గలతీయులు 2:1-21

  • పౌలు యెరూషలేములో అపొస్తలుల్ని కలవడం (1-10)

  • పౌలు పేతురును (కేఫాను) సరిదిద్దడం (11-14)

  • విశ్వాసం వల్లే నీతిమంతులుగా తీర్పు పొందుతారు (15-21)

2  మళ్లీ 14 సంవత్సరాల తర్వాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో+ పాటు యెరూషలేముకు వెళ్లాను.+  అలా వెళ్లాలని నాకు బయల్పర్చబడింది కాబట్టే వెళ్లాను. అక్కడ నేను గౌరవనీయులుగా ఎంచబడిన సహోదరుల్ని కలిసి, నేను అన్యజనుల మధ్య ప్రకటిస్తున్న మంచివార్త గురించి వివరించాను. నేను ఇప్పటివరకు చేసిన, లేదా చేస్తూ ఉన్న పరిచర్య వృథాకాలేదని నిర్ధారించుకోవడానికి ఆ విషయాలు వాళ్లకు ఏకాంతంగా వివరించాను.  నాతో వచ్చిన తీతు+ గ్రీకువాడే అయినా, సున్నతి చేయించుకోమని అతన్ని కూడా ఎవ్వరూ బలవంతపెట్టలేదు.+  కానీ సంఘంలోకి రహస్యంగా ప్రవేశించిన కపట సహోదరుల+ వల్ల ఆ విషయం చర్చకు వచ్చింది. క్రీస్తుయేసు శిష్యులుగా మనకున్న స్వేచ్ఛను పాడుచేసి,+ మనల్ని పూర్తిగా బానిసలుగా చేసుకోవడానికి వాళ్లు దొంగచాటుగా చొరబడ్డారు;+  అయితే సత్యం గురించిన మంచివార్త ఎప్పుడూ మీలో ఉండాలని మేము వాళ్ల మాట వినలేదు, ఒక్క క్షణం కూడా వాళ్లకు లొంగిపోలేదు.+  గౌరవనీయులుగా ఎంచబడే సహోదరుల+ విషయానికొస్తే, వాళ్లు నాకు కొత్తవేమీ నేర్పించలేదు. వాళ్లు ఎంతటివాళ్లయినా నాకు ఫర్వాలేదు, ఎందుకంటే దేవుడు మనిషి హోదాను చూడడు.  అయితే, సున్నతి పొందినవాళ్లకు మంచివార్త ప్రకటించే పని పేతురుకు అప్పగించబడినట్టే, సున్నతి పొందనివాళ్లకు మంచివార్త ప్రకటించే పని నాకు అప్పగించబడిందని+ ఆ సహోదరులు గుర్తించారు.  ఎందుకంటే, సున్నతి పొందినవాళ్లకు అపొస్తలునిగా పనిచేసే సామర్థ్యాన్ని పేతురుకు ఇచ్చిన దేవుడే అన్యజనులకు అపొస్తలునిగా పనిచేసే సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడు.+  ఆ సహోదరులు దేవుడు నాకు అనుగ్రహించిన అపారదయను+ గుర్తించినప్పుడు, సంఘానికి స్తంభాల్లా కనిపించే యాకోబు,+ కేఫా,* యోహానులు నాతో, బర్నబాతో+ కరచాలనం చేసి మేము అన్యజనుల దగ్గరికి, వాళ్లు సున్నతి పొందినవాళ్ల దగ్గరికి వెళ్లడానికి అంగీకరించినట్టు చూపించారు. 10  పేద సహోదరుల్ని మనసులో ఉంచుకోమని మాత్రం మాకు చెప్పారు, అలా చేయడానికి నేను కూడా మనస్ఫూర్తిగా కృషి​చేశాను.+ 11  అయితే, కేఫా*+ అంతియొకయకు+ వచ్చినప్పుడు అతను చేసినదానిలో తప్పు ఉండడంతో నేను అతన్ని ముఖాముఖిగా ఎదిరించాను. 12  ఎందుకంటే, యాకోబు+ పంపించినవాళ్లు వచ్చేవరకు అతను అన్యజనులతో కలిసి భోంచేస్తూ ఉండేవాడు;+ కానీ వాళ్లు వచ్చినప్పుడు, సున్నతి పొందినవాళ్లకు భయపడి+ అన్యజనులతో కలిసి భోంచేయడం మానేసి, అన్యజనులకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. 13  మిగిలిన యూదులు కూడా ​అతనితోపాటు నటించడం మొదలుపెట్టారు. వాళ్ల ప్రభావం వల్ల చివరికి బర్నబా కూడా వాళ్లలాగే చేశాడు. 14  అయితే వాళ్లు మంచివార్తకు సంబంధించిన సత్యానికి తగ్గట్టు నడుచుకోవట్లేదని+ నేను గమనించినప్పుడు, వాళ్లందరి ముందు కేఫాతో* ఇలా అన్నాను: “నువ్వు యూదుడివై ఉండి యూదుల్లా కాకుండా అన్యజనుల్లా నడుచుకుంటున్నావు, అలాంటప్పుడు అన్యజనుల్ని యూదుల ఆచారం ప్రకారం నడుచుకోమని ఎలా బలవంతపెడుతున్నావు?”+ 15  మనం పుట్టుకతో యూదులం, అన్య​జనుల్లో నుండి వచ్చిన పాపులం కాదు. 16  ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కాదుగానీ యేసుక్రీస్తు మీద విశ్వాసం+ ఉంచడం ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్పు పొందుతాడని మనకు తెలుసు.+ కాబట్టి మనం క్రీస్తుయేసు మీద విశ్వాసం ఉంచాం, ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కాకుండా క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులుగా తీర్పు పొందాలని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల ఎవ్వరూ నీతిమంతులుగా తీర్పు పొందరు.+ 17  క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్పు పొందాలని ప్రయత్నిస్తున్న మనం పాపులుగా కూడా కనిపిస్తే, క్రీస్తు మనతో పాపం చేయిస్తున్నట్టా? అలా ఎప్పటికీ జరగదు! 18  నేను ఒకప్పుడు పడగొట్టిన వాటినే మళ్లీ కడితే నేను దోషిని అవుతాను. 19  నేను ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాను,+ కానీ అలా చనిపోవడం వల్ల దేవుని విషయంలో బ్రతికాను. 20  నేను క్రీస్తుతోపాటు మేకులతో కొయ్యకు ​దిగగొట్టబడ్డాను.+ ఇక నుండి బ్రతికేది నేను కాదు,+ నాలో జీవిస్తున్న క్రీస్తే. నిజానికి నేను ఇప్పుడు జీవించే జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసంతోనే జీవిస్తున్నాను.+ 21  నేను దేవుని అపారదయను+ తిరస్కరించను.* ఎందుకంటే ధర్మశాస్త్రం వల్లే ఒక వ్యక్తి నీతిమంతుడైపోతే, క్రీస్తు అనవసరంగా చని​పోయినట్టే.+

అధస్సూచీలు

పేతురు అని కూడా పిలవబడ్డాడు.
పేతురు అని కూడా పిలవబడ్డాడు.
పేతురు అని కూడా పిలవబడ్డాడు.
లేదా “పక్కకు నెట్టేయను.”