కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు మీ వ్యక్తిగత అభీష్టాలకే ప్రాముఖ్యతనిస్తున్నారా?

మీరు మీ వ్యక్తిగత అభీష్టాలకే ప్రాముఖ్యతనిస్తున్నారా?

మీరు మీ వ్యక్తిగత అభీష్టాలకే ప్రాముఖ్యతనిస్తున్నారా?

ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. వారిలో ఒక పిల్లవాడు తనకు ఇష్టమైన ఆటబొమ్మను మరో పిల్లవాని దగ్గరి నుండి లాక్కొని “ఇది నాది!” అని అరచి గీపెడతాడు. అపరిపూర్ణ మానవులు చిన్న వయసు నుండే కొంతమేరకు స్వార్థాన్ని చూపిస్తారు. (ఆది. 8:21; రోమా. 3:23) అంతేకాక, లోకం కూడ స్వార్థాన్ని పెంచి పోషిస్తోంది. మనం అలా ప్రవర్తించకూడదంటే మనలోని స్వార్థపూరిత ఆలోచనలకు వ్యతిరేకంగా గట్టి పోరాటం చేయాలి. అలా చేయకపోతే మనం తరచూ ఇతరులను అభ్యంతరపెట్టి, యెహోవాతో మన సంబంధాన్ని బలహీనపర్చుకుంటాం.​—⁠రోమా. 7:​21-23.

మనం చేసే పనులు ఇతరులమీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించమని ప్రోత్సహిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.” ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “అభ్యంతరము కలుగజేయకుడి.” (1 కొరిం. 10:​23, 32) కాబట్టి, వ్యక్తిగత అభీష్టాల విషయానికొస్తే మనం ఇలా ఆలోచించడం మంచిది: ‘సంఘ సమాధానానికి భంగం వాటిల్లే ప్రమాదమున్నప్పుడు నేను నా వ్యక్తిగత హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానా? నాకు కష్టమనిపించినా సరే బైబిలు సూత్రాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నానా?’

ఉద్యోగాన్ని ఎంపికచేసుకుంటున్నప్పుడు

ఉద్యోగ ఎంపిక అనేది వ్యక్తిగత విషయమనీ అది ఇతరులపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చనీ లేదా దాని ప్రభావం ఇతరులపై అసలు పడనే పడదనీ చాలామంది అనుకుంటారు. అయితే, దక్షిణ అమెరికాలో ఉన్న ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్న ఓ వ్యాపారి ఉదాహరణను చూద్దాం. ఆయనకు ఒకప్పుడు జూదగాడు, తాగుబోతు అనే చెడ్డ పేరు ఉండేది. అయితే, యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం ఆరంభించిన తర్వాత తాను నేర్చుకున్నవాటిని అన్వయించుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. (2 కొరిం. 7:⁠1) సంఘంతో కలిసి పరిచర్యలో పాల్గొనాలనుందని చెప్పినప్పుడు ఒక సంఘ పెద్ద ఆయనను నొప్పించకుండా తాను చేస్తున్న ఉద్యోగం ఎలాంటిదో ఆలోచించమని చెప్పాడు. ఎందుకంటే, ఆయనే ఆ పట్టణంలో చెరకు నుండి తీసిన మద్యాన్ని అమ్మే ముఖ్య పంపిణీదారుడు. దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ ఆ ప్రాంతంలోని ప్రజలు నశా కోసమే దాన్ని పానియాల్లో కలిపి తాగుతారు.

ఒకవైపు దాన్ని అమ్ముతూ మరోవైపు ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తే సంఘానికి చెడ్డ పేరు వస్తుందనీ, దానివల్ల దేవునితో తనకున్న సంబంధం కూడ దెబ్బతింటుందనీ ఆయన గుర్తించాడు. పెద్ద కుటుంబాన్ని పోషించే బాధ్యత తనమీదున్నా ఆయన ఆ వ్యాపారాన్ని మానేశాడు. ఆయన ఇప్పుడు కాగితపు ఉత్పత్తులను అమ్ముతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన, ఆయన భార్య, ఆయన ఐదుగురు పిల్లల్లో ఇద్దరు ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులు. వారు ధైర్యంతో సువార్తను ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు.

స్నేహితులను ఎంపికచేసుకుంటున్నప్పుడు

అవిశ్వాసులతో స్నేహం చేయడం వ్యక్తిగత విషయమా లేక ఈ విషయంలో బైబిలు సూత్రాలేవైనా ఉన్నాయా? దానిని తెలుసుకునేందుకు ఒక ఉదాహరణను చూద్దాం. నిజ క్రైస్తవుడు కాని ఓ యువకునితో పార్టీకి వెళ్లాలని ఒక సహోదరి అనుకుంది. ఇతరులు ఎంత చెప్పినా వినకుండా ఆ పార్టీకి వెళ్లే హక్కు తనకుందనుకొని అక్కడికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి ఆమెకు శక్తివంతమైన మత్తుపదార్థాన్ని కలిపిన పానీయాన్నిచ్చారు. ఎన్నో గంటలు తర్వాత మత్తునుండి తేరుకున్న ఆమె, తన స్నేహితుడని అనుకున్న వ్యక్తే తనను మానభంగం చేశాడని గుర్తించింది.​—⁠ఆదికాండము 34:2 పోల్చండి.

అవిశ్వాసులతో సహవసిస్తే ఎప్పుడూ అలాగే జరుగుతుందనేమీ లేదు. అయినా, బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామె. 13:20) చెడు సహవాసులను ఎంపిక చేసుకుంటే ప్రమాదంలో చిక్కుకుంటామనడంలో ఎలాంటి సందేహం లేదు. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు” అని సామెతలు 22:3 చెబుతోంది. స్నేహితులు మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి దేవునితో మన సంబంధాన్ని పాడుచేయగలరు.​—⁠1 కొరిం. 15:33; యాకో. 4:⁠4.

వస్త్రధారణ, కనబడే తీరు

దుస్తుల ఫ్యాషన్లు తరచూ మారుతుంటాయి. అయితే వస్త్రధారణ, కనబడే తీరు విషయంలో బైబిలు సూత్రాలు ఎన్నడూ మారవు. “అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేత . . . తమ్మును తాము అలంకరించుకొనవలెను” అని పౌలు స్త్రీలను ప్రోత్సహించాడు. ఆ సూత్రం పురుషులకు కూడ వర్తిస్తోంది. (1 తిమో. 2:​9, 10) సాదాసీదా బట్టలు ధరించాలని ఆయన చెప్పడంలేదు, అలాగని క్రైస్తవులందరూ ఒకేలాంటి దుస్తులు ధరించాలని ఆయన ప్రోత్సహించలేదు. అయితే, అణకువ విషయమేమిటి? అణకువ అంటే “గర్వం లేదా అహంభావానికి చోటు ఇవ్వకుండా ఉండడం . . . దుస్తులు, మాటలు లేదా ప్రవర్తన మర్యాదగా ఉండడం” అని ఒక నిఘంటువు నిర్వచిస్తోంది.

మనం ఈ విషయాలను ఆలోచించాలి: ‘ప్రత్యేకంగా కనిపించే విధంగా ఏ దుస్తులైనా ధరించే హక్కు నాకుందని నేను పట్టుబడితే నేను అణకువతో ఉన్నానని నిజాయితీగా చెప్పగలనా? నా వ్యక్తిత్వం లేదా నా నైతిక జీవితం విషయంలో ఇతరులకు తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా నేను దుస్తులు ధరిస్తున్నానా?’ “సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ” చూడడం లేదా పట్టించుకోవడం ద్వారా ఇతరులకు “ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక” ఉంటాం.​—⁠2 కొరిం. 6:3; ఫిలి. 2:⁠4.

వ్యాపార విషయాల్లో

కొరింథు సంఘంలో అన్యాయానికి లేదా మోసానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలు తలెత్తినప్పుడు పౌలు వారికి ఇలా రాశాడు: “అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?” క్రైస్తవులు సహోదరుణ్ణి న్యాయస్థానానికి తీసుకువెళ్లే బదులు, నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలని పౌలు సలహా ఇచ్చాడు. (1 కొరిం. 6:​1-7) అమెరికాలోని ఓ సహోదరుడు ఈ సలహాను గంభీరంగా తీసుకున్నాడు. ఆయన తన తోటి సహోదరుని దగ్గర పనిచేస్తున్నాడు. ఓ సందర్భంలో తనకు ఇవ్వాల్సిన జీతం విషయంలో ఆయనకూ ఆ సహోదరునికీ భేదాభిప్రాయం ఏర్పడింది. లేఖన నిర్దేశాలను అనుసరిస్తూ ఆ ఇద్దరు సహోదరులు అనేకసార్లు కలుసుకొని సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించారు. చివరగా, ఆ సమస్య పరిష్కారం కోసం “సంఘమునకు” ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘ పెద్దల దగ్గరికీ వెళ్లారు.​—⁠మత్త. 18:​15-17.

అయితే, విచారకరంగా వారు ఆ సమస్యను పరిష్కరించుకోలేకపోయారు. ఆ సమస్య గురించి ఎంతగానో ప్రార్థించిన తర్వాత ఆ సహోదరుడు తనకు రావాల్సిందాంట్లో పెద్ద మొత్తాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఆయన కొంతకాలం తర్వాత ఇలా చెప్పాడు: “దీనివల్ల నేను ఆనందంగా ఉండలేకపోయాను. ఆధ్యాత్మిక విషయాలకు ఉపయోగించగల అమూల్యమైన సమయాన్ని కోల్పోయాను.” ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత తాను మళ్లీ ఆనందంగా ఉండగలుగుతున్నానని, యెహోవా తన సేవను ఆశీర్వదిస్తున్నాడని ఆయనకు అనిపించింది.

చిన్నచిన్న విషయాల్లో కూడ

మన వ్యక్తిగత అభీష్టాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటే చిన్నచిన్న విషయాల్లో కూడ ఆశీర్వాదాలు పొందుతాం. జిల్లా సమావేశపు మొదటి రోజున, ఒక పయినీరు జంట తొందరగా వచ్చి తమకు ఇష్టమైన సీట్లలో కూర్చున్నారు. కార్యక్రమం ప్రారంభమైనప్పుడు చాలామంది పిల్లలున్న ఒక పెద్ద కుటుంబం హడావిడిగా నిండిపోయిన స్టేడియంలోకి వచ్చారు. ఆ కుటుంబం తగినన్ని సీట్ల కోసం వెతుకుతున్నారని గమనించి, ఆ జంట తమ సీట్లను వారికి ఇచ్చారు. దానివల్ల ఆ కుటుంబమంతా ఒకే దగ్గర కూర్చోగలిగారు. ఆ సమావేశం జరిగిన కొద్ది రోజులకు ఆ కుటుంబం తమ కృతజ్ఞతను తెలుపుతూ పయినీరు జంటకు ఓ ఉత్తరం రాశారు. సమావేశానికి ఆలస్యంగా రావడంతో తాము ఎంత నిరుత్సాహపడ్డారో వారు ఆ ఉత్తరంలో వివరించారు. పయినీరు జంట దయతో తమకు సీట్లు ఇవ్వడంవల్ల వారు తమ నిరుత్సాహమంతా మరచిపోయి ఆనందించారు. వారి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది.

మనకు అవకాశం దొరికినప్పుడు ఇతరుల కోసం మన అభీష్టాలను ఇష్టపూర్వకంగా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందాం. “స్వప్రయోజనమును” చూసుకోని విధంగా ప్రేమను కనబరచడం ద్వారా సంఘంలో సమాధానాన్ని కాపాడగలుగుతాం, మన పొరుగువారితో సమధానంగా ఉండగలుగుతాం. (1 కొరిం. 13:⁠5) అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, యెహోవాతో మన స్నేహాన్ని కాపాడుకోగలుగుతాం.

[20వ పేజీలోని చిత్రం]

ఫ్యాషన్ల విషయంలో మీరు మీ సొంత అభీష్టాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?

[20, 21వ పేజీలోని చిత్రం]

మీ సహోదరుల కోసం సీటు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?