కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మృత సముద్రపు గ్రంథపు చుట్టలను గురించిన నిజాలు ఏమిటి?

మృత సముద్రపు గ్రంథపు చుట్టలను గురించిన నిజాలు ఏమిటి?

మృత సముద్రపు గ్రంథపు చుట్టలను గురించిన నిజాలు ఏమిటి?

యాభై సంవత్సరాల క్రితం ఒక బెడువిన్‌ జిప్సీల కాపరి ఒక గుహలోకి విసిరిన రాయి, పురావస్తుశాస్త్ర సంబంధంగా 20వ శతాబ్దంలోనే అతి గొప్ప ఆవిష్కరణ అని పిలువబడినదొకటి వెలుగులోకి రావడానికి నడిపించింది. ఆ బెడువిన్‌ కాపరికి తాను ఊరికినే విసిరిన రాయి ఒక మట్టి జాడీకి తగిలి అది పగలడం వినిపించింది. దగ్గరికెళ్ళి పరిశీలనగా చూడడంతో ఆయన, మృతసముద్రపు గ్రంథపు చుట్టలు అని అటుతరువాత పిలువబడిన గ్రంథపు చుట్టల్లో మొట్టమొదటిదాన్ని కనుగొన్నాడు.

ఈగ్రంథపు చుట్టలపై అటు పండిత వర్గంలోను ఇటు వార్తామాధ్యమాల్లోను ఎంతో అవధానం కేంద్రీకరించబడింది, అలాగే అవి వివాదాస్పదంగా కూడా మారాయి. ప్రజల్లో చూస్తే వాటి విషయంలో గలిబిలి అధికమైంది, అలాగే తప్పుడు సమాచారం చాలా వ్యాపించింది. ఈ గ్రంథపు చుట్టలు క్రైస్తవుల యూదుల విశ్వాసాన్ని క్షీణింపజేసే కొన్ని నిజాల్ని వెల్లడిచేస్తాయన్న భయంతో వాటిని మరుగుచేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరిగాయన్న వదంతులు అంతటా పాకాయి. అయితే, ఈ గ్రంథపు చుట్టలకు గల నిజమైన ప్రాముఖ్యం ఏమిటి? అవి దొరికి 50 సంవత్సరాలకుపైగా గడిచిపోయిన తర్వాత, ఇప్పుడు వాటిని గురించిన నిజాల్ని తెలుసుకునే అవకాశం ఉందా?

మృత సముద్రపు గ్రంథపు చుట్టలంటే ఏమిటి?

మృత సముద్రపు గ్రంథపు చుట్టలనేవి ప్రాచీన యూదామత వ్రాతప్రతులు, వీటిలో చాలామట్టుకు హీబ్రూలోను, కొన్ని అరామిక్‌లోను మరికొన్ని గ్రీకులోను వ్రాయబడివున్నాయి. ఈ గ్రంథపు చుట్టల్లోనూ వాటి ముక్కల్లోనూ అనేకం 2,000 కన్నా ఎక్కువ సంవత్సరాల పూర్వపువి, అంటే యేసు పుట్టక మునుపటి కాలానికి చెందినవి. బెడువిన్‌ల నుంచి తీసుకున్న మొట్టమొదటి గ్రంథపు చుట్టల్లో ఏడు సుదీర్ఘమైన వ్రాతప్రతులున్నాయి, వాటిలో ఒక్కొక్క గ్రంథపు చుట్ట ఒక్కొక్క భాగం దగ్గర శిథిలావస్థలో ఉన్నాయి. ఇంకా మరిన్ని గుహల్ని అన్వేషించగా మరితర గ్రంథపు చుట్టలు, వేలాది సంఖ్యలో గ్రంథపు చుట్టల ముక్కలు దొరికాయి. మృత సముద్రానికి ఆనుకుని ఉన్న కుమ్రాన్‌ వద్దనున్న 11 గుహల్లో గ్రంథపు చుట్టలున్నట్లు 1947 నుండి 1956 సంవత్సరాల మధ్యకాలంలో కనుగొనడం జరిగింది.

ఈ మొత్తం గ్రంథపు చుట్టల్నీ, వాటి ముక్కల్నీ ఒక పద్ధతి ప్రకారం పెట్టిన తరువాత అవి మొత్తానికి దాదాపు 800 వ్రాతప్రతులయ్యాయి. వాటిలో నాలుగవ వంతు అంటే 200కి కొంచెం పైచిలుకు వ్రాతప్రతుల్లో హీబ్రూ భాషలోని బైబిలు పాఠం ఉంది. మిగతా వ్రాతప్రతుల్లో ప్రాచీన బైబిలేతరమైన అపోక్రిఫా వ్రాతలూ అలాగే మరితర స్యూడెపీగ్రాఫా వ్రాతలూ ఉన్నాయి. *

ఇంతకు మునుపు తెలియని కొన్ని వ్రాతలు గ్రంథపు చుట్టల్లో ఉండడం పండితుల్లో ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. ఈ వ్రాతల్లో యూదా ధర్మశాస్త్ర విషయాలపై వివరణలున్నాయి, కుమ్రాన్‌లో జీవించిన తెగ యొక్క సమాజపు కట్టుబాట్లున్నాయి, ఆరాధనలో ఉపయోగించే కవితలు ప్రార్థనలు ఉన్నాయి, అలాగే బైబిలు ప్రవచనాల నెరవేర్పులను గూర్చిన అంత్యదినాలను గూర్చిన దృక్కోణాలను బయలుపర్చే వివిధ క్రైస్తవ సిద్ధాంతాల్ని గూర్చిన చుట్టలు ఉన్నాయి. అంతేగాక, వాటిలో విశిష్ఠమైన బైబిలు వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి, ఇవి బైబిలు వచనాలపై నేడున్న ఆధునిక వ్యాఖ్యానాలకు పూర్వగాములుగా ఉన్నాయి.

మృత సముద్రపు గ్రంథపు చుట్టల్ని ఎవరు వ్రాశారు?

ప్రాచీన వ్రాతప్రతుల కాలాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే వేర్వేరు పద్ధతుల ఆధారంగా చూస్తే, ఈ గ్రంథపు చుట్టల్ని సా.శ.పూ. మూడవ శతాబ్దం మొదలుకొని సా.శ. మొదటి శతాబ్దం మధ్యకాలంలో నకలు వ్రాయడమో కూర్చడమో జరిగిందని తెలుస్తుంది. సా.శ. 70 లో ఆలయం నాశనం కావడానికి ముందు యెరూషలేములోని యూదులు ఈ గ్రంథపు చుట్టల్ని ఈ గుహల్లో దాచివుంటారని కొందరు పండితులు ప్రతిపాదించారు. అయితే, గ్రంథపు చుట్టల్ని పరిశీలిస్తున్న పండితుల్లో అత్యధికులు గ్రంథపు చుట్టల్లో ఉన్న విషయాలకూ ఈ అభిప్రాయానికీ పొంతన కుదరడం లేదని భావిస్తున్నారు. యెరూషలేములోని మతాధికారుల అభిప్రాయాలకు పూర్తి భిన్నంగా ఉన్న అభిప్రాయాలనూ, ఆచారాలనూ ఆ గ్రంథపు చుట్టల్లో అనేకం ప్రతిబింబిస్తాయి. యెరూషలేములోని యాజకుల్నీ అక్కడి దేవాలయ సేవల్నీ దేవుడు తిరస్కరించాడనీ, తామొక గుంపుగా అరణ్యంలో ఆరాధించడాన్ని దేవాలయ సేవలకు ఒక విధమైన ప్రత్యామ్నాయంగా ఆయన దృష్టిస్తున్నాడనీ నమ్ముతున్న ఒక సమాజం గురించి ఆ గ్రంథపు చుట్టలు వెల్లడి చేస్తున్నాయి. యెరూషలేము దేవాలయ అధికారులు అలాంటి గ్రంథపు చుట్టలున్న ఒక గ్రంథసంచయాన్ని జాగ్రత్తగా దాచిపెడ్తారనడం నమ్మశక్యమైన విషయంగా కన్పించడంలేదు.

కుమ్రాన్‌లో నకలు వ్రాసే విశ్వాసుల గుంపు ఒకటి ఉన్నప్పటికీ, గ్రంథపు చుట్టల్లో అత్యధికం వేరే ఎక్కడో సేకరించబడి ఉండవచ్చు, అటుతరువాత ఈ విశ్వాసులు వాటినక్కడికి తీసుకువచ్చి ఉండవచ్చు. ఒక భావంలో మృత సముద్రపు గ్రంథపు చుట్టలు ఒక విస్తారమైన గ్రంథాలయ సేకరణ అని చెప్పవచ్చు. ఏ గ్రంథాలయంలోనైనా విభిన్నమైన ఆలోచనలుగల పుస్తకాలు సేకరించబడి ఉంటాయి, అవన్నీ కూడా ఆ గ్రంథాలయానికెళ్ళే పాఠకుల మతపరమైన దృక్పథాల్ని ప్రతిబింబిస్తుండాల్సిన అవసరం లేదు; మృత సముద్రపు గ్రంథపు చుట్టల విషయంలోనూ అంతే. అయితే, ఏ పాఠముల ప్రతులు ఎక్కువగా ఉన్నాయో అవి ఆ గుంపులోని వారి ప్రత్యేక ఆసక్తులనూ, నమ్మకాల్నీ ప్రతిబింబించే అవకాశం ఎక్కువగా ఉంది.

కుమ్రాన్‌ నివాసులు ఎస్సెన్‌లా?

ఒకవేళ ఈ గ్రంథపు చుట్టలే కుమ్రాన్‌లోని గ్రంథాలయం అనుకుంటే, మరి అక్కడి నివాసులెలాంటివారు? ఈ గ్రంథపు చుట్టలు ఎస్సెన్‌ల ఒక సమాజానికి చెందినవని ప్రతిపాదించిన మొట్టమొదటి వ్యక్తి, జెరూసలేంలోని హీబ్రూ యూనివర్సిటీ కోసం 1947 లో మూడు గ్రంథపు చుట్టల్ని సంపాదించిన ప్రొఫెసర్‌ ఎలియాజర్‌ సూకెనీక్‌.

జోసిఫస్‌, అలెగ్జాండ్రియాకు చెందిన ఫైలో, ప్లీనీ ది ఎల్డర్‌ అనే మొదటి శతాబ్దపు రచయితలు ఎస్సెన్‌లను యూదుల్లో ఒక తెగగా పేర్కొన్నారు. ఈ ఎస్సెన్‌ల అసలు వంశమూలాల విషయంలో ఊహాగానాలు మాత్రమే ఉన్నప్పటికీ, వారు సా.శ.పూ. రెండవ శతాబ్దంలో జరిగిన మక్కబీయుల తిరుగుబాటు తరువాత కలిగిన సంక్షోభ సమయంలోనే ఏర్పడినట్టు కనబడుతోంది. * పరిసయ్యుల సద్దూకయ్యుల మతపరమైన దృక్కోణాలకు వీరి దృక్కోణాలు ఎలా భిన్నంగా ఉన్నాయో వివరిస్తూ వీరా కాలంలో ఉనికిలో ఉన్నారని జోసిఫస్‌ నివేదించాడు. మృత సముద్రానికి ఆనుకుని యెరికోకు ఎన్గెదీకి మధ్య ప్రాంతంలో ఎస్సెన్‌ల ఒక సమాజం ఉన్నట్లు ప్లీనీ పేర్కొన్నాడు.

మృత సముద్రపు గ్రంథపు చుట్టల పండితుడైన ప్రొఫెసర్‌ జేమ్స్‌ వాండర్‌కామ్‌, “కుమ్రాన్‌లో నివసించిన ఎస్సెన్‌లు, పెద్ద ఎస్సెనీయుల ఉద్యమానికి చెందిన ఒక చిన్న గుంపు మాత్రమే” అని ప్రతిపాదించాడు. ఈ ఎస్సెనీయుల సంఖ్య నాలుగువేలు అని జోసిఫస్‌ చెప్పాడు. అన్ని వర్ణనలకూ సరిపోకపోయినా, కుమ్రాన్‌ వ్రాతల్లోని వర్ణనల నుండి మనకు తెలియవచ్చేదేమంటే ఆ కాలంలోని ఏ ఇతర యూదామత గుంపు కన్నా ఎక్కువగా ఎస్సెన్‌లే సరిపోతారు.

క్రైస్తవత్వ ఆరంభం కుమ్రాన్‌లో జరిగిందని కొందరు వాదిస్తారు. అయితే, కుమ్రాన్‌లోని తెగవారి మతపరమైన దృక్కోణాలకూ తొలి క్రైస్తవుల దృక్కోణాలకూ చాలా భిన్నమైన తేడాల్ని మనం గమనించవచ్చు. కుమ్రాన్‌లోని వ్రాతలు మరీ కచ్చితమైన సబ్బాతు నియమాలు ఉన్నట్లు చూపిస్తున్నాయి, అంతేగాక ఆచారబద్ధమైన శుద్ధీకరణ విషయంలో మరీ అతిగా శ్రద్ధవహిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి. (మత్తయి 15:​1-20; లూకా 6:​1-11) ఎస్సెన్‌లు మిగతా సమాజం నుండి తాము ఏకాంతంగా ఉండాలనుకోవడం, విధిని నమ్మడం, ఆత్మ అమర్త్యమైనదని నమ్మడం, పెండ్లి చేసుకోకుండా ఉండడాన్ని నొక్కిచెప్పడం, తమ ఆరాధనలో దేవదూతలు పాల్గొంటున్నారన్న మార్మిక తలంపులు వంటివాటి గురించి కూడా అలాగనే చెప్పవచ్చు. వారు యేసు బోధలకూ తొలి క్రైస్తవుల బోధలకూ వేరుగా ఉన్నారని ఇది చూపిస్తుంది.​—⁠మత్తయి 5:​14-16; యోహాను 11:​23, 24; కొలొస్సయులు 2:​18; 1 తిమోతి 4:1-3.

మరుగుచేసే ప్రయత్నాలూ, దాచబడిన గ్రంథపు చుట్టలూ ఏమీ లేవు

మృత సముద్రపు గ్రంథపు చుట్టలు కనుగొనబడిన తరువాతి సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులకు అందుబాటులో ఉండేలా తొలి గ్రంథపు చుట్టల్ని ప్రచురించడం జరిగింది. కానీ గుహ 4 అని పిలువబడిన గుహలో లభ్యమైన వేలాది ముక్కలు చాలా సమస్యాపూరితంగా కన్పించాయి. ఇవి, ఈస్ట్‌ జెరూసలేంలో (అప్పట్లో ఇది జోర్డాన్‌లో భాగంగా ఉండేది) పాలస్టీన్‌ ఆర్కియాలాజికల్‌ మ్యూజియం వద్ద అంతర్జాతీయ స్థాయిలో స్థాపించబడిన విద్వాంసులతో కూడిన ఒక చిన్న జట్టు ఆధీనంలో ఉండేవి. ఈ జట్టులో యూదులు కానీ లేక ఇజ్రాయిల్‌లోని పండితులు కానీ ఎవరూ లేరు.

తమ పరిశోధనా ఫలితాల్ని అధికారికంగా ప్రచురించేంత వరకు ఈ గ్రంథపు చుట్టల్ని ఎవరికీ అందుబాటులో ఉంచకూడదన్న నియమాన్ని ఈ జట్టు ఏర్పర్చుకుంది. జట్టు సభ్యుల సంఖ్యకు ఒక పరిమితి కూడా పెట్టడం జరిగింది. జట్టులోని ఒక సభ్యుడు చనిపోయినట్లైతే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒకే ఒక్క క్రొత్త పండితుడు జట్టులో చేర్చుకోబడాలి. పని పూర్తిచేయడానికి నిజానికి ఇంకా పెద్ద జట్టు అవసరం, కొన్ని సందర్భాల్లో హీబ్రూ, అరామిక్‌ భాషా నైపుణ్యాలు మరింత ఎక్కువగా కావాల్సివచ్చింది. జేమ్స్‌ వాండర్‌కామ్‌ ఇలా చెబుతున్నాడు: “వేల సంఖ్యలో ఉన్న ముక్కలపై పనిచేయడానికి నిజానికి ఎంత సామర్థ్యంగలవారైనా ఎనిమిది మంది నిపుణులు ఏమాత్రం సరిపోరు.”

1967 లో ఆరురోజుల యుద్ధం జరిగినప్పుడు ఈస్ట్‌ జెరూసలేంతోపాటు అక్కడి గ్రంథపు చుట్టలు కూడా ఇజ్రాయిల్‌ ఆధీనంలోకి వచ్చేశాయి, కానీ గ్రంథపు చుట్టల పరిశోధనా జట్టు నియమంలో ఎటువంటి మార్పూ జరగలేదు. గుహ 4 నుండి సంపాదించిన గ్రంథపు చుట్టల్ని ప్రచురించడంలోని ఆలస్యం సంవత్సరాల నుండి దశాబ్దాలకు పెరిగింది, దాంతో అనేకమంది పండితులు ఘోష పెట్టనారంభించారు. 1977 లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ గేజా వెర్మెస్‌ దాన్ని 20వ శతాబ్దంలోనే విద్యాపరమైన అతి విశేషమైన కుంభకోణం అని పిలిచాడు. క్రైస్తవత్వాన్ని ధ్వంసంచేసే సమాచారాన్ని గ్రంథపు చుట్టల్లో నుండి క్యాథలిక్‌ చర్చి కావాలనే దాస్తుందనే వదంతులు వ్యాపించడం ప్రారంభమైంది.

1980ల తొలిభాగంలో ఎట్టకేలకు జట్టు సభ్యుల సంఖ్య 20 మంది పండితులకు పెరిగింది. 1990 లో జెరూసలేంలోని హీబ్రూ యూనివర్సిటీకి చెందిన ఇమానువల్‌ టోవ్‌ క్రొత్త ప్రధాన సంపాదకునిగా నియుక్తుడైన తరువాత ఆయన నిర్దేశంలో జట్టు సంఖ్య 50 మంది పండితులకు పెరిగింది. మిగిలిన గ్రంథపు చుట్టల పాండిత్యపరమైన సంపుటిలన్నింటినీ ప్రచురించడానికిగాను ఒక ఖచ్చితమైన షెడ్యూలు ఏర్పర్చడం జరిగింది.

1991 లో అనూహ్యమైన రీతిలో ఒక నిజమైన ఘన కార్యం సాధించబడింది. మొదటిగా, ఎ ప్రిలిమినరీ ఎడిషన్‌ ఆఫ్‌ ది అన్‌పబ్లిష్డ్‌ డెడ్‌ సీ స్క్రోల్స్‌ ప్రచురించబడింది. దీన్ని జట్టుకి చెందిన అకారాది పట్టిక ఆధారంగా కంప్యూటర్‌లోకి ఎక్కించడం జరిగింది. రెండవదిగా, కాలిఫోర్నియాలోని సాన్‌ మారీనోలోని హంటింగ్టన్‌ లైబ్రరీవారు గ్రంథపు చుట్టల పూర్తి ఫొటో కాపీలను ఏ పండితునికైనా అందుబాటులో ఉంచనైయున్నారని ప్రకటించారు. కొద్దికాలానికే, ఎ ఫాక్సిమిలీ ఎడిషన్‌ ఆఫ్‌ ద డెడ్‌ సీ స్క్రోల్స్‌ ప్రచురించబడడంతో ఇంతకు మునుపు ప్రచురించబడని గ్రంథపు చుట్టల ఫొటో కాపీలు చాలా సులభంగా అందుబాటులోకి వచ్చాయి.

అలా గత దశాబ్దంలో మృత సముద్రపు గ్రంథపు చుట్టలన్నీ పరిశీలనకు అందుబాటులోకి వచ్చేశాయి. మరుగుచేసే ఎటువంటి ప్రయత్నాలూ జరగలేదనీ, దాచబడిన గ్రంథపు చుట్టలంటూ ఏవీ లేవనీ పరిశోధన వెల్లడి చేసింది. గ్రంథపు చుట్టల అధికారిక సంపుటిలు ప్రచురించబడుతుండడంతో ఇప్పుడు మాత్రమే పూర్తి విశ్లేషణను ప్రారంభించడానికి వీలుంది. గ్రంథపు చుట్టల సంబంధంగా పండితుల ఒక క్రొత్త తరం ఉద్భవించింది. కానీ ఈ పరిశోధన బైబిలు విద్యార్థులకు ఎలాంటి ప్రాముఖ్యాన్ని కలిగివుంది?

[అధస్సూచీలు]

^ పేరా 6 అపోక్రిఫా వ్రాతలు (అక్షరార్థంగా, “దాగివున్న”), స్యూడెపీగ్రాఫా వ్రాతలు (అక్షరార్థంగా, “బూటకపు వ్రాతలు”) సా.శ.పూ. మూడవ శతాబ్దం మొదలుకొని సా.శ. మొదటి శతాబ్ద కాలం వరకు ఉన్న యూదామత వ్రాతలు. రోమన్‌ క్యాథలిక్‌ చర్చి అపోక్రిఫాను దైవప్రేరేపిత బైబిలులో భాగంగా స్వీకరించింది, కానీ ఈ పుస్తకాల్ని యూదులు ప్రొటెస్టెంట్లు తిరస్కరించారు. బైబిల్లోని కథల్ని సాగదీసి వ్రాసి వాటికి ప్రసిద్ధిగాంచిన కొన్ని బైబిలు పాత్రల పేర్లు పెట్టిన వృత్తాంతాలు స్యూడెపీగ్రాఫా వ్రాతల్లో ఎక్కువగా ఉన్నాయి.

^ పేరా 13 కావలికోట నవంబరు 15, 1998, పేజీలు 21-4 లోని “మక్కబీయులు ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.

[3వ పేజీలోని చిత్రం]

మృత సముద్రం వద్ద ప్రాచీన గ్రంథపు చుట్టలు లభ్యమైన గుహల్లో ఇవి కొన్ని

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

గ్రంథపు చుట్టల ముక్కలు: 3, 4, 6 పేజీల్లో: Courtesy of Israel Antiquities Authority

[5వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of Shrine of the Book, Israel Museum, Jerusalem