రాజులు రెండో గ్రంథం 18:1-37

  • హిజ్కియా, యూదా రాజు (1-8)

  • ఇశ్రాయేలు నాశనమైన విధానం (9-12)

  • సన్హెరీబు యూదా మీదికి రావడం (13-18)

  • రబ్షాకే యెహోవాను దూషించడం (19-37)

18  ఇశ్రాయేలు రాజూ ఏలా కుమారుడూ అయిన హోషేయ+ పరిపాలన మూడో సంవత్సరంలో, యూదా రాజైన ఆహాజు+ కుమారుడు హిజ్కియా+ రాజయ్యాడు.  రాజైనప్పుడు అతనికి 25 ఏళ్లు, అతను యెరూషలేములో 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి, జెకర్యా కూతురైన అబీ.*+  అతను తన పూర్వీకుడైన దావీదులా+ యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ వచ్చాడు.+  ఉన్నత స్థలాల్ని తీయించింది,+ పూజా స్తంభాల్ని ముక్కలుముక్కలు చేసింది, పూజా కర్రను* నరికించింది+ అతనే. అంతేకాదు అతను మోషే చేయించిన రాగి సర్పాన్ని+ కూడా ముక్కలుముక్కలు చేశాడు; ఇశ్రాయేలీయులు అప్పటివరకు దానికి బలులు అర్పిస్తూ వాటి పొగ పైకిలేచేలా చేస్తూ వచ్చారు; అది రాగి సర్ప విగ్రహం* అని పిలవబడేది.  హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద నమ్మకం ఉంచాడు;+ యూదా రాజులందరిలో అతని తర్వాత గానీ, అతనికి ముందు గానీ అతనిలాంటివాళ్లు ఎవ్వరూ లేరు.  హిజ్కియా యెహోవాను హత్తుకొని ఉన్నాడు,+ ఆయన్ని అనుసరించడం మానేయలేదు; యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞల్ని అతను పాటిస్తూ ఉన్నాడు.  యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అతను ఎక్కడికి వెళ్లినా తెలివిగా ప్రవర్తించాడు. హిజ్కియా అష్షూరు రాజు మీద తిరుగుబాటు చేశాడు, అతన్ని సేవించడానికి ఒప్పుకోలేదు.+  అంతేకాదు అతను కావలిబురుజు నుండి ప్రాకారాలుగల నగరాల వరకు,* గాజా, దాని ప్రాంతాల వరకు ఫిలిష్తీయుల్ని ఓడించాడు.+  రాజైన హిజ్కియా పరిపాలనలోని నాలుగో సంవత్సరంలో, అంటే ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడు హోషేయ పరిపాలనలోని ఏడో సంవత్సరంలో, అష్షూరు రాజైన షల్మనేసెరు సమరయ మీదికి వచ్చి దాన్ని ముట్టడించడం మొదలుపెట్టాడు.+ 10  మూడు సంవత్సరాల చివర్లో వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకున్నారు;+ వాళ్లు హిజ్కియా పరిపాలనలోని ఆరో సంవత్సరంలో, అంటే ఇశ్రాయేలు రాజైన హోషేయ పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరంలో సమరయను స్వాధీనం చేసుకున్నారు. 11  తర్వాత అష్షూరు రాజు ఇశ్రాయేలు ప్రజల్ని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లి+ వాళ్లను హాలహులో, గోజాను నది దగ్గరున్న హాబోరులో, మాదీయుల నగరాల్లో నివసింపజేశాడు.+ 12  ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుడైన యెహోవా మాట* వినకుండా ఆయన ఒప్పందాన్ని, యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మీరుతూ ఉన్నారు కాబట్టి అలా జరిగింది.+ వాళ్లు వినలేదు, లోబడలేదు. 13  హిజ్కియా రాజు పరిపాలనలోని 14వ సంవత్సరంలో, అష్షూరు+ రాజైన సన్హెరీబు ప్రాకారాలుగల యూదా నగరాలన్నిటి మీదికి వచ్చి, వాటిని స్వాధీనం చేసుకున్నాడు.+ 14  దాంతో యూదా రాజైన హిజ్కియా లాకీషులో ఉన్న అష్షూరు రాజుకు, “తప్పు నాదే. నా మీద దాడి చేయకుండా వెనక్కి వెళ్లు. నువ్వు నాకు ఏ జరిమానా విధించినా దాన్ని చెల్లిస్తాను” అని సందేశం పంపించాడు. అప్పుడు అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 300 తలాంతుల* వెండిని, 30 తలాంతుల బంగారాన్ని జరిమానా విధించాడు. 15  కాబట్టి హిజ్కియా యెహోవా మందిరంలో, అలాగే రాజభవనంలోని ఖజానాల్లో ఉన్న వెండినంతా ఇచ్చాడు.+ 16  ఆ సమయంలో, యూదా రాజైన హిజ్కియా తాను అంతకుముందు బంగారు రేకుతో కప్పించిన యెహోవా మందిర తలుపుల్ని,+ ద్వారబంధాల్ని+ తీయించి* అష్షూరు రాజుకు ఇచ్చాడు. 17  తర్వాత, అష్షూరు రాజు లాకీషు+ నుండి ఒక పెద్ద సైన్యంతో తర్తానును,* రబ్సారీసును,* రబ్షాకేను* యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజు దగ్గరికి పంపించాడు.+ వాళ్లు యెరూషలేముకు వచ్చి, చాకలివాడి పొలానికి వెళ్లే రహదారి పక్కనున్న పైకొలను కాలువ దగ్గర నిలబడ్డారు.+ 18  వాళ్లు రాజును బయటికి రమ్మని పిలిచినప్పుడు, హిల్కీయా కుమారుడూ రాజభవనం మీద అధికారీ అయిన ఎల్యాకీము,+ కార్యదర్శి అయిన షెబ్నా,+ ఆసాపు కుమారుడూ వివరాలు నమోదు చేసేవాడూ అయిన యోవాహు వాళ్ల దగ్గరికి వెళ్లారు. 19  అప్పుడు రబ్షాకే వాళ్లతో ఇలా అన్నాడు: “దయచేసి హిజ్కియాతో ఈ మాట చెప్పండి, ‘గొప్ప రాజైన అష్షూరు రాజు ఏమంటున్నాడంటే: “ఏం చూసుకొని నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు?+ 20  నువ్వు, ‘యుద్ధం చేయడానికి వ్యూహం, శక్తి నా దగ్గర ఉన్నాయి’ అని అంటున్నావు; అవన్నీ వట్టి మాటలు. ఎవర్ని నమ్ముకొని నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తున్నావు?+ 21  ఇదిగో! నలిగిన రెల్లు లాంటి ఈ ఐగుప్తు ఆదుకుంటుందని నువ్వు నమ్ముతున్నావు,+ ఎవరైనా దాన్ని ఆనుకుంటే అది వాళ్ల అరచేతిలో గుచ్చుకుంటుంది. తనను నమ్ముకునే వాళ్లందరికీ ఐగుప్తు రాజైన ఫరో అలాంటివాడే. 22  మీరు ఒకవేళ, ‘మేము మా దేవుడైన యెహోవాను నమ్ముకున్నాం’+ అంటారేమో; ఆయన ఉన్నత స్థలాల్నే, బలిపీఠాల్నే కదా హిజ్కియా తొలగించి+ యూదా, యెరూషలేము వాళ్లతో, ‘మీరు యెరూషలేములోని ఈ బలిపీఠం ముందు మాత్రమే వంగి నమస్కరించాలి’ అని చెప్తున్నాడు?” ’+ 23  కాబట్టి ఇప్పుడు దయచేసి నా ప్రభువైన అష్షూరు రాజుతో ఒక పందెం కాయి: నేను నీకు 2,000 గుర్రాల్ని ఇస్తాను, నీకు చేతనైతే వాటికి సరిపోయేంత మంది రౌతుల్ని తీసుకురా.+ 24  అలాంటిది, రథాల కోసం, రౌతుల కోసం ఐగుప్తు మీద నమ్మకం పెట్టుకున్న నువ్వు నా ప్రభువు సేవకుల్లో అత్యల్పుడైన ఒక్క అధిపతినైనా ఎలా తరిమికొట్టగలవు? 25  యెహోవా ఆదేశం లేకుండానే నేను ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చానా? ‘ఈ దేశం మీదికి వెళ్లి దాన్ని నాశనం చేయి’ అని యెహోవాయే స్వయంగా నాతో చెప్పాడు.” 26  అప్పుడు హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా,+ యోవాహు రబ్షాకేతో+ ఇలా అన్నారు: “దయచేసి నీ సేవకులమైన మాతో అరామిక్‌* భాషలో+ మాట్లాడు, మాకు ఆ భాష అర్థమౌతుంది; ప్రాకారం మీదున్న ప్రజలకు వినిపించేలా యూదుల భాషలో మాతో మాట్లాడకు.”+ 27  కానీ రబ్షాకే వాళ్లతో ఇలా అన్నాడు: “కేవలం మీ ప్రభువుకు, మీకు మాత్రమే ఈ మాటలు చెప్పమని నా ప్రభువు నన్ను పంపించాడా? ఈ ప్రాకారం మీద కూర్చున్నవాళ్లతో కూడా అతను ఈ మాటలు చెప్పమన్నాడు. మీతో పాటు వాళ్లు కూడా తమ మలాన్ని తింటారు, తమ మూత్రాన్ని తాగుతారు.” 28  అప్పుడు రబ్షాకే నిలబడి యూదుల భాషలో బిగ్గరగా ఇలా అన్నాడు: “గొప్ప రాజైన అష్షూరు రాజు చెప్పేది వినండి.+ 29  రాజు ఇలా చెప్తున్నాడు, ‘హిజ్కియా మాటలు విని మోసపోకండి, అతను నా చేతిలో నుండి మిమ్మల్ని కాపాడలేడు.+ 30  “యెహోవా తప్పకుండా మనల్ని రక్షిస్తాడు, ఈ నగరం అష్షూరు రాజు చేతికి అప్పగించబడదు” అని హిజ్కియా చెప్తున్న మాటల్ని విని యెహోవా మీద నమ్మకం పెట్టుకోకండి.+ 31  హిజ్కియా చెప్పేది వినకండి, ఎందుకంటే అష్షూరు రాజు ఇలా అంటున్నాడు: “నాతో సంధి చేసుకొని లొంగిపోండి, అప్పుడు మీలో ప్రతీ ఒక్కరు తమ సొంత ద్రాక్షచెట్టు పండ్లను, సొంత అంజూర చెట్టు పండ్లను తింటారు, సొంత బావిలోని నీళ్లు తాగుతారు, 32  తర్వాత నేను వచ్చి, మిమ్మల్ని మీ దేశం లాంటి ఒక దేశానికి,+ అంటే ధాన్యం, కొత్త ద్రాక్షారసం, ఆహారం, ద్రాక్షతోటలు, ఒలీవ చెట్లు, తేనె ఉండే దేశానికి తీసుకెళ్తాను. అప్పుడు మీరు చనిపోకుండా బ్రతికుంటారు. హిజ్కియా మాట వినొద్దు. ‘యెహోవా మనల్ని రక్షిస్తాడు’ అని చెప్తూ అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. 33  దేశాలు పూజించే దేవుళ్లలో ఏ దేవుడైనా అష్షూరు రాజు చేతిలో నుండి తన దేశాన్ని రక్షించుకోగలిగాడా? 34  హమాతు,+ అర్పాదు దేవుళ్లు ఏమయ్యారు? సెపర్వయీము,+ హేన, ఇవ్వా దేవుళ్లు ఏమయ్యారు? వాళ్లు నా చేతిలో నుండి సమరయను రక్షించారా?+ 35  యెహోవా యెరూషలేమును నా చేతిలో నుండి కాపాడతాడని నమ్మడానికి, ఈ దేశాలు పూజించిన దేవుళ్లలో ఎవరు తమ దేశాన్ని నా చేతిలో నుండి రక్షించారు?” ’ ”+ 36  అయితే ప్రజలు ఒక్కమాట కూడా అతనికి బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయారు; ఎందుకంటే, “మీరు అతనికి బదులివ్వకూడదు” అని రాజు ఆదేశించాడు.+ 37  అప్పుడు హిల్కీయా కుమారుడూ రాజభవనం మీద అధికారీ అయిన ఎల్యాకీము, కార్యదర్శి అయిన షెబ్నా, ఆసాపు కుమారుడూ వివరాలు నమోదు చేసేవాడూ అయిన యోవాహు తమ బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరికి వచ్చి రబ్షాకే మాటల్ని అతనికి చెప్పారు.

అధస్సూచీలు

ఇది అబీయాకు సంక్షిప్త రూపం.
పదకోశం చూడండి.
లేదా “నెహుష్టాన్‌.”
అంటే, తక్కువ జనాభా, ఎక్కువ జనాభా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో.
అక్ష., “స్వరం.”
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
అక్ష., “నరికి.”
లేదా “సైన్యాధికారిని.”
లేదా “ముఖ్య ఆస్థాన అధికారిని.”
లేదా “ముఖ్య పానదాయకుడిని.”
లేదా “సిరియా.”