కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు అవసరం?

మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు అవసరం?

మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు అవసరం?

‘నీవే నా దేవుడవు. దయగల నీ ఆత్మ నన్ను నడిపించును గాక.’ —కీర్త. 143:10.

1. ఒక అదృశ్యమైన శక్తి మనల్ని నడిపించగలదని చెప్పేందుకు ఉదాహరణనివ్వండి.

 మీరు ఎప్పుడైనా దిక్సూచిని చూశారా? అది దిశను సూచించే ఒక సాధారణ పరికరం. దానిలో ఉండే అయస్కాంతపు ముల్లు అదృశ్యమైన అయస్కాంతపు శక్తి వల్ల దానంతటదే కదులుతూ ఎప్పుడూ ఉత్తర దిక్కునే చూపిస్తుంది. సముద్ర మార్గాన, నేల మార్గాన ప్రయాణిస్తున్నప్పుడు దారి కనుక్కోవడానికి ప్రజలు ఎన్నో శతాబ్దాలుగా దిక్సూచిని ఉపయోగిస్తున్నారు.

2, 3. (ఎ) కోటానుకోట్ల సంవత్సరాల క్రితం యెహోవా ఏ గొప్ప శక్తిని ఉపయోగించాడు? (బి) దేవుని అదృశ్య శక్తి ఇప్పుడు మనల్ని నడిపించాలని మనం ఎందుకు కోరుకోవాలి?

2 మనకు నడిపింపునిచ్చే మరింత ప్రాముఖ్యమైన అదృశ్య శక్తి మరొకటి ఉంది. అదేమిటో మీకు తెలుసా? దాని గురించి, బైబిల్లోని ప్రారంభపు వచనాల్లో ఉంది. కోటానుకోట్ల సంవత్సరాల క్రితం యెహోవా చేసినదాని గురించి ఆదికాండము ఇలా చెబుతోంది, “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” అలా సృష్టించడానికి ఆయన ఒక గొప్ప శక్తిని ఉపయోగించాడు. అందుకే, “దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను” అని సృష్టిని గురించిన వృత్తాంతం చెబుతోంది. (ఆది. 1:1, 2) అవును, సమస్త సృష్టిని చేయడానికి దేవుడు ఉపయోగించిన గొప్ప శక్తే పరిశుద్ధాత్మ. ఆ శక్తిని ఉపయోగించి మనకు జీవాన్ని ఇచ్చినందుకు, మిగతా సృష్టిని చేసినందుకు మనం యెహోవాకు కృతజ్ఞత చూపిస్తాం.—యోబు 33:4; కీర్త. 104:30.

3 దేవుడు ఆ శక్తిని ఉపయోగించే మనకు జీవాన్నిచ్చాడు కాబట్టి అది మన జీవితంలో మరే విధంగానైనా పని చేస్తుందా? అలా పని చేయగలదని దేవుని కుమారుడైన యేసుకు తెలుసు. ఎందుకంటే, ‘ఆత్మ మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును’ అని ఆయన తన శిష్యులతో చెప్పాడు. (యోహా. 16:13) యేసు ఇక్కడ ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు? అది మనల్ని నడిపించాలని మనం ఎందుకు కోరుకోవాలి?

పరిశుద్ధాత్మ అంటే ఏమిటి?

4, 5. (ఎ) త్రిత్వాన్ని నమ్మేవాళ్ళు పరిశుద్ధాత్మ గురించి ఏమని తప్పుగా అనుకుంటారు? (బి) పరిశుద్ధాత్మ అంటే ఏమిటో మీరెలా వివరిస్తారు?

4 పరిచర్యలో మనం కలిసే కొంతమందికి పరిశుద్ధాత్మ విషయంలో లేఖన విరుద్ధమైన అభిప్రాయం ఉండవచ్చు. త్రిత్వాన్ని నమ్మేవాళ్ళు పరిశుద్ధాత్మ అంటే దేవునితో సమానమైన ఒక అదృశ్య వ్యక్తని తప్పుగా అనుకుంటారు. (1 కొరిం. 8:6) కానీ త్రిత్వ సిద్ధాంతం లేఖన విరుద్ధమైనదని సుళువుగా నిరూపించవచ్చు.

5 ఇంతకీ పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? వాయువు లేదా గాలి కంటికి కనిపించకపోయినా దాని ప్రభావం మనకు తెలుస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ మన కంటికి కనిపించకపోయినా అది ఎన్నో పనులు జరగడానికి తోడ్పడుతుంది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదు. అది దేవుడు ఉపయోగించే శక్తి. తాను అనుకున్నది జరిగించడానికి ఆయన దాన్ని ప్రజల మీద లేదా వస్తువుల మీద ఉపయోగిస్తాడు. అంతటి అద్భుతమైన శక్తి సర్వశక్తిగల దేవుని నుండి వస్తుందంటే నమ్మడం కష్టమా? ఎంత మాత్రమూ కాదు!—యెషయా 40:12, 13 చదవండి.

6. దావీదు యెహోవాను ఏ ప్రత్యేకమైన కోరిక కోరాడు?

6 యెహోవా మనల్ని జీవితాంతం తన శక్తితో నడిపిస్తాడా? ఆయన కీర్తనకర్తయైన దావీదుకు ఇలా వాగ్దానం చేశాడు, “నీకు ఉపదేశము చేసెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను.” (కీర్త. 32:8) దావీదు తనకు అలాంటి నడిపింపు కావాలని కోరుకున్నాడు, అందుకే ఆయన యెహోవాను ఇలా వేడుకున్నాడు, ‘నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ నన్ను నడిపించును గాక.’ (కీర్త. 143:10) దావీదుకు ఉన్నట్లే మనకు కూడా పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలనే కోరిక ఉండాలి. ఎందుకు? నాలుగు కారణాలను పరిశీలిద్దాం.

మనల్ని మనం నిర్దేశించుకోలేం

7, 8. (ఎ) దేవుని సహాయం లేకుండా మనల్ని మనం ఎందుకు నిర్దేశించుకోలేకపోతున్నాం? (బి) ఈ దుష్టలోకంలో మన జీవితాల్ని సొంతగా నిర్దేశించుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదో ఒక ఉదాహరణతో చెప్పండి.

7 పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలని మనం కోరుకోవడానికి గల మొదటి కారణం ఏమిటంటే, మన జీవితాల్ని నిర్దేశించుకునే సామర్థ్యం మనకు లేదు. ఎందుకంటే యెహోవా మనల్ని ఆ సామర్థ్యంతో సృష్టించలేదు, ముఖ్యంగా ఈ అపరిపూర్ణ స్థితిలో మనమలా చేయలేం. యిర్మీయా ప్రవక్త ఇలా రాశాడు, “యెహోవా! మనిషి త్రోవ తన వశములో లేదని నాకు తెలుసు. తన అడుగులు సరిగా వేయడం మనిషి తరం కాదు.” (యిర్మీ. 10:23, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఎందుకు? మనల్ని మనం ఎందుకు నిర్దేశించుకోలేమో తెలియజేస్తూ దేవుడు యిర్మీయా ద్వారా ఇలా చెప్పాడు, “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?”—యిర్మీ. 17:9; మత్త. 15:19.

8 ఒక వ్యక్తి తనకు దారి అంతగా తెలియని ఒక అడవి గుండా వెళ్తున్నాడనుకుందాం. దారి తెలిసిన వ్యక్తి తోడు లేకుండా, దిక్సూచి లేకుండా ఒంటరిగా వెళ్ళడం మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి ప్రదేశంలో ఎలా వెళ్ళాలో, అక్కడనుండి సురక్షితంగా ఎలా బయటపడాలో తెలియకపోతే అతని ప్రాణానికే ప్రమాదం. అలాగే ఈ దుష్టలోకంలో దేవుని నడిపింపును అనుసరించకుండా తమ సొంత సామర్థ్యంతో తమ జీవితాల్ని నిర్దేశించుకోగలమని అనుకునేవాళ్ళ ప్రాణాలు కూడా ఘోరమైన ప్రమాదంలో పడతాయి. కాబట్టి మనం దావీదులాగే యెహోవాను ఇలా వేడుకోవాలి, “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము.” (కీర్త. 25:4; 23:3) అలాంటి నడిపింపును మనమెలా పొందవచ్చు?

9. పదిహేడవ పేజీలో చూపించినట్లుగా పరిశుద్ధాత్మ మనకు ఎలా నడిపింపునిస్తుంది?

9 మనం వినయంగా, ఇష్టపూర్వకంగా యెహోవా నిర్దేశం కోరితే ఆయన తన పరిశుద్ధాత్మతో మనకు నడిపింపునిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయం చేస్తుంది? యేసు తన శిష్యులకు ఇలా వివరించాడు, “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.” (యోహా. 14:26) మనం క్రీస్తు బోధలన్నిటితో పాటు దేవుని వాక్యాన్ని క్రమంగా, ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేస్తే యెహోవా లోతైన జ్ఞానం గురించిన మన అవగాహన పెంచుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. అప్పుడు మనం ఆయన చిత్తాన్ని మరింత బాగా చేయగలుగుతాం. (1 కొరిం. 2:10) మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనకు అవసరమైన నడిపింపును పరిశుద్ధాత్మ ఇస్తుంది, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటితో వ్యవహరించడానికి కావాల్సిన బైబిలు సూత్రాలను మనకు గుర్తుచేస్తుంది.

పరిశుద్ధాత్మ యేసును నడిపించింది

10, 11. దేవుని అద్వితీయ కుమారుడు పరిశుద్ధాత్మ ఏమి చేయాలని ఆశించాడు? అది ఆయనకు ఎలా సహాయం చేసింది?

10 పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలని మనం కోరుకోవడానికి గల రెండవ కారణం ఏమిటంటే, దేవుడు తన సొంత కుమారుణ్ణే పరిశుద్ధాత్మతో నడిపించాడు. దేవుని అద్వితీయ కుమారునికి భూమ్మీదకు రాకముందే ఈ ప్రవచనం గురించి తెలుసు, “యెహోవా ఆత్మ, జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును.” (యెష. 11:2) యేసు భూమ్మీద ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ సహాయం కోసం ఎంత ఆశగా ఎదురుచూసి ఉంటాడో ఊహించండి!

11 ఆ ప్రవచనంలోని యెహోవా మాటలు నెరవేరాయి. యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే ‘పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడ్డాడు’ అని సువార్త వృత్తాంతం చెబుతోంది. (లూకా 4:1) యేసు ఉపవాసం ఉండి, ప్రార్థిస్తూ, ధ్యానిస్తున్న సమయంలో ముందుముందు ఏమి జరగబోతుందో యెహోవా ఆయనకు తెలియజేసివుండవచ్చు. యేసు ఆలోచనల్ని, నిర్ణయాల్ని నిర్దేశిస్తూ పరిశుద్ధాత్మ ఆయన మనసుపై, హృదయంపై పనిచేసింది. అందుకే ఏ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలో యేసు తెలుసుకోగలిగాడు. ఆయన తన తండ్రి చేయమన్నదే చేశాడు.

12. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలని మనం ఎందుకు ప్రార్థించాలి?

12 యేసుకు తన జీవితంలో పరిశుద్ధాత్మ సహాయం ఉండడం వల్ల వచ్చిన మంచి ఫలితాల గురించి తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం కోసం వేడుకోవడం, దాని నడిపింపును పొందడం ఎంత ప్రాముఖ్యమో తన శిష్యులకు కూడా తెలియజేశాడు. (లూకా 11:9-13 చదవండి.) మనకు పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు అవసరం? ఎందుకంటే అది మన ఆలోచనావిధానాన్ని సరిచేస్తుంది, అప్పుడు మనం కూడా క్రీస్తు మనసును కలిగివుండగలుగుతాం. (రోమా. 12:2; 1 కొరిం. 2:16) మన జీవితాల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మను అనుమతించడం ద్వారా మనం క్రీస్తు మాదిరిని అనుకరిస్తాం.—1 పేతు. 2:21.

లౌకికాత్మ మనల్ని తప్పుదారి పట్టిస్తుంది

13. లౌకికాత్మ అంటే ఏమిటి? అది మనమెలా ప్రవర్తించేలా చేస్తుంది?

13 పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలని మనం కోరుకోవడానికి గల మూడవ కారణం ఏమిటంటే, పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే లౌకికాత్మ మనల్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. నేడు లోకంలోని చాలామంది ఆ లౌకికాత్మ చెప్పుచేతల్లోనే ఉన్నారు. అది పరిశుద్ధాత్మ నడిపింపుకు విరుద్ధంగా ప్రవర్తించేలా చేస్తుంది. అది ప్రజల్లో క్రీస్తు మనసును పెంపొందించే బదులు ఈ లోక పరిపాలకుడైన సాతానులా ఆలోచించేటట్లు, ప్రవర్తించేటట్లు చేస్తుంది. (ఎఫెసీయులు 2:1-3; తీతు 3:3 చదవండి.) ఒక వ్యక్తి దానికి లొంగిపోయి శరీరకార్యాలు చేయడం మొదలుపెడితే ఆయనకు ఘోరమైన పరిణామాలు ఎదురౌతాయి, చివరకు ఆయన దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోవచ్చు.—గల. 5:19-21.

14, 15. లౌకికాత్మను ఎదిరించడంలో ఎలా విజయం సాధించవచ్చు?

14 లౌకికాత్మను ఎదిరించడానికి యెహోవా మనల్ని సిద్ధం చేశాడు. ‘ప్రభువు యొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. అప్పుడు మీరు ఆపద్దినమందు నిలువబడుటకు శక్తిమంతులగుదురు’ అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (ఎఫె. 6:10, 13) మనల్ని తప్పుదారి పట్టించేందుకు సాతాను చేసే ప్రయత్నాల్ని తట్టుకొని నిలబడడానికి యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని బలపరుస్తాడు. (ప్రక. 12:9) లౌకికాత్మ చాలా శక్తివంతమైనది, దాని బారినపడకుండా మనం పూర్తిగా తప్పించుకోలేం. కానీ దాన్ని ఎదిరించవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దానికన్నా శక్తివంతమైనది, మనకు సహాయం చేస్తుంది.

15 మొదటి శతాబ్దంలో క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టినవాళ్ళు “తిన్ననిమార్గమును విడిచి . . . త్రోవ తప్పిపోయిరి” అని అపొస్తలుడైన పేతురు రాశాడు. (2 పేతు. 2:15) “లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను” పొందినందుకు మనమెంత కృతజ్ఞులమో కదా! (1 కొరిం. 2:12) ఆ ఆత్మ సహాయం తీసుకొని, ఆధ్యాత్మికంగా మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి యెహోవా చేసిన ఏర్పాట్లను పూర్తిగా ఉపయోగించుకుంటే ఈ దుష్టలోకంలోని సాతాను ఆత్మను ఎదిరించగలుగుతాం.—గల. 5:16.

పరిశుద్ధాత్మ మంచి లక్షణాల్ని పెంపొందిస్తుంది

16. పరిశుద్ధాత్మ మనలో ఎలాంటి మంచి లక్షణాల్ని పెంపొందిస్తుంది?

16 పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలని మనం కోరుకోవడానికి గల నాలుగవ కారణం ఏమిటంటే, దాని నడిపింపును అనుసరించేవాళ్ళలో అది మంచి లక్షణాల్ని పెంపొందిస్తుంది. (గలతీయులు 5:22, 23 చదవండి.) మరింత ప్రేమగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలని మనలో ఎవరం మాత్రం కోరుకోం? దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం ఇంకా ఎక్కువగా చూపించాలని మనలో ఎవరం మాత్రం ఇష్టపడం? విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం మరింత బాగా పెంపొందించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల్ని ఎవరం మాత్రం కాదనుకుంటాం? మనకు, మన కుటుంబ సభ్యులకు, ఇతరులకు, తోటి సహోదరులకు ప్రయోజనం చేకూర్చే మంచి లక్షణాల్ని పరిశుద్ధాత్మ మనలో పెంపొందేలా చేస్తుంది. అయితే వాటిని పెంపొందించుకునేందుకు మనం కృషి చేస్తూనే ఉండాలి. అలా మనం ఎన్ని మంచి లక్షణాలనైనా పెంపొందించుకోవచ్చు.

17. ఆత్మఫలంలోని లక్షణాలను సాధ్యమైనంత ఎక్కువగా పెంపొందించుకోవడానికి మనం ఏమి చేయాలి?

17 మన మాటలు, మన పనులు మనం పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరిస్తున్నామని, మంచి లక్షణాల్ని పెంపొందించుకుంటున్నామని చూపిస్తున్నాయా లేదా అని పరిశీలించుకోవడం మంచిది. (2 కొరిం. 13:5; గల. 5:25) మనం పరిశుద్ధాత్మ ఫలంలోని కొన్ని లక్షణాల్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మనకు అనిపిస్తే పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరించడానికి మరింతగా ప్రయత్నించాలి. అందుకోసం బైబిలును, మన క్రైస్తవ ప్రచురణలను ఉపయోగించి ఈ లక్షణాల్లో ఒక్కోదాని గురించి అధ్యయనం చేయాలి. అలాచేస్తే, మన దైనందిన జీవితంలో ఆ లక్షణాలను ఎలా చూపించవచ్చో తెలుసుకోగలుగుతాం, అప్పుడు ఆ లక్షణాలను మరింత బాగా చూపించేందుకు కృషి చేయగలుగుతాం. a పరిశుద్ధాత్మ మన జీవితంలో, తోటి క్రైస్తవుల జీవితాల్లో పని చేయడం వల్ల వచ్చిన ఫలితాలను మనం గమనిస్తే మనమెందుకు ఆ ఆత్మ ద్వారా నడిపించబడాలో స్పష్టంగా అర్థమవుతుంది.

మీరు పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడుతున్నారా?

18. పరిశుద్ధాత్మ నడిపింపును అంగీకరించే విషయంలో యేసు మనకు ఎలా మాదిరిగా ఉన్నాడు?

18 మానవునిగా ఉన్నప్పుడు యేసు జీవితంలో పరిశుద్ధాత్మ ఎంత శక్తివంతంగా పనిచేసిందో బైబిలు చెబుతోంది. ఆయన పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకున్నాడు, ఆ ఆత్మ ఏదైనా పని చేయమని నిర్దేశించినప్పుడు ఆయన దాన్ని అంగీకరించి దాని ప్రకారమే చేశాడు. (మార్కు 1:12, 13; లూకా 4:14) మీరు కూడా అలాగే చేస్తారా?

19. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలంటే మనమేమి చేయాలి?

19 ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడడానికి ఇష్టపడేవాళ్ళ మనసులపై, హృదయాలపై అది పనిచేసి వాళ్ళను నడిపిస్తుంది. అది మనల్ని సరైన దిశలో నడిపించేందుకు మనం దానినెలా అనుమతించవచ్చు? తన ఆత్మను అనుగ్రహించి, దాని నడిపింపుకు లోబడేలా సహాయం చేయమని యెహోవాకు ఎల్లప్పుడూ ప్రార్థించాలి. (ఎఫెసీయులు 3:14-16 చదవండి.) పరిశుద్ధాత్మ సహాయంతో రాయబడిన దేవుని వాక్యమైన బైబిలును చదవడం ద్వారా దాని నడిపింపుకు లోబడాలని కోరుకుంటున్నట్లు చూపించాలి. (2 తిమో. 3:16, 17) అదిచ్చే జ్ఞానవంతమైన సూచనలను పాటిస్తూ, పరిశుద్ధాత్మ నడిపింపును అంగీకరించాలి. ఈ దుష్టలోకంలో సరైన విధంగా నడిపించేందుకు యెహోవాకు శక్తి ఉందని నమ్మకం కలిగివుండాలి.

[అధస్సూచి]

a ఆత్మఫలంలోని ఒక్కొక్క లక్షణం గురించి మరింత తెలుసుకోవడం కోసం కావలికోట జూలై 15, 2007, 24-25 పేజీలు, కావలికోట ఏప్రిల్‌ 15, 2011, 18-27 పేజీలు చూడండి.

ముఖ్యమైన విషయాలు గుర్తున్నాయా?

• పరిశుద్ధాత్మ మనల్ని ఎలా నడిపిస్తుంది?

• పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలని మనం కోరుకోవడానికి గల నాలుగు కారణాలు ఏమిటి?

• పరిశుద్ధాత్మ నడిపింపు నుండి మనం పూర్తిగా ఎలా ప్రయోజనం పొందవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

యేసు ఆలోచనలను, నిర్ణయాలను పరిశుద్ధాత్మ నిర్దేశించింది

[17వ పేజీలోని చిత్రం]

పరిశుద్ధాత్మ ప్రజల మనసులపై, హృదయాలపై పనిచేసి వాళ్ళను నడిపిస్తుంది