యెషయా 37:1-38
37 హిజ్కియా రాజు ఆ మాటలు వినగానే తన బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరంలోకి వెళ్లాడు.+
2 తర్వాత అతను రాజభవనం* మీద అధికారైన ఎల్యాకీమును, కార్యదర్శి షెబ్నాను, యాజకుల్లో పెద్దల్ని ఆమోజు కుమారుడైన యెషయా+ ప్రవక్త దగ్గరికి పంపించాడు. వాళ్లు గోనెపట్ట కట్టుకొని వెళ్లి,
3 అతనితో ఇలా అన్నారు: “హిజ్కియా ఇలా చెప్తున్నాడు, ‘ఈ రోజు శ్రమ, దూషణ,* అవమానం ఉన్న రోజు; ప్రసవించే సమయం వచ్చింది, కానీ కనడానికి శక్తి చాలట్లేదు.+
4 నీ దేవుడైన యెహోవా బహుశా రబ్షాకే మాటల్ని విని, నీ దేవుడైన యెహోవా తాను విన్న మాటల్ని బట్టి అతన్ని శిక్షిస్తాడేమో. జీవంగల దేవుణ్ణి దూషించడానికి+ అతని ప్రభువైన అష్షూరు రాజే అతన్ని పంపించాడు. కాబట్టి బ్రతికున్న మిగతా ప్రజల+ కోసం ప్రార్థన చేయి.’ ”+
5 హిజ్కియా రాజు సేవకులు యెషయా దగ్గరికి వెళ్లినప్పుడు,+
6 యెషయా వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు మీ ప్రభువుతో ఇలా చెప్పాలి, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నువ్వు విన్న మాటల్ని బట్టి, అంటే అష్షూరు రాజు సేవకులు+ నన్ను దూషిస్తూ అన్న మాటల్ని బట్టి భయపడకు.+
7 నేను అతని మనసులో ఒక ఆలోచన పెడుతున్నాను, ఒక వార్త విని అతను తన దేశానికి తిరిగెళ్లిపోతాడు;+ అతను తన స్వదేశంలోనే కత్తితో చంపబడేలా నేను చేస్తాను.” ’ ”+
8 అష్షూరు రాజు లాకీషు నుండి వెళ్లిపోయాడని రబ్షాకే విన్నప్పుడు అతను రాజు దగ్గరికి తిరిగెళ్లాడు. అప్పుడు రాజు లిబ్నా మీద యుద్ధం చేస్తున్నాడు.+
9 ఇతియోపియా రాజైన తిర్హాకా తనతో యుద్ధం చేయడానికి వచ్చాడని అష్షూరు రాజుకు కబురు అందింది. అది విన్నప్పుడు అతను మళ్లీ హిజ్కియా దగ్గరికి సందేశకుల్ని పంపించి+ ఇలా అన్నాడు:
10 “యూదా రాజైన హిజ్కియాతో మీరు ఇలా చెప్పాలి: ‘ “యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడదు” అని నువ్వు నమ్ముకున్న నీ దేవుడు చెప్పే మాటలు విని మోసపోవద్దు.+
11 ఇదిగో! అష్షూరు రాజులు దేశాలన్నిటికీ ఏం చేశారో, వాటిని ఎలా సమూలంగా నాశనం చేశారో నువ్వు విన్నావు కదా.+ నువ్వు మాత్రం తప్పించుకుంటావని అనుకుంటున్నావా?
12 నా పూర్వీకులు నాశనం చేసిన దేశాల దేవుళ్లు వాటిని కాపాడగలిగారా?+ గోజాను, హారాను,+ రెజెపు ఏమయ్యాయి? తెలశ్శారులో నివసించిన ఏదెను ప్రజలు ఏమయ్యారు?
13 హమాతు రాజు ఎక్కడ? అర్పాదు రాజు ఎక్కడ? సెపర్వయీము,+ హేన, ఇవ్వా నగరాల రాజులు ఎక్కడ?’ ”
14 హిజ్కియా ఆ సందేశకుల చేతిలో నుండి ఉత్తరాల్ని తీసుకొని చదివాడు. తర్వాత హిజ్కియా యెహోవా మందిరానికి వెళ్లి వాటిని* యెహోవా ముందు పరిచాడు.+
15 తర్వాత హిజ్కియా యెహోవాకు ఇలా ప్రార్థించాడు:+
16 “సైన్యాలకు అధిపతివైన యెహోవా,+ ఇశ్రాయేలు దేవా, కెరూబుల పైన* సింహాసనంలో కూర్చున్న దేవా, భూమ్మీదున్న రాజ్యాలన్నిట్లో నువ్వు మాత్రమే సత్యదేవుడివి. భూమ్యాకాశాల్ని నువ్వే చేశావు.
17 యెహోవా, దయచేసి చెవిపెట్టి విను!+ యెహోవా, దయచేసి కళ్లు తెరిచి చూడు!+ జీవంగల దేవుణ్ణి దూషించడానికి సన్హెరీబు పంపిన మాటలన్నిటినీ విను.+
18 యెహోవా, అష్షూరు రాజులు తమ స్వదేశంతో సహా దేశాలన్నిటినీ నాశనం చేసిన మాట నిజమే.+
19 వాళ్లు ఆ దేశాల దేవుళ్లను అగ్నిలో కాల్చేశారు.+ ఎందుకంటే అవి దేవుళ్లు కావు, కేవలం మనుషుల చేతిపనులు;+ చెక్కలు, రాళ్లు మాత్రమే. అందుకే వాళ్లు వాటిని నాశనం చేయగలిగారు.
20 అయితే ఇప్పుడు యెహోవా, మా దేవా, దయచేసి అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. యెహోవా, అప్పుడు భూమ్మీదున్న రాజ్యాలన్నీ నువ్వు మాత్రమే దేవుడివని తెలుసుకుంటాయి.”+
21 అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఈ సందేశం పంపాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘అష్షూరు రాజైన సన్హెరీబు గురించి నువ్వు ప్రార్థించావు కదా,+
22 యెహోవా అతని గురించి ఈ మాట చెప్పాడు:
“సీయోను కన్య నిన్ను తిరస్కరిస్తుంది, ఆమె నిన్ను హేళన చేస్తుంది.
యెరూషలేము కూతురు నిన్ను చూసి తల ఆడిస్తుంది.
23 నువ్వు నిందించింది, దూషించింది ఎవర్ని?+
నీ గొంతునూ, అహంకారంతో నిండిన నీ కళ్లనూ పైకెత్తింది ఎవరి మీద?+ఇశ్రాయేలు పవిత్ర దేవుని మీదే కదా!+
24 నీ సేవకుల ద్వారా నువ్వు యెహోవాను నిందించి+ ఇలా అన్నావు:‘నా యుద్ధ రథాల సమూహంతోనేను పర్వత శిఖరాల మీదికి ఎక్కుతాను,+లెబానోను మారుమూల ప్రాంతాల్ని చేరుకుంటాను.
దాని ఎత్తైన దేవదారు చెట్లను, దాని శ్రేష్ఠమైన సరళవృక్షాల్ని నరికేస్తాను.
దాని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోకి, దాని దట్టమైన అడవుల్లోకి ప్రవేశిస్తాను.
25 నేను బావులు తవ్వి నీళ్లు తాగుతాను;అరికాళ్లతో ఐగుప్తు వాగుల్ని* ఎండిపోజేస్తాను.’
26 నువ్వు వినలేదా? నేను దీన్ని ఎప్పుడో నిర్ణయించాను.*
చాలాకాలం క్రితమే దాన్ని సిద్ధం చేశాను.*+
ఇప్పుడు అది జరిగేలా చేస్తాను.+
ప్రాకారాలుగల నగరాల్ని నువ్వు శిథిలాల కుప్పలుగా మారుస్తావు.+
27 వాటి నివాసులు నిస్సహాయులౌతారు;వాళ్లు భయపడిపోతారు, అవమానాలపాలు అవుతారు.
వాళ్లు పొలంలోని మొక్కల్లా, పచ్చగడ్డిలా తయారౌతారు,తూర్పు గాలికి వాడిపోయిన పైకప్పుల మీది గడ్డిలా అవుతారు.
28 అయితే నువ్వు ఎప్పుడు కూర్చుంటావో, ఎప్పుడు బయటికి వెళ్తావో, ఎప్పుడు లోపలికి వస్తావో,ఎప్పుడు నా మీద కోపంగా ఉంటావో నాకు బాగా తెలుసు.+
29 ఎందుకంటే నా మీద నీకున్న కోపం గురించి,+ నీ రంకెల గురించి నాకు వినబడింది.+
కాబట్టి నేను నా కొక్కెం నీ ముక్కుకు తగిలించి, నీ నోటికి కళ్లెం+ వేసినువ్వు వచ్చిన దారినే నిన్ను వెనక్కి నడిపిస్తాను.”
30 “ ‘ఇది నీకు* సూచనగా ఉంటుంది: ఈ సంవత్సరం మీరు దానంతటదే పండే పంటను* తింటారు; రెండో సంవత్సరం, దాని నుండి మొలిచిన ధాన్యాన్ని తింటారు; అయితే మూడో సంవత్సరం మాత్రం మీరు విత్తనాలు విత్తి పంట కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి పండ్లు తింటారు.
31 యూదా ఇంటివాళ్లలో తప్పించుకున్నవాళ్లు, అంటే మిగిలినవాళ్లు+ కిందికి వేరు తన్ని, పైకి ఎదిగి ఫలిస్తారు.
32 ఎందుకంటే మిగిలినవాళ్లు యెరూషలేము నుండి, తప్పించుకున్నవాళ్లు సీయోను పర్వతం నుండి బయల్దేరతారు.+ సైన్యాలకు అధిపతైన యెహోవా ఆసక్తితో దీన్ని జరిగిస్తాడు.+
33 “ ‘కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా ఇలా చెప్తున్నాడు:+
“అతను ఈ నగరంలోకి రావడం గానీ,+ఒక బాణం వేయడం గానీ,డాలుతో ఎదిరించడం గానీ,ముట్టడిదిబ్బ కట్టడం గానీ జరగదు.” ’+
34 ‘అతను వచ్చిన దారినే వెళ్లిపోతాడు;అతను ఈ నగరంలో అడుగుపెట్టడు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
35 ‘నేను నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం+ఈ నగరాన్ని కాపాడి సంరక్షిస్తాను.’ ”+
36 తర్వాత యెహోవా దూత బయల్దేరి, అష్షూరీయుల శిబిరంలో 1,85,000 మంది పురుషుల్ని చంపేశాడు. ప్రజలు పొద్దున్నే లేచి చూసినప్పుడు అన్నీ శవాలే కనిపించాయి.+
37 కాబట్టి అష్షూరు రాజైన సన్హెరీబు అక్కడి నుండి బయల్దేరి, నీనెవెకు+ తిరిగెళ్లి అక్కడే ఉండిపోయాడు.+
38 అతను తన దేవుడైన నిస్రోకు గుడిలో వంగి నమస్కారం చేస్తున్నప్పుడు, అతని సొంత కుమారులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి,+ అరారాతు+ దేశానికి పారిపోయారు. తర్వాత అతని కుమారుడు ఏసర్హద్దోను+ అతని స్థానంలో రాజయ్యాడు.
అధస్సూచీలు
^ లేదా “రాజు ఇంటివాళ్ల.”
^ లేదా “నింద.”
^ అక్ష., “దాన్ని.”
^ లేదా “మధ్య” అయ్యుంటుంది.
^ లేదా “నైలు నది కాలువల్ని.”
^ అక్ష., “చేశాను.”
^ లేదా “తయారు చేశాను.”
^ అంటే, హిజ్కియాకు.
^ లేదా “కిందపడిన ధాన్యపు గింజల నుండి వచ్చే పంటను.”