కీర్తనలు 22:1-31

  • కృంగిపోయిన స్థితి నుండి స్తుతించే స్థితికి

    • “నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?” (1)

    • “నా లోపలి వస్త్రం కోసం చీట్లు వేసుకుంటున్నారు” (18)

    • సమాజంలో దేవుణ్ణి స్తుతించడం (22, 25)

    • భూమంతా దేవుణ్ణి ఆరాధిస్తుంది (27)

సంగీత నిర్దేశకునికి సూచన; “పగటి ఆడ జింక”* అనే రాగంలో పాడాలి. దావీదు శ్రావ్యగీతం. 22  నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?+ నన్ను రక్షించడానికి ఎందుకు రావడం లేదు?నా ఆర్తనాదాలు ఎందుకు పట్టించుకోవట్లేదు?+   నా దేవా, పగటిపూట నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, కానీ నువ్వు జవాబివ్వడం లేదు;+ రాత్రిపూట కూడా నేను మౌనంగా ఉండలేకపోతున్నాను.   కానీ నువ్వు పవిత్రుడివి,+ఇశ్రాయేలు స్తుతుల మధ్య సింహాసనాసీనుడివై ఉన్నావు.*   మా పూర్వీకులు నీ మీద నమ్మకముంచారు;+వాళ్లు నమ్మకముంచారు, నువ్వు వాళ్లను రక్షిస్తూ వచ్చావు.+   వాళ్లు నీకు మొరపెట్టారు, నువ్వు వాళ్లను కాపాడావు;వాళ్లు నీ మీద నమ్మకముంచారు, వాళ్లకు నిరాశ ఎదురుకాలేదు.*+   నా విషయానికొస్తే, మనుషులు నన్ను హీనంగా* చూస్తూ చీదరించుకుంటున్నారు.+నేను మనిషిని కాదు పురుగును అన్నట్టు చూస్తున్నారు;   నన్ను గమనించేవాళ్లందరూ హేళన చేస్తున్నారు;+గేలి చేస్తూ, హేళనగా తలలాడిస్తూ ఇలా అంటున్నారు:+   “అతను యెహోవాకు తనను తాను అప్పగించుకున్నాడు. ఆయనే అతన్ని రక్షించనీ! అతను ఆయనకు ఎంతో ఇష్టమైనవాడు కాబట్టి ఆయనే అతన్ని కాపాడనీ!”+   నా తల్లి గర్భం నుండి నువ్వే నన్ను బయటికి తెచ్చావు,+నా తల్లి స్తనాల మీద నేను సురక్షితంగా ఉన్నట్టు భావించేలా చేశావు. 10  పుట్టినప్పటి నుండి నేను నీ కాపుదలకు అప్పగించబడ్డాను;*నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నువ్వే నా దేవుడివి. 11  నాకు దూరంగా ఉండకు, ఎందుకంటే శ్రమ దగ్గర్లో ఉంది,+నాకు సహాయం చేసేవాళ్లు ఇంకెవ్వరూ లేరు.+ 12  ఎన్నో బలమైన ఎద్దులు* నన్ను చుట్టుముట్టాయి;+బలమైన బాషాను ఎద్దులు నా చుట్టూ ఉన్నాయి.+ 13  గర్జించే సింహం జంతువును ముక్కలుముక్కలుగా చీల్చేసినట్టు+అవి నా మీద పెద్దగా నోళ్లు తెరిచాయి.+ 14  నేను నీళ్లలా పారబోయబడ్డాను;నా ఎముకలన్నీ వాటి స్థానం తప్పాయి. నా హృదయం మైనంలా తయారైంది;+అది నా లోలోపల కరిగిపోతోంది.+ 15  నాలో ఇక శక్తి లేదు, నేను మట్టి పెంకులా ఉన్నాను;+నా నాలుక నా అంగిలికి అంటుకుపోతోంది;+నువ్వు నన్ను మరణ ధూళిలో పడేస్తున్నావు.+ 16  నా శత్రువులు కుక్కల్లా నన్ను చుట్టుముట్టారు;+కీడు చేసేవాళ్ల గుంపు నా మీదికి వస్తోంది,+వాళ్లు సింహంలా నా చేతులను, కాళ్లను కొరుకుతున్నారు.+ 17  నేను నా ఎముకలన్నీ లెక్కపెట్టగలను.+ వాళ్లు నన్ను అదేపనిగా తేరి చూస్తున్నారు. 18  వాళ్లు నా వస్త్రాలు పంచుకుంటున్నారు,నా వస్త్రాల కోసం చీట్లు* వేసుకుంటున్నారు.+ 19  కానీ యెహోవా, నాకు దూరంగా ఉండకు.+ నువ్వే నా బలం; నాకు సహాయం చేయడానికి త్వరగా రా.+ 20  కత్తి నుండి నన్ను,కుక్కల చేతి* నుండి నా అమూల్యమైన ప్రాణాన్ని* కాపాడు;+ 21  నాకు జవాబివ్వు,సింహం నోటి నుండి, అడవి ఎద్దుల కొమ్ముల నుండి నన్ను కాపాడు.+ 22  నేను నీ పేరును నా సహోదరులకు ప్రకటిస్తాను;+సమాజం మధ్యలో నిన్ను స్తుతిస్తాను.+ 23  యెహోవాకు భయపడేవాళ్లారా, ఆయన్ని స్తుతించండి! యాకోబు సంతానమా,* మీరంతా ఆయన్ని మహిమపర్చండి!+ ఇశ్రాయేలు సంతానమా,* మీరంతా ఆయన మీద భయభక్తులతో లేచి నిలబడండి. 24  ఆయన బాధితుని కష్టాల్ని అసహ్యించుకోలేదు, వాటిని అలక్ష్యం చేయలేదు;+అతని నుండి తన ముఖాన్ని దాచుకోలేదు.+ అతను సహాయం కోసం మొరపెట్టినప్పుడు, ఆయన విన్నాడు.+ 25  మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను;+నీకు భయపడేవాళ్ల ముందు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను. 26  సాత్వికులు తిని తృప్తి పొందుతారు;+యెహోవాను వెదికేవాళ్లు ఆయన్ని స్తుతిస్తారు.+ మీరు శాశ్వతకాలం జీవించాలి.* 27  భూమంతా యెహోవాను గుర్తించి, ఆయనవైపు తిరుగుతుంది. దేశాల కుటుంబాలన్నీ నీ ముందు సాష్టాంగపడతాయి.+ 28  ఎందుకంటే రాజరికం యెహోవాది;+ఆయన దేశాల మీద పరిపాలిస్తున్నాడు. 29  భూమ్మీది ధనవంతులందరూ భోజనం చేసి, మొక్కుతారు;మట్టికి చేరుకుంటున్న వాళ్లందరూ ఆయన ముందు మోకాళ్లూనుతారు;వాళ్లలో ఎవ్వరూ తమ ప్రాణాల్ని కాపాడుకోలేరు. 30  వాళ్ల వంశస్థులు ఆయన్ని సేవిస్తారు;రాబోయే తరం యెహోవా గురించి వింటుంది. 31  వాళ్లు వచ్చి ఆయన నీతి గురించి చెప్తారు. ఆయన ఏమి చేశాడో పుట్టబోయేవాళ్లకు చెప్తారు.

అధస్సూచీలు

ఒక రాగం లేదా సంగీత శైలి కావచ్చు.
లేదా “ఇశ్రాయేలు స్తుతులు నీ చుట్టూ ఉన్నాయి.”
లేదా “వాళ్లు అవమానాలపాలు కాలేదు.”
లేదా “నిందగా.”
అక్ష., “నీ మీద విసిరేయబడ్డాను.”
లేదా “కోడెదూడలు.”
పదకోశం చూడండి.
లేదా “పంజా.”
అక్ష., “నా ఒకేఒక్క దాన్ని,” అతని ప్రాణాన్ని సూచిస్తుంది.
అక్ష., “విత్తనమా.”
అక్ష., “విత్తనమా.”
లేదా “మీ గుండెలు శాశ్వతంగా కొట్టుకుంటూ ఉండాలి.”