కంటెంట్‌కు వెళ్లు

మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలి?

మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలి?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిలు ఇచ్చే దిశానిర్దేశాల వల్ల మనం తిరుగులేని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే అది మనకు “తెలివిని, అవగాహనను” ఇస్తుంది. (సామెతలు 4:5) కొన్నిసార్లు మంచి నిర్ణయాలు ఏంటో సూటిగా చెప్పేస్తుంది. ఇంకొన్నిసార్లు మనమే తెలివైన నిర్ణయాలు తీసుకునేలా దారి చూపిస్తుంది.

ఈ ఆర్టికల్‌లో

 మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సలహాలు

  •   తొందరపడి నిర్ణయం తీసుకోకండి. బైబిలు ఇలా చెప్తుంది: “వివేకం గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు.” (సామెతలు 14:15) మీరు తొందరపడి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమైన విషయాల్ని చూసీచూడనట్టు వదిలేయవచ్చు. కాబట్టి సమయం తీసుకుని అన్నివైపుల నుండి జాగ్రత్తగా ఆలోచించండి.—1 థెస్సలొనీకయులు 5:21.

  •   మీకు అనిపించేదాన్ని బట్టి, కోరికల్ని బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోకండి. మన మనసు చెప్పేది ఎప్పుడూ కరెక్ట్‌ కాకపోవచ్చని బైబిలు చెప్తుంది. (సామెతలు 28:26; యిర్మీయా 17:9) ఉదాహరణకు ఆవేశంలో, నిరాశలో, చిరాకులో లేదా డీలా పడినప్పుడు, బాగా అలసిపోయినప్పుడు మనం మంచి నిర్ణయాలు తీసుకోకపోవచ్చు.—సామెతలు 24:10; 29:22.

  •   తెలివి కోసం అడగండి. (యాకోబు 1:5) తెలివి కోసం మనం చేసే ప్రార్థనల్ని దేవుడు వింటాడు. అనవసరంగా చిక్కుల్లో పడకూడదని తన పిల్లల గురించి ఆలోచించే ప్రేమగల తండ్రిలా ఆయన ఉన్నాడు. ఎందుకంటే, “తెలివిని ఇచ్చేది యెహోవాయే; ఆయన నోటి నుండే జ్ఞానం, వివేచన వస్తాయి.” a (సామెతలు 2:6) అలాంటి తెలివిని తన వాక్యమైన బైబిలు ద్వారా ఇస్తున్నాడు.—2 తిమోతి 3:16, 17.

  •   నమ్మదగిన సమాచారం కోసం వెదకండి. మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే నమ్మదగిన సమాచారం మీ దగ్గర ఉండాలి. బైబిలు ఇలా చెప్తుంది: “తెలివిగలవాళ్లు విని, మరింత ఉపదేశం పొందుతారు.” (సామెతలు 1:5) మరి అలాంటి సహాయపడే నమ్మదగిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది?

     మీరు ఆలోచిస్తున్న వాటిని బైబిల్లో వెదకండి. ఎందుకంటే, మనకు ఏది మంచిదో మన సృష్టికర్తకు బాగా తెలుసు. అందుకనే మనకు బాగా పనికొచ్చే వాటిని తన బైబిల్లో రాయించాడు. (కీర్తన 25:12) కొన్ని నిర్ణయాల విషయంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఆజ్ఞల్ని బైబిలు సూటిగా చెప్తుంది. (యెషయా 48:17, 18) కానీ ఇంకొన్ని విషయాల్లో అలా సూటిగా చెప్పకపోయినా, కొన్ని సత్యాల్ని సూత్రాల రూపంలో ఇస్తుంది. వాటివల్ల మనకు నచ్చింది చేస్తూనే మనం మంచి నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి లేఖనాల్ని ఈ వెబ్‌సైట్‌లో ఉన్న కొన్ని ఆర్టికల్స్‌లో, పత్రికల్లో వెదకండి. b

     మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వేరే నమ్మదగిన సమాచారాన్ని కూడా వెదకాల్సి రావచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా ఖరీదైన వస్తువు కొంటున్నప్పుడు ఆ వస్తువు గురించి, ఆ వస్తువును తయారుచేసే కంపెనీ గురించి, దాని వారెంటి గురించి, అది మనకు నచ్చకపోతే తిరిగి పంపించే పాలసీ గురించి వెదకండి. అలాగే ఆ వస్తువు అసలు మీ అవసరాల్ని తీరుస్తుందో లేదో కూడా చూడండి.

     “ఒకరితో ఒకరు సంప్రదించుకోకపోతే ప్రణాళికలు విఫలమౌతాయి” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 15:22) కాబట్టి మీరు ఏదైన నిర్ణయం తీసుకునేముందు, నమ్మకస్థులు అనిపించేవాళ్లతో మాట్లాడండి. ఉదాహరణకు, మీ ఆరోగ్యం విషయంలో నిర్ణయం తీసుకునేముందు డాక్టర్‌ని కలవండి. (మత్తయి 9:12) ఇంకొన్నిసార్లు మీలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్న వాళ్లతో మాట్లాడండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు మాట్లాడేవాళ్లు మీకు బదులుగా నిర్ణయం తీసుకోరు. మీ నిర్ణయం మీరే తీసుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితాలు మీరే ఎదుర్కోవాలి.—గలతీయులు 6:4, 5.

  •   అన్ని కోణాల నుండి చూడండి. మీకు దొరికిన సమాచారాన్నిబట్టి వేర్వేరు నిర్ణయాల్ని రాసిపెట్టుకోండి. ప్రతి నిర్ణయంవల్ల మంచేంటో, చెడేంటో రాసిపెట్టుకోండి. ఆ నిర్ణయంవల్ల ఏం జరుగుతుందో నిజాయితీగా ఆలోచించండి. (ద్వితీయోపదేశకాండం 32:29) ఆ నిర్ణయం మీకు, మీ కుటుంబానికి, ఇతరులకు మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా? (సామెతలు 22:3; రోమీయులు 14:19) ఈ ప్రశ్నకు బైబిలు కోణం నుండి జవాబు తెలుసుకుంటే మీరు మంచి, తెలివైన నిర్ణయం తీసుకుంటారు.

  •   నిర్ణయం తీసుకోవడానికి వెనకాడకండి. కొన్నిసార్లు ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు. కానీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతే మనకున్న మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటాం, మనకు ఇష్టంలేని పని చేయాల్సిరావచ్చు. మరో మాటలో చెప్పాలంటే అసలు ఏ నిర్ణయం తీసుకోకపోవడం, చెడ్డ నిర్ణయంతో సమానం. ఒక రైతు ఉదాహరణ చెప్తూ బైబిలు ఇలా అంటుంది: “మంచి గాలి కోసం, మంచి వాతావరణం కోసం ఎదురుచూసే వ్యక్తి విత్తలేడు, పంట కోయలేడు.”—ప్రసంగి 11:4, గుడ్‌ న్యూస్‌ ట్రాన్స్‌లేషన్‌.

 మనం ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా అన్నిసార్లు దానివల్ల మంచే జరగకపోవచ్చు. మనకు ఏదైన ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి. అంతేకాదు కొన్నిసార్లు అనుకోని సంఘటనలు కూడా జరగవచ్చు. (ప్రసంగి 9:11) కాబట్టి మనకు దొరికిన సమాచారాన్ని బట్టి వీలైనంత మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి.

 నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలా?

 మనం ఏదైన నిర్ణయం తీసుకుంటే అన్నిసార్లు, అదే ఫైనల్‌ అని చెప్పలేం. ఎందుకంటే మన పరిస్థితులు మారవచ్చు లేదా ఇంతకుముందు తీసుకున్న నిర్ణయంవల్ల చేదు అనుభవాలు ఎదురవ్వవచ్చు. కాబట్టి మన పరిస్థితుల్ని మళ్లీ ఒకసారి ఆలోచించి మంచి ఫలితాలు వచ్చే నిర్ణయాల్ని తీసుకోవాల్సిరావచ్చు.

 కొన్ని నిర్ణయాలు మార్చకూడదు. (కీర్తన 15:4) ఉదాహరణకు భార్యాభర్తలిద్దరూ తమ పెళ్లి ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. c (మలాకీ 2:16; మత్తయి 19:6) అందుకే వాళ్ల మధ్య ఏదైన సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలే గానీ విడిపోకూడదు.

 నేను మార్చలేని తెలివితక్కువ నిర్ణయం తీసుకుంటే?

 మనం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పిచ్చి నిర్ణయం తీసుకుని ఉంటాం. (యాకోబు 3:2, అధస్సూచి) అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నామా అని బాధపడడం సహజమే. (కీర్తన 69:5) అలా బాధపడడం కొంతవరకు మంచిదే. దానివల్ల అలాంటి నిర్ణయమే మళ్లీ తీసుకోకుండా ఉంటాం. (సామెతలు 14:9) కానీ అతిగా బాధపడొద్దు అని బైబిలు చెప్తుంది. ఎందుకంటే దానివల్ల నిరాశలో కూరుకుపోయే అవకాశం ఉంది. (2 కొరింథీయులు 2:7) d “యెహోవా కరుణ, కనికరం గల దేవుడు” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 103:8-13) కాబట్టి ఆ పిచ్చి నిర్ణయం నుండి నేర్చుకోండి. మీ పరిస్థితుల్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించండి.

a యెహోవా దేవుని పేరు అని బైబిలు చెప్తుంది.—కీర్తన 83:18.

b మీరు తీసుకోవాలనుకుంటున్న నిర్ణయానికి సంబంధించి, పదాల్ని టైప్‌ చేసి jw.orgలో వెదకవచ్చు. చాలా విషయాల్లో బైబిలిచ్చే సలహాలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అంతేకాదు, పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంలోని “బైబిలు పదాల అకారాది పట్టిక”లో ప్రత్యేకంగా ఒక పదం గురించి వెదకవచ్చు.

c భార్యాభర్తలు జీవించినంత కాలం కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే, భార్యాభర్తల్లో ఎవరో ఒకరు లైంగిక పాపం చేస్తేనే ఆయన విడాకులు తీసుకోవడాన్ని, మళ్లీ పెళ్లి చేసుకోవడాన్ని అనుమతిస్తాడు. (మత్తయి 19:9) మీ వివాహ జీవితంలో సమస్యలు వస్తే, వాటిని పరిష్కరించుకోవడానికి బైబిలు ప్రేమగా, తెలివిగా సహాయం చేస్తుంది.

d దీని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, “తప్పు చేసి, బాధతో కుమిలిపోతున్నా—బైబిలు ఎలా సహాయం చేస్తుంది?” అనే ఇంగ్లీష్‌ ఆర్టికల్‌ చూడండి.