కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ బాడీ లాంగ్వేజ్‌ మీ గురించి ఏమి చెబుతుంది?

మీ బాడీ లాంగ్వేజ్‌ మీ గురించి ఏమి చెబుతుంది?

మీ బాడీ లాంగ్వేజ్‌ మీ గురించి ఏమి చెబుతుంది?

బాడీ లాంగ్వేజ్‌లో ఒక వ్యక్తి ఇతరులతో సంభాషించడానికి ఉపయోగించే సంజ్ఞలు, కదలికలు హావభావాలు వంటివి ఉన్నాయి. మీ బాడీ లాంగ్వేజ్‌ ఏమి చెబుతుంది? అది గౌరవం, నమ్రత, ఆనందం వంటివాటి గురించి మాట్లాడుతుందా? లేక అది కోపాన్ని చిరాకును తెలియజేస్తుందా? చెప్పుకోదగినంత తీవ్రతనూ, అర్థాన్ని వ్యక్తపర్చిన భంగిమలను గురించిన, సంజ్ఞలను గురించిన లేఖనాలు బైబిలులో కోకొల్లలు. కొన్ని దేశాల్లోని ప్రజలు వేరే దేశాలవారికన్నా స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపర్చినప్పటికీ, అంతగా వెనుకంజ వేయకపోయినప్పటికీ బైబిలు కాలాల్లో ప్రజలు తమ వైఖరులను ఎలా వ్యక్తం చేసేవారో పరిశీలించడం ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు.

గౌరవప్రదమైన భంగిమ

యెహోవాకు ప్రార్థించగల్గడం ఒక ఆధిక్యత, అందుకు ప్రగాఢమైన గౌరవంతో కూడిన భంగిమ అవసరం. హెబ్రీయుల్లోను తొలి క్రైస్తవుల్లోను ఫలాని భంగిమలోనే ప్రార్థన చేయాలన్న నియమమేమీ లేదు. ముకుళిత హస్తాలతో ఉండాలనో లేదా చేతిలో చేయి వేసుకుని ఉండాలనో నియమం ఏమీ లేదు, అయితే వారు పాటించిన భంగిమలన్నీ ఎంతో గౌరవపూర్వకమైనవిగా ఉన్నాయి. ప్రార్థించేటప్పుడు నిల్చోవడం, మోకరించడం వంటి భంగిమలు సర్వసాధారణం; యేసు తన బాప్తిస్మం తరువాత నిలబడి ప్రార్థన చేసినట్లు అర్థమౌతుంది, గెత్సేమనే తోటలో ఆయన మోకాళ్ళూనాడు. (లూకా 3:​21, 22; 22:​41) నిలబడినప్పుడు లేక మోకాళ్ళూనినప్పుడు కొన్నిసార్లు చేతులు ఆకాశం తట్టు ఎత్తబడతాయి, అంటే వేడుకుంటున్నట్లుగా చేతులు పైకి చాచడమో లేక ముందుకు చాచడమో జరుగుతుంది. ఒక వ్యక్తి తన కళ్ళను లేదా ముఖాన్ని ఆకాశం తట్టు ఎత్తవచ్చు.​—⁠నెహెమ్యా 8:⁠6; మత్తయి 14:​19; యోబు 22:⁠26.

కొందరు విజ్ఞప్తిదారులు మోకాళ్ళూని తమ మడిమెలపై కూర్చుని, తలను వంచుతారు, ఎలీషా నేలమీద పడి తన ముఖాన్ని మోకాళ్ళమధ్య ఉంచుకున్నట్లుగా చేస్తారు. (1 రాజులు 18:​42) ఎంతో దుఃఖాక్రాంతులై ఉన్నప్పుడు లేక తీవ్రంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్న వ్యక్తి పూర్తిగా సాష్టాంగపడుతుండవచ్చు. అయితే ప్రార్థనలు నిష్కపటంగా ఉండాలని యేసు స్పష్టం చేశాడు; ఆడంబరంగా ఉండడాన్నీ ముఖంలోను శరీర భంగిమలోను లేని దైవభక్తిని ప్రదర్శించడాన్నీ ఆయన ఖండించాడు.

ఒకరిపట్ల ఒకరు గౌరవాన్ని వ్యక్తం చేసుకునేటప్పుడు, ప్రాముఖ్యంగా పై అధికారులకు విజ్ఞప్తి చేసుకునేటప్పుడు ప్రాచ్య దేశాలవారి భంగిమలు శరీరాకృతులు, మనం ప్రార్థన చేసేటప్పుడు ఉండే భంగిమలకు చాలా సమాంతరంగా ఉంటాయి. ఇతరులను వేడుకునేటప్పుడు మోకాళ్ళూనడానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మనకు కనబడతాయి. ఇది ఆ వ్యక్తిని ఆరాధిస్తున్నట్లుగా కాదు గానీ ఆయన స్థానాన్ని, లేదా అధికారాన్ని ప్రగాఢమైన గౌరవంతో గుర్తిస్తున్నట్లు అర్థం. (మత్తయి 17:​14) గౌరవాన్ని చూపించడం గురించి మనం లేఖనాల నుండి చాలా నేర్చుకోవచ్చు.

నమ్రతతో కూడిన భంగిమ

బైబిలు కాలాల్లో ఒక వ్యక్తి జోళ్ళ లేసులను విప్పడం, లేక జోళ్ళను మోయడం చాలా నీచమైన పనిగా, ఒకరి నమ్రతకు వ్యక్తీకరణగా, యజమానితో పోలిస్తే తాను అల్పుడన్న విషయాన్ని ఎరిగివున్నాడన్నదానికి వ్యక్తీకరణగా పరిగణించబడేది. ఒక వ్యక్తి చేతులపై నీళ్ళు పోయడమూ​—⁠అన్నం తిన్న తరువాత ఇలా చేయడం ఆవశ్యకం​—⁠కాళ్ళను కడగడమూ ఆతిథ్యంలో భాగంగా, గౌరవానికి నిదర్శనంగా, కొన్ని సంబంధాల్లో నమ్రతకు చిహ్నంగా చేయబడతాయి. ఎలీషా ఏలీయాకు పరిచారకునిగా లేక సేవకునిగా “ఏలీయా చేతులమీద నీళ్లుపో[సే]” వాడన్న వ్యక్తీకరణతో గుర్తించబడ్డాడు. (2 రాజులు 3:​11) ఆయన బాడీ లాంగ్వేజ్‌ నమ్రతతో కూడిన తన వైఖరిని ఖచ్చితంగా ప్రదర్శించింది. తన శిష్యులకు నమ్రత విషయంలోనూ, ఒకరికొకరు సేవచేసుకోవడం విషయంలోనూ ఒక పాఠాన్ని నేర్పించేందుకు యేసు వారి పాదాలను కడిగినప్పుడు, ఆయన ప్రాచ్య దేశాలకు చెందిన ఆ ఆచారాల్లో ఒకదాన్ని దృష్టాంతరీతిలో ఉపయోగించాడు.​—⁠యోహాను 13:3-10.

ఒక వ్యక్తి తన నడుంకి తువాలు కట్టుకోవడం కూడా సేవ చేసేందుకు నమ్రతతో సంసిద్ధంగా ఉన్నాడని చూపిస్తుంది. బైబిలు కాలాల్లో తాను వదులుగా వేసుకుని ఉన్న పై వస్త్రం తాను పనిచేయడం లేక పరిగెత్తడం లాంటివి చేస్తున్నప్పుడు అడ్డం రాకుండా ఉండేందుకు నడికట్టుతో లేక మొలనూలుతో బిగించే ఆచారాన్ని ఇది సూచిస్తుంది. పరస్పరాంగీకారంతో పనిచేయడంలో, కలిసి పాల్గొనడంలో అంటే కలిసి భాగంవహించడంలో నమ్రతను చూపించడమనేది చేతులు కలపడంతో, అంటే అవతలి వ్యక్తి చేతిని పట్టుకోవడంతో సూచించబడేది. (గలతీయులు 2:​8, 9) ఇద్దరు సహోదరులు చేతుల్ని బిగించి షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడం ఎంత హృదయరంజకంగా ఉంటుందో కదా!

విషాదం, సిగ్గు, కోపం

ప్రాచీన కాలాల్లో విశ్వసనీయులైన యెహోవా సేవకులు ఈ భావాల్ని బాహాటంగా వ్యక్తం చేశారు. తలలపై దుమ్ము ధూళి చల్లుకోవడం, వస్త్రాల్ని చింపుకోవడం, గోనె సంచి కట్టుకోవడం, ఎలుగెత్తి ఏడ్వడం, విచారంతో ముఖం వ్రేలాడేసుకోవడం, నేల మీదే కూర్చోవడం వంటి చర్యల ద్వారా దుఃఖం ప్రదర్శితమౌతుంది. (యోబు 2:​12, 13; 2 సమూయేలు 13:​19) గడ్డపు వెంట్రుకల్ని కత్తిరించుకోవడం లేక పెరికివేసుకోవడం, తలను కప్పుకోవడం, తలపై చేతులు వేసుకోవడం వంటివి దుఃఖాన్ని లేక సిగ్గును సూచిస్తాయి. (ఎజ్రా 9:⁠3; ఎస్తేరు 6:​12; యిర్మీయా 2:​37) తలపై చేతులు వేసుకోవడం అనేది విలపిస్తున్న వ్యక్తిపై దేవుని విపత్తు అనే బరువైన హస్తం ఉన్నదని సూచిస్తుందని కొందరు నమ్ముతారు. సత్యారాధకులు విషాదాన్ని లేక సిగ్గును తేలిగ్గా తీసుకోలేదు.

విచారమూ పశ్చాత్తాపమూ ఉపవాసం ద్వారా కూడా ప్రదర్శించబడ్డాయి. (2 సమూయేలు 1:​12; యోవేలు 1:​13, 14) యేసు భూమ్మీద ఉన్నప్పుడు వేషధారులు తమ “పవిత్రత”ను చూపించేసుకోవడానికి దుఃఖముఖులుగా నటిస్తూ తమ ముఖాల్ని వికారంగా మార్చేసుకుని ఉపవాసమున్నారు, కానీ తన శిష్యులు ఉపవాసం చేస్తున్నప్పుడు తండ్రి తమ హృదయాల్ని చూస్తాడన్న విషయాన్ని ఎరిగి వారు తమ తలల్ని అంటుకుని ముఖాల్ని కడుక్కోవాలని అలా వారు ఇతరులకు మామూలుగా ఉన్నట్లు కనబడతారని యేసు చెప్పాడు. (మత్తయి 6:​16-18) ఆధ్యాత్మిక విషయాలకు అవిభాగిత అవధానాన్ని ఇచ్చేందుకు గాను క్రైస్తవులు కొన్నిసార్లు ఉపవాసం ఉన్నారు.​—⁠అపొస్తలుల కార్యములు 13:2, 3.

మాటలతోపాటుగా వేర్వేరు సంజ్ఞలూ చర్యలూ కూడా కోపం, వైరం, తిరస్కృతి, అవమానం, ధిక్కారం, హేళన వంటి తీవ్రమైన భావోద్వేగాల్ని వ్యక్తీకరించాయి. వీటిలో పెదవులతో సంజ్ఞలు చేయడం, తలను ఆడించడం, చేసైగలు చేయడం, చెంపమీద కొట్టడం, దుమ్ము ఎగరగొట్టడం, కాళ్ళతో నేలను తన్నడం వంటివి కూడా ఉన్నాయి. (యెహెజ్కేలు 25:⁠6; కీర్తన 22:⁠7; జెఫన్యా 2:​15; మత్తయి 5:​39; 2 సమూయేలు 16:​13) ఇవన్నీ తన ప్రత్యర్థికి గానీ, తాను ద్వేషించే శత్రువుకు గానీ, తనను అణగద్రొక్కే వ్యక్తికి గానీ జరిగిన చెరుపును చూసి ఆనందించడాన్ని సూచిస్తుండవచ్చు. క్రైస్తవులు పాపాలు చేసినట్లైతే, వాళ్లు తమ దుఃఖాన్ని ప్రదర్శించినప్పటికీ, తమ శరీర భంగిమలో తమ సిగ్గును చూపించినప్పటికీ, వారు అనియంత్రిత కోపాన్ని లేదా ధిక్కారాన్ని తమ బాడీ లాంగ్వేజ్‌ ప్రదర్శించడాన్ని నివారించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు.

స్నేహాన్ని ఆనందాన్ని ప్రదర్శించడం

స్నేహాన్ని బైబిలు ఎంతో హృదయరంజకంగా ప్రదర్శిస్తుంది. స్నేహం ముద్దు ద్వారాను, కొన్ని మరింత గొప్ప భావోద్వేగాలు కలిగిన సందర్భాల్లో కౌగిలించుకుని మెడపై ముద్దు పెట్టుకుని కన్నీళ్ళు విడవడం ద్వారా ప్రదర్శించబడింది. (ఆదికాండము 33:⁠4; అపొస్తలుల కార్యములు 20:​37, 38) యేసు భూమ్మీద ఉన్న కాలంలో ఆచరించబడిన ఒరిగి కూర్చుని భోజనం తినే పద్ధతిలో, ఒక వ్యక్తి రొమ్ముకు ఆనుకుని ఉండడమనేది వారి మధ్య ఉన్న ఆంతరంగిక స్నేహాన్ని లేదా అనుగ్రహాన్ని చూపించే ఒక వైఖరియై ఉంది; దీన్ని రొమ్ముకు ఆనుకునే స్థానం అని పిలిచేవారు. (యోహాను 13:​23, 25) లూకా 16:22, 23 లోని దృష్టాంతానికి ఈ ఆచారమే ఆధారం. అవతలి వ్యక్తి రొట్టెను ఆయనతోపాటు తినడం స్నేహానికీ ఆయనతో ఉన్న సమాధానానికీ సూచన. అటు తరువాత ఆయనకే హాని తలపెట్టడమనేది అతి ఘోరమైన ద్రోహంగా పరిగణించబడేది.​—⁠కీర్తన 41:⁠9.

చప్పట్లు కొట్టడం ద్వారానూ సంగీతంతోపాటు నాట్యం చేయడం వంటివాటి ద్వారానూ ఆనందం వ్యక్తం చేయబడేది. ద్రాక్షాల కోతకాలం వంటి సందర్భాల్లో పనిచేస్తున్నప్పుడు కేకలు వేయడం పాటలు పాడడం సంతోషానికీ కృతజ్ఞతతో కూడిన ఆనందానికీ వ్యక్తీకరణలుగా ఉన్నాయి. (కీర్తన 47:⁠1; న్యాయాధిపతులు 11:​34; యిర్మీయా 48:​33NW) నేడు సంతోషభరితులైన యెహోవా సేవకులు తమ అంతర్జాతీయ సహోదరత్వంలోని తమ స్నేహాలను ఎంతో అమూల్యంగా ఎంచుతారు, ‘యెహోవాయందు ఆనందించడంలో’ బలమొందుతారు, దేవునికి అత్యుత్సాహంతో పాటలు పాడతారు.

నడక, పరుగు

“నడవడం” అనే ఒక దృష్టాంతరూపమైన వ్యక్తీకరణకు “నోవహు దేవునితోకూడ నడచిన”ట్టుగా ఫలాని చర్యాగతిని అనుసరించడం అని అర్థం. (ఆదికాండము 6:⁠9) దేవునితో కూడ నడిచినవారు దేవుడు నిర్దేశించిన జీవిత మార్గాన్ని అనుసరించి ఆయన అనుగ్రహాన్ని పొందారు. ఇదే వ్యక్తీకరణను ఉపయోగిస్తూ క్రైస్తవ గ్రీకు లేఖనాలు దేవుని సేవకునిగా మారడానికి ముందు అటు తరువాత అనుసరించిన భిన్నంగా ఉన్న రెండు చర్యాగతులను చిత్రీకరిస్తున్నాయి. (ఎఫెసీయులు 2:​2, 10) అదేవిధంగా “పరుగెత్తడం” ఒక చర్యాగతిని సూచించడానికి ఉపయోగించబడింది. యూదాలోని ప్రవక్తలు తాను పంపించకపోయినా ‘పరుగెత్తారు’ అని దేవుడు చెప్పాడు; వారు ప్రవచనాత్మక జీవన విధానాన్ని అబద్ధంగా, అనధికారపూర్వకంగానే స్వీకరించారు. పౌలు క్రైస్తవ విధానాన్ని “పరుగెత్తడం” అని అభివర్ణించాడు. ఆయన దాన్ని బహుమానాన్ని గెలవడానికి నియమాల ప్రకారం ఒక వ్యక్తి పరుగెత్తాల్సిన పరుగుపందెంతో పోలుస్తున్నాడు.​—⁠యిర్మీయా 23:​21; 1 కొరింథీయులు 9:⁠24.

మన బాడీ లాంగ్వేజ్‌ ఎన్నెన్నో మాటల్ని మనం నోటితో చెప్పనవసరం లేకుండానే అది చెబుతుంది. అదెల్లప్పుడూ గౌరవాన్ని, నమ్రతగల వైఖరిని సూచిస్తూ, కోపాన్నీ చిరాకునూ కాక స్నేహాన్నీ ఆనందాన్ని చూపించును గాక. మనం ‘దేవునితో కూడ నడుస్తుండగా’ నిత్యజీవితపు పరుగుపందెంలో ‘పరుగెత్తడంలో’ మనం విజయాన్ని సాధిస్తాము.