ప్రసంగి 11:1-10
11 నీ ఆహారం నీళ్ల మీద వేయి,+ చాలా రోజుల తర్వాత అది మళ్లీ నీకు దొరుకుతుంది.+
2 నీకున్న దానిలో కొంత ఏడుగురికి, ఎనిమిదిమందికి ఇవ్వు;+ ఎందుకంటే భూమ్మీద ఏ విపత్తు వస్తుందో నీకు తెలీదు.
3 మేఘాలు నీళ్లతో నిండితే అవి భూమ్మీద వర్షం కురిపిస్తాయి; చెట్టు దక్షిణం వైపు పడినా, ఉత్తరం వైపు పడినా, అది పడిన చోటే ఉంటుంది.
4 గాలిని గమనించేవాడు విత్తడు, మేఘాల్ని చూసేవాడు పంట కోయడు.+
5 స్త్రీ గర్భంలోని శిశువు ఎముకల్లో జీవశక్తి* ఎలా పనిచేస్తుందో+ నీకు తెలీదు, అలాగే అన్నిటినీ చేసే సత్యదేవుని పని నీకు తెలీదు.+
6 ఉదయం విత్తనాలు విత్తు, సాయంత్రం వరకు నీ చేతికి విశ్రాంతినివ్వకు;+ ఎందుకంటే అవి ఎదుగుతాయో, ఇవి ఎదుగుతాయో లేక రెండూ ఎదుగుతాయో నీకు తెలీదు.
7 వెలుగు మనోహరమైనది, కళ్లు సూర్యుణ్ణి చూడడం మంచిది.
8 ఒక మనిషి చాలా ఏళ్లు బ్రతికితే, అతను ప్రతీరోజు సంతోషంగా గడపాలి.+ అయితే దుఃఖకరమైన రోజులు చాలా ఉండొచ్చని అతను గుర్తుంచుకోవాలి; రాబోయేదంతా వ్యర్థం.+
9 యౌవనుడా, నీ యౌవనంలో సంతోషించు; నీ యౌవనకాలంలో నీ హృదయాన్ని సంతోషంగా ఉండనివ్వు. నీ హృదయం నడిపించే మార్గాల్లో నడువు, నీ కళ్లు చూపించే వైపు వెళ్లు; అయితే వాటన్నిటిని బట్టి సత్యదేవుడు నిన్ను లెక్క అడుగుతాడని* తెలుసుకో.+
10 కాబట్టి నీ హృదయంలో నుండి ఇబ్బందిపెట్టే వాటిని, నీ శరీరంలో నుండి హానికరమైన వాటిని తీసేసుకో; ఎందుకంటే యౌవనం, యుక్తవయసు వ్యర్థం.+
అధస్సూచీలు
^ ఇది దేవుని పవిత్రశక్తిని కూడా సూచించవచ్చు. పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “తీర్పులోకి తెస్తాడని.”