కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని కృప గురించిన సువార్త ప్రకటించండి

దేవుని కృప గురించిన సువార్త ప్రకటించండి

‘దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమివ్వండి.’అపొ. 20:24.

పాటలు: 10, 25

1, 2. దేవుడు తనపై కృప చూపించినందుకు అపొస్తలుడైన పౌలు ఎలా కృతజ్ఞత చూపించాడు?

 అపొస్తలుడైన పౌలు నమ్మకంగా ఇలా చెప్పగలిగాడు, “నాకు అనుగ్రహింపబడిన ఆయన [దేవుని] కృప నిష్ఫలము కాలేదు.” (1 కొరింథీయులు 15:9, 10 చదవండి.) దేవుని గొప్ప కనికరానికి తాను అర్హుణ్ణి కాదని పౌలుకు తెలుసు. ఎందుకంటే అతను ఒకప్పుడు క్రైస్తవుల్ని హింసించాడు.

2 పౌలు చనిపోవడానికి కొంతకాలం ముందు తిమోతికి ఇలా రాశాడు, “తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనై యున్నాను.” (1 తిమో. 1:12-14) ఇంతకీ ఏంటా పరిచర్య? ఎఫెసు సంఘంలోని పెద్దలకు పౌలు ఇలా చెప్పాడు, “దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.”—అపొ. 20:24.

3. యేసు పౌలుకు ఏ బాధ్యత అప్పగించాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

3 పౌలు ప్రకటించిన “సువార్త” ఏంటి? దానిలో యెహోవా కృప ఎలా కనిపించింది? ఎఫెసులో ఉన్న క్రైస్తవులకు పౌలు ఇలా చెప్పాడు, “మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారు.” (ఎఫె. 3:1, 2) యూదులుకాని వాళ్లకు సువార్త ప్రకటించమని యేసు పౌలుకు చెప్పాడు. దానివల్ల వివిధ దేశాలకు చెందిన ప్రజలకు మెస్సీయతోపాటు పరిపాలించే అవకాశం దొరికింది. (ఎఫెసీయులు 3:5-11 చదవండి.) పౌలు ఉత్సాహంగా సువార్త ప్రకటించి నేడున్న క్రైస్తవులకు చక్కని ఆదర్శం ఉంచాడు. అలా దేవుడు తనపై చూపించిన కృప “నిష్ఫలము” కాలేదని పౌలు చూపించాడు.

ప్రకటించాలనే కోరికను దేవుని కృప మీలో కలిగిస్తుందా?

4, 5. ‘దేవుని కృపాసువార్త,’ రాజ్యసువార్త లాంటిదే అని ఎందుకు చెప్పవచ్చు?

4 ఈ చివరిరోజుల్లో, ‘రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతా ప్రకటించే’ బాధ్యత యెహోవా సేవకులకు ఉంది. (మత్త. 24:14) ఓ విధంగా ‘దేవుని కృపాసువార్త,’ రాజ్యసువార్త లాంటిదే. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే దేవుని రాజ్యంలో మనం పొందబోయే ఆశీర్వాదాలన్నీ యెహోవా కృపనుబట్టే పొందుతాం. (ఎఫె. 1:3) అందుకే పౌలు యెహోవా చూపించిన కృపకు కృతజ్ఞతగా సువార్తను ఉత్సాహంగా ప్రకటించాడు. మరి మనం పౌలును ఆదర్శంగా తీసుకుని ఉత్సాహంగా సువార్త ప్రకటిస్తున్నామా?—రోమీయులు 1:14-16 చదవండి.

5 పాపులైన మనం యెహోవా చూపించే కృప నుండి ఎన్ని విధాలుగా ప్రయోజనం పొందుతున్నామో ముందటి ఆర్టికల్‌లో చూశాం. అయితే దేవుని కృప నుండి మనందరం ఎంతో ప్రయోజనం పొందుతున్నాం కాబట్టి, యెహోవా ప్రేమను ఎలా చూపిస్తున్నాడో, దాన్నుండి ఇతరులు ఎలా ప్రయోజనం పొందవచ్చో బోధించాల్సిన బాధ్యత మనకుంది. దేవుని కృపకు కృతజ్ఞత చూపించేలా ఇతరులకు మనం ఏయే విధాలుగా సహాయం చేయవచ్చు?

విమోచన క్రయధనం గురించిన సువార్త ప్రకటించండి

6, 7. విమోచన క్రయధనం గురించి ఇతరులకు చెప్తున్నప్పుడు, దేవుని కృపాసువార్తను ప్రకటిస్తున్నామని ఎలా చెప్పవచ్చు?

6 నేడు చాలామంది పాపం చేసినప్పుడు ఏమాత్రం బాధపడరు. అందుకే విమోచన క్రయధనం ఎందుకు అవసరమో వాళ్లకు అర్థంకాదు. మరోవైపు, తమ జీవన విధానం నిజమైన సంతోషాన్ని ఇవ్వట్లేదని చాలామంది గుర్తిస్తున్నారు. అంతేకాదు యెహోవాసాక్షుల్ని కలిసేంతవరకు చాలామందికి పాపం అంటే ఏంటి, దానివల్ల వాళ్లు ఎలాంటి బాధలు పడుతున్నారు, వారసత్వంగా వచ్చిన పాపం నుండి బయటపడాలంటే ఏమి చేయాలి వంటి విషయాలు తెలీదు. అయితే యెహోవా ఎంతో ప్రేమ, కృపతో మనుషుల్ని పాపమరణాల నుండి విడిపించడానికి తన కొడుకును భూమ్మీదకు పంపించాడని నిజాయితీగల ప్రజలు తెలుసుకున్నప్పుడు ఆయనకు కృతజ్ఞత చూపిస్తారు.—1 యోహా. 4:9, 10.

7 యెహోవా ప్రియకుమారుని గురించి పౌలు ఇలా చెప్పాడు, “దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.” (ఎఫె. 1:7) దేవునికి మనమీద ఉన్న ప్రేమకు క్రీస్తు విమోచన క్రయధనమే గొప్ప రుజువు. దాన్నిబట్టి ఆయన కృప ఎంత గొప్పదో కూడా అర్థమౌతుంది. యేసు బలిమీద విశ్వాసం ఉంచితే మన పాపాలు క్షమించబడతాయనీ, మనం మంచి మనస్సాక్షితో ఉండవచ్చనీ తెలుసుకోవడం ఎంతో ఊరటనిస్తుంది. (హెబ్రీ. 9:14) ఇది ఇతరులతో పంచుకోవాల్సిన మంచివార్త కాదంటారా?

దేవుని స్నేహితులు అయ్యేలా ప్రజలకు సహాయం చేయండి

8. పాపులైన మనుషులు దేవునితో ఎందుకు సమాధానపడాలి?

8 యేసు బలిమీద విశ్వాసం చూపించని వాళ్లను దేవుడు తన శత్రువులుగా చూస్తాడు. అందుకే దేవుని స్నేహితులు అవ్వగలరనే విషయాన్ని వాళ్లకు చెప్పాల్సిన బాధ్యత మనకుంది. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు, “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.” (యోహా. 3:36) యేసుక్రీస్తు ఇచ్చిన బలి వల్ల మనం దేవునికి స్నేహితులు అవ్వడం సాధ్యమైంది. దానిగురించే పౌలు ఇలా చెప్పాడు, ‘గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియలవలన మీ మనస్సులో విరోధభావముగలవాళ్లునై ఉన్న మిమ్మల్ని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు సమాధానపరిచాడు.’—కొలొ. 1:21, 22.

9, 10. (ఎ) అభిషిక్త సహోదరులకు యేసుక్రీస్తు ఏ బాధ్యత అప్పగించాడు? (బి) “వేరేగొర్రెలు” అభిషిక్తులకు ఎలా సహాయం చేస్తున్నారు?

9 యేసుక్రీస్తు భూమ్మీదున్న అభిషిక్త సహోదరులకు, ‘సమాధానపరచు పరిచర్యను’ చేయాల్సిన బాధ్యత అప్పగించాడు. పౌలు అభిషిక్తులతో ఇలా అన్నాడు, “సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై—దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.”—2 కొరిం. 5:18-20.

10 అభిషిక్తులకు పరిచర్యలో సహాయం చేసే గొప్ప అవకాశం ‘వేరేగొర్రెలకు’ ఉంది. (యోహా. 10:16) వాళ్లు క్రీస్తు ‘రాయబారులుగా’ సత్యాన్ని ప్రజలకు ప్రకటిస్తూ, దేవునితో దగ్గరి సంబంధం కలిగివుండడానికి సహాయం చేస్తూ ప్రకటనాపనిలో గొప్ప పాత్ర పోషిస్తున్నారు. దేవుని కృపాసువార్తను ప్రకటించడంలో ఇది ప్రాముఖ్యమైన భాగం.

దేవుడు ప్రార్థనలు వింటాడని ప్రజలకు బోధించండి

11, 12. ప్రజలు యెహోవాకు ప్రార్థించవచ్చని తెలుసుకోవడం వాళ్లకు ఎందుకు ఓ మంచివార్త?

11 చాలామంది కేవలం మనసు ప్రశాంతంగా ఉంటుందని ప్రార్థిస్తారే తప్ప దేవుడు వింటాడనే నమ్మకంతో కాదు. అలాంటివాళ్లు యెహోవా ‘ప్రార్థన ఆలకించేవాడని’ తెలుసుకోవాలి. కీర్తనకర్త దావీదు ఇలా రాశాడు, “ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు నామీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు.”—కీర్త. 65:2, 3.

12 యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు, “నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.” (యోహా. 14:14) అంటే మనం యెహోవా చిత్తప్రకారం ఏదైనా అడగవచ్చని దానర్థం. యోహాను ఇలా రాశాడు, “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.” (1 యోహా. 5:14) ప్రార్థన కేవలం మనశ్శాంతి కోసం చేసేది కాదుగానీ, దాని ద్వారా యెహోవా ‘కృపాసనమును’ సమీపించవచ్చని ప్రజలు అర్థంచేసుకునేలా సహాయం చేయడం మనకెంతో ఆనందాన్నిస్తుంది. (హెబ్రీ. 4:16) సరైన విధంగా, సరైన వ్యక్తికి, సరైన విషయాల గురించి ప్రార్థించడం ప్రజలకు నేర్పించినప్పుడు వాళ్లు యెహోవా స్నేహితులు అవ్వగలుగుతారు. కష్టాల్లో ఓదార్పును కూడా పొందగలుగుతారు.—కీర్త. 4:1; 145:18.

కొత్తలోకంలో యెహోవా తన కృపను ఎలా చూపిస్తాడు?

13, 14. (ఎ) అభిషిక్త క్రైస్తవులకు భవిష్యత్తులో ఎలాంటి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి? (బి) మనుషుల కోసం అభిషిక్త క్రైస్తవులు ఏ గొప్ప పని చేస్తారు?

13 కొత్తలోకంలో యెహోవా తన కృపను ఇంకా ఎక్కువగా చూపిస్తాడు. ఎలా? క్రీస్తుతోపాటు పరిపాలించే 1,44,000 మందికి ఆయన ఓ గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. పౌలు ఆ అవకాశం గురించి ఇలా చెప్పాడు, “దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతోకూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము, క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.”—ఎఫె. 2:4-7.

14 పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించబోయే అభిషిక్త క్రైస్తవుల కోసం యెహోవా సిద్ధం చేసిన అద్భుతమైన విషయాల్ని ఊహించుకోవడం కష్టం. (లూకా 22:28-30; ఫిలి. 3:20, 21; 1 యోహా. 3:2) ఆయన అభిషిక్తులపై, “అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును” చూపిస్తాడు. వాళ్లు ‘కొత్త యెరూషలేముగా’ అంటే క్రీస్తుకు పెళ్లికుమార్తెగా ఉంటారు. (ప్రక. 3:12; 17:14; 21:2, 9, 10) వాళ్లు ‘జనములను స్వస్థపర్చడంలో’ యేసుతోపాటు పనిచేస్తారు. అంతేకాదు మనుషులు పాపమరణాల నుండి విడుదల పొంది, పరిపూర్ణులుగా అవ్వడానికి సహాయం చేస్తారు.—ప్రకటన 22:1, 2, 17 చదవండి.

15, 16. భవిష్యత్తులో ‘వేరేగొర్రెల’ మీద యెహోవా తన కృపను ఎలా చూపిస్తాడు?

15 “రాబోవు యుగములలో” దేవుడు తన కృపను చూపిస్తాడని ఎఫెసీయులు 2:6వ వచనంలో చదువుతాం. అప్పుడు భూమ్మీదున్న ప్రతీఒక్కరు “అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును” రుచిచూస్తారు. (లూకా 18:29, 30) యెహోవా భూమ్మీద తన కృపను చూపించే ఒక గొప్ప విధానం ఏంటంటే, “సమాధులలో” ఉన్నవాళ్లను తిరిగి బ్రతికించడమే. (యోబు 14:13-15; యోహా. 5:28, 29) ఇంతకీ ఎవరు పునరుత్థానం అవుతారు? క్రీస్తు మరణించడానికన్నా ముందు చనిపోయిన నమ్మకస్థులైన స్త్రీ, పురుషులు అలాగే చివరిరోజుల్లో యెహోవాకు నమ్మకంగా ఉండి చనిపోయిన ‘వేరేగొర్రెలు’ పునరుత్థానం అవుతారు. నమ్మకస్థులైన వీళ్లందరూ యెహోవాను మళ్లీ సేవిస్తూ ఉండేలా తిరిగి బ్రతికించబడతారు.

16 యెహోవా గురించి తెలుసుకోకుండా చనిపోయిన లక్షలమంది కూడా తిరిగి బ్రతికించబడతారు. యోహాను ఇలా రాశాడు, “గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పుపొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియలచొప్పున తీర్పుపొందెను.” (ప్రక. 20:12, 13) పునరుత్థానమైనవాళ్లకు యెహోవా గురించి నేర్చుకుని, ఆయన పరిపాలనను అంగీకరించే అవకాశం ఉంటుంది. వాళ్లు బైబిలు సూత్రాల్ని, కొత్త ‘గ్రంథాల్లో’ ఉన్న నిర్దేశాల్ని తెలుసుకుని, వాటిని తమ జీవితంలో పాటించాలి. ఆ కొత్త నిర్దేశాలు ఇవ్వడం ద్వారా కూడా యెహోవా తన కృపను చూపిస్తాడు.

సువార్త ప్రకటిస్తూ ఉండండి

17. ప్రకటనాపని ముఖ్య ఉద్దేశం ఏంటి?

17 అంతం దగ్గర్లో ఉంది కాబట్టి రాజ్యసువార్తను ప్రకటించడం ముందెప్పటికన్నా ఇప్పుడు చాలా ప్రాముఖ్యం. (మార్కు 13:10) యెహోవాను ఘనపర్చడమే మన ప్రకటనాపని ముఖ్య ఉద్దేశమని గుర్తుపెట్టుకోవాలి. కొత్తలోకంలో మనం పొందబోయే ఆశీర్వాదాలన్నీ కేవలం యెహోవా గొప్ప కృపవల్లే సాధ్యమౌతాయని ప్రజలకు ప్రకటించడం ద్వారా మనం యెహోవాను ఘనపర్చవచ్చు.

దేవుని కృప గురించిన సువార్తను ఉత్సాహంగా ప్రకటించండి.—1 పేతు. 4:10. (17-19 పేరాలు చూడండి)

18, 19. యెహోవా కృపను మనమెలా మహిమపరచవచ్చు?

18 మనం ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తు పరిపాలనలో విమోచనా క్రయధనం నుండి వచ్చే పూర్తి ప్రయోజనం పొందుతామని, క్రమక్రమంగా పరిపూర్ణులం అవుతామని ప్రజలకు వివరించవచ్చు. “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.” (రోమా. 8:20, 21) ఇది కేవలం యెహోవా కృపవల్లే సాధ్యమౌతుంది.

19 ప్రకటన 21:4-5 వచనాల్లో ఉన్న అద్భుతమైన వాగ్దానాన్ని ప్రకటించే గొప్ప అవకాశం మనకుంది. అక్కడిలా ఉంది, “ఆయన [దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” ఆ తర్వాత సింహాసనం మీద కూర్చున్న యెహోవా, “ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను . . . ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుము” అని చెప్తున్నాడు. మనం ఈ మంచివార్తను ఉత్సాహంగా ప్రకటిస్తే యెహోవా కృపను మహిమపరుస్తాం.