కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమవల్ల ధైర్యం బలపడుతుంది

ప్రేమవల్ల ధైర్యం బలపడుతుంది

ప్రేమవల్ల ధైర్యం బలపడుతుంది

“దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.”​—⁠2 తిమోతి 1:⁠7.

కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక జంట ఆస్ట్రేలియా తూర్పు తీర ప్రాంతంలోని ఓ పట్టణం దగ్గర సముద్రంలో నీటి అడుగున ఈదుతున్నారు. వారు పైకి రాబోతుండగా ఓ పెద్ద తిమింగిలం ఆ స్త్రీ వైపుకు దూసుకొచ్చింది. అయితే ఆ భర్త సాహసోపేతంగా తన భార్యను ప్రక్కకు నెట్టి తాను తిమింగలానికి బలయ్యాడు. “ఆయన నా కోసం తన ప్రాణాలర్పించాడు” అని ఆ విధవరాలు అతని అంత్యక్రియల సమయంలో అంది.

2 అవును, ప్రేమ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించేలా మానవుల్ని ప్రేరేపించగలదు. యేసుక్రీస్తు స్వయంగా ఇలా చెప్పాడు: “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు.” (యోహాను 15:​13) యేసు ఈ మాటలు పలికి 24 గంటలైనా గడవకముందే ఆయన కేవలం ఒక్కరి కోసం కాదు మొత్తం మానవాళి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. (మత్తయి 20:​28) అంతేకాక, యేసు కేవలం అప్పటికప్పుడు నిర్ణయించుకుని సాహసోపేతంగా తన ప్రాణాన్ని అర్పించలేదు. ఆయనకు తాను అపహసించబడి, కొట్టబడి, అన్యాయంగా శిక్షవేయబడి, హింసాకొయ్యపై చంపబడతానని ముందే తెలుసు. ఈ పరిణామం గురించి ఆయన తన శిష్యులను సహితం సిద్ధంచేస్తూ ఇలా అన్నాడు: “ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు.”​—⁠మార్కు 10:​33, 34.

3 యేసు అసాధారణ ధైర్యానికి ఏది దోహదపడింది? విశ్వాసం, దైవభయం ముఖ్యపాత్రలు పోషించాయి. (హెబ్రీయులు 5:⁠7; 12:⁠1) అయితే యేసు ధైర్యానికి మరి ముఖ్యంగా, దేవునిపట్ల, పొరుగువారిపట్లవున్న ప్రేమ దోహదపడింది. (1 యోహాను 3:​16) విశ్వాసానికి, దైవభయానికి తోడుగా మనమలాంటి ప్రేమను అలవర్చుకున్నప్పుడు, మనం కూడా క్రీస్తులాంటి ధైర్యాన్ని కనబర్చగలుగుతాం. (ఎఫెసీయులు 5:⁠2) అలాంటి ప్రేమను మనమెలా వృద్ధిచేసుకోవచ్చు? మనం ఆ ప్రేమకున్న మూలాధారాన్ని గుర్తించాలి.

“ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది”

4 యెహోవా ప్రేమాస్వరూపే కాక, ఆ ప్రేమకు మూలాధారం కూడా. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ప్రియులారా, మనము ఒకనికొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.” (1 యోహాను 4:​7, 8) కాబట్టి ఒకవ్యక్తి ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకుని, ఆ జ్ఞానానికి తగినవిధంగా హృదయపూర్వక విధేయతతో ప్రవర్తిస్తూ యెహోవాకు సన్నిహితమైనప్పుడు మాత్రమే దైవప్రేమను వృద్ధి చేసుకోగలడు.​—⁠ఫిలిప్పీయులు 1:⁠9; యాకోబు 4:⁠8; 1 యోహాను 5:⁠3.

5 యేసు తన 11 మంది అపొస్తలులతో కలిసి చేసిన చివరి ప్రార్థనలో, దేవుని తెలుసుకోవడానికి, ప్రేమలో వృద్ధి కావడానికివున్న సంబంధమేమిటో వివరిస్తూ ఇలా అన్నాడు: “నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదను.” (యోహాను 17:​26) యేసు మాటలోను, మాదిరిలోను దేవుని నామం ప్రతీకగావున్న అంటే ఆయన అద్భుత లక్షణాల్ని ప్రదర్శిస్తూ తనకు తన తండ్రికి మధ్యవున్న ప్రేమనే వృద్ధిచేసుకొనేందుకు తన శిష్యులకు సహాయం చేశాడు. అందువల్ల యేసు ఇలా చెప్పగలిగాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.”​—⁠యోహాను 14:​9, 10; 17:⁠8.

6 క్రీస్తులాంటి ప్రేమ దేవుని పరిశుద్ధాత్మ ఫలాల్లో ఒకటి. (గలతీయులు 5:​22) తొలి క్రైస్తవులు సా.శ. 33 పెంతెకొస్తునాడు వాగ్దత్త పరిశుద్ధాత్మను పొందినప్పుడు, వారు యేసు బోధించిన అనేక విషయాలను గుర్తు తెచ్చుకోవడమే కాక, లేఖనాల భావాన్ని మరింత లోతుగా అర్థం చేసుకున్నారు. ఈ ప్రగాఢ అంతర్దృష్టి దేవునిపట్ల వారికున్న ప్రేమను బలోపేతం చేసింది. (యోహాను 14:​26; 15:​26) దాని ఫలితమేమిటి? వారు తమ ప్రాణాల్ని సహితం పణంగాపెట్టి సువార్తను ధైర్యంగా, ఉత్సాహంగా ప్రకటించారు.​—⁠అపొస్తలుల కార్యములు 5:​28, 29.

ధైర్యం, ప్రేమ ప్రదర్శించబడడం

7 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.” (2 తిమోతి 1:⁠7) పౌలు తన వ్యక్తిగత అనుభవం నుండి మాట్లాడుతున్నాడు. ఆయన, బర్నబా కలిసిచేసిన మిషనరీ యాత్రలో ఏమి ఎదుర్కొన్నారో పరిశీలించండి. వారు అంతియొకయ, ఈకొనియ, లుస్త్రతోపాటు అనేక పట్టణాల్లో ప్రకటించారు. ప్రతీ పట్టణంలో కొందరు విశ్వాసులవగా, మరితరులు తీవ్ర వ్యతిరేకులయ్యారు. (అపొస్తలుల కార్యములు 13:​2, 14, 45, 50; 14:​1, 5) లుస్త్రలో కోపోద్రేకులైన ఒక గుంపు పౌలును రాళ్లతో కొట్టి, చనిపోయాడనుకుని ఆయనను వదిలివెళ్లిపోయారు! “అయితే శిష్యులు అతనిచుట్టు నిలిచియుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి, మరునాడు బర్నబాతోకూడ దెర్బేకు బయలుదేరిపోయెను.”​—⁠అపొస్తలుల కార్యములు 14:​6, 19, 20.

8 పౌలుపై జరిగిన ఈ హత్యాయత్నం తమ పనిని మానేసేలా ఆయనను, బర్నబాను భయపెట్టిందా? ఎంత మాత్రం భయపెట్టలేదు! దెర్బేలో “అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత” ఈ ఇద్దరు “లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి[రి].” ఎందుకు? క్రొత్తవారు తమ విశ్వాసంలో బలంగా నిలిచివుండేలా ప్రోత్సహించేందుకే. “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెను” అని పౌలు, బర్నబాలు అన్నారు. కాబట్టి వారికి ఈ ధైర్యం క్రీస్తు “గొఱ్ఱెపిల్లల”పట్లవున్న ప్రగాఢమైన ప్రేమనుండి పుట్టిందనేది స్పష్టం. (అపొస్తలుల కార్యములు 14:​21-23; యోహాను 21:​15-17) క్రొత్తగా రూపొందుతున్న ప్రతీ సంఘంలో పెద్దలను నియమించిన తర్వాత, ఆ ఇద్దరు సహోదరులు ప్రార్థనచేసి, “వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.”

9 పౌలు ఎంత ప్రేమగల, ధైర్యవంతుడంటే, తొలి క్రైస్తవుల్లో చాలామంది ఆయనను ప్రగాఢంగా ప్రేమించారు. పౌలు తాను మూడు సంవత్సరాలు సేవచేసి ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్న ఎఫెసు నుండి వచ్చిన పెద్దలతో నిర్వహించిన కూటంలో ఏమి జరిగిందో గుర్తుచేసుకోండి. (అపొస్తలుల కార్యములు 20:​17-31) వారికి అప్పగించబడిన దేవుని మందను కాయుమని వారిని ప్రోత్సహించిన తర్వాత పౌలు వారితోపాటు మోకాళ్లూని ప్రార్థించాడు. అప్పుడు “వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టుకొనిరి.” పౌలుపట్ల ఈ సహోదరులకు ఎంత ప్రేమ ఉందో కదా! అవును, పౌలు ఆయన ప్రయాణ సహవాసులు బయలుదేరే సమయమొచ్చినప్పుడు స్థానిక పెద్దలు వారిని వెళ్లొద్దని బ్రతిమలాడుతున్నందున వారు బలవంతంగా “వారిని విడిచిపెట్టి” వెళ్లవలసివచ్చింది.​—⁠అపొస్తలుల కార్యములు 20:36-21:⁠1.

10 నేడు ప్రయాణ పైవిచారణకర్తలు, సంఘ పెద్దలు, ఇతరులనేకులు యెహోవా మందపట్ల తాము చూపించిన ధైర్యాన్నిబట్టి ప్రగాఢంగా ప్రేమించబడుతున్నారు. ఉదాహరణకు, అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్న లేదా ప్రకటనాపని నిషేధించబడిన దేశాల్లో ప్రయాణ పైవిచారణకర్తలు, వారి భార్యలు సంఘాలను సందర్శించేందుకు తమ స్వేచ్ఛను, ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. అదేవిధంగా, అనేకమంది సాక్షులు తమ తోటి సాక్షులను అప్పగించనందుకు లేదా తాము ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎక్కడనుండి పొందారో వెల్లడి చేయనందుకు శత్రుభావంగల పరిపాలకుల, వారి అనుయాయుల చేతుల్లో కష్టాలు అనుభవించారు. వేలాదిమంది ఇతరులు సువార్త ప్రకటనను ఆపుజేయనందుకు లేదా క్రైస్తవ కూటాల్లో తోటి విశ్వాసులతో సహవాసం మానుకోనందుకు హింసించబడ్డారు, చిత్రహింసలకు గురయ్యారు, చివరికి చంపబడ్డారు. (అపొస్తలుల కార్యములు 5:​28, 29; హెబ్రీయులు 10:​24, 25) అలాంటి ధైర్యవంతులైన సహోదరసహోదరీల విశ్వాసాన్ని, ప్రేమను మనం అనుకరించుదము గాక!​—⁠1 థెస్సలొనీకయులు 1:⁠6.

మీ ప్రేమను చల్లారనివ్వకండి

11 సాతాను ఈ భూమ్మీదికి పడద్రోయబడినప్పుడు, యెహోవా సేవకులు “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న” కారణంగా వారిపై తన కోపాన్ని వెళ్లగ్రక్కేందుకు పూనుకున్నాడు. (ప్రకటన 12:​9, 17) అపవాది తంత్రాల్లో ఒకటి హింస. అయితే ఆ తంత్రం తరచూ వికటిస్తుంది, ఎందుకంటే అది దేవుని ప్రజలను క్రైస్తవ ప్రేమలో మరింత సన్నిహితుల్నిచేస్తూ, వారిలో చాలామంది మరింత ఉత్సాహం చూపేందుకు వారిని ప్రేరేపిస్తుంది. సాతాను ప్రయోగించే మరో తంత్రం పాపభరిత మానవాశలను ఆకర్షించడం. ఇది మన సొంత ‘మోసకరమైన, ఘోరమైన వ్యాధిగల’ హృదయంలోని చెడు కోరికలకు వ్యతిరేకంగా చేసే అంతరంగ పోరాటం కాబట్టి, ఈ ముట్టడిని త్రిప్పికొట్టేందుకు మనకు మరో విధమైన ధైర్యం అవసరం.​—⁠యిర్మీయా 17:⁠9; యాకోబు 1:​14, 15.

12 సాతాను అంబుల పొదిలో, దేవుని పరిశుద్ధాత్మకు పూర్తిగా విరుద్ధమైన “లౌకికాత్మ” అంటే లోకసంబంధమైన బలమైన కోరిక లేదా ప్రేరణ అనే మరో శక్తివంతమైన ఆయుధముంది. (1 కొరింథీయులు 2:​12) ఈ లౌకికాత్మ పేరాశను, ఐశ్వర్యాసక్తిని అంటే ‘నేత్రాశను’ ప్రోత్సహిస్తుంది. (1 యోహాను 2:​16; 1 తిమోతి 6:​9, 10) భౌతిక విషయాలు, డబ్బు వాటంతటవే హానికరం కాకపోయినా, వాటిపట్ల మనకున్న ప్రేమ దేవుని ప్రేమను మించిపోతే, సాతాను విజయం సాధించినట్లే. లౌకికాత్మ యొక్క శక్తి లేదా ‘ఆధిపత్యం’ పాపభరిత శరీరాశలను ఆకర్షించే విధంలో, దాని మోసంలో, దాని కాఠిన్యంలో, గాలిలా అది వ్యాపించడంలో ఉంది. లౌకికాత్మ మీ హృదయాన్ని పాడుచేయనివ్వకండి.​—⁠ఎఫెసీయులు 2:​2, 3; సామెతలు 4:​23.

13 అయితే, ఈ దుష్ట లౌకికాత్మను ఎదిరించి, దానిని విడిచిపెట్టేందుకు నైతికపరమైన ధైర్యం అవసరం. ఉదాహరణకు, చెడు చిత్రాలు వచ్చినప్పుడు సినిమా హాలులో నుండి లేచి బయటకు నడిచేందుకు, కంప్యూటర్‌ను లేదా టీవీని ఆపుజేసేందుకు ధైర్యం అవసరం. తోటివాళ్ల హానికరమైన ఒత్తిడిని తిరస్కరించేందుకు, చెడు సహవాసాలు మానేసేందుకు ధైర్యం అవసరం. అదేవిధంగా, తోటి విద్యార్థులనుండి, తోటి ఉద్యోగస్థులనుండి, పొరుగువారినుండి లేదా బంధువులనుండి అపహాస్యం ఎదురైనా దేవుని నియమాలకు, సూత్రాలకు కట్టుబడి ఉండేందుకు ధైర్యం అవసరం.​—⁠1 కొరింథీయులు 15:​33; 1 యోహాను 5:​19.

14 కాబట్టి దేవునిపట్ల, మన ఆధ్యాత్మిక సహోదర, సహోదరీలపట్ల మనకున్న ప్రేమను బలపర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా! ఈ లౌకికాత్మ ప్రభావం ఏ విధంగానైనా మీమీద పడుతుందేమో తెలుసుకోవడానికి మీ లక్ష్యాలను, మీ జీవన విధానాన్ని పరీక్షించుకునేందుకు సమయం తీసుకోండి. ఆ ప్రభావం కాస్తయినా మీమీద పడుతుంటే దానిని పూర్తిగా తీసిపారేసి దానికి దూరంగా ఉండేందుకు కావలసిన ధైర్యం కోసం యెహోవాను ప్రార్థించండి. అలాంటి యథార్థ ప్రార్థనల్ని యెహోవా ఉపేక్షించడు. (కీర్తన 51:​17) అంతేకాక, ఆయన ఆత్మ లౌకికాత్మకన్నా మరెంతో శక్తివంతమైనది.​—⁠1 యోహాను 4:⁠3.

వ్యక్తిగత పరీక్షల్ని ధైర్యంగా ఎదుర్కోవడం

15 యెహోవా సేవకులు ఎదుర్కోవలసిన ఇతర సవాళ్లలో అపరిపూర్ణత వృద్ధాప్యాల ప్రభావాలు, వాటివల్ల కలిగే వ్యాధి, అశక్తత, కృంగుదల, మరితర సమస్యలు చాలావున్నాయి. (రోమీయులు 8:​22) క్రీస్తులాంటి ప్రేమ ఈ పరీక్షల్ని తాళుకొనేందుకు మనకు సహాయం చేయగలదు. ఉదాహరణకు, జాంబియాలో క్రైస్తవ కుటుంబంలో పెరిగిన నామాన్గోల్వా విషయమే పరిశీలించండి. రెండేళ్లప్పుడు నామాన్గోల్వా అంగవైకల్యానికి గురైంది. “నా ఆకారం చూసి ప్రజలు భయపడతారని నాలో నేనే కలతపడేదాన్ని. కానీ నేను పరిస్థితిని భిన్నంగా చూసేందుకు నా ఆధ్యాత్మిక సహోదరులు నాకు సహాయం చేశారు. ఫలితంగా, నేను నాలోని ఆ కలతను అధిగమించి, అనతికాలంలోనే బాప్తిస్మం తీసుకున్నాను” అని ఆమె చెబుతోంది.

16 నామాన్గోల్వాకు సొంత చక్రాలకుర్చీ ఉన్నా, ఇసుకవున్న మట్టి దారుల్లో ఆమె తరచూ తన చేతులమీద, మోకాళ్ల మీద నడవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆమె ప్రతీ సంవత్సరం కనీసం రెండు నెలలు సహాయ పయినీరుగా పరిచర్యలో భాగం వహిస్తుంది. నామాన్గోల్వా సాక్ష్యమిచ్చినప్పుడు ఒక గృహిణి కంటతడి పెట్టింది. ఎందుకు? ఎందుకంటే ఆమె మన సహోదరి విశ్వాసం, ధైర్యం చూసి బహుగా చలించిపోయింది. యెహోవా మెండైన ఆశీర్వాదానికి సూచనగా నామాన్గోల్వా బైబిలు విద్యార్థులు ఐదుగురు బాప్తిస్మం తీసుకున్నారు, వారిలో ఒకరు సంఘ పెద్దగా సేవ చేస్తున్నాడు. “నా కాళ్లు తరచూ చాలా నొప్పిపెడతాయి, అలాగని ఆ నొప్పి నన్ను ఆపుజేసేందుకు నేను అనుమతించను” అని ఆమె చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా, శారీరకంగా బలహీనంగావున్నా దేవునిపట్ల, పొరుగువారిపట్ల తమకున్న ప్రేమనుబట్టి ఆత్మయందు బలంగావున్న అనేకమంది సాక్షుల్లో ఈ సహోదరి ఒకరు మాత్రమే. అలాంటి వారందరూ యెహోవాకు ఎంత ఇష్టులో కదా!​—⁠హగ్గయి 2:⁠7.

17 దీర్ఘకాల వ్యాధి సహితం నిరుత్సాహపర్చేదిగా, చివరకు కృంగదీసేదిగా ఉండవచ్చు. “నేను హాజరయ్యే పుస్తక అధ్యయన గుంపులో ఒక సహోదరి మధుమేహంతో, మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతోంది, మరో సహోదరికి క్యాన్సర్‌, మరో ఇద్దరు సహోదరీలకు తీవ్రమైన కీళ్లనొప్పులు, ఇంకొక సహోదరికి వృకవికార వ్యాధి, ఫైబ్రోమ్యాల్జియా ఉన్నాయి. కొన్నిసార్లు వారు నిరుత్సాహపడతారు. అయినప్పటికీ, వారు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే కూటాలకు హాజరవరు. వారందరూ క్రమంగా క్షేత్రసేవకు వస్తారు. ‘నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను’ అని చెప్పిన పౌలును వారు నాకు గుర్తుచేస్తారు. నేను వారి ప్రేమను, ధైర్యాన్ని మెచ్చుకుంటాను. బహుశా వారి ఆరోగ్య పరిస్థితి జీవితంపై, నిజంగా ప్రాముఖ్యమైన దానిపై వారికి స్పష్టమైన అవగాహనను ఇస్తుండవచ్చు” అని ఒక సంఘ పెద్ద చెబుతున్నాడు.​—⁠2 కొరింథీయులు 12:​10.

18 మీరు దుర్బలతతో, వ్యాధితో లేదా మరితర సమస్యతో పోరాడుతుంటే, మీరు నిరుత్సాహానికి బలికాకుండా ఉండేలా సహాయం కోసం “యెడతెగక ప్రార్థనచేయుడి.” (1 థెస్సలొనీకయులు 5:​14, 17) మీకు బహుశా భావోద్రేక ఒడుదుడుకులు ఉండవచ్చు, అయితే ప్రోత్సాహకరమైన ఆధ్యాత్మిక విషయాలపై, ప్రత్యేకంగా ప్రశస్తమైన మన రాజ్య నిరీక్షణపై దృష్టి నిల్పేందుకు ప్రయత్నించండి. “క్షేత్ర పరిచర్యే నాకు మందు” అని ఒక సహోదరి అంటోంది. ఇతరులతో సువార్త పంచుకోవడం ఆశావహ దృక్కోణాన్ని కాపాడుకొనేందుకు ఆమెకు సహాయం చేస్తోంది.

దోషులు యెహోవావద్దకు తిరిగివచ్చేలా ప్రేమ సహాయం చేస్తుంది

19 ఆధ్యాత్మికంగా బలహీనులైన లేదా పాపం చేసిన చాలామందికి యెహోవావద్దకు తిరిగిరావడం అంత సులభంగా ఉండదు. అయితే అలాంటి వారు నిజంగా పశ్చాత్తాపపడి, దేవునిపట్ల తమ ప్రేమను తిరిగి అధికం చేసుకున్నప్పుడు వారికవసరమైన ధైర్యం లభిస్తుంది. అమెరికాలో నివసిస్తున్న మారియో * విషయమే తీసుకోండి. మారియో క్రైస్తవ సంఘాన్ని విడిచిపెట్టి, త్రాగుబోతుగా మారి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి, 20 సంవత్సరాల తర్వాత జైలుపాలయ్యాడు. “నేను నా భవిష్యత్తు గురించి, మళ్లీ బైబిలు చదవడం గురించి దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాను. కొద్దిరోజుల్లోనే నేను యెహోవా లక్షణాలను ప్రత్యేకంగా ఆయన కనికరాన్ని అర్థం చేసుకుని, దానికోసం తరచూ ప్రార్థించేవాణ్ణి. నేను జైలునుండి విడుదలైన తర్వాత, నా పాత స్నేహితులకు దూరంగావుండి క్రైస్తవ కూటాలకు వెళ్తూ చివరకు తిరిగి చేర్చుకోబడ్డాను. నా చర్యల పర్యవసానాల్ని నేను శారీరకంగా అనుభవిస్తున్నా, నాకు కనీసం అద్భుతమైన నిరీక్షణ ఉంది. యెహోవా నాపట్ల చూపిన కనికరానికి, క్షమాపణకు నేనెంతో కృతజ్ఞుడను” అని మారియో చెబుతున్నాడు.​—⁠కీర్తన 103:​9-13; 130:​3, 4; గలతీయులు 6:​7, 8.

20 మారియోలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు యెహోవావద్దకు తిరిగి వచ్చేందుకు చాలా కష్టపడాలనేది వాస్తవం. అయితే బైబిలు అధ్యయనం, ప్రార్థన, ధ్యానంవల్ల అధికం చేయబడిన వారి ప్రేమ వారికవసరమైన ధైర్యాన్ని, నిశ్చయతను ఇస్తుంది. రాజ్య నిరీక్షణవల్ల కూడా మారియో బలపర్చబడ్డాడు. అవును, ప్రేమ, విశ్వాసం, దైవభయంతోపాటు నిరీక్షణ కూడా మన జీవితంలో ప్రయోజనకరమైన శక్తిగా పనిచేయగలదు. తర్వాతి ఆర్టికల్‌లో ఈ ప్రశస్తమైన ఆధ్యాత్మిక బహుమానాన్ని నిశితంగా పరిశీలిస్తాం.

[అధస్సూచి]

^ పేరా 26 పేరు మార్చబడింది.

మీరు జవాబివ్వగలరా?

• యేసు అసాధారణ ధైర్యానికి ప్రేమ ఎలా దోహదపడింది?

• పౌలు, బర్నబాలకు సహోదరులపట్ల ఉన్న ప్రేమ వారికెలా అసాధారణమైన ధైర్యాన్నిచ్చింది?

• క్రైస్తవ ప్రేమను నాశనం చేసేందుకు సాతాను దేనిమూలంగా ప్రయత్నిస్తాడు?

• యెహోవాపట్ల మనకున్న ప్రేమ ఏ పరీక్షలను తట్టుకునేందుకు మనకు ధైర్యాన్నివ్వగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) ప్రేమ ఒక వ్యక్తిని ఏమి చేయడానికి ప్రేరేపించగలదు? (బి) యేసు ధైర్యం ఎందుకు అసాధారణమైనది?

3. యేసు గొప్ప ధైర్యానికి ఏది దోహదపడింది?

4. యెహోవాయే ప్రేమకు మూలాధారమని ఎందుకు చెప్పవచ్చు?

5, 6. క్రీస్తులాంటి ప్రేమను వృద్ధిచేసుకొనేందుకు యేసు తొలి అనుచరులకు ఏది సహాయం చేసింది?

7. పౌలు, బర్నబాలు కలిసి, తమ మిషనరీ యాత్రలో దేనిని సహించవలసివచ్చింది?

8. పౌలు, బర్నబాలు ప్రదర్శించిన ధైర్యం ప్రజలపట్ల వారికున్న ప్రగాఢమైన ప్రేమనెలా ప్రతిబింబించింది?

9. పౌలు ఎఫెసు పెద్దలపట్ల చూపించిన ప్రేమకు వారెలా స్పందించారు?

10. ఆధునిక దిన యెహోవాసాక్షులు పరస్పరం ఎలా ధైర్యవంతమైన ప్రేమను కనబర్చారు?

11. యెహోవా సేవకులకు వ్యతిరేకంగా సాతాను ఎలాంటి ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్నాడు, వారేమి చేయవలసిన అవసరం ఉంది?

12. దేవునిపట్ల మనకున్న ప్రేమను బలహీనపర్చే తన ప్రయత్నంలో సాతాను “లౌకికాత్మను” ఎలా ఉపయోగిస్తాడు?

13. మన నైతిక ధైర్యం ఎలా పరీక్షించబడవచ్చు?

14. లౌకికాత్మ మనకు సోకితే మనమేమి చేయాలి?

15, 16. వ్యక్తిగత పరీక్షల్ని తాళుకునేందుకు క్రీస్తులాంటి ప్రేమ మనకెలా సహాయం చేయగలదు? ఒక ఉదాహరణ ఇవ్వండి.

17, 18. అనారోగ్యాన్ని, ఇతర పరీక్షల్ని తాళుకొనేందుకు చాలామందికి ఏది సహాయం చేస్తోంది? స్థానిక ఉదాహరణలు కొన్ని చెప్పండి.

19, 20. (ఎ) పాపంలో పడిపోయినవారు యెహోవా వద్దకు తిరిగి రావడానికి ధైర్యం తెచ్చుకొనేందుకు వారికేది సహాయం చేయవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

[23వ పేజీలోని చిత్రం]

ప్రజలపట్ల పౌలుకున్న ప్రేమ పట్టుదలతో కొనసాగేందుకు ఆయనకు ధైర్యమిచ్చింది

[24వ పేజీలోని చిత్రం]

దేవుని ప్రమాణాలకు కట్టుబడివుండేందుకు ధైర్యం అవసరం

[24వ పేజీలోని చిత్రం]

నామాన్గోల్వా సుటుటు