ఆదికాండం 8:1-22
8 ఆ తర్వాత దేవుడు నోవహును, అతనితో పాటు ఓడలో ఉన్న అడవి జంతువులన్నిటినీ, సాధు జంతువులన్నిటినీ గుర్తుచేసుకున్నాడు.+ అప్పుడు దేవుడు భూమంతటా గాలి వీచేలా చేశాడు, దాంతో నీళ్లు తగ్గిపోసాగాయి.
2 అగాధ జలాల ఊటలు, ఆకాశ తూములు* మూయబడ్డాయి; ఆకాశం నుండి వర్షం కురవడం ఆగిపోయింది.+
3 అప్పుడు భూమ్మీదున్న నీళ్లు మెల్లమెల్లగా తగ్గిపోసాగాయి. 150 రోజుల తర్వాత నీటిమట్టం తగ్గింది.
4 ఏడో నెల, 17వ రోజున ఓడ అరారాతు పర్వతాల మీద ఆగింది.
5 పదో నెల వరకు నీళ్లు నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్నాయి. పదో నెల, మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయి.+
6 కాబట్టి 40 రోజులు గడిచాక నోవహు ఓడ కిటికీ+ తెరిచి,
7 ఒక కాకిని బయటికి పంపించాడు; భూమ్మీద నీళ్లు ఎండిపోయే వరకు అది బయట ఎగురుతూ, తిరిగొస్తూ ఉంది.
8 తర్వాత నోవహు, నేలమీద నీళ్లు తగ్గిపోయాయో లేదో తెలుసుకోవడానికి ఒక పావురాన్ని బయటికి పంపించాడు.
9 భూమంతటా ఇంకా నీళ్లు ఉండడంతో,+ వాలడానికి* ఎక్కడా చోటు లేక ఆ పావురం ఓడలో ఉన్న నోవహు దగ్గరికి తిరిగొచ్చింది. అప్పుడు నోవహు తన చెయ్యి బయటికి చాపి దాన్ని ఓడలోకి తీసుకున్నాడు.
10 అతను ఇంకో ఏడురోజులు ఆగి, మళ్లీ ఆ పావురాన్ని ఓడ బయటికి వదిలాడు.
11 సాయంత్రం కావస్తున్నప్పుడు ఆ పావురం అతని దగ్గరికి వచ్చింది, దాని నోట్లో అప్పుడే తెంపిన ఒక ఒలీవ ఆకు ఉంది! దాంతో, భూమ్మీద నీళ్లు తగ్గిపోయాయని+ నోవహుకు అర్థమైంది.
12 అతను మరో ఏడురోజులు ఆగి, మళ్లీ ఆ పావురాన్ని బయటికి వదిలాడు. ఈసారి అది అతని దగ్గరికి తిరిగిరాలేదు.
13 చివరికి 601వ సంవత్సరం,+ మొదటి నెల, మొదటి రోజున భూమ్మీది నీళ్లు ఇంకిపోయాయి; నోవహు ఓడ పైకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరిపోతూ ఉందని గమనించాడు.
14 రెండో నెల, 27వ రోజున భూమి పూర్తిగా ఆరిపోయింది.
15 అప్పుడు దేవుడు నోవహుతో ఇలా అన్నాడు:
16 “నువ్వు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్లు ఓడలో నుండి బయటికి రండి.+
17 అలాగే అన్నిరకాల ప్రాణులు భూమ్మీద విస్తరించి, పిల్లల్ని కని, వాటి సంఖ్య పెరిగేలా+ ఎగిరే ప్రాణుల్ని, జంతువుల్ని, భూమ్మీద పాకే జంతువులన్నిటినీ మీతోపాటు బయటికి తీసుకురండి.”+
18 కాబట్టి నోవహు తన కుమారులతో,+ భార్యతో, కోడళ్లతో కలిసి ఓడ బయటికి వచ్చాడు.
19 ప్రతీ ప్రాణి, పాకే ప్రతీ జంతువు, ఎగిరే ప్రతీ ప్రాణి, భూమ్మీద కదిలే ప్రతీది దానిదాని జాతి ప్రకారం ఓడ బయటికి వచ్చాయి.+
20 తర్వాత నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి,+ పవిత్రమైన జంతువులన్నిట్లో నుండి, పవిత్రమైన ఎగిరే ప్రాణులన్నిట్లో నుండి+ కొన్ని తీసుకొని వాటిని ఆ బలిపీఠం మీద దహనబలులుగా అర్పించాడు.+
21 అప్పుడు యెహోవా ఆ ఇంపైన* సువాసనను ఆఘ్రాణించడం మొదలుపెట్టాడు. కాబట్టి యెహోవా తన హృదయంలో ఇలా అనుకున్నాడు: “ఇంకెప్పుడూ నేను మనుషుల్ని బట్టి నేలను శపించను.+ మనిషి హృదయం చిన్నప్పటి నుండి చెడువైపే మొగ్గుచూపుతుంది;+ అంతేకాదు ఇప్పుడు చేసినట్టుగా ఇంకెప్పుడూ నేను ప్రతీ ప్రాణిని చంపను.+
22 ఇప్పటినుండి భూమ్మీద విత్తడం-కోయడం, చలి-వేడి, ఎండాకాలం-చలికాలం, పగలు-రాత్రి అనేవి ఎప్పటికీ ఉంటాయి.”+