కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కెన్యాలో అర్హులైనవారికోసం అన్వేషణ

కెన్యాలో అర్హులైనవారికోసం అన్వేషణ

కెన్యాలో అర్హులైనవారికోసం అన్వేషణ

కెన్యాలో ప్రకృతి సౌందర్యం అత్యద్భుతంగా ఉంటుంది. దట్టమైన అరణ్యాలతో, విస్తారమైన పచ్చిక బయళ్ళతో, మాడ్చేసే ఎండ కాసే ఎడారులతో, మంచును కప్పుకున్న పర్వతాలతో ఈ మనోహరమైన దేశం తనను తాను సింగారించుకుంది. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఖడ్గమృగాలకూ, పది లక్షల వైల్డెబీస్ట్‌లకూ ఈ దేశం ఆలవాలంగా ఉంది. జిరాఫీలు మందలు మందలుగా పచ్చిక బయళ్ళలో తిరుగాడుతుండడం కూడా మనకు కనిపిస్తుంది.

గగనవీధిలో గిరికీలు కొట్టే పక్షులు కూడా పుష్కలమే ఇక్కడ. ఎంతో ఎత్తుకి ఎగిరే శక్తివంతమైన గ్రద్దలు, తమ తీయటి గానాలతో గాలినే పరవశింపజేసే వేలాది గానపక్షులు మనకిక్కడ కానవస్తాయి. ఏనుగులు సింహాలు మాత్రం మనకు కనబడకుండాపోతాయా? కెన్యాలోని రమణీయ దృశ్యాలు వీనులవిందైన స్వరాలు తీపిగుర్తులే.

అయినా, ఈ సుందరమైన దేశమంతటా వినబడుతున్న స్వరం మరొకటుంది. అది ఒక నిరీక్షణా సందేశాన్ని ముక్తకంఠంతో వినిపిస్తున్న వేలాదిమందికి చెందిన స్వరం. (యెషయా 52:⁠7) వీరి స్వరాలు 40కి పైగా ఉన్న తెగల, భాషల వారిని చేరుతున్నాయి. ఈ భావంలో చెప్పాలంటే కెన్యా, ఆధ్యాత్మిక సౌందర్యంగల ప్రదేశం కూడా.

కెన్యాలోని అత్యధికులు మతంపట్ల మొగ్గుచూపుతుంటారు, ఆధ్యాత్మిక విషయాల్ని చర్చించడానికి సుముఖంగా ఉంటారు. అయినప్పటికీ మాట్లాడడానికి ప్రజల్ని కనుగొనడం ఒక సవాలుగా ఉంది, ఎందుకంటే అనేక ఇతర దేశాల్లా కెన్యా కూడా ఒక మార్పుకు లోనౌతుంది.

ఆర్థిక ఇబ్బందుల మూలంగా అనేకమంది తమ జీవన విధానాల్లో సర్దుబాట్లు చేసుకోవాల్సివచ్చింది. సాంప్రదాయికంగా స్త్రీలు గృహిణులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఆఫీసుల్లో పనిచేస్తూనో లేక రోడ్ల ప్రక్కన పండ్లు, కూరగాయలు, చేపలు, అల్లిన బుట్టలు వగైరా అమ్ముకుంటూనో కనిపిస్తారు. పురుషులు తమ కుటుంబాల్ని పోషించడానికి ప్రతి రోజు పొద్దుపోయేంత వరకు కాయకష్టం చేస్తూ ఉంటారు. చివరికి పిల్లలు కూడా తమ చిన్ని చేతులతో వేయించిన పల్లీల పొట్లాలు, ఉడకబెట్టిన గ్రుడ్ల పొట్లాలు పట్టుకుని వీధుల్లో వాటిని అమ్ముతూ కనిపిస్తారు. దీని మూలంగా పగటిపూట ఇండ్లల్లో కనబడే ప్రజలు తక్కువ. ఈ పరిస్థితి మూలంగా రాజ్య సువార్త ప్రచారకులు కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సివచ్చింది.

ఇండ్ల బయట ఉంటూ తమ దైనందిన కార్యకలాపాల్లో పాల్గొంటున్న ప్రజలు, అలాగే తమ స్నేహితులు, బంధువులు, తోటి పనివారు, వ్యాపారవేత్తల వంటివారిపై దృష్టి కేంద్రీకరించమని యెహోవాసాక్షుల సంఘాలకు సలహా ఇవ్వబడింది. దీనికి సహోదరులు ప్రతిస్పందించి, తమకు ప్రజలెక్కడ కనబడితే అక్కడ వారితో మాట్లాడసాగారు. (మత్తయి 10:​11) ఇలా తమ కార్యకలాపాల్ని విస్తృతం చేసుకున్న ప్రయత్నం ఫలితాల్ని సాధించిందా? సాధించింది! కొన్ని ఉదాహరణల్ని గమనించండి.

బంధువులు—⁠మనకు అతి సమీపస్థులైన పొరుగువారు

కెన్యా రాజధానియైన నైరోబీ జనాభా దాదాపు 30 లక్షలు. నగరానికి తూర్పువైపున పదవీ విరమణ చేసిన ఒక ఆర్మీ మేజర్‌ జనరల్‌ నివసిస్తున్నాడు. ఆయనకు యెహోవాసాక్షులంటే అంతగా పడదు, అయితే ఆయన కుమారుడు మాత్రం యెహోవాసాక్షి అన్న విషయం ఆయనకు మింగుడు పడడం లేదు. ఒక సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రిఫ్ట్‌ వ్యాలీని ఆనుకుని ఉన్న పట్టణమైన నాకూరూలో నివసిస్తున్న తన కుమారుడి ఇంటికి వెళ్ళాడు. తానక్కడ ఉన్నప్పుడు ఆయన కుమారుడు ఆయనకొక కానుక ఇచ్చాడు​—⁠అది నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం.* తండ్రి దాన్ని స్వీకరించి తిరుగు ప్రయాణం చేసి ఇంటికి వచ్చాడు.

ఇంటికి వచ్చింతర్వాత ఈ మాజీ ఆఫీసర్‌ ఆ పుస్తకాన్ని తన భార్యకిచ్చాడు, అది యెహోవాసాక్షులు ప్రచురించారన్న వాస్తవాన్ని ఆమె గ్రహించకనే దాన్ని చదవనారంభించింది. నెమ్మదిగా, బైబిలు సత్యం ఆమె హృదయాన్ని స్పృశించసాగింది, తరువాత ఆ సమాచారాన్ని ఆమె తన భర్తతో పంచుకుంది. జిజ్ఞాస కలిగి ఆయన కూడా దాన్ని చదవనారంభించాడు. దాన్ని ప్రచురించిందెవరో వారు గ్రహించిన తరువాత, యెహోవాసాక్షుల గురించి తమకన్నీ అబద్ధాలు చెప్పడం జరిగిందని వారొక ముగింపుకు వచ్చారు. దాంతో వారు స్థానిక సాక్షుల్ని సంప్రదించారు, ఒక బైబిలు అధ్యయనం ప్రారంభమైంది. జ్ఞానము పుస్తకాన్ని తాము సొంతగా చదివినప్పుడే వారికి పొగాకును వినియోగించడం అమ్మడం క్రైస్తవులకు తగదని వారు గ్రహించారు. (మత్తయి 22:​39; 2 కొరింథీయులు 7:⁠1) ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ దుకాణంలో ఉన్న సిగరెట్లన్నింటినీ నాశనం చేసేశారు. కొన్ని నెలల తరువాత బాప్తిస్మం పొందని ప్రచారకులుగా వారు అర్హులయ్యారు, అటు తరువాత త్వరలోనే ఒక జిల్లా సమావేశంలో బాప్తిస్మం పొందారు.

చెత్తకుప్పలో ఖజానా

దేశ రాజధాని ఉన్న జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా విసిరేసినట్లుగా గ్రామాలున్నాయి, వీటిలోని జనాభా లక్షల సంఖ్యలో ఉంటుంది. మట్టి, చెక్క, ఇనప సామాను, ఇనప రేకులు వంటివాటితో చేసిన ఇళ్ళు వరసగా ఉండడం కనిపిస్తుంది. కర్మాగారాల్లో పని దొరకనప్పుడు ప్రజలు కొత్త పనుల్ని కల్పించుకుంటారు. జూవా కాలీ (స్వాహిలిలో, “మండే సూర్యుడు”) కార్మికులు బయట ఎండలో కాయకష్టం చేస్తూ పాత కారు టైర్ల నుండి చెప్పుల్ని తయారు చేయడమో, పారేసిన డబ్బాల నుండి కిరోసిన్‌ దీపాల్ని తయారు చేయడమో చేస్తుంటారు. ఇంకా ఇతరులు చెత్తకుప్పల్లోను, చెత్త కుండీల్లోను కాగితాలు, డబ్బాలు, సీసాల్ని రీసైక్లింగ్‌ కోసం ఏరుకుంటూ ఉంటారు.

చెత్తకుప్పలో ఖజానా దొరుకుతుందా? తప్పకుండా! ఒక సహోదరుడు ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “తైలసంస్కారం లేకుండా మోటుగా కన్పించే ఒక దృఢకాయుడు, నిండా పారేసిన కాగితాలు పత్రికలు ఉన్న పెద్ద ప్లాస్టిక్‌ సంచీ భుజాన వేసుకుని మా అసెంబ్లీ హాలున్న గ్రవుండ్స్‌లోకి వచ్చాడు. నాతో తన పేరు విలియమ్‌ అని చెప్పి, ‘మీ దగ్గర తాజా కావలికోట పత్రికలు ఉన్నాయా?’ అనడిగాడు. నేను కాస్త గాబరాపడిపోయాను, అసలాయన ఉద్దేశమేమై ఉంటుందాని తికమక పడ్డాను. కావలికోట పత్రిక ప్రతులు ఐదు చూపించేసరికి ఒకదాని తరువాత మరోటి తిరగేసి, ‘నాకివన్నీ కావాలి’ అన్నాడు. నేనాశ్చర్యపోయాను, నా రూంలోకెళ్ళి మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని తీసుకువచ్చాను. * దాన్లోని పరదైసు చిత్రాన్ని చూపించి, ప్రజలతో ఉచితంగా బైబిలు అధ్యయనం చేస్తామని వివరించాను. నేనన్నాను: ‘విలియమ్‌, మీరు రేపు రాకూడదూ? మనం అధ్యయనం ప్రారంభిద్దాం.’” ఆయన మాట ప్రకారం వచ్చాడు!

“ఒక ఆదివారంనాడు ఆయన మొదటిసారి కూటానికి వచ్చాడు. ఆ రోజు నేను బహిరంగ ప్రసంగం ఇస్తున్నాను. విలియమ్‌ లోపలికి ప్రవేశించి అందరివైపూ కలియజూసి, ప్లాట్‌ఫారం మీదున్న నన్నూ చూసి, గిరుక్కున వెనక్కి తిరిగి హాలు బయటికి పరుగెత్తాడు. అటుతరువాత అడిగానాయన్ని ఎందుకలా చేశావని. బిడియపడుతూ, ‘అక్కడున్న వాళ్ళంతా చాలా నీటుగా ఉన్నారు. నాకు భయం వేసింది’ అన్నాడు.

“విలియమ్‌ తన అధ్యయనంలో పురోభివృద్ధి సాధిస్తుండగా బైబిలు సత్యం ఆయన జీవితాన్ని మార్చనారంభించింది. ఆయన స్నానం చేయనారంభించాడు, జుట్టు కత్తిరించుకుని, శుభ్రమైన నీటైన బట్టలు వేసుకుని కూటాలకు క్రమంగా హాజరుకానారంభించాడు. నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకం విడుదలైనప్పుడు మేము అందులోనుండి అధ్యయనం ప్రారంభించాము. ఈలోగా ఆయన దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో రెండు ప్రసంగాలు ఇచ్చాడు, త్వరలోనే బాప్తిస్మం పొందని ప్రచారకుడయ్యాడు కూడా. ప్రత్యేక సమావేశ దినాన బాప్తిస్మం పొందినప్పుడు ఆయన్ను నా ఆధ్యాత్మిక సహోదరునిగా ఆహ్వానించడం నాకెంతో ఉత్తేజాన్నిచ్చింది.”

విలియమ్‌ కావలికోట పత్రికలోని విలువను మొట్టమొదటిగా ఎక్కడ గుర్తించాడు? “చెత్తలో పారేసిన కాగితాల మధ్య నాకు కొన్ని కావలికోట పత్రికలు కన్పించాయి.” అవును, ఆయన ఆ అసాధారణమైన రీతిలో ఒక ఖజానాను కనుగొన్నాడు!

పనిస్థలంలో సాక్ష్యం

మన పనిస్థలంలో అనియత సాక్ష్యమిచ్చేందుకు మనకు లభ్యమయ్యే అవకాశాలను ఉపయోగించుకోవడానికి మనం ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామా? నైరోబీలోని ఒక సంఘంలో పెద్దగా ఉన్న జేమ్స్‌కు బైబిలు సత్యం అలానే దొరికింది. దాంతో ఆయన కూడా ఇతరులను సమీపించడానికి ఈ పద్ధతిలో నైపుణ్యం సాధించాడు. ఉదాహరణకు, ఒకసారి తన తోటి పనివాడు “యేసు రక్షించును” అనే మాటలున్న బ్యాడ్జి పెట్టుకుని ఆఫీసుకు రావడం జేమ్స్‌ గమనించాడు. సువార్తికుడైన ఫిలిప్పు మాదిరినే అనుసరిస్తూ జేమ్స్‌ ఆ తోటి పనివాడిని ఇలా అడిగాడు: “ఆ మాటలకు అర్థమేమిటో నీవు నిజంగా గ్రహిస్తున్నావా?” (అపొస్తలుల కార్యములు 8:​30) ఆ ప్రశ్న చక్కని సంభాషణకు దారితీసింది. ఒక బైబిలు అధ్యయనం ప్రారంభమైంది, ఆ వ్యక్తి అటుతరువాత బాప్తిస్మం తీసుకున్నాడు. ఇంకా ఇతరుల విషయంలో జేమ్స్‌ విజయాన్ని సాధించాడా? ఆయన్నే వివరించనివ్వండి:

“నేనూ టామ్‌ ఒకే కంపెనీలో పనిచేస్తున్నాము. మేమిద్దరమూ అప్పుడప్పుడు స్టాఫ్‌ బస్సులో కలిసి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు ఉదయం మేమిద్దరం కలిసి కూర్చున్నాము. నేను మన పుస్తకమొకటి చదువుతున్నాను, ఆ పుస్తకం ఆయనకు కూడా చక్కగా కనబడేలా చూసి పట్టుకుని ఉన్నాను. నేనాశించిన రీతిలోనే ఆయన అవధానం ఆకర్షించబడింది, నేను ఆనందంగా నా పుస్తకాన్ని అరువిచ్చాను. తాను చదివినదాన్ని బట్టి చాలా ఆకర్షితుడై బైబిలు అధ్యయనానికి సమ్మతించాడు. ఇప్పుడు ఆయనా ఆయన భార్య బాప్తిస్మం పొందిన యెహోవా సేవకులు.”

జేమ్స్‌ ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు: “మా కంపెనీలో మధ్యాహ్న భోజనం సమయంలో తరచూ చాలా ఆసక్తికరమైన సంభాషణలు జరుగుతాయి. అలాంటి సంభాషణల్లోనే వేర్వేరు సందర్భాలో నేను ఏఫ్రాయిమ్‌, వాల్టర్‌లను కలిశాను. నేనొక సాక్షినని వారిద్దరికీ తెలుసు. యెహోవాసాక్షులకు విరుద్ధంగా ఎందుకంత వైరీభావం ఉందో ఎఫ్రాయిమ్‌ తెలుసుకోవాలని ఆసక్తిని కనబరిచాడు. సాక్షులకూ ఇతర మతాలవారికీ ఉన్న తేడాలేమిటో తెలుసుకోవాలనుకున్నాడు వాల్టర్‌. నేనిచ్చిన లేఖనాధార జవాబులు వారిద్దర్నీ సంతృప్తిపరిచాయి, అధ్యయనానికి సమ్మతించారు. ఎఫ్రాయిమ్‌ త్వరితగతిన అభివృద్ధి సాధించాడు. కొంతకాలానికి ఆయనా ఆయన భార్యా తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకున్నారు. ఆయనిప్పుడు ఒక పెద్దగా సేవచేస్తున్నాడు, ఆయన భార్య రెగ్యులర్‌ పయినీరు. అయితే వాల్టర్‌కు మాత్రం ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఎదురైందంటే ఆయన తన అధ్యయన పుస్తకాన్ని విసిరిపారేశాడు. అయితే నేను పట్టువీడక ప్రయత్నించడంతో తన అధ్యయనాన్ని పునఃప్రారంభించాడు. ఆయన కూడా ఇప్పుడు పెద్దగా సేవచేయడమనే ఆధిక్యతలో ఆనందిస్తున్నాడు.” జేమ్స్‌ తన పనిస్థలంలో అనియతంగా సాక్ష్యమిచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకున్నందున మొత్తంగా 11 మంది నిజ క్రైస్తవులయ్యారు.

అత్యద్భుతమైన పరిణామం

విక్టోరియా సరస్సు ఒడ్డున ఉన్న ఒక కుగ్రామంలో ఒక వ్యక్తి అంత్యక్రియలకు బంధుమిత్రులు హాజరయ్యారు. అక్కడ శోకంతో విలపిస్తున్నవారిలో ఒక వృద్ధ సాక్షి కూడా ఉన్నారు. ఆయన డాలీ అనే ఒక స్కూలు టీచరుని సమీపించి, ఆమెకు చనిపోయినవారి స్థితిని గురించి, మరణం ఎన్నడూ ఉండకుండా తీసివేయాలనే యెహోవా సంకల్పం గురించీ వివరించారు. ఆమె అనుకూలంగా ప్రతిస్పందించడంతో ఆమెకిలా అభయాన్నిచ్చారాయన: “మీరు మీ స్వస్థలానికి వెళ్ళినప్పుడు, మా మిషనరీల్లో ఒకరు మీ దగ్గరికి వచ్చి మీకు బైబిలును బోధిస్తారు.”

డాలీ స్వస్థలం కెన్యాలో మూడవ అతిపెద్ద నగరం. అప్పట్లో అక్కడ కేవలం నలుగురు మిషనరీలు మాత్రమే సేవచేస్తున్నారు. నిజానికి ఈ మిషనరీల్లో ఎవరికీ డాలీని కలవమని ఆ వృద్ధ సహోదరుడు చెప్పలేదు. అలా జరిగి తీరుతుందని ఆయనకు సంపూర్ణ విశ్వాసం ఉందంతే. అలా జరగనే జరిగింది! స్వల్పకాల వ్యవధిలోనే ఒక మిషనరీ సహోదరి డాలీని కలిసి ఆమెతో అధ్యయనం ప్రారంభించింది. డాలీ ఇప్పుడు బాప్తిస్మం పొందింది, ఆమె చిన్న కూతురు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో తన పేరును నమోదు చేయించుకుంది, ఆమె ఇద్దరు కుమారులు బాప్తిస్మం పొందారు కూడా. ఆమె పయినీరు సేవా పాఠశాలకు కూడా హాజరై దానిద్వారా ఆనందాన్ని అనుభవించింది.

అభివృద్ధిపట్ల శ్రద్ధవహించడం

అనియత సాక్ష్యాన్ని నొక్కిచెప్పడం, కెన్యాలో వేలాదిమంది అదనంగా సువార్తను వినేలా చేసింది. ఇప్పుడు 15,000కు పైగా ప్రచారకులు అతి ప్రాముఖ్యమైన ఈ పనిలో బిజీగా ఉన్నారు, గత సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి 41,000కు పైగా హాజరయ్యారు. కెన్యా అంతటా తరచూ రాజ్య ప్రచారకుల సంఖ్యకు రెండింతలుగా కూటాల హాజరు ఉంటోంది. దీంతో మరిన్ని రాజ్యమందిరాల అవసరం ఏర్పడింది.

రాజ్యమందిరాలు అటు పెద్ద నగరాల్లోను ఇటు మారుమూల ప్రాంతాల్లోను నిర్మించబడుతున్నాయి. నైరోబీకి ఈశాన్యాన 320 కిలోమీటర్ల దూరంలో ఏకాకిగా ఉన్న, సాంబూరూ భాష మాట్లాడేవారు నివసించే పట్టణం వీటిలో ఒకటి. ఈ పట్టణానికి సాంబూరూ భాషలో “మిరుమిట్లుగొల్పే” అని అర్థమిచ్చే మారాలల్‌ అనే పేరు 1934 లో పెట్టబడింది, ఎందుకంటే అక్కడ ఉపయోగించబడిన మొట్టమొదటి ఇనుప రేకుతో చేసిన పైకప్పు ఎండలో మెరిసేది. 62 సంవత్సరాల తరువాత మారాలల్‌లో ఇనుప రేకుతో చేసిన పైకప్పుతో మరో బిల్డింగ్‌ నిర్మించబడింది. అది కూడా “మిరుమిట్లుగొల్పుతుంది” “మెరుస్తూంటుంది” ఎందుకంటే అది స్థానిక సత్యారాధన జరిగే స్థలం.

కెన్యాలోని మారుమూల ప్రాంతమైన ఈ ప్రదేశంలో మొట్టమొదటి రాజ్యమందిరాన్ని నిర్మించడానికి 15 మంది ప్రచారకులు అద్భుతమైన ప్రయత్నాన్ని చేశారు. నిధులు పరిమితంగా ఉన్నాయి, అందుకని సహోదరులు స్థానిక నిర్మాణ సామగ్రిపై ఆధారపడాల్సివచ్చింది. వాళ్ళు ఎర్రమట్టితో గోడల్ని కట్టి, నిలువైన దుంగల్ని అటూ ఇటూ వరసగా పాతారు. ఆవుపేడ బూడిద కలిపి ఈ గోడల్ని నున్నగా అలికారు, దాంతో సంవత్సరాల తరబడి నిలవగలిగే గోడలు తయారయ్యాయి.

నిర్మాణానికి దుంగల కోసం చెట్లను నరికేందుకు సహోదరులు అనుమతిని సంపాదించారు. కానీ వారికి దగ్గరగా ఉన్న అడవి ఎక్కడని చూస్తే అది పది కిలోమీటర్లవతల ఉంది. సహోదర సహోదరీలు ఆ అడవి వరకు నడిచి వెళ్లి చెట్లను, వాటి కొమ్మలను నరికి నిర్మాణ స్థలం దగ్గరికి వాటిని మోసుకురావాల్సి వచ్చింది. అడవి నుండి తిరిగి వస్తుండగా సహోదరుల్ని పోలీసులు ఆపి వారిదగ్గరున్న పర్మిట్‌ చట్టబద్ధమైంది కాదని చెప్పారు. చెట్లను నరికినందుకు ఆయన్ను అరెస్టు చేస్తున్నామని పోలీసులు ఒక ప్రత్యేక పయినీరుకు చెప్పారు. అప్పుడు అటు సమాజంలోనివారికీ, ఇటు పోలీసులకూ బాగా పరిచయమున్న ఒక స్థానిక సహోదరి ముందుకు వచ్చి ఇలా మాట్లాడింది: “మీరు మా సహోదరుణ్ణి అరెస్టు చేయాలనుకుంటే, మమ్మల్నందర్నీ అరెస్టు చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మేమందరమూ చెట్లు నరికాము!” అప్పుడు ఆ ఆఫీసర్‌ అందర్నీ వెళ్ళనిచ్చాడు.

అడవిలో క్రూర మృగాలున్నాయి, అందుకని దాని గుండా నడవడం ప్రమాదకరం కూడా. ఒకరోజు ఒక సహోదరి ఒక చెట్టును కూలగొట్టింది. అది నేలను తాకడంతోనే ఒక జంతువు ఎగిరి దూకి పరుగెత్తడం ప్రారంభించింది. దాని శరీరం ముదురు పసుపు రంగులో ఉన్నట్లు కన్పించినందున అది కేవలం ఇంపాలా మాత్రమేనని అనుకుంది, కానీ తర్వాత అడుగుజాడల్ని చూసినప్పుడు అది సింహం అని ఆమె గుర్తించింది! అలాంటి ప్రమాదాలున్నప్పటికీ సహోదరులు రాజ్యమందిర నిర్మాణాన్ని పూర్తిచేశారు, అదిప్పుడు యెహోవాకు స్తుతులు చెల్లించే “మిరుమిట్లుగొల్పే” స్థలంగా ఉంది.

1963, ఫిబ్రవరి 1వ తారీఖు కెన్యాలోని యెహోవాసాక్షుల దైవపరిపాలనా చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన తేదీ. ఆ రోజున మొట్టమొదటి బ్రాంచి కార్యాలయం ప్రారంభించబడింది, ఆ కార్యాలయం కేవలం 7.4 చదరపు మీటర్ల గది మాత్రమే. కెన్యా దైవపరిపాలనా చరిత్రలో 1997, అక్టోబరు 25 మరొక మైలురాయి వంటిది​—⁠అది 7,800 చదరపు మీటర్ల క్రొత్త బేతేలు కాంప్లెక్స్‌ ప్రతిష్ఠాపన దినం! మూడు సంవత్సరాల అవిరామ కృషికి లభించిన ఫలితమే ఆ పూర్తైన నిర్మాణం. 25 దేశాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సేవకులు, బురద, కలుపు మొక్కలతో నిండి ఉన్న 7.8 ఎకరాల పొలాన్ని 80 మంది బేతేలు కుటుంబ సభ్యులుండే క్రొత్త బ్రాంచి సౌకర్యాల నిమిత్తం ఒక సుందరమైన ఉద్యానవనంలా మార్చారు.

యెహోవా తన ప్రజల కోసం ఏమి చేశాడో చూసి ఆనందించడానికి మనకు ఎన్నో కారణాలున్నాయి. కెన్యాలో అర్హులైనవారి కోసమైన అన్వేషణను విస్తృతపర్చి, తీవ్రతరం చేసేందుకు తన సేవకుల హృదయాల్ని ఉత్తేజపర్చినందుకూ, కెన్యాలో ఆధ్యాత్మిక సౌందర్యం విలసిల్లేలా చేసినందుకూ ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లుతాయి.

[అధస్సూచి]

^ పేరా 13 వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.