాశాలు అనుకోకుండా మీకు ఎదురుకావచ్చు. అలాంటి అవకాశాల కోసం మీరు కనిపెట్టుకొని ఉంటున్నారా? వివిధ సంస్కృతులవారికి ప్రకటించేందుకు చొరవ తీసుకుంటున్నారా? అలాచేస్తే టర్కులోని సహోదరుల్లాగే మీరూ మంచి ఫలితాలను సాధిస్తారు.

[32వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఫిన్‌లాండ్‌

హెల్సిన్కీ

టర్కు