కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వస్తుసంపదల్ని కాదు రాజ్యాన్ని వెదకండి

వస్తుసంపదల్ని కాదు రాజ్యాన్ని వెదకండి

“ఆయన [దేవుని] రాజ్యమును వెదకుడి; దానితోకూడ ఇవి మీ కనుగ్రహింపబడును.”లూకా 12:31.

పాటలు: 40, 44

1. అవసరాలకు, కోరికలకు మధ్య ఉన్న తేడా ఏమిటి?

 మనిషి అవసరాలు కొన్నే, కానీ కోరికలు మాత్రం అనంతం అని అంటుంటారు. అసలు అవసరాలకు, కోరికలకు మధ్య ఉన్న తేడా ఏమిటో చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ తేడా ఏమిటి? “అవసరాలు” అంటే మనం బ్రతకడానికి ఖచ్చితంగా కావాల్సినవి. ఉదాహరణకు ఆహారం, బట్టలు, ఇల్లు లాంటివి. “కోరికలు” అంటే రోజువారీ జీవితానికి అవసరం లేకపోయినప్పటికీ మనం కావాలనుకునేవి.

2. ప్రజలు ఎలాంటి వస్తువులు కావాలని కోరుకుంటారు?

2 పేద దేశంలో ఉండే ప్రజల కోరికలకూ, సంపన్న దేశంలో ఉండే ప్రజల కోరికలకూ చాలా తేడా ఉండవచ్చు. ఉదాహరణకు పేద దేశంలోని ప్రజలు ఫోన్‌, బైక్‌ లేదా కొంత స్థలం కావాలని కోరుకోవచ్చు. సంపన్న దేశంలోని ప్రజలు ఎన్నో ఖరీదైన బట్టలు, ఓ పెద్ద భవనం, ఎంతో ఖరీదైన వాహనం కావాలని కోరుకోవచ్చు. అయితే మనం ఎలాంటి దేశంలో ఉంటున్నా, ఆ వస్తువులు కొనగలిగే స్తోమత మనకున్నా లేకపోయినా వస్తుసంపదలపై మోజు ఎవరిలోనైనా మొదలవ్వవచ్చు.

వస్తుసంపదల మోజులో పడకండి

3. వస్తుసంపదలపై మోజు అంటే ఏమిటి?

3 వస్తుసంపదలపై మోజు అంటే దేవునితో ఉన్న సంబంధం కన్నా, వస్తుసంపదలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం. వస్తుసంపదలపై మోజు ఉండే వ్యక్తి తనకు అవసరమయ్యే వాటితో తృప్తిపడకుండా, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటాడు. నిజానికి, ఎక్కువ డబ్బు లేనివాళ్లు లేదా ఖరీదైన వస్తువులు కొనే అలవాటు లేనివాళ్లు కూడా వస్తుసంపదల మోజులో పడే అవకాశం ఉంది. అలాంటివాళ్లు తమ జీవితాల్లో రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వడం మానేసే ప్రమాదం ఉంది.—హెబ్రీ. 13:5.

4. సాతాను ‘నేత్రాశను’ ఎలా ఉపయోగించుకుంటాడు?

4 ఎక్కువ వస్తువులు ఉంటేనే ఆనందంగా ఉంటామని మనల్ని నమ్మించడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం అతను ఈ లోకాన్ని, ‘నేత్రాశను’ ఉపయోగించుకుని ఎక్కువ సంపాదించాలనే కోరికను మనలో కలిగించాలని చూస్తున్నాడు. (1 యోహా. 2:15-17; ఆది. 3:6; సామె. 27:20) కొత్త వస్తువులు కొనాలనే ఆశను మనలో పుట్టించే ప్రకటనల్ని ప్రతీరోజు చూస్తున్నాం, వింటున్నాం. కేవలం కంటికి అందంగా కనిపించినందుకు లేదా ప్రకటనలో చూసినందుకు మీరు ఏదైనా వస్తువును కొన్నారా? ఒకవేళ మీరలా కొనివుంటే, మీకు ఆ వస్తువు నిజంగా అవసరంలేదని కొంతకాలం తర్వాత గుర్తించి ఉండవచ్చు. అలాంటి అనవసరమైన వస్తువుల్ని కొనడం వల్ల లేనిపోని కష్టాలు వస్తాయే తప్ప ఏ ఉపయోగం ఉండదు. అంతేకాదు యెహోవాను సేవించనివ్వకుండా ఆ వస్తువులు మన మనసును పక్కకు మళ్లిస్తాయి. దానివల్ల బైబిలు చదవడానికి, మీటింగ్స్‌కు సిద్ధపడి వెళ్లడానికి, క్రమంగా ప్రీచింగ్‌కు వెళ్లడానికి మనకు సమయం ఉండకపోవచ్చు. కాబట్టి “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి” అని అపొస్తలుడైన యోహాను ఇచ్చిన హెచ్చరికను మనం గుర్తుంచుకోవాలి.

5. ఎక్కువ వస్తువుల్ని సంపాదించుకోవడం కోసమే ప్రయాసపడేవాళ్లకు ఏమౌతుంది?

5 మన శక్తినంతా యెహోవా కోసం కాకుండా ఎక్కువ డబ్బును, వస్తువుల్ని సంపాదించుకోవడానికే ఉపయోగించాలన్నది సాతాను కోరిక. (మత్త. 6:24) కానీ మనం ఎక్కువ వస్తువుల్ని సంపాదించుకోవడం కోసమే ప్రయాసపడుతుంటే, మన జీవితానికి అర్థం ఉండదు. పైగా చిరాకుల్లో లేదా అప్పుల్లో కూరుకుపోతాం. చివరికి యెహోవాపై, ఆయన రాజ్యంపై మనకున్న విశ్వాసం కూడా పోతుంది. (1 తిమో. 6:9, 10; ప్రక. 3:17) అందుకే ‘ఇతర వస్తువుల పట్ల వ్యామోహం’ అనేది మొలకెత్తిన విత్తనాన్ని ఎదగనివ్వకుండా చేసే ముళ్ల లాంటిదని యేసు అన్నాడు.—మార్కు 4:14, 18-19, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

6. బారూకు నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

6 యిర్మీయా కార్యదర్శి అయిన బారూకు గురించి ఓసారి ఆలోచించండి. అతను “గొప్పవాటి” కోసం ప్రాకులాడుతున్నప్పుడు, తాను త్వరలోనే యెరూషలేమును నాశనం చేస్తానని యెహోవా గుర్తుచేశాడు. అయితే అతని ప్రాణాన్ని కాపాడతానని యెహోవా మాటిచ్చాడు. (యిర్మీ. 45:1-5) అంతకన్నా ఎక్కువేదీ బారూకు ఆశించి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణంతోపాటు అందులోని ప్రజల ఆస్తుల్ని కూడా నాశనం చేయబోతున్నాడు. (యిర్మీ. 20:5) నేడు మనం సాతాను లోకం అంతమయ్యే సమయానికి చాలా దగ్గర్లో జీవిస్తున్నాం. మనకోసం ఆస్తుల్ని సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. అంతేకాదు ఇప్పుడు మనకున్న ఆస్తులు ఎంత విలువైనవైనా సరే, అవి మహాశ్రమలు తర్వాత కూడా ఉంటాయని అనుకోకూడదు.—సామె. 11:4; మత్త. 24:21, 22; లూకా 12:15.

7. మనం ఏమి పరిశీలిస్తాం? ఎందుకు?

7 జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనదాని మీద ధ్యాసపెడుతూనే మనల్నీ, మన కుటుంబాన్నీ ఎలా పోషించుకోవచ్చు? వస్తుసంపదల మోజులో పడకుండా మనమెలా జాగ్రత్తపడవచ్చు? మన అవసరాల గురించి అతిగా ఆలోచించకుండా ఉండేందుకు మనకేది సహాయం చేయగలదు? దీనిగురించి కొండమీద ప్రసంగంలో యేసు చక్కని సలహా ఇచ్చాడు. (మత్త. 6:19-21) కాబట్టి మత్తయి 6:25-34 వచనాల్ని చదివి, కాసేపు చర్చిద్దాం. వస్తుసంపదల కోసం ప్రాకులాడకుండా రాజ్యాన్ని వెతుకుతూ ఉండడానికి అవి మనకు సహాయం చేస్తాయి.—లూకా 12:31.

మన అవసరాల్ని యెహోవా తీరుస్తాడు

8, 9. (ఎ) మన అవసరాల గురించి ఎందుకు అతిగా చింతించకూడదు? (బి) యేసుకు ఏ విషయాలు తెలుసు?

8 మత్తయి 6:25 చదవండి. ఏమి తింటాం, ఏమి తాగుతాం, ఏమి ధరించుకుంటాం అనే వాటిగురించి తన శిష్యులు చింతిస్తున్నారని యేసుకు తెలుసు. అందుకే ఆయన వాళ్లకు ‘మీ ప్రాణము గురించి చింతించకండి’ అని కొండమీద ప్రసంగంలో చెప్పాడు. వాటిగురించి చింతించాల్సిన అవసరం ఎందుకు లేదో అర్థంచేసుకోవడానికి ఆయన వాళ్లకు సహాయం చేయాలనుకున్నాడు. నిజంగా అవసరమైన వాటిగురించైనా సరే, అతిగా ఆలోచిస్తే జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయాన్ని వాళ్లు మర్చిపోయే ప్రమాదం ఉందని యేసుకు తెలుసు. తన శిష్యులపై యేసుకు ఎంత శ్రద్ధ ఉందంటే, ఈ ప్రమాదం గురించి కొండమీద ప్రసంగంలో ఆయన వాళ్లను నాలుగుసార్లు హెచ్చరించాడు.—మత్త. 6:27, 28, 31, 34.

9 మనం ఏమి తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం వంటి వాటిగురించి చింతించవద్దని యేసు మనకెందుకు చెప్పాడు? ఆహారం, బట్టలు మనకు అవసరమైనవి కావా? ఖచ్చితంగా అవసరమైనవే. వాటికోసం మన దగ్గర సరిపడా డబ్బులేనప్పుడు చింతించడం సహజమే, ఆ విషయం యేసుకు తెలుసు. ప్రజల అవసరాలేమిటో ఆయనకు తెలుసు, ‘అంత్యదినాల్లో’ తన శిష్యులు చాలా కష్టతరమైన పరిస్థితుల్లో జీవిస్తారని కూడా ఆయనకు తెలుసు. (2 తిమో. 3:1) చెప్పాలంటే చాలామందికి ఉద్యోగాలు దొరకట్లేదు, వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా ప్రాంతాల్లోని ప్రజలు కడు బీదరికంలో జీవిస్తున్నారు, వాళ్లకు తినడానికి ఆహారం కూడా ఉండట్లేదు. అయితే ‘ఆహారముకంటె ప్రాణము, వస్త్రముకంటె దేహము గొప్పవని’ యేసుకు తెలుసు.

10. యేసు తన శిష్యులకు ఎలా ప్రార్థించాలో నేర్పిస్తున్నప్పుడు, వాళ్ల జీవితంలో అన్నిటికన్నా దేనికి ముఖ్యమైన స్థానం ఇవ్వాలని చెప్పాడు?

10 పరలోక తండ్రికి ప్రార్థించేటప్పుడు తమ అవసరాల గురించి అడగాలని యేసు తన శిష్యులకు కొండమీది ప్రసంగంలో చెప్పాడు. వాళ్లను ఇలా అడగమని చెప్పాడు, “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.” (మత్త. 6:11) మరో సందర్భంలో, “మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము” అని ప్రార్థించమని వాళ్లకు చెప్పాడు. (లూకా 11:3) దానర్థం మనమెప్పుడూ మన అవసరాలు తీర్చుకోవడం గురించే ఆలోచిస్తూ ఉండాలని కాదు. మన అవసరాల గురించి ప్రార్థించడం కన్నా దేవుని రాజ్యం రావాలని ప్రార్థించడమే చాలా ప్రాముఖ్యమని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్త. 6:9, 10; లూకా 11:2) అంతేకాదు యెహోవా తన సృష్టిలోని ప్రాణుల్ని ఎలా పోషిస్తున్నాడో గుర్తుచేసి, తమ అవసరాల గురించి అతిగా చింతించకుండా ఉండేందుకు వాళ్లకు సహాయం చేశాడు.

11, 12. యెహోవా ఆకాశపక్షుల అవసరాలను తీర్చే విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

11 మత్తయి 6:26 చదవండి. మనం “ఆకాశపక్షులను” బాగా గమనించాలి. అవి చిన్న ప్రాణులే అయినప్పటికీ చాలా ఎక్కువ ఆహారం తింటాయి. ఒకవేళ అవి మనుషులంత పెద్దగా ఉండివుంటే మనిషి తినే ఆహారం కన్నా ఎక్కువే తినేవి. పక్షులు పళ్లను, విత్తనాలను, పురుగులను తింటాయి, కానీ అవి విత్తనాలు చల్లి తమ ఆహారాన్ని పండించుకోవాల్సిన అవసరంలేదు. యెహోవాయే వాటికి కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. (కీర్త. 147:9) ఆహారమైతే సమృద్ధిగా ఉంటుందిగానీ పక్షులు కూడా తమ వంతు కృషిచేయాలి. అవి దానికోసం వెళ్లి, వెతకాలి.

12 తన తండ్రి పక్షుల అవసరాలే తీరుస్తున్నప్పుడు, ప్రజల అవసరాలు కూడా తీరుస్తాడని యేసు బలంగా నమ్మాడు. [1] (1 పేతు. 5:6, 7) అయితే పక్షుల్లాగే మనం కూడా మన వంతు కృషి చేయాలి. అంటే పనిచేసి మన ఆహారాన్ని పండించుకోవాలి లేదా ఆహారాన్ని కొనుక్కోవడానికి డబ్బులు సంపాదించుకోవాలి. అప్పుడు యెహోవా మన కృషిని దీవిస్తాడు. మన దగ్గర సరిపడా డబ్బు లేదా ఆహారం లేనప్పుడు కూడా యెహోవా మన అవసరాల్ని తీర్చగలడు. ఉదాహరణకు, ఇతరులు తమ దగ్గర ఉన్నవాటిని మనతో పంచుకోవచ్చు. మరో విషయమేమిటంటే, పక్షులు ఉండడానికి కూడా యెహోవా ఓ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన వాటికి గూడు కట్టుకునే సామర్థ్యాన్నీ, అందుకు అవసరమయ్యే వాటినీ ఇచ్చాడు. అదేవిధంగా మన కుటుంబం ఉండడానికి అవసరమయ్యే ఇంటిని పొందడానికి కూడా ఆయన సహాయం చేస్తాడు.

13. మనం పక్షులకంటే శ్రేష్ఠులమని ఎలా చెప్పవచ్చు?

13 యెహోవా పక్షుల్ని పోషిస్తున్నాడని గుర్తుచేసిన తర్వాత, యేసు తన శిష్యుల్ని ఇలా అడిగాడు, “మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?” (లూకా 12:6, 7 పోల్చండి.) ఆ మాటలు అంటున్నప్పుడు, త్వరలో మనుషులందరి కోసం తన ప్రాణాన్ని అర్పించడం గురించి యేసు ఆలోచించి ఉంటాడు. అవును, యేసు పక్షుల కోసం లేదా జంతువుల కోసం తన ప్రాణాన్ని అర్పించలేదు. మనం నిత్యం జీవించాలనే ఆయన మనకోసం చనిపోయాడు.—మత్త. 20:28.

14. చింతించినంత మాత్రాన ఏమి జరగదు?

14 మత్తయి 6:27 చదవండి. చింతించడం వల్ల మన ఎత్తును ఒక మూరెడు కూడా ఎక్కువ చేసుకోలేమని యేసు అన్న మాటలకు అర్థమేంటి? మన అవసరాల గురించి చింతించినంత మాత్రాన మన ఆయుష్షును పెంచుకోలేమని యేసు మాటల ఉద్దేశం. నిజానికి మరీ ఎక్కువగా ఆలోచిస్తే, మన ఆరోగ్యం పాడై, తొందరగా చనిపోతాం కూడా.

15, 16. (ఎ) యెహోవా అడవి పువ్వులను అలంకరించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) మనం ఏమని ప్రశ్నించుకోవాలి? ఎందుకు?

15 మత్తయి 6:28-30 చదవండి. చక్కని బట్టలు వేసుకున్నప్పుడు మనందరికీ సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా పరిచర్యకు వెళ్తున్నప్పుడు, మీటింగ్స్‌కు లేదా సమావేశాలకు వెళ్తున్నప్పుడు అలాంటి బట్టలు వేసుకోవాలని కోరుకుంటాం. కాబట్టి మనం ‘వస్త్రాల గురించి చింతించాలా?’ యెహోవా తన సృష్టి ప్రాణుల అవసరాల్ని ఎలా తీరుస్తున్నాడో యేసు మరోసారి తన శిష్యులకు గుర్తుచేశాడు. అందుకోసం ఆయన ‘అడవి పువ్వులను’ ఉదాహరణగా చూపించాడు. అందమైన ఆ పువ్వులేవీ తమకోసం బట్టలను కుట్టుకోవాల్సిన అవసరంలేదు. అయినాసరే అవి ఎంత అందంగా ఉంటాయంటే, ‘తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదానివలెనైనా అలంకరింపబడలేదు’ అని యేసు అన్నాడు.

16 ఆ తర్వాత ఆయన, “అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా” అని చెప్పాడు. ఈ విషయంలో యేసు శిష్యులకు మరింత విశ్వాసం అవసరమైంది. (మత్త. 8:26; 14:31; 16:8; 17:20-21) యెహోవా తమ అవసరాలు తీర్చాలనుకుంటున్నాడని, ఆయన ఖచ్చితంగా తీరుస్తాడని వాళ్లు నమ్మాలి. మరి మన విషయమేమిటి? యెహోవా మన అవసరాలు తీరుస్తాడనే నమ్మకం మనకుందా?

17. యెహోవాతో మనకున్న స్నేహాన్ని ఏది పాడుచేయవచ్చు?

17 మత్తయి 6:31, 32 చదవండి. యెహోవా గురించి తెలియని ఎంతోమంది ఎక్కువ డబ్బును, వస్తువుల్ని సంపాదించడం కోసం తమ జీవితాన్ని ధారపోస్తున్నారు. మనం కూడా అలానే చేస్తే, యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేసుకుంటాం. యెహోవా మన తండ్రనీ, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడనీ మనకు తెలుసు. ఆయన కోరేవాటిని చేస్తూ, రాజ్యానికి మొదటిస్థానం ఇస్తే మనకు అవసరమైన వాటికన్నా ఎక్కువ ఇస్తాడనే నమ్మకం కూడా మనకుంది. అంతేకాదు యెహోవాతో మంచి సంబంధం కలిగివుండడంలోనే నిజమైన సంతోషం ఉందని కూడా మనం గుర్తిస్తాం. అలా గుర్తించినప్పుడు మనకు అవసరమైన ‘అన్నవస్త్రాలతో’ తృప్తిపడతాం.

దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇస్తున్నారా?

18. యెహోవాకు మన గురించి ఏమి తెలుసు? మనకోసం ఆయనేమి చేస్తాడు?

18 మత్తయి 6:33 చదవండి. దేవుని రాజ్యానికి మన జీవితంలో మొదటిస్థానం ఇస్తే మన అవసరాలన్నిటినీ యెహోవాయే తీరుస్తాడు. అలాగని మనమెందుకు నమ్మవచ్చు? యేసు ఇలా చెప్పాడు, “ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.  అవును మీకేమి అవసరమో మీకన్నా ముందు యెహోవాకు తెలుసు. (ఫిలి. 4:19) మీకు బట్టలు, ఆహారం అవసరమని ఆయనకు తెలుసు. మీరూ, మీ కుటుంబం ఉండడానికి ఓ ఇల్లు అవసరమనే విషయం కూడా యెహోవాకు తెలుసు. మీ అవసరాలన్నీ ఖచ్చితంగా తీరేలా ఆయన చూస్తాడు.

19. భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మనమెందుకు చింతించాల్సిన అవసరంలేదు?

19 మత్తయి 6:34 చదవండి. మరోసారి యేసు తన శిష్యులకు ‘చింతింపకండి’ అని చెప్పాడు. మన రోజువారీ అవసరాల్ని యెహోవా తీరుస్తాడు కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మనం అతిగా ఆలోచించాల్సిన అవసరంలేదు. ఒకవేళ అతిగా ఆలోచిస్తే, మనం మన సొంతశక్తి మీద ఆధారపడే ప్రమాదం ఉంది. దానివల్ల యెహోవాతో మనకున్న సంబంధం పాడౌతుంది. అందుకే అతిగా ఆలోచించే బదులు యెహోవాను పూర్తిగా నమ్మాలి.—సామె. 3:5, 6; ఫిలి. 4:6, 7.

మొదట రాజ్యాన్ని వెదకండి, మిగిలినవన్నీ యెహోవా చూసుకుంటాడు

రాజ్యానికి మొదటిస్థానం ఇచ్చేలా సాదాసీదా జీవితం గడపగలరా? (20వ పేరా చూడండి)

20. (ఎ) యెహోవా సేవలో మీరు ఎలాంటి లక్ష్యం పెట్టుకోవాలనుకుంటున్నారు? (బి) సాదాసీదాగా జీవించడానికి మీరేమి చేయవచ్చు?

20 రాజ్యానికి సంబంధించిన పనుల్ని పక్కనపెట్టి వస్తుసంపదల్ని ఎంత సంపాదించుకున్నా ఉపయోగం ఉండదు. దానికి బదులు యెహోవాను సేవించడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. ఉదాహరణకు, ప్రచారకుల అవసరం ఎక్కువున్న సంఘానికి సహాయం చేయడం కోసం మీరు ఆ ప్రాంతానికి వెళ్లగలరా? మీరు పయినీరు సేవ చేయగలరా? ఒకవేళ మీరు ఇప్పటికే పయినీరు సేవ చేస్తుంటే, రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లడం గురించి ఆలోచించారా? వారంలో కొన్ని రోజులు బెతెల్‌లో లేదా అనువాద కార్యాలయంలో పనిచేయడానికి వెళ్లగలరా? లేదా నిర్మాణపనిలో స్వచ్ఛంద సేవకునిగా పనిచేస్తూ కొంత సమయాన్ని రాజ్యమందిరాలను కట్టడంలో వెచ్చించగలరా? రాజ్యానికి సంబంధించిన పనులకు ఎక్కువ సమయాన్ని, శక్తిని వెచ్చించేలా మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోగలరో ఆలోచించండి. ఈ విషయం గురించి “ సాదాసీదాగా జీవించాలంటే. . .” అనే బాక్సులో కొన్ని సలహాలు ఉన్నాయి. ముందుగా, మీరేమి చేయాలో నిర్ణయించుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. ఆ తర్వాత అవసరమైన మార్పులు చేసుకోవడం ప్రారంభించండి.

21. మనం ఎందుకు యెహోవాకు మరింత దగ్గరౌతాం?

21 రాజ్యాన్ని మొదట వెదకాలని యేసు మనకు నేర్పించాడు. అలా వెదికినప్పుడు మన అవసరాల గురించి అతిగా చింతించకుండా ఉంటాం. మన అవసరాల్ని యెహోవా తీరుస్తాడనే నమ్మకం మనకుంది కాబట్టి ఆయనకు మరింత దగ్గరౌతాం. అంతేకాదు మన దగ్గర కొనగలిగేంత డబ్బు ఉన్నప్పటికీ, మనకు ఇష్టమైన ప్రతీ వస్తువును లేదా లోకం ఆకర్షణీయంగా చూపించే ప్రతీదాన్ని కొనకుండా మనల్ని మనం అదుపులో ఉంచుకుంటాం. ఇప్పుడు మనం సాదాసీదాగా జీవిస్తే, యెహోవాకు నమ్మకంగా ఉంటూ ఆయన మాటిచ్చిన ‘వాస్తవమైన జీవాన్ని’ సొంతం చేసుకోగలుగుతాం.—1 తిమో. 6:18, 19.

^ [1] (12వ పేరా చూడండి) కొన్నిసార్లు దేవుని సేవకుల్లో కొంతమందికి కడుపునిండా ఆహారం దొరక్కపోవచ్చు. అలా జరిగేందుకు యెహోవా ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకోవడానికి కావలికోట సెప్టెంబరు 15, 2014 సంచికలోని 22వ పేజీలో ఉన్న “పాఠకుల ప్రశ్న” చూడండి.