ప్రసంగి 9:1-18

  • అందరికీ పట్టే గతి ఒక్కటే (1-3)

  • మరణం ఉన్నా సంతోషంగా జీవించడం (4-12)

    • చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు (5)

    • సమాధిలో ఏ పనీ ఉండదు (10)

    • అనుకోని సమయాల్లో, అనుకోని ​సంఘటనలు (11)

  • తెలివిని అన్నిసార్లూ గుర్తించరు (13-18)

9  కాబట్టి నేను ఇదంతా పరిశీలించి ఒక ముగింపుకు వచ్చాను: నీతిమంతులు, తెలివి​గలవాళ్లు, తమ పనులతో సహా సత్యదేవుని చేతిలో ఉన్నారు.+ తాము పుట్టకముందు ఎంత ప్రేమ, ద్వేషం ఉన్నాయో మనుషులకు తెలీదు.  నీతిమంతులకు, దుష్టులకు;+ మంచివాళ్లకు, పవిత్రులకు, అపవిత్రులకు; బలి అర్పించేవాళ్లకు, బలి అర్పించనివాళ్లకు అందరికీ పట్టే గతి ఒక్కటే.+ మంచివాడికి, పాపం చేసే​వాడికి; ఆలోచించకుండా ఒట్టేసేవాడికి, ఒట్టేసే ​విషయంలో జాగ్రత్తగా ఉండేవాడికి పట్టే గతి ఒక్కటే.  సూర్యుని కింద జరిగే ఈ విషయం దుఃఖకరమైనది: మనుషులందరికీ పట్టే గతి ఒక్కటే+ కాబట్టి, వాళ్ల హృదయాలు కూడా ​చెడుతనంతో నిండిపోయాయి. బ్రతికినన్ని రోజులు వాళ్ల హృదయాల్లో ​వెర్రితనం ఉంటుంది, ఆ తర్వాత వాళ్లు చనిపోతారు!  బ్రతికున్నవాళ్లకు ఆశ ఉంటుంది, ఎందుకంటే చనిపోయిన సింహం కన్నా బ్రతికున్న కుక్కే మేలు.+  బ్రతికున్నవాళ్లకు తాము ​చనిపోతామని తెలుసు,+ కానీ చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు,+ వాళ్లకు ఇక ఏ ప్రతిఫలమూ* ఉండదు; ప్రజలు వాళ్లను ఇక గుర్తుచేసుకోరు.+  అంతేకాదు వాళ్ల ప్రేమ, వాళ్ల ద్వేషం, వాళ్ల అసూయ నశించిపోయాయి; సూర్యుని కింద జరిగేవాటిలో వాళ్లకు ఇక ఏ వంతూ ఉండదు.  వెళ్లి సంతోషంగా భోజనం చేయి, ఉల్లాస హృదయంతో ద్రాక్షారసం తాగు,+ ఎందుకంటే సత్యదేవుడు ఇప్పటికే నీ పనుల్ని బట్టి సంతోషించాడు.+  నీ బట్టలు ఎప్పుడూ తెల్లగా ఉండాలి,* నీ తలకు నూనె రాసుకోవడం మర్చిపోకు.+  నీ కొద్దిపాటి* జీవితంలో నువ్వు బ్రతికినన్ని రోజులు నువ్వు ప్రేమించే నీ భార్యతో సంతోషంగా గడుపు;+ సూర్యుని కింద దేవుడు నీకు ఇచ్చిన ఈ వ్యర్థమైన జీవితమంతా అలాగే గడుపు. ఎందుకంటే జీవితంలో అదే నీ వంతు, సూర్యుని కింద నువ్వు పడే ప్రయాసకు అదే నీ బహుమతి. 10  నువ్వు చేయగలిగిన ఏ పనైనా నీ పూర్తి శక్తితో చేయి, ఎందుకంటే నువ్వు వెళ్లే సమాధిలో* పని గానీ, ఉపాయం గానీ, జ్ఞానం గానీ, తెలివి గానీ ఉండదు.+ 11  నేను సూర్యుని కింద మరో విషయం చూశాను: వేగం గలవాళ్లు ​అన్నిసార్లూ పందెంలో గెలవరు, బలవంతులు అన్నిసార్లూ యుద్ధంలో గెలవరు,+ తెలివిగలవాళ్లకు అన్నిసార్లూ ఆహారం దొరకదు, మేధావులకు అన్నివేళలా ​సంపదలు ఉండవు,+ జ్ఞానం గలవాళ్లు అన్నిసార్లూ విజయం సాధించరు;+ ఎందుకంటే అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు వాళ్లందరికీ ఎదురౌతాయి. 12  తన సమయం ఎప్పుడు వస్తుందో మనిషికి తెలీదు.+ చేపలు వలలో చిక్కుకు​న్నట్టే, పక్షులు ఉచ్చులో చిక్కుకున్నట్టే, హఠా​త్తుగా తమ మీదికి విపత్తు వచ్చినప్పుడు మనుషులు దానిలో చిక్కుకుంటారు. 13  సూర్యుని కింద నేను తెలివి గురిం​చిన ఈ విషయాన్ని కూడా గమనించాను, అది నన్ను ముగ్ధుణ్ణి చేసింది: 14  కొద్దిమంది ప్రజలే ఉన్న ఒక చిన్న నగరం ఉంది; శక్తిమంతుడైన ఒక రాజు దానిమీదికి వచ్చి, దాన్ని చుట్టుముట్టి, చుట్టూ పెద్ద పెద్ద ముట్టడిది​బ్బలు కట్టాడు. 15  ఆ నగరంలో, పేదవాడే అయినా తెలివి​గల ఒకతను ఉన్నాడు; అతను తన తెలివితో ఆ నగరాన్ని కాపాడాడు. అయితే ఆ పేదవాణ్ణి ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు.+ 16  అప్పుడు నేను ఇలా అనుకున్నాను: ‘బలం కన్నా తెలివి మేలు;+ అయితే పేదవాడి తెలివిని ప్రజలు నీచంగా చూస్తారు, అతని మాటల్ని పట్టిం​చుకోరు.’+ 17  తెలివితక్కువవాళ్లను పరిపాలించేవాడి కేకలు వినడం కన్నా తెలివిగలవాడు మెల్లగా మాట్లాడే మాటలు వినడం మేలు. 18  యుద్ధ ఆయుధాల కన్నా తెలివి మేలు, అయితే ఒక్క పాపి ఎంతో మంచిని పాడుచేయగలడు.+

అధస్సూచీలు

లేదా “జీతమూ.”
అంటే, సంతోషాన్ని వ్యక్తం చేసే ప్రకాశవంతమైన బట్టలు; దుఃఖవస్త్రాలు కాదు.
లేదా “వ్యర్థ.”
లేదా “షియోల్‌లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.