సమూయేలు రెండో గ్రంథం 1:1-27

  • సౌలు చనిపోయాడని దావీదు వినడం (1-16)

  • సౌలు, యోనాతాను గురించి దావీదు శోకగీతం (17-27)

1  సౌలు చనిపోయిన తర్వాత, దావీదు ​అమాలేకీయుల్ని ఓడించి* తిరిగొచ్చి రెండు రోజులు సిక్లగులో+ ఉన్నాడు.  మూడో రోజు, సౌలు శిబిరం నుండి ఒక వ్యక్తి వచ్చాడు. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, అతని ​తలమీద దుమ్ము ఉంది. అతను దావీదు దగ్గ​రికి వచ్చి, నేలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు.  దావీదు అతన్ని, “నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు?” అని అడిగాడు. అతను, “నేను ఇశ్రాయేలీయుల శిబిరం నుండి తప్పించుకొని వస్తున్నాను” అన్నాడు.  దావీదు అతన్ని, “దయచేసి ఏమి జరిగిందో చెప్పు” అని అడిగాడు. దానికి అతను, “ప్రజలు యుద్ధం నుండి పారిపోయారు, చాలామంది చనిపోయారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారు”+ అన్నాడు.  ఆ వార్త తీసుకొచ్చిన యువకుణ్ణి దావీదు ఇలా అడిగాడు: “సౌలు, అతని కుమారుడు యోనాతాను చనిపోయారని నీకెలా తెలుసు?”  దానికి ఆ యువకుడు ఇలా చెప్పాడు: “అనుకోకుండా నేను అప్పుడు గిల్బోవ పర్వతం+ మీద ఉన్నాను. సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉన్నాడు. రథాలతోపాటు గుర్రపురౌతులు అతనికి దగ్గరగా వచ్చారు.+  అతను చుట్టూ చూసినప్పుడు నేను కనిపించాను, అతను నన్ను పిలిచాడు. నేను, ‘ఏమి చేయాలో చెప్పు!’ అన్నాను.  అతను నన్ను, ‘నువ్వు ఎవరు?’ అని అడిగాడు. ‘నేను ఒక అమాలేకీయున్ని’+ అని చెప్పాను.  అప్పుడు అతను, ‘దయచేసి నా దగ్గరికి వచ్చి నన్ను చంపు, నేను ఇంకా బ్రతికే ఉన్నా, ఎంతో వేదన అనుభవిస్తున్నాను’ అన్నాడు. 10  దాంతో నేను అతని దగ్గరికి వెళ్లి అతన్ని చంపాను.+ ఎందుకంటే, అంత తీవ్రంగా గాయపడ్డాక అతను బ్రతకడని నాకు తెలుసు. తర్వాత నేను అతని తల మీద ఉన్న ​కిరీటాన్ని, అతని చేతి గొలుసును తీసుకొని నా ​ప్రభువైన నీ దగ్గరికి వచ్చాను.” 11  అది విని దావీదు తన బట్టలు చింపుకున్నాడు. అతనితో ఉన్న మనుషులు కూడా అలాగే చేశారు. 12  సౌలు, అతని కుమారుడు యోనాతాను, యెహోవా ప్రజలు, ఇశ్రాయేలు ఇంటివాళ్లు+ కత్తితో చంపబడ్డారు కాబట్టి వాళ్ల గురించి దావీదు, అతనితో ఉన్న మనుషులు దుఃఖిస్తూ ఏడుస్తూ సాయంత్రం వరకు ఉపవాసమున్నారు.+ 13  ఆ వార్త తీసుకొచ్చిన యువకుణ్ణి దావీదు, “నువ్వు ఎక్కడి వాడివి?” అని అడిగాడు. దానికి అతను, “నేను ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయుడైన ఒక అమాలేకీయుని కుమారుణ్ణి” అన్నాడు. 14  అప్పుడు దావీదు అతనితో ఇలా అన్నాడు: “యెహోవా అభిషేకించిన వ్యక్తిని చంపేలా నీ చెయ్యి ఎత్తడానికి నువ్వు ఎందుకు భయపడలేదు?”+ 15  అలా అన్నాక దావీదు ఒక యువకుణ్ణి పిలిచి, “నువ్వు ముందుకు వచ్చి అతన్ని చంపు” అన్నాడు. దాంతో ఆ యువకుడు అతన్ని చంపాడు.+ 16  దావీదు అతనితో ఇలా అన్నాడు: “నీ చావుకు* నువ్వే బాధ్యుడివి. ఎందు​కంటే, ‘యెహోవా అభిషేకించిన వ్యక్తిని నేనే చంపాను’+ అని అంటూ నీమీద నువ్వే సాక్ష్యం చెప్పుకున్నావు.” 17  అప్పుడు దావీదు సౌలు గురించి, అతని కుమారుడైన యోనాతాను గురించి ఈ శోకగీతం పాడాడు.+ 18  “విల్లు” అనే పేరున్న ఈ శోకగీతాన్ని యూదా ప్రజలకు నేర్పించాలని అతను చెప్పాడు. అది యాషారు గ్రంథంలో+ ఉంది: 19  “ఇశ్రాయేలూ, అందమైనవాళ్లు నీ ఎత్తైన స్థలాల్లో హతులై పడివున్నారు.+ అయ్యో, బలాఢ్యులు ఎలా ​కూలిపోయారు! 20  దీన్ని గాతులో చెప్పొద్దు;+అష్కెలోను వీధుల్లో చాటించొద్దు,అలాచేస్తే ఫిలిష్తీయుల కూతుళ్లు ​సంతోషిస్తారు,సున్నతిలేనివాళ్ల కూతుళ్లు ఆనందంతో ఉప్పొంగుతారు. 21  గిల్బోవ పర్వతాల్లారా,+ఇక మీ మీద మంచు గానీ, వర్షం గానీ పడకూడదు,పవిత్ర అర్పణలు ఇచ్చే పొలాలు ​ఉండకూడదు,+ఎందుకంటే అక్కడ బలవంతుల డాలు అపవిత్రపర్చబడింది,సౌలు డాలు ఇక నూనెతో అభిషేకించ​బడదు. 22  శత్రువుల రక్తాన్ని చిందించకుండా, ​బలవంతుల కొవ్వును చీల్చకుండా,యోనాతాను విల్లు వెనక్కి రాదు,+విజయం సాధించకుండా సౌలు కత్తి వెనక్కిరాదు.+ 23  సౌలు, యోనాతానులు బ్రతికున్నప్పుడు ప్రియమైనవాళ్లు, ఇష్టులు;మరణంలో వాళ్లు విడిపోలేదు.+ వాళ్లు గద్దలకన్నా వేగం గలవాళ్లు,+సింహాలకన్నా బలం గలవాళ్లు.+ 24  ఇశ్రాయేలు కూతుళ్లారా, సౌలు గురించి ఏడ్వండి,అతను, అలంకరించబడిన ముదురు ఎరుపు బట్టల్ని మీకు ​ధరింపజేశాడు,మీ బట్టల మీద బంగారు నగలు పెట్టాడు. 25  యుద్ధంలో బలవంతులు ఎలా ​కూలిపోయారు! నీ ఎత్తైన స్థలాల్లో యోనాతాను హతుడై పడివున్నాడు!+ 26  నా సహోదరుడైన యోనాతానా, నీ గురించి నేనెంతో బాధపడు​తున్నాను;నువ్వు నాకు ఎంతో ప్రియమైనవాడివి.+ నామీద నీకున్న ప్రేమ స్త్రీలు చూపించే ప్రేమకన్నా ఎంతో గొప్పది.+ 27  బలవంతులు ఎలా కూలిపోయారు!యుద్ధ ఆయుధాలు ఎలా నాశనమయ్యాయి!”

అధస్సూచీలు

లేదా “హతం చేసి.”
అక్ష., “రక్తానికి.”