హగ్గయి 2:1-23

  • రెండో మందిరం మహిమతో నింపబడడం (1-9)

    • అన్నిదేశాల్ని కంపింపజేయడం (7)

    • దేశాల విలువైన వస్తువులు మందిరంలోకి వస్తాయి (7)

  • ఆలయాన్ని తిరిగి కట్టడం దీవెనలు తెస్తుంది (10-19)

    • పవిత్రమైన వాటిని తాకితే పవిత్రమైపోవు (10-14)

  • జెరుబ్బాబెలుకు సందేశం (20-23)

    • ‘నేను నిన్ను ముద్ర-ఉంగరంలా చేస్తాను’ (23)

2  ఏడో నెల 21వ రోజున యెహోవా వాక్యం హగ్గయి+ ప్రవక్త ద్వారా ఇలా చెప్పింది:  “యూదా అధిపతీ షయల్తీయేలు కుమారుడూ అయిన జెరుబ్బాబెలును,+ ప్రధాన​యాజకుడూ యెహోజాదాకు+ కుమారుడూ అయిన యెహోషువను,+ మిగతా ప్రజలందర్నీ దయ​చేసి ఇలా అడుగు:  ‘ఈ మందిర* పూర్వ వైభవాన్ని చూసినవాళ్లు ఎవరైనా మీలో ఉన్నారా?+ ఇప్పుడది మీకెలా కనిపిస్తుంది? దానికీ దీనికీ అసలు పోలికే లేదని మీకు ​అనిపించడం లేదా?’+  “యెహోవా ఇలా అంటున్నాడు: ‘జెరుబ్బాబెలూ, నువ్వు ధైర్యంగా ఉండు! ప్రధానయాజకుడివి, యెహోజాదాకు కుమారుడివి అయిన యెహోషువా, నువ్వు ధైర్యంగా ఉండు!’ “ ‘దేశంలోని ప్రజలారా, మీరంతా ధైర్యంగా ఉండి, పని చేయండి!’+ అని యెహోవా అంటున్నాడు. “ ‘ఎందుకంటే, నేను మీకు తోడుగా ఉన్నాను’+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.  ‘మీరు ఐగుప్తు* నుండి బయటికి వచ్చినప్పుడు నేను మీకు ఏమని వాగ్దానం చేశానో గుర్తుచేసుకోండి.+ ఇప్పటికీ నా పవిత్రశక్తితో నేను మిమ్మల్ని నడిపిస్తూనే ఉన్నాను.* భయపడకండి.’ ”+  “ఎందుకంటే, సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘త్వరలోనే నేను ఇంకొకసారి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, ఆరిన నేలను కంపింపజేస్తాను.’+  “ ‘నేను అన్నిదేశాల్ని కంపింపజేస్తాను, అప్పుడు అన్నిదేశాల విలువైన వస్తువులు* ఈ మందిరంలోకి వస్తాయి;+ నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను’+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు.  “ ‘వెండి నాది, బంగారం నాది’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.  “ ‘ఈ మందిర భవిష్యత్‌ వైభవం, దాని పూర్వ వైభవాన్ని మించిపోతుంది’ అని సైన్యా​లకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు. “ ‘ఈ చోట నేను శాంతిని అనుగ్రహి​స్తాను’+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.” 10  దర్యావేషు పరిపాలన రెండో సంవత్సరం తొమ్మిదో నెల 24వ రోజున యెహోవా వాక్యం హగ్గయి+ ప్రవక్తకు ఇలా చెప్పింది: 11  “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తు​న్నాడు: ‘దయచేసి, ధర్మశాస్త్రం గురించి యాజకుల్ని ఇలా అడుగు:+ 12  “ఒక వ్యక్తి తన వస్త్రపు మడతలో పవిత్రమైన మాంసాన్ని పెట్టుకుని ​వెళ్తున్నప్పుడు, ఆ వస్త్రం రొట్టెను గానీ, కూరను గానీ, ద్రాక్షారసాన్ని గానీ, నూనెను గానీ, వేరే ఆహారాన్ని గానీ తాకితే అవి పవిత్ర​మౌతాయా?” ’ ” అందుకు యాజకులు, “అవ్వవు!” అన్నారు. 13  తర్వాత హగ్గయి వాళ్లను, “శవాన్ని* ముట్టుకోవడం వల్ల అపవిత్రుడైన వ్యక్తి వాటిలో దేన్నైనా ముట్టుకుంటే, అది అపవిత్రమౌ​తుందా?” అని అడిగాడు.+ అందుకు యాజకులు, “అపవిత్రమౌతుంది!” అన్నారు. 14  అప్పుడు హగ్గయి ఇలా అన్నాడు: “ ‘ఈ ప్రజలు కూడా అలానే ఉన్నారు, నా ముందు ఈ జనం కూడా అలానే ఉంది, వాళ్ల చేతుల పనంతా అలానే ఉంది; వాళ్లు అక్కడ అర్పించేవన్నీ అలానే ఉన్నాయి’ అని యెహోవా అంటున్నాడు. 15  “ ‘అయితే, ఈ రోజు నుండి దయచేసి మీరు దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి: యెహోవా ఆలయాన్ని మళ్లీ కట్టడం మొదలుపెట్టకముందు+ 16  పరిస్థితి ఎలా ఉండేది? ఒక వ్యక్తి 20 కొలతల ధాన్యం ఉంటుందనుకొని ధాన్యం కుప్ప దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడ 10 కొలతల ధాన్యమే ఉండేది; అలాగే ఒక వ్యక్తి 50 కొలతల ద్రాక్షారసం ఉంటుందనుకొని ద్రాక్షతొట్టి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ 20 కొలతల ద్రాక్షారసమే ఉండేది;+ 17  నేను మీ చేతుల పనంతటినీ ఘోరమైన తెగులుతో, బూజుతో,* వడగండ్లతో నాశనం చేశాను.+ అయినా మీలో ఒక్కరు కూడా నావైపు తిరగలేదు’ అని యెహోవా అంటున్నాడు. 18  “ ‘ఈ రోజు నుండి అంటే తొమ్మిదో నెల 24వ రోజున యెహోవా మందిర పునాది వేసినప్పటి నుండి+ మీరు దయచేసి దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి, ఈ విషయం మీద ​మనసుపెట్టండి: 19  గోదాములో ధాన్యం ఉందా?+ ద్రాక్ష చెట్లు, అంజూర చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఇంకా ఫలించలేదు కదా? ఈ రోజు నుండి నేను మిమ్మల్ని దీవిస్తాను.’ ”+ 20  ఆ నెల 24వ రోజున యెహోవా వాక్యం హగ్గయి దగ్గరికి రెండోసారి వచ్చి+ ఇలా చెప్పింది: 21  “యూదా అధిపతైన జెరుబ్బాబెలుకు ఇలా చెప్పు: ‘నేను ఆకాశాన్ని, భూమిని కంపింపజేయబోతున్నాను.+ 22  నేను రాజుల సింహాసనాల్ని పడద్రోస్తాను, దేశాల్ని పరిపా​లించే రాజ్యాల బలాన్ని నాశనం చేస్తాను;+ నేను రథాల్ని, వాటి రౌతుల్ని పడద్రోస్తాను; గుర్రాలు పడిపోతాయి, వాటి రౌతులు పడిపోతారు; వాళ్లు కత్తితో ఒకరినొకరు చంపుకుంటారు.’ ”+ 23  “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘షయల్తీయేలు కుమారుడివి, నా సేవకుడివి అయిన జెరుబ్బాబెలూ,+ ఆ రోజున నేను నీకు ఒక పని అప్పగిస్తాను.’+ యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను నా ​ముద్ర-ఉంగరంలా చేస్తాను, ఎందుకంటే నువ్వు నేను ఎంచుకున్న వ్యక్తివి.’ ఇది సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్పిన మాట.”

అధస్సూచీలు

అక్ష., “ఇంటి.”
లేదా “ఈజిప్టు.”
లేదా “అప్పుడు నా పవిత్రశక్తి మీ మధ్య నిలిచివుండేది” అయ్యుంటుంది.
లేదా “ఇష్ట వస్తువులు.”
పదకోశంలో “ప్రాణం” చూడండి.
లేదా “మొక్కల తెగులుతో.”