కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులు అంత్యక్రియలను గౌరవపూర్వకంగా, మర్యాదకరంగా, దేవుడు ఇష్టపడే విధంగా జరిపించాలి

క్రైస్తవులు అంత్యక్రియలను గౌరవపూర్వకంగా, మర్యాదకరంగా, దేవుడు ఇష్టపడే విధంగా జరిపించాలి

క్రైస్తవులు అంత్యక్రియలను గౌరవపూర్వకంగా, మర్యాదకరంగా, దేవుడు ఇష్టపడే విధంగా జరిపించాలి

విషాదఛాయలు అలముకొనివున్నాయి. కొంతమంది ప్రత్యేకమైన నల్లని దుస్తులు ధరించుకొని నేలమీద పడి బోరుమని ఏడుస్తున్నారు. మరికొంతమంది సంగీత వాద్యాల ధ్వనులకు అనుగుణంగా నాట్యమాడుతున్నారు. ఇంకొంతమంది బిగ్గరగా నవ్వుతూ తింటూ తాగుతూ విందు చేసుకుంటున్నారు. ఇతరులేమో విరివిగా అందించబడిన కల్లూ, బీరూ పూటుగా తాగి, ఆ నశాలో నేలమీద పడి ఉన్నారు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వందలాదిమంది అంత్యక్రియలప్పుడు చనిపోయిన వారికి తమ తుది వీడ్కోలు తెల్పడానికి అలా చేస్తుంటారు.

ఎన్నో మూఢనమ్మకాలు పాటించే, చనిపోయినవారికి భయపడే బంధుమిత్రుల మధ్య చాలామంది యెహోవాసాక్షులు జీవిస్తున్నారు. చనిపోయినవారు ఆత్మగా మారి తమకు సహాయమైనా హానియైనా చేయగలరని లక్షలాదిమంది నమ్ముతారు. ఈ నమ్మకం వల్లే అంత్యక్రియలప్పుడు ఎన్నో ఆచారాలు చేస్తారు. అయితే, ఎవరైన చనిపోయినప్పుడు బాధతో ఏడ్వడం సహజమే. కొన్ని సందర్భాల్లో యేసు, ఆయన శిష్యులు తమ ఆత్మీయులు మరణించినప్పుడు ఏడ్చారు. (యోహా. 11:​33-35, 38; అపొ. 8:2; 9:39) ఆ కాలంలోనివారు తమ దుఃఖాన్ని విపరీతంగా వ్యక్తం చేసేవారు. వారిలా యేసూ ఆయన అపొస్తలులూ చేయలేదు. (లూకా 23:​27, 28; 1 థెస్స. 4:13) ఎందుకు? ఎందుకంటే, చనిపోయినవారికి ఏమౌతుందో వారికి తెలుసు.

బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు . . . వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు . . . నీవు పోవు షియోల్‌నందు [మానవజాతి సామాన్య సమాధియందు] పనియైనను, ఉపాయమైనను, తెలివియైనను, జ్ఞానమైనను లేదు.” (ప్రసం. 9:​5, 6, 10, NW) చనిపోయినవారికి తమ చుట్టూ ఏమి జరుగుతుందో తెలియదు అనే విషయాన్ని ఈ ప్రేరేపిత లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి ఆలోచించలేడు, మాట్లాడలేడు, దేనినీ అర్ధం చేసుకోలేడు, ఆయనకు ఎలాంటి భావాలు కలుగవు. ఈ ప్రాముఖ్యమైన బైబిలు సత్యం తెలిసిన క్రైస్తవులు అంత్యక్రియలను ఎలా జరపాలి?

‘అపవిత్రమైనదానిని ముట్టకండి’

చనిపోయినవారికి అన్ని తెలుసనీ, మనకు సహాయమైనా హానియైనా చేయగలరనీ నేడు చాలామంది నమ్ముతారు. అయితే, యెహోవాసాక్షులు మాత్రం తమ జాతి, సంస్కృతులు ఏవైనా అలాంటి నమ్మకాలకు సంబంధించిన ఆచారాలకు దూరంగా ఉంటారు. మృతదేహం దగ్గర రాత్రంతా మేల్కొని విలపిస్తూ పాటలు పాడడం, వేడుకలు జరుపుకోవడం, వర్ధంతులు జరుపుకోవడం, చనిపోయినవారికి బలులు అర్పించడం, వితంతువులకు సంబంధించిన ఆచారాలు జరుపుకోవడం వంటివాటిని దేవుడు ఇష్టపడడు. వాటిని అపవిత్రమైనవిగా ఎంచుతాడు. ఎందుకంటే, అవన్నీ ఆత్మ చావదు అనే లేఖనవిరుద్ధమైన దయ్యాల బోధకు సంబంధించినవి. నిజక్రైస్తవులు “ప్రభువు బల్లమీద ఉన్న దానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు” కాబట్టి, వారు అలాంటి ఆచారాల్లో పాల్గొనరు. (1 కొరి. 10:21) “ప్రత్యేకముగా ఉండుడి, . . . అపవిత్రమైనదానిని ముట్టకుడి” అనే ఆజ్ఞకు వారు లోబడతారు. (2 కొరి. 6:​16-18) అయితే, అలా చేయడం అన్ని సందర్భాల్లో సులభమేమీ కాదు.

కొన్ని ఆచారాలు పాటించకపోతే పూర్వీకుల ఆత్మలకు కోపం వస్తుందనీ ఆఫ్రికాలోని, మరితర దేశాల్లోని చాలామంది నమ్ముతారు. అంతేకాక, అలాంటివి చేయకపోవడం ఘోరమైన అపరాధమనీ దానివల్ల తమకూ, తమ సమాజానికి మంచి జరగదనీ లేదా శపించబడతామనీ వారనుకుంటారు. లేఖనవిరుద్ధమైన అంత్యక్రియలకు సంబంధించిన ఆచారాల్లో పాల్గొనకపోవడంవల్ల, చాలామంది యెహోవాసాక్షులు విమర్శించబడ్డారు, అవమానించబడ్డారు. బంధువులు, సమాజం వారిని వెలివేయబడినవారిగా చూశారు. కొందరైతే సమాజ వ్యతిరేకులుగా, చనిపోయిన వారిని అగౌరవపర్చేవారిగా నిందించబడ్డారు. కొన్నిసార్లు, చనిపోయిన ఒక క్రైస్తవుడి అంత్యక్రియల ఏర్పాట్లను అవిశ్వాసులు బలవంతంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. కాబట్టి, దేవునికి ఇష్టంలేని అలాంటి అంత్యక్రియలకు సంబంధించిన ఆచారాలను పాటించమని పట్టుబట్టేవారితో అనవసరంగా వాదించే పరిస్థితి ఏర్పడకూడదంటే ఏమి చేయాలి? అంతకంటే ప్రాముఖ్యంగా యెహోవాతో మనకున్న సంబంధాన్ని దెబ్బతీయగల అపవిత్రమైన ఆచారాలకూ అభ్యాసాలకూ దూరంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

మీ నిర్ణయాలను స్పష్టం చేయండి

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కుటుంబ పెద్దలు, దూరపు చుట్టాలు అంత్యక్రియలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం పరిపాటి. కాబట్టి, బైబిలు సూత్రాలకు అనుగుణంగా యెహోవాసాక్షులు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తారని ఒక నమ్మకమైన క్రైస్తవుడు స్పష్టం చేయాలి. (2 కొరిం. 6:​14-16) క్రైస్తవ అంత్యక్రియల్లో జరిగేవి తోటి క్రైస్తవుల మనసాక్షిని కలవరపర్చకూడదు, మరణించిన వారి గురించిన మన నమ్మకాలు, బోధలు తెలిసినవారినీ అభ్యంతరపర్చకూడదు.

ఒకవేళ అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత క్రైస్తవ సంఘంలోని ఒక సహోదరునికి అప్పగిస్తే ఏర్పాట్లన్ని లేఖనాలకు అనుగుణంగా ఉండేలా నియమిత పెద్దలు అవసరమైన సూచనలను, కావాల్సిన లేఖనాధారిత ఓదార్పును విశ్వాసులైన కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చు. అవిశ్వాసులైనవారు అంత్యక్రియలప్పుడు అపవిత్రమైన ఆచారాలను చేయాలనుకుంటే, వాటి విషయంలో క్రైస్తవులుగా మన నమ్మకాలకే కట్టుబడి ఉంటూ, దాన్ని దయతో గౌరవపూర్వకంగా, ధైర్యంగా వివరించడం చాలా అవసరం. (1 పేతు. 3:15) అయినా, అవిశ్వాసులైన బంధువులు వాటిని ఆచరించాలని పట్టుబడితే ఏమి చేయవచ్చు? అలాంటి పరిస్థితుల్లో విశ్వాసులైన ఆ మృతుని కుటుంబపువారు అంత్యక్రియలను విడిచివెళ్లిపోవచ్చు. (1 కొరిం. 10:20) అలా జరిగితే, స్థానిక రాజ్యమందిరంలో లేదా అనువైన మరో స్థలంలో అంత్యక్రియల ప్రసంగాన్ని ఇవ్వవచ్చు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు ఆ విధంగా ‘లేఖనముల నుండి ఆదరణ’ పొందుతారు. (రోమా. 15:⁠4) మృతుని శరీరం అక్కడ లేకపోయినా, ఆ ఏర్పాటు గౌరవపూర్వకంగా ఉంటుంది, అలా చేయడంలో తప్పేమీలేదు. (ద్వితీ. 34:​5, 6, 8) అవిశ్వాస బంధువులు అనవసరంగా జోక్యం చేసుకున్నప్పుడు కుటుంబ సభ్యుల బాధ, ఒత్తిడి పెరుగుతుంది. అయినా, సరైంది చేయాలనే మన కృతనిశ్చయాన్ని “బలాధిక్యము” ఇచ్చే దేవుడు గమనిస్తాడనేది గుర్తుంచుకొని మనం ఓదార్పుపొందవచ్చు.​—⁠2 కొరిం. 4:⁠7.

మీ అభీష్టాలను ముందుగానే రాసిపెట్టుకోండి

తన అంత్యక్రియలు ఎలా జరగాలన్న విషయాన్ని ఒక వ్యక్తి ముందుగానే రాసిపెట్టినట్లయితే అవిశ్వాసులైన కుటుంబ సభ్యులను ఒప్పించడం చాలా సులభం. ఎందుకంటే వారు మృతుని అభీష్టాలను గౌరవించే అవకాశముంది. అంత్యక్రియలను ఎక్కడ, ఎలా జరిపించాలి, దాన్ని జరిపించే బాధ్యతలు ఎవరు తీసుకోవాలి వంటి ప్రాముఖ్యమైన వివరాలను రాసిపెట్టాలి. (ఆది. 50:⁠5) సాక్షుల సమక్షంలో సంతకం చేసిన దస్తావేజు తయారుచేసుకుంటే ఇంకా మంచిది. ముసలివాళ్లైన తర్వాత లేదా ఏదో ఒక ప్రాణాంతక వ్యాధి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించవచ్చులే అని బైబిలు సూత్రాలకు అనుగుణంగా పరిజ్ఞానంతో, వివేకంతో భవిష్యత్తు గురించి ఆలోచించేవారు అనుకోరు.​—⁠సామె. 22:3; ప్రసం. 9:⁠12.

అంత్యక్రియల గురించి రాసిపెట్టుకోవడం కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించింది. అయితే, అలా చేయడం ద్వారా మనం క్రైస్తవ పరిణతిగలవారమని, మనకు ఇతరులపట్ల ప్రేమా, శ్రద్ధా ఉన్నాయని చూపిస్తాం. (ఫిలి. 2:⁠4) అంత్యక్రియలప్పుడు దుఃఖంలో మునిగివున్న కుటుంబ సభ్యులు మీరు ఇష్టపడని, నమ్మని అపవిత్రమైన ఆచారాలు పాటించేలా చేసే అవిశ్వాస బంధువుల ఒత్తిడికి తలొగ్గకుండా ఉండాలంటే మీరే పరిస్థితులను చక్కబెట్టేవిధంగా చర్యలు తీసుకోవడం ఎంతో మంచిది.

అంత్యక్రియలు మర్యాదకరంగా ఉండేలా చూడండి

ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో పూర్వీకుల ఆత్మలకు కోపం తెప్పించకుండా ఉండాలంటే అంత్యక్రియలు చాలా గొప్పగా, ఆర్భాటంగా ఉండాలని చాలామంది నమ్ముతారు. మరి కొంతమంది సమాజంలో తమకున్న హోదాని, తమ ఆర్థిక స్తోమతను ‘డంబంగా’ ప్రదర్శించడానికి ఆ సందర్భాలను ఉపయోగించుకుంటారు. (1 యోహా. 2:16) మృతుల అంత్యక్రియలను, జ్ఞాపకార్థాన్ని ప్రజలకు “సరైనది” అనిపించేలా నిర్వహించడానికి ఎంతో సమయాన్ని, శక్తిని, డబ్బును ధారపోస్తారు. అంత్యక్రియలకు చాలామందిని ఆకర్షించేలా మృతుని ఫోటోవున్న పెద్దపెద్ద పోస్టర్లను వివిధ ప్రాంతాల్లో అంటించి బహిరంగంగా ప్రచారం చేస్తారు. అంత్యక్రియలకు వచ్చేవారు వేసుకునేందుకు చనిపోయిన వ్యక్తి ఫోటోవున్న టీ-షర్టులను తయారుచేయిస్తారు. చూపరులను ఆకట్టుకునే విధంగా ఆర్భాటమైన, ఖరీదైన శవపేటికలను కొంటారు. ఒకానొక ఆఫ్రికా దేశంలోనైతే కొందరు తమ సంపదను, వైభవాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శించడానికి కార్లు, విమానాలు, పడవలు, మరితర వస్తువుల్లా కనిపించే శవపేటికను కూడ తయారుచేయిస్తారు. అంతటితో ఊరుకోకుండా శవాన్ని శవపేటిక నుండి బయటికి తీసి ప్రత్యేకంగా అలంకరించబడిన మంచంమీద ప్రదర్శిస్తారు. స్త్రీలు చనిపోతే మృతదేహానికి పెళ్లినాటి తెల్లని వస్త్రాలను ధరింపజేసి, పెద్ద మొత్తంలో ఆభరణాలను, పూసల దండను పెట్టి అలంకరిస్తారు. అలాంటి ఆచారాల్లో పాల్గొనడం దేవుని ప్రజలకు తగినదేనా?

దేవుని సూత్రాలు తెలియని, వాటిని పట్టించుకోని ప్రజలు ఆచరించే విపరీతమైన ఆచార అలవాట్లు ఎందుకు పాటించకూడదో పరిణతిగల క్రైస్తవులు గుర్తిస్తారు. అమర్యాదకరమైన, లేఖనరహితమైన ఆచారాలు, అలవాట్లు ‘తండ్రివలన పుట్టినవి కావు, గానీ గతించిపోతూ ఉన్న లోకసంబంధమైనవే’ అని మనకు తెలుసు. (1 యోహా. 2:​15-17) అంత్యక్రియలు ఇతరుల కన్నా ఆర్భాటంగా చేయాలనే పోటీతత్వం క్రైస్తవులకు తగనిది. అలాంటి పోకడలకు పోకుండా మనం ఎంతో జాగ్రత్తపడాలి. (గల. 5:26) స్థానిక సంస్కృతిలో చనిపోయినవారి గురించిన భయం ప్రజల్లో నాటుకొనిపోయుంటే అంత్యక్రియలు సాధారణంగా డాబుగా జరిపిస్తారని, ఎక్కువమంది రావడంవల్ల పర్యవేక్షణ కష్టమై అది త్వరగా అదుపుతప్పుతుందని అనుభవాలు చెబుతున్నాయి. మృతదేహాన్ని పూజిస్తే అవిశ్వాసులు అదుపుతప్పి ప్రవర్తించవచ్చు. వారు అంత్యక్రియల్లో బిగ్గరగా, భోరుమని విలపించడం, మృతదేహాన్ని ఆలింగనం చేసుకోవడం, అది బ్రతికున్నట్లు దానితో మాట్లాడడం, డబ్బులు, ఇతర వస్తువులతో దండలు వేయడం వంటివి చేయవచ్చు. క్రైస్తవ అంత్యక్రియల్లో ఇలాంటవి జరిగితే అది యెహోవా నామానికి, ఆయన ప్రజలకు ఎంతో అవమానాన్ని తీసుకువస్తుంది.​—⁠1 పేతు. 1:​14-16.

చనిపోయినవారి స్థితి గురించిన సరైన అవగాహన ఉంటే అంత్యక్రియలప్పుడు లోకానికి సంబంధించిన ఎలాంటి ఆచారాన్నైనా పాటించకుండా ఉండడానికి కావాల్సిన ధైర్యాన్ని కూడగట్టుకోగలుగుతాం. (ఎఫె. 4:​17-19) భూమ్మీద జీవించినవారందరిలో యేసు ఎంతో గొప్పవాడు, అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అయినప్పటికీ ఎలాంటి ఆర్భాటం లేకుండా సామాన్య రీతిలో సమాధిచేయబడ్డాడు. (యోహా. 19:​40-42) ‘ప్రభువు మనస్సుగలవారు’ అలాంటి సామాన్య అంత్యక్రియలు అవమానకరమైనవని అనుకోరు. (1 కొరిం. 2:16) లేఖనవిరుద్ధమైన అపవిత్రమైన ఆచారాలు ఆచరించకుండా దేవుణ్ణి ప్రేమించేవారికి తగినట్లు గౌరవపూర్వకంగా, ఇతరులు మెచ్చుకునే విధంగా ప్రశాంత వాతావరణంలో అంత్యక్రియలు జరపాలంటే క్రైస్తవులు వాటిని ఏ ఆర్భాటం లేకుండా, మర్యాదకరంగా చేయడమే ఉత్తమం.

వేడుకలు జరుపుకోవాలా?

అంత్యక్రియల తర్వాత చాలామంది బంధువులు, పొరుగువారు, మరితరులు ఒక దగ్గర చేరి విందులు చేసుకోవడం, పెద్ద వాల్యూమ్‌ పెట్టుకొని డాన్స్‌ చేయడం ఆచారం కావచ్చు. సాధారణంగా అలాంటి సమయాల్లో కొంతమంది తప్పతాగి లైంగిక దుర్నీతికి పాల్పడతారు. అలా సరదాగా గడిపితే తమ బాధను మరిచిపోవచ్చని వారు చెబుతారు. మరికొందరు అది కేవలం తమ సంస్కృతిలో భాగమని అనుకుంటారు. అయితే, ఆచారం ప్రకారంగా, చనిపోయినవారిని గౌరవించి స్తుతించడానికీ, వారి ఆత్మలు పూర్వీకులతో కలవడానికీ అలా సరదాగా గడపాలని చాలామంది నమ్ముతారు.

నిజ క్రైస్తవులు ఈ లేఖనంలోని ప్రోత్సాహం ఎంత జ్ఞానయుక్తమైందో గ్రహిస్తారు: “నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును.” (ప్రసం. 7:⁠3) అంతేకాక, మన జీవితం ఎంత చిన్నదనేదాని గురించీ, పునరుత్థాన నిరీక్షణ గురించీ ప్రశాంతంగా ఆలోచించడంవల్ల ప్రయోజనాలున్నాయని వారికి తెలుసు. యెహోవాతో బలమైన వ్యక్తిగత సంబంధం కలిగివుండేవారు ‘తమ జన్మ దినముకంటె మరణదినమే మేలు’ అని అనుకుంటారు. (ప్రసం. 7:⁠1) అంత్యక్రియలప్పుడు సరదాగా గడపడం అభిచార క్రియలకూ, లైంగిక దుర్నీతికీ సంబంధించింది కాబట్టి అలాంటి వేడుకలను నిజ క్రైస్తవులు అసలు ఏర్పాటు చేయకూడదు లేదా హాజరుకాకూడదు. వాటిలో పాల్గొంటే దేవుణ్ణి అవమానపరుస్తాం, తోటి యెహోవా ఆరాధకుల మనస్సాక్షిని అగౌరవపరుస్తాం.

ఇతరుల నుండి వేరుగా ఉన్నామని గుర్తించేలా చేయండి

చనిపోయినవారి విషయంలో సామాన్యంగా ఉండే అనవసరమైన భయాలనుండి స్వతంత్రులైనందుకు మనం ఎంతో సంతోషిస్తాం. (యోహా. 8:32) “వెలుగు” సంబంధులముగా మనకున్న ఆధ్యాత్మిక అవగాహనకు అనుగుణంగా బాధను, దుఃఖాన్ని కనబరుస్తాం, అంటే పునరుత్థాన నిరీక్షణతో బలపర్చబడి మర్యాదకరంగా, గౌరవపూర్వకంగా ప్రవర్తిస్తాం. (ఎఫె. 5:8; యోహా. 5:​28, 29) “నిరీక్షణలేని” వారిలా విపరీతంగా దుఃఖాన్ని వ్యక్తం చేయకుండా ఉండేందుకు మనకు ఆ నిరీక్షణ దోహదపడుతుంది. (1 థెస్స. 4:13) మనుష్యుల భయానికి లోనుకాకుండా స్వచ్ఛారాధన విషయంలో ఇతరుల ఒత్తిడికి తలొగ్గకుండా ఉండేందుకు అది దోహదపడుతుంది.​—⁠1 పేతు. 3:​13, 14.

బైబిలు సూత్రాలకు నమ్మకంగా లోబడడంవల్ల “దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో” ప్రజలు గ్రహించగలుగుతారు. (మలా. 3:18) అసలు మరణమే లేని రోజొకటి వస్తుంది. (ప్రక. 21:⁠4) ఆ గొప్ప వాగ్దాన నేరవేర్పు కోసం వేచివుండగా మనం యెహోవా దృష్టిలో నిష్కళంకులముగా, నిందారహితులముగా ఉంటూ ఈ దుష్టలోకం నుండి, దేవుణ్ణి అవమానపరిచే ఆచారాల నుండి పూర్తి వేరుగా ఉందుము గాక.​—⁠2 పేతు. 3:⁠14.

[30వ పేజీలోని చిత్రం]

అంత్యక్రియల ఏర్పాట్ల విషయంలో మన వ్యక్తిగత అభీష్టాలను రాసిపెట్టుకోవడం జ్ఞానయుక్తం

[31వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ అంత్యక్రియలు మర్యాదకరంగా, గౌరవపూర్వకంగా ఉండాలి