కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా “వాక్కు” మిమ్మల్ని కాపాడనివ్వండి

యెహోవా “వాక్కు” మిమ్మల్ని కాపాడనివ్వండి

యెహోవా “వాక్కు” మిమ్మల్ని కాపాడనివ్వండి

సా.శ.పూ. 490లో, చారిత్రాత్మక మారథాన్‌ యుద్ధంలో, పదివేల నుండి ఇరవై వేలమంది ఎథీనియన్లు, లక్షమంది పర్షియా సైనికులను ఎదుర్కొన్నారు. గ్రీసు దేశస్థుల యుద్ధతంత్రంలో కీలకాంశం సేనావ్యూహమే, అంటే దగ్గరదగ్గరగా కూర్చబడిన పదాతిదళమే. ఆ సైనికులు ఒక చేతిలో డాలు మరో చేతిలో ఈటె పట్టుకుని దగ్గరదగ్గరగా కూర్చబడినట్లు ఒక పంక్తిలో నిలబడితే, అది ఒక దుర్భేద్యమైన గోడలా ఉండేది. దగ్గరదగ్గరగా కూర్చబడిన ఆ సేనావ్యూహం ఎథీనియన్లకు పర్షియన్ల విస్తారమైన సైన్యంపై సుప్రసిద్ధ విజయాన్ని తెచ్చిపెట్టింది.

నిజ క్రైస్తవులు ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నారు. వాళ్ళు శక్తిమంతమైన శత్రువులతో, అంటే ‘అంధకారసంబంధులగు లోకనాథులు, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములు’ అని బైబిలు వర్ణిస్తున్న ప్రస్తుత దుష్టవిధానపు అదృశ్య పరిపాలకులతో పోరాడుతున్నారు. (ఎఫెసీయులు 6:12; 1 యోహాను 5:​19) దేవుని ప్రజలు విజయం సాధించడంలో కొనసాగుతున్నారు, అయితే వారు తమ సొంత శక్తితో విజయం సాధించడంలేదు. దానికి ఘనత యెహోవాకే దక్కుతుంది, ఎందుకంటే “యెహోవా వాక్కు నిర్మలము. తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము” అని కీర్తన 18:30లో పేర్కొనబడినట్లుగా, ఆయనే వారిని కాపాడుతూ వారికి ఉపదేశిస్తున్నాడు.

అవును, యెహోవా పరిశుద్ధ లేఖనాల్లోని తన శుద్ధమైన “వాక్కు” ద్వారా యథార్థవంతులైన తన సేవకులను ఆధ్యాత్మిక హానినుండి కాపాడుతున్నాడు. (కీర్తన 19:7-11; 119:​93) దేవుని వాక్యంలో వెల్లడిచేయబడిన జ్ఞానం గురించి సొలొమోను ఇలా వ్రాశాడు: “జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును. దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.” (సామెతలు 4:6; ప్రసంగి 7:​12) దైవిక జ్ఞానము మనకు హాని జరగకుండా ఎలా కాపాడుతుంది? ప్రాచీన ఇశ్రాయేలు ఉదాహరణను పరిశీలించండి.

దైవిక జ్ఞానముచేత కాపాడబడిన ప్రజలు

యెహోవా ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులను జీవితంలోని ప్రతి అంశంలోనూ కాపాడి, నిర్దేశించింది. ఉదాహరణకు, ఆహారనియమం, పరిశుభ్రత, విడిగా ఉంచడం వంటివాటికి సంబంధించి ఇవ్వబడిన నియమాలు, ఇతర జనాంగాలను నాశనం చేసిన అనేక వ్యాధులనుండి వారిని కాపాడింది. 19వ శతాబ్దంలో సూక్ష్మక్రిముల గురించి తెలుసుకున్న తర్వాతే, విజ్ఞానశాస్త్రం దేవుని ధర్మశాస్త్రంలోని ప్రమాణాలను చేరుకోగలిగింది. భూమి యాజమాన్యం, తిరిగి కొనడం, రుణవిముక్తి, వడ్డీకి అప్పివ్వడం వంటివి సుస్థిరమైన సమాజానికి, న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు దోహదపడి ఇశ్రాయేలులో సామాజిక ప్రయోజనాలు చేకూరేలా చేశాయి. (ద్వితీయోపదేశకాండము 7:12, 15; 15:​4, 5) యెహోవా ధర్మశాస్త్రం ఇశ్రాయేలు నేల సారాన్ని కాపాడడానికి కూడా తోడ్పడింది. (నిర్గమకాండము 23:​10, 11) అబద్ధ ఆరాధనకు వ్యతిరేకంగా ఇవ్వబడిన ఆజ్ఞలు ప్రజలను ఆధ్యాత్మికంగా కాపాడి, వారిని దయ్యాల అణచివేత నుండి, పిల్లలను బలిగా అర్పించడం నుండి, ఇంకా అనేక చెడుకార్యాల నుండి తప్పించాయి, అంతేగాక మానవులు నిర్జీవమైన విగ్రహాల ఎదుట సాగిలపడే నీచమైన ఆచారం నుండి కూడా వారిని కాపాడాయి.​—⁠నిర్గమకాండము 20:3-5; కీర్తన 115:​4-8.

స్పష్టంగా, యెహోవా “వాక్కు” ఇశ్రాయేలీయులకు “నిరర్థకమైన మాటకాదు” అని నిరూపించబడింది, దాన్ని అనుసరించిన వారికి అది జీవాన్ని, సుదీర్ఘమైన ఆయుష్షును ఇచ్చింది. (ద్వితీయోపదేశకాండము 32:​47) క్రైస్తవులు ఇప్పుడిక ధర్మశాస్త్ర నిబంధన క్రింద లేకపోయినా, జ్ఞానయుక్తమైన యెహోవా మాటలను అనుసరించేవారికి నేడు కూడా అలాంటి ప్రయోజనమే చేకూరుతుంది. (గలతీయులు 3:24, 25; హెబ్రీయులు 8:⁠8) వాస్తవానికి, క్రైస్తవులను నడిపించడానికి, వారిని కాపాడడానికి వివిధ నియమాలుగల నియమావళికి బదులు వారికి వివిధ అంశాలపై ఎన్నో బైబిలు సూత్రాలు ఉన్నాయి.

సూత్రాలచేత కాపాడబడే ప్రజలు

నియమాలకు పరిమితమైన అన్వయింపే ఉండవచ్చు, అవి తాత్కాలికమైనవే అయ్యుండవచ్చు. అయితే, బైబిలు సూత్రాలు ప్రాథమిక సత్యాలు కాబట్టి, సాధారణంగా వాటికి విస్తృతమైన శాశ్వతమైన అన్వయింపు ఉంటుంది. ఉదాహరణకు, యాకోబు 3:17లో పేర్కొనబడిన సూత్రాన్ని పరిశీలించండి, పాక్షికంగా అదిలా ఉంది: “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది.” నేడు ఆ ప్రాథమిక సూత్రం దేవుని ప్రజలకు ఒక డాలులా ఎలా ఉపయోగపడగలదు?

పవిత్రంగా ఉండడమంటే నైతికంగా పరిశుభ్రంగా ఉండడమని అర్థం. కాబట్టి, పవిత్రతను విలువైనదిగా ఎంచేవారు కేవలం లైంగిక దుర్నీతినే కాదు, లైంగిక వ్యామోహం, అసభ్య చిత్రాలు వంటివాటితో సహా లైంగిక దుర్నీతికి నడిపే వాటికి కూడా దూరంగా ఉంటారు. (మత్తయి 5:​28) అదేవిధంగా, యాకోబు 3:17లోని సూత్రాన్ని గంభీరంగా తీసుకునేవారు, వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో సన్నిహితంగా మెలిగే జంటలు, మనసు అదుపు తప్పేలా చేసే చర్యలకు దూరంగా ఉంటారు. సూత్రాలను ప్రేమించేవారిగా, వారు వాస్తవంగా దేవుని నియమాలను అక్షరార్థంగా మీరనంత వరకూ తమ ప్రవర్తనను యెహోవా ఆమోదిస్తాడని అనుకుంటూ పవిత్రతను పోగొట్టుకునే ప్రలోభంలో పడిపోరు. యెహోవా “హృదయమును లక్ష్యపెట్టును” అని వారికి తెలుసు, వారు దానికి తగిన విధంగానే ప్రతిస్పందిస్తారు. (1 సమూయేలు 16:7; 2 దినవృత్తాంతములు 16:⁠9) అలాంటి జ్ఞానవంతులు, నేడు ప్రబలంగా ఉన్న లైంగిక వ్యాధుల నుండి తమ శరీరాన్ని కాపాడుకోవడమే కాక తమ మానసిక, భావోద్వేగ సంక్షేమాన్ని కూడా కాపాడుకుంటారు.

దైవిక జ్ఞానము “సమాధానకరమైనది” కూడా అని యాకోబు 3:⁠17 చెబుతోంది. సాతాను అమర్యాదకరమైన సాహిత్యం, చిత్రాలు, సంగీతం, కంప్యూటర్‌ గేమ్స్‌ వంటివాటి ద్వారా, కొంతమేరకు మన హృదయాల్లో దౌర్జన్య స్ఫూర్తిని నాటడం ద్వారా మనల్ని యెహోవాకు దూరం చేయడానికి ప్రయత్నిస్తాడని మనకు తెలుసు. ఈ వీడియో గేముల్లో కొన్ని, వాటిని ఆడుతున్న ఆటగాళ్ళు చెప్పలేనంత క్రూరత్వానికి, చిత్రహింసకు పాల్పడేలా పురికొల్పుతాయి. (కీర్తన 11:⁠5) అంతకంతకూ అధికమవుతున్న దౌర్జన్యపూరిత నేరాలవల్ల, సాతాను విజయం సాధిస్తున్నాడని స్పష్టమవుతోంది. అలాంటి నేరాల గురించి, కొన్ని సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ద సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ అనే వార్తాపత్రిక, “సీరియల్‌ కిల్లర్‌” అనే ఆంగ్ల పదాన్ని రూపొందించిన రాబర్ట్‌ రెస్లర్‌ చెప్పినదాన్ని ఉటంకించింది. 1970లలో తాను ఇంటర్వ్యూ చేసిన హంతకులు “నేటి ప్రమాణాలతో పోల్చితే ఎంతో అల్పంగా కనిపించే” అసభ్య లైంగిక చిత్రాల మూలంగా ఉద్రేకపరచబడ్డారని రెస్లర్‌ అన్నాడు. కాబట్టి రెస్లర్‌, “రాబోయే నూతన శతాబ్దంలో అనేక హత్యలు చేసే హంతకులు అధికమవుతారంటూ భవిష్యత్తుపట్ల నిరాశాజనక దృక్పథాన్ని” వ్యక్తం చేశాడు.

నిజానికి, ఆ వార్తాంశం ముద్రించబడిన కేవలం కొన్ని నెలల తర్వాత, ఒక వ్యక్తి స్కాట్‌లాండ్‌లోని డన్‌బ్లేన్‌లో ఒక కిండర్‌గార్టన్‌ పాఠశాలలో 16 మంది పిల్లల్ని, వాళ్ళ టీచరును తుపాకీతో కాల్చి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అది జరిగిన మరుసటి నెలలో, ఆస్ట్రేలియాకు చెందిన టాస్మేనియాలో ఉన్న పోర్ట్‌ ఆర్తర్‌ అనే ప్రశాంతమైన పట్టణంలో మరో ఉన్మాది 32 మందిని తుపాకీతో కాల్చి చంపాడు. ఇటీవలి సంవత్సరాల్లో అమెరికాలోని అనేక పాఠశాలల్లో సామూహిక వధ జరిగింది, దానితో అమెరికన్లు ‘ఇలా ఎందుకు జరుగుతోంది’ అని అడుగుతున్నారు. 2001 జూన్‌లో, ఒక ఉన్మాది జపాన్‌లోని ఒక పాఠశాలలోకి ప్రవేశించి ఒకటి, రెండు తరగతులు చదువుతున్న ఎనిమిదిమంది పిల్లలను చంపి, మరో 15 మందిని గాయపరచినప్పుడు జపాన్‌ ప్రపంచ వార్తాకథనాల్లోకి ఎక్కింది. ఖచ్చితంగా అలాంటి దుష్టకార్యాల వెనుకున్న కారణాలు సంక్లిష్టమైనవి, కానీ ప్రసారసాధనాల్లో ప్రసారమయ్యే దౌర్జన్యం ఆ దుష్టకార్యాలకు అంతకంతకూ దోహదపడే అంశంగా తయారవుతోంది. “కేవలం 60 సెకండ్ల వ్యాపార ప్రకటన ఎన్నో లాభాలను తెచ్చిపెట్టగలిగితే, అనేక కోట్లు వెచ్చించి తీసే రెండు గంటల సినిమా దృక్పథాలను ఖచ్చితంగా మార్చగలుగుతుంది” అని ఆస్ట్రేలియాకు చెందిన విలేఖరి ఫిలిప్‌ ఆడమ్స్‌ వ్రాశాడు. ఆసక్తికరంగా, పోర్ట్‌ ఆర్తర్‌లో హత్యలు చేసిన హంతకుడి ఇంట్లో పోలీసులు దౌర్జన్యపూరిత, అశ్లీల చిత్రాల 2,000 వీడియోలు స్వాధీనం చేసుకున్నారు.

బైబిలు సూత్రాలను హత్తుకుని ఉండేవారు, దౌర్జన్యంపట్ల కోరికను పెంచే అన్ని రకాల వినోదం నుండి తమ మనసులను, హృదయాలను కాపాడుకుంటారు. కాబట్టి, వారి ఆలోచనా విధానంలో, అభిలాషల్లో “లౌకికాత్మకు” ఎలాంటి స్థానమూ ఉండదు. బదులుగా, వారికి ‘దేవుని ఆత్మ నేర్పిస్తుంది,’ వారు సమాధానముతో సహా పరిశుద్ధాత్మ ఫలాలపట్ల ప్రేమను పెంచుకోవడానికి కృషి చేస్తారు. (1 కొరింథీయులు 2:12, 13; గలతీయులు 5:​22, 23) క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రోత్సాహకరమైన ధ్యానం ద్వారా వారు ఆ కృషి చేస్తారు. అంతేగాక వారు దౌర్జన్యపూరిత దృక్పథంగల వ్యక్తులతో సహవసించడాన్ని మానుకుని, తమలాగే యెహోవా శాంతియుతమైన నూతనలోకం కోసం ఆశించే వారితో సహవసించడానికి ఎంపిక చేసుకుంటారు. (కీర్తన 1:1-3; సామెతలు 16:​29) అవును, దైవిక జ్ఞానము ఎంతటి రక్షణనిస్తుందో కదా!

యెహోవా “వాక్కు” మీ హృదయాన్ని కాపాడనివ్వండి

యేసు అరణ్యంలో శోధించబడినప్పుడు, ఆయన దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉదాహరించడం ద్వారా సాతానును ఖండించాడు. (లూకా 4:​1-13) అయితే, ఆయన తనకున్న ప్రజ్ఞనంతా చూపించుకోవడానికి అపవాదితో వాదించలేదు. యేసు తనను తాను సమర్థించుకోవడానికి లేఖనాలను ఉపయోగించుకోవడం ద్వారా తన హృదయం నుండి మాట్లాడాడు, అందుకే ఏదెనులో ఎంతో బాగా పనిచేసిన సాతాను కుతంత్రం యేసు విషయంలో విఫలమైంది. మనం మన హృదయాన్ని యెహోవా వాక్కులతో నింపుకుంటే మన విషయంలో కూడా సాతాను కుతంత్రాలు విఫలమవుతాయి. మరేది హృదయంకంటే ప్రాముఖ్యం కాదు, ఎందుకంటే, “హృదయములోనుండి జీవధారలు బయలుదేరును.”​—⁠సామెతలు 4:​23.

అంతేగాక, మనం ఎల్లప్పుడూ మన హృదయాన్ని కాపాడుకోవడంలో కొనసాగాలి. సాతాను యేసును శోధించడంలో అరణ్యంలో విఫలమైనప్పటికీ అంతటితో ఆయనను విడిచిపెట్టలేదు. (లూకా 4:​13) అతడు మన యథార్థతను భంగపరచడానికి వివిధ కుతంత్రాలు ఉపయోగిస్తూ, మన విషయంలో కూడా అలాగే పట్టువిడువడు. (ప్రకటన 12:​17) కాబట్టి, దేవుని వాక్యంపట్ల ప్రగాఢమైన ప్రేమను వృద్ధి చేసుకోవడం ద్వారా యేసును అనుకరిద్దాం, అదే సమయంలో, పరిశుద్ధాత్మ కోసం జ్ఞానం కోసం ఎల్లప్పుడూ ప్రార్థిద్దాం. (1 థెస్సలొనీకయులు 5:17; హెబ్రీయులు 5:⁠7) యెహోవా తనను ఆశ్రయించేవారందరికీ ఏ విధమైన ఆధ్యాత్మిక హాని జరగదని వాగ్దానం చేస్తున్నాడు.​—⁠కీర్తన 91:1-10; సామెతలు 1:​33.

దేవుని వాక్యం సంఘాన్ని కాపాడుతుంది

ముందే ప్రవచించబడిన “గొప్ప సమూహము” మహా శ్రమలను తప్పించుకోకుండా సాతాను అడ్డగించలేడు. (ప్రకటన 7:​9, 14) ఏదేమైనా, కనీసం కొంతమందైనా యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయేలా క్రైస్తవులను భ్రష్టుపట్టించాలని అతడు పిచ్చిగా ప్రయత్నిస్తాడు. ఆ కుతంత్రం ప్రాచీన ఇశ్రాయేలులో పనిచేసి, సరిగ్గా వారు వాగ్దానదేశంలోకి ప్రవేశించబోయే ముందు 24,000 మంది మరణించడానికి కారణమైంది. (సంఖ్యాకాండము 25:​1-9) అయితే తప్పు చేసే క్రైస్తవులు నిజమైన పశ్చాత్తాపాన్ని చూపిస్తే, ఆధ్యాత్మికంగా పునరుద్ధరించబడేలా ప్రేమపూర్వక సహాయాన్ని పొందుతారు. కానీ పశ్చాత్తాపపడకుండా పాపం చేసే ప్రాచీనకాల జిమ్రీ వంటివారు ఇతరుల నైతిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి ప్రమాదం కలిగిస్తారు. (సంఖ్యాకాండము 25:​14) దగ్గరదగ్గరగా కూర్చబడిన పదాతిదళంలోని సైనికులు తమ డాళ్లను పడేసుకున్నట్లుగా, వారు తమకు మాత్రమే గాక తమ సహచరులకు కూడా హాని కలిగిస్తారు.

అందుకే బైబిలు ఇలా ఆజ్ఞాపిస్తోంది: “సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్న యెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనుకూడదు. . . . ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.” (1 కొరింథీయులు 5:​11, 13) ఈ జ్ఞానయుక్త “వాక్కు” క్రైస్తవ సంఘ నైతిక, ఆధ్యాత్మిక స్వచ్ఛతను కాపాడడానికి సహాయం చేస్తుందని మీరు అంగీకరించరా?

దీనికి పూర్తి భిన్నంగా, క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేక చర్చీలు అలాగే మతభ్రష్టులు, నైతికత విషయంలో ఆధునిక, స్వేచ్ఛాపూరిత దృక్పథాలకు వ్యతిరేకంగా ఉన్న బైబిల్లోని భాగాలను నిరర్థకమైనవిగా పరిగణిస్తున్నారు. అందుకే వాళ్ళు మతనాయకులు చేసినవైనా సరే, అన్ని రకాలైన ఘోరమైన పాపాలను క్షమిస్తున్నారు. (2 తిమోతి 4:​3, 4) అయితే, యెహోవా డాలువంటి “వాక్కు” గురించి ప్రస్తావిస్తున్న మరో వచనమైన సామెతలు 30:​5, తర్వాతి వచనమైన 6వ వచనం ఇలా ఆజ్ఞాపించడాన్ని గమనించండి: “[దేవుని] మాటలతో ఏమియు చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.” అవును, బైబిలుతో ఆటలాడుకునేవారు నిజానికి ఆధ్యాత్మిక అబద్ధికులు, వీరు అబద్ధికులందరిలోకి అతిపెద్ద దోషులు. (మత్తయి 15:​6-9) కాబట్టి దేవుని వాక్యాన్ని ఎంతో గౌరవించే సంస్థలో భాగంగా ఉన్నందుకు మనం నిజంగా కృతజ్ఞులుగా ఉందాం.

“సువాసన” మూలంగా కాపాడబడ్డారు

దేవుని ప్రజలు బైబిలు సూత్రాలను పాటిస్తూ, దానిలోని ఓదార్పుకరమైన సందేశాన్ని ఇతరులతో పంచుకుంటారు కాబట్టి, వారు యెహోవాకు సంతోషం కలిగించే ధూపం వంటి జీవ “సువాసన”ను వెదజల్లుతారు. అయితే అనీతిమంతులైన వ్యక్తులకు, ఆ సందేశాన్ని అందజేసేవారు జె.బి. ఫిలిప్స్‌ అనువాదం ప్రకారం, “నాశనానికి దారితీసే మరణకరమైన వాసన”ను వెదజల్లుతారు. అవును, దుష్టుల సూచనార్థక ఆఘ్రాణించే సామర్థ్యం సాతాను విధానంచే ఎంతగా వికృతం చేయబడిందంటే, వారు “క్రీస్తు సువాసన”ను వెదజల్లేవారి సమక్షంలో ఎంతో అసౌకర్యంగా, చివరికి ప్రతికూలంగా ఉన్నట్లు భావిస్తారు. మరోవైపున, ఆసక్తితో సువార్త వ్యాపింపజేస్తున్నవారు ‘రక్షింపబడువారి మధ్య క్రీస్తు సువాసనయై ఉంటారు.’ (2 కొరింథీయులు 2:​14-16) అలాంటి యథార్థహృదయులు తరచూ అబద్ధమత లక్షణాలైన వేషధారణను, మత సంబంధమైన అబద్ధాలను ఏవగించుకుంటారు. కాబట్టి, మనం దేవుని వాక్యాన్ని తెరిచి వారితో రాజ్య సందేశాన్ని పంచుకున్నప్పుడు, వారు క్రీస్తువైపు ఆకర్షించబడి, మరింత తెలుసుకోవాలనుకుంటారు.​—⁠యోహాను 6:​44.

కాబట్టి ఎవరైనా రాజ్య సందేశానికి ప్రతికూలంగా ప్రతిస్పందిస్తే నిరుత్సాహపడకండి. బదులుగా, “క్రీస్తు సువాసన”ను, హానికలిగించగల అనేకులను దేవుని ప్రజలు ఆస్వాదించే ఆధ్యాత్మిక స్థితి నుండి దూరంగా ఉంచి, అదే సమయంలో సహృదయులను దానివైపుకు ఆకర్షించే ఆధ్యాత్మిక రక్షణగా దృష్టించండి.​—⁠యెషయా 35:8, 9.

గ్రీకు సైనికులు మారథాన్‌లో తమ శక్తి అంతటితో తమ డాళ్ళను పట్టుకుని దగ్గరదగ్గరగా కూర్చబడి ముందుకుసాగారు కాబట్టే ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో సహితం విజయం సాధించారు. అలాగే, యెహోవా నమ్మకమైన సాక్షులకు వారి ఆధ్యాత్మిక యుద్ధంలో సంపూర్ణ విజయం లభిస్తుందని హామీ ఇవ్వబడింది, ఎందుకంటే అది వారి “స్వాస్థ్యము.” (యెషయా 54:​17) కాబట్టి, మనలో ప్రతి ఒక్కరం “జీవవాక్యమును” గట్టిగా “చేత పట్టుకొని” యెహోవాను ఆశ్రయించడంలో కొనసాగుదాం.​—⁠ఫిలిప్పీయులు 2:​16.

[31వ పేజీలోని చిత్రాలు]

‘పైనుండివచ్చు జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది’