రాజులు రెండో గ్రంథం 3:1-27

  • యెహోరాము, ఇశ్రాయేలు రాజు (1-3)

  • ఇశ్రాయేలు మీద మోయాబు తిరుగుబాటు (4-25)

  • మోయాబు ఓడిపోవడం (26, 27)

3  యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని 18వ సంవత్సరంలో, అహాబు కుమారుడైన యెహోరాము+ సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. అతను 12 సంవత్సరాలు పరిపాలించాడు.  అతను యెహోవా దృష్టిలో చెడు చేస్తూ వచ్చాడు, అయితే తన తల్లిదండ్రులు చేసినంత చెడు చేయలేదు, ఎందుకంటే అతను తన తండ్రి చేయించిన బయలు పూజా స్తంభాన్ని తీసేశాడు.+  అయితే నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలీయులతో చేయించిన పాపాల్నే+ ఇతను కూడా చేశాడు. అతను వాటిని విడిచిపెట్టలేదు.  మోయాబు రాజైన మేషా దగ్గర విస్తారమైన గొర్రెలు ఉండేవి. అతను 1,00,000 గొర్రెపిల్లల్ని, బొచ్చు కత్తిరించని 1,00,000 పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజుకు కప్పం చెల్లించేవాడు.  అయితే, అహాబు చనిపోగానే+ మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేశాడు.+  కాబట్టి, ఆ సమయంలో యెహోరాము రాజు సమరయ నుండి బయల్దేరి, ఇశ్రాయేలు ప్రజలందర్నీ పోగు చేశాడు.  అతను యూదా రాజైన యెహోషాపాతుకు కూడా ఈ సందేశాన్ని పంపించాడు: “మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేశాడు. మోయాబు మీద యుద్ధం చేయడానికి నువ్వు నాతోపాటు వస్తావా?” దానికి అతను, “నేను వస్తాను.+ నువ్వూ నేనూ ఒక్కటే. నా ప్రజలు నీ ప్రజలే. నా గుర్రాలు నీ గుర్రాలే ” అన్నాడు.+  తర్వాత యెహోషాపాతు, “మనం ఏ మార్గంలో వెళ్లాలి?” అని అడిగాడు. యెహోరాము, “ఎదోము ఎడారి* మార్గంలో” అని చెప్పాడు.  తర్వాత ఇశ్రాయేలు రాజు, యూదా రాజుతో, ఎదోము రాజుతో+ కలిసి బయల్దే​రాడు. వాళ్లు చుట్టూ తిరిగి ఏడురోజులు ప్రయాణించిన తర్వాత, సైనికులకు, వాళ్లతో ఉన్న పశువులకు నీళ్లు లేకుండా పోయాయి. 10  అప్పుడు ఇశ్రాయేలు రాజు, “అయ్యో! మోయాబు చేతికి అప్పగించడానికే రాజులైన మన ముగ్గుర్ని యెహోవా ఒక చోట చేర్చాడు!” అని అన్నాడు. 11  అప్పుడు యెహోషాపాతు, “మనం యెహోవా దగ్గర విచారణ చేయడానికి ఇక్కడ యెహోవా ప్రవక్త ఒక్కరూ లేరా?”+ అని అడిగాడు. దానికి ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు, “షాపాతు కుమారుడైన ఎలీషా+ ఉన్నాడు, అతను ఏలీయా చేతుల మీద నీళ్లు ​పోసేవాడు”*+ అని చెప్పాడు. 12  అప్పుడు యెహోషాపాతు, “అతను మనకు యెహోవా మాటను తెలియజేస్తాడు” అన్నాడు. దాంతో ​ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతు, ఎదోము రాజు ఎలీషా దగ్గరికి వెళ్లారు. 13  ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “నాతో నీకేం పని?+ నీ తండ్రి ప్రవక్తల దగ్గరికి, నీ తల్లి ప్రవక్తల దగ్గరికి వెళ్లు”+ అన్నాడు. అయితే ఇశ్రాయేలు రాజు అతనితో, “లేదు, మోయాబు చేతికి అప్పగించడానికి యెహోవాయే రాజులైన మా ముగ్గుర్ని ఒక చోట చేర్చాడు” అన్నాడు. 14  అందుకు ఎలీషా ఇలా అన్నాడు: “నేను సేవిస్తున్న* సైన్యాలకు అధిపతైన యెహోవా జీవం తోడు, యూదా రాజైన యెహోషాపాతు మీద నాకు గౌరవం లేకపోయుంటే,+ నేను నిన్ను చూసేవాణ్ణీ కాదు, పట్టించుకునేవాణ్ణీ కాదు.+ 15  ఇప్పుడు, నా దగ్గరికి వీణ* వాయించే ఒక వ్యక్తిని+ తీసుకురండి.” ఆ వ్యక్తి వీణ వాయిం​చడం మొదలుపెట్టగానే, యెహోవా పవిత్రశక్తి* ఎలీషా మీదికి వచ్చింది.+ 16  అతను ఇలా అన్నాడు, “యెహోవా ఏం చెప్తున్నాడంటే: ‘ఈ లోయలో* ఒకదాని తర్వాత ఒకటి గుంటలు తవ్వుకుంటూ వెళ్లండి, 17  ఎందుకంటే యెహోవా ఇలా చెప్తున్నాడు: “మీరు గాలిని చూడరు, వర్షాన్ని చూడరు; అయినా ఈ లోయ* నీళ్లతో నిండిపోతుంది,+ మీరు ఆ నీళ్లు తాగుతారు, మీ పశువులు, మిగతా జంతువులు కూడా తాగుతాయి.” ’ 18  అయితే, ఇది యెహోవా దృష్టికి చాలా చిన్న విషయం.+ ఆయన మోయాబును కూడా మీ చేతికి అప్పగిస్తాడు.+ 19  మీరు ప్రాకారంగల ప్రతీ నగరాన్ని,+ ప్రతీ మంచి నగరాన్ని నాశనం చేయాలి; ప్రతీ మంచి చెట్టును నరికేయాలి, నీటి ఊటలన్నిటినీ పూడ్చేయాలి, ప్రతీ మంచి పొలాన్ని రాళ్లతో నింపి నాశనం చేయాలి.”+ 20  తర్వాతి రోజు పొద్దున్నే, ఉదయం ధాన్యార్పణ అర్పించే సమయంలో,+ ఉన్నట్టుండి ఎదోము వైపు నుండి నీళ్లు రావడంతో ఆ లోయ నీళ్లతో నిండిపోయింది. 21  తమతో యుద్ధం చేయడానికి రాజులు వచ్చారని మోయాబీయులందరూ విన్నారు. దాంతో వాళ్లు ఆయుధాలు ధరించగల వాళ్లందర్నీ పోగుచేసుకొని సరిహద్దు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నారు. 22  వాళ్లు ఉదయాన్నే లేచినప్పుడు, సూర్య కిరణాలు నీళ్లమీద పడి ప్రకాశించాయి; ఆ నీళ్లు, అవతలి వైపున్న మోయాబీయులకు రక్తంలా ఎర్రగా కనిపించాయి. 23  అప్పుడు వాళ్లు, “ఇది రక్తం! ఖచ్చితంగా ఆ రాజులు ఒకరినొకరు కత్తితో చంపుకున్నారు. కాబట్టి, మోయాబీయులారా, పదండి దోపుడుసొమ్ము దగ్గరికి వెళ్దాం!”+ అన్నారు. 24  వాళ్లు ఇశ్రాయేలు శిబిరంలోకి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులు లేచి వాళ్లను చంపడం మొదలుపె​ట్టారు, దాంతో వాళ్లు ఇశ్రాయేలీయుల దగ్గర నుండి పారిపో​యారు.+ ఇశ్రాయేలీయులు మోయాబీయుల్ని చంపుతూ మోయాబులోకి దూసుకెళ్లారు. 25  వాళ్లు నగరాల్ని పడగొట్టారు, ప్రతీ మంచి పొలం మీద ఒక్కొక్కరు ఒక్కో రాయి విసిరి దాన్ని రాళ్లతో నింపేశారు; ప్రతీ నీటి ఊటను పూడ్చేశారు,+ ప్రతీ మంచి చెట్టును నరికేశారు.+ చివరికి కీర్హరెశెతు+ రాతి ప్రాకారాలు మాత్రమే మిగిలాయి, వడిసెల విసిరేవాళ్లు దాన్ని చుట్టుముట్టి దానిమీద దాడిచేశారు. 26  యుద్ధంలో ఓడిపోయామని మోయాబు రాజుకు అర్థమైనప్పుడు, అతను కత్తులు ధరించిన 700 మందిని వెంటబెట్టుకొని ఎదోము రాజు దగ్గరికి చొచ్చుకొని వెళ్లడానికి ప్రయత్నించాడు;+ కానీ అది వాళ్ల వల్ల అవ్వలేదు. 27  అప్పుడు అతను, తన స్థానంలో పరిపాలించబోయే తన పెద్ద కుమారుణ్ణి ప్రాకారం మీద దహనబలిగా అర్పించాడు.+ దానివల్ల ఇశ్రాయేలీయుల మీద చాలా కోపం రగులుకుంది. దాంతో వాళ్లు అక్కడి నుండి తమ దేశానికి తిరిగొచ్చారు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “అతను ఏలీయా సేవకుడు.”
అక్ష., “నేను ఎవరి ముందు నిలబడ్డానో ఆ.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
అక్ష., “చెయ్యి.”
లేదా “వాగులో.”
లేదా “వాగు.”