కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఇప్పుడు మీరు దేవుని ప్రజలు’

‘ఇప్పుడు మీరు దేవుని ప్రజలు’

“ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి.”—1 పేతు. 2:10.

1, 2. సా.శ. 33, పెంతెకొస్తు రోజున ఏ మార్పు జరిగింది? యెహోవా కొత్త జనాంగంలో ఎవరు సభ్యులయ్యారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

 భూమ్మీద ఉన్న యెహోవా ప్రజల చరిత్రలో సా.శ. 33, పెంతెకొస్తు ఓ మైలురాయి. అప్పుడు ఓ కీలకమైన మార్పు జరిగింది. ఆ రోజు యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా ఓ కొత్త జనాంగాన్ని, అంటే “దేవుని ఇశ్రాయేలును” లేదా ఆధ్యాత్మిక ఇశ్రాయేలును ఉనికిలోకి తెచ్చాడు. (గల. 6:16) అబ్రాహాము సంతతివాళ్లలా ఈ కొత్త జనాంగంలోని సభ్యులు సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదని పౌలు రాశాడు. బదులుగా వాళ్ల “సున్నతి హృదయ సంబంధమైనది,” అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది.—రోమా. 2:29.

2 దేవుని కొత్త జనాంగంలోని తొలి సభ్యుల్లో యేసుక్రీస్తు అపొస్తలులు, యెరూషలేములోని మేడగదిలో సమకూడిన వందకన్నా ఎక్కువమంది ఇతర శిష్యులు ఉన్నారు. (అపొ. 1:12-15) దేవుడు వాళ్లపై పరిశుద్ధాత్మను కుమ్మరించి, తన కుమారులుగా దత్తత తీసుకున్నాడు. (రోమా. 8:15, 16; 2 కొరిం. 1:21) యెహోవా క్రీస్తు బలిని అంగీకరించాడని, పాతనిబంధన స్థానంలో కొత్తనిబంధనను ప్రవేశపెట్టాడని అది నిరూపించింది. (లూకా 22:20; హెబ్రీయులు 9:15 చదవండి.) ఈ అభిషిక్త శిష్యులు యెహోవా కొత్త జనాంగంలో సభ్యులయ్యారు. పెంతెకొస్తు పండుగ ఆచరించేందుకు రోమా సామ్రాజ్యం నలుమూలల నుండి యెరూషలేముకు వచ్చిన యూదులకు, యూదామత ప్రవిష్టులకు వీళ్లు పరిశుద్ధాత్మ శక్తితో వేర్వేరు భాషల్లో ప్రకటించారు. ఆ ప్రజలందరూ తమ సొంత భాషలో “దేవుని గొప్పకార్యములను” విన్నారు, అర్థం చేసుకున్నారు.—అపొ. 2:1-11.

దేవుని కొత్త జనము

3-5. (ఎ) పెంతెకొస్తు రోజున పేతురు యూదులతో ఏం చెప్పాడు? (బి) యెహోవా కొత్త జనాంగం దాని తొలినాళ్లలో ఎలా వృద్ధి అయ్యింది?

3 యెహోవా అపొస్తలుడైన పేతురును ఉపయోగించుకుని యూదులను, యూదామత ప్రవిష్టులను కొత్త జనాంగంలోకి అంటే క్రైస్తవ సంఘంలోకి ఆహ్వానించాడు. పెంతెకొస్తు రోజున పేతురు యూదులతో మాట్లాడుతూ, వాళ్లు యేసును చంపారని, అయితే వాళ్లిప్పుడు ఆయన్ను “ప్రభువుగాను క్రీస్తుగాను” ఒప్పుకోవాలని ధైర్యంగా చెప్పాడు. మరి తామేమి చేయాలని యూదులు అడిగినప్పుడు పేతురు ఇలా చెప్పాడు, “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.” (అపొ. 2:22, 23, 36-38) ఆ రోజు సుమారు 3,000 మంది, కొత్త జనాంగమైన ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో సభ్యులయ్యారు. (అపొ. 2:41) ఆ తర్వాత, అపొస్తలులు ఉత్సాహంగా చేసిన ప్రకటనా పనివల్ల ఇంకా చాలామంది సత్యాన్ని అంగీకరించారు. (అపొ. 6:7) ఆ కొత్త జనాంగం వృద్ధి అవుతూ వచ్చింది.

4 ఆ తర్వాత యేసు శిష్యులు సమరయులకు కూడా ప్రకటించారు. వాళ్లలో చాలామంది సత్యాన్ని అంగీకరించి, బాప్తిస్మం తీసుకున్నారు. అయితే వాళ్లు పరిశుద్ధాత్మను పొందలేదు. అప్పుడు యెరూషలేములో ఉన్న పరిపాలక సభ పేతురును, యోహానును సమరయలోని ఆ సహోదరసహోదరీల దగ్గరికి పంపించింది. ఈ ఇద్దరు అపొస్తలులు “వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.” (అపొ. 8:5, 6, 14-17) అలా సమరయులు కూడా ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో ఆత్మాభిషిక్త సభ్యులయ్యారు.

పేతురు కొర్నేలికి, ఆయన ఇంటివాళ్లకు ప్రకటించాడు (5వ పేరా చూడండి)

5 సా.శ. 36⁠లో, యెహోవా పేతురును మరోసారి ఉపయోగించుకుని ఇతరుల్ని తన కొత్త జనాంగంలోకి ఆహ్వానించాడు. పేతురు రోమా శతాధిపతి కొర్నేలికి, ఆయన బంధుమిత్రులకు ప్రకటించాడు. (అపొ. 10:22, 24, 34, 35) ఆ సందర్భం గురించి బైబిలు ఇలా చెబుతుంది, “పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరిమీదికి [అన్యుల మీదకు] పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి.” (అపొ. 10:44-46) అప్పటినుండి, సున్నతి పొందని అన్యులు కూడా ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో సభ్యులయ్యారు.

“తన నామముకొరకు ఒక జనము”

6, 7. కొత్త జనాంగం ఏయే విధాలుగా యెహోవా ‘నామముకొరకు ఒక జనముగా’ నిరూపించుకుంది? వాళ్లు ఆ పనిని ఎంత విస్తృతంగా చేశారు?

6 సా.శ. 49⁠లో జరిగిన ఓ పరిపాలక సభ కూటంలో శిష్యుడైన యాకోబు ఇలా చెప్పాడు, “అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను [పేతురు] వివరించి యున్నాడు.” (అపొ. 15:14) యెహోవా నామాన్ని ధరించే ఆ కొత్త జనములో విశ్వాసులుగా మారిన యూదులూ అన్యులూ ఉన్నారు. (రోమా. 11:25-27) తర్వాత పేతురు ఇలా రాశాడు, “ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి.” వాళ్ల పని ఏమిటో చెబుతూ ఆయనిలా అన్నాడు, “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.” (1 పేతు. 2:9, 10) తాము ప్రాతినిధ్యం వహిస్తున్న దేవుణ్ణి స్తుతిస్తూ, వాళ్లు ఆయన నామాన్ని నలుగురిలో మహిమపర్చాలి. విశ్వసర్వాధిపతియైన యెహోవా గురించి ధైర్యంగా సాక్ష్యమివ్వాలి.

7 ‘నా స్తోత్రమును ప్రచురము చేయడం కోసం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు’ అని యెహోవా ఒకప్పుడు సహజ ఇశ్రాయేలును పిలిచినట్లే, ఆధ్యాత్మిక ఇశ్రాయేలును కూడా పిలిచాడు. (యెష. 43:21) ఆ తొలి క్రైస్తవులు, తమ కాలంనాటి దేవుళ్లంతా అబద్ధ దేవుళ్లని, యెహోవాయే ఏకైక సత్య దేవుడని ధైర్యంగా ప్రకటించారు. (1 థెస్స. 1:9, 10) వాళ్లు యెహోవా గురించి, యేసు గురించి “యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును” సాక్ష్యమిచ్చారు.—అపొ. 1:8; కొలొ. 1:23.

8. పౌలు మొదటి శతాబ్దంలోని దేవుని ప్రజలకు ఏ హెచ్చరిక ఇచ్చాడు?

8 మొదటి శతాబ్దంలో యెహోవా ‘నామముకొరకు ఒక జనముగా’ ధైర్యంగా సేవచేసిన వాళ్లలో అపొస్తలుడైన పౌలు కూడా ఒకడు. “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై” ఉన్నాడని చెబుతూ, ఆయన అబద్ధమత తత్వవేత్తల ముందు యెహోవా సర్వాధిపత్యాన్ని ధైర్యంగా సమర్థించాడు. (అపొ. 17:18, 23-25) మూడవ మిషనరీ యాత్ర ముగింపులో పౌలు దేవుని ప్రజల్ని ఇలా హెచ్చరించాడు, “నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపొ. 20:29, 30) ఆయన ముందే చెప్పినట్లు, మొదటి శతాబ్దం చివరికల్లా మతభ్రష్టత్వం స్పష్టంగా కనిపించింది.—1 యోహా. 2:18, 19.

9. అపొస్తలులు చనిపోయిన తర్వాత దేవుని ప్రజలకు ఏం జరిగింది?

9 అపొస్తలులు చనిపోయిన తర్వాత మతభ్రష్టత్వం వృద్ధి చెంది, క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చీలు ఉనికిలోకి వచ్చాయి. యెహోవా ‘నామం కొరకు ప్రజలుగా’ ఉండే బదులు భ్రష్ట క్రైస్తవులు చివరికి తమ బైబిలు అనువాదాల నుండి యెహోవా పేరును కూడా తీసేశారు. వాళ్లు అబద్ధమత ఆచారాలను పాటించడమే కాక, బైబిల్లోలేని సిద్ధాంతాలతో, తమ ‘పవిత్ర యుద్ధాలతో,’ నీచమైన ప్రవర్తనతో దేవునికి చెడ్డపేరు తెచ్చారు. అందుకే కొన్ని శతాబ్దాలపాటు భూమ్మీద దేవునికి నమ్మకంగా ఉన్న సేవకులు చాలా కొద్దిమందే ఉన్నారు. కానీ వాళ్లు ఆయన ‘నామముకొరకు ఒక జనముగా’ సంస్థీకరించబడి లేరు.

దేవుని జనము మళ్లీ పుట్టింది

10, 11. (ఎ) గోధుమలు గురుగులు ఉపమానంలో యేసు ఏ విషయాన్ని ముందే చెప్పాడు? (బి) యేసు ఉపమానం 1914 తర్వాత ఎలా నెరవేరింది? దాని ఫలితం ఏమిటి?

10 మతభ్రష్టత్వం కారణంగా వచ్చే ఆధ్యాత్మిక రాత్రి గురించి, గోధుమలు గురుగులు ఉపమానంలో యేసు ముందే చెప్పాడు. “మనుష్యులు నిద్రించుచుండగా,” తాను గోధుమలు నాటిన పొలంలోనే అపవాది గురుగులు నాటుతాడని యేసు చెప్పాడు. ఆ రెండూ “యుగసమాప్తి” వరకూ కలిసి పెరుగుతాయి. “మంచి విత్తనములు రాజ్యసంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు” అని యేసు వివరించాడు. యుగసమాప్తి కాలంలో, సూచనార్థక గోధుమల నుండి గురుగులను వేరు చేయడానికి యేసు ‘కోతకోయు వారిని’ అంటే దేవదూతలను పంపిస్తాడు. అప్పుడు రాజ్య సంబంధులు సమకూర్చబడతారు. (మత్త. 13:24-30, 36-43) మరి, యేసు చెప్పిన మాటలు ఎలా నెరవేరాయి? వాటి నెరవేర్పుకు, యెహోవాకు భూమ్మీద మళ్లీ ప్రజలు ఉండడానికి సంబంధం ఏమిటి?

11 “యుగసమాప్తి” 1914⁠లో మొదలైంది. ఆ సమయంలో అభిషిక్త క్రైస్తవులు కొన్ని వేలమందే భూమ్మీద ఉన్నారు. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో ‘రాజ్య సంబంధులైన’ ఆ అభిషిక్తులు ఇంకా మహాబబులోను ఆధ్యాత్మిక చెరలోనే ఉన్నారు. అయితే 1919⁠లో యెహోవా వాళ్లను విడిపించి, వాళ్లకూ గురుగులైన నకిలీ క్రైస్తవులకూ మధ్యవున్న తేడాను స్పష్టంగా చూపించాడు. ఆయన ‘రాజ్య సంబంధులను’ సమకూర్చి వాళ్లను ఓ జనముగా సంస్థీకరించాడు. దాని గురించి యెషయా ఇలా ప్రవచించాడు, “ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను.” (యెష. 66:8) ఈ సందర్భంలో సీయోను అంటే ఆత్మప్రాణులతో కూడిన యెహోవా సంస్థ. అది ఆత్మాభిషిక్త క్రైస్తవులను కని, వాళ్లను ఓ జనాంగంగా సంస్థీకరించింది.

12. యెహోవా ‘నామముకొరకు ఒక జనముగా’ ఉన్నట్లు అభిషిక్తులు ఎలా చూపించారు?

12 తొలి క్రైస్తవుల్లాగే, అభిషిక్తులైన “రాజ్యసంబంధులు” కూడా యెహోవాకు సాక్షులే. (యెషయా 43:1, 10, 11 చదవండి.) వాళ్లు తమ క్రైస్తవ ప్రవర్తన ద్వారా, ‘ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థముగా’ ప్రకటించడం ద్వారా ఇతరులకు భిన్నంగా ఉన్నారు. (మత్త. 24:14; ఫిలి. 2:14-16) ఆ విధంగా, లక్షలాదిమంది యెహోవాతో సన్నిహిత సంబంధం వృద్ధి చేసుకోవడానికి వాళ్లు సహాయం చేశారు.—దానియేలు 12:3 చదవండి.

“మేము మీతోకూడ వత్తుము”

13, 14. అభిషిక్తులు కానివాళ్లు యెహోవాకు ఇష్టమైన విధంగా ఆరాధించాలన్నా, సేవించాలన్నా ఏమి చేయాలి? బైబిలు ముందే ఈ విషయాన్ని ఎలా చెప్పింది?

13 ప్రాచీన ఇశ్రాయేలులోని పరదేశులు యెహోవాకు ఇష్టమైన విధంగా ఆరాధించాలంటే, ఆయన ప్రజలతో సహవసించాలని మనం ముందటి ఆర్టికల్‌లో చూశాం. (1 రాజు. 8:41-43) అలాగే నేడుకూడా అభిషిక్తులు కానివాళ్లు, అభిషిక్త సాక్షులతో కలిసి యెహోవాను ఆరాధించాలి.

14 ఈ అంత్యకాలంలో యెహోవా ప్రజలతో కలిసి ఆయనను ఆరాధించడానికి అనేకమంది గుంపులుగా వస్తారని ఇద్దరు ప్రాచీనకాల ప్రవక్తలు ముందే చెప్పారు. యెషయా ఇలా ప్రవచించాడు, “సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి—యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.” (యెష. 2:2, 3) అదేవిధంగా, “అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు” అని జెకర్యా ప్రవక్త ముందే చెప్పాడు. ఆయన వాళ్లను “ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది” అని వర్ణించాడు. “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుము” అని చెబుతూ వాళ్లు ఆధ్యాత్మిక ఇశ్రాయేలు చెంగును సూచనార్థకంగా పట్టుకుంటారు.—జెక. 8:20-23.

15. “వేరే గొఱ్ఱెలు” ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులతో కలిసి ఏ పని చేస్తారు?

15 రాజ్య సువార్త ప్రకటించే పనిలో “వేరే గొఱ్ఱెలు” ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులతో కలిసి పనిచేస్తారు. (మార్కు 13:10) వాళ్లు దేవుని ప్రజల్లో భాగమౌతారు. వాళ్లూ అభిషిక్తులూ కలిసి ‘మంచి కాపరియైన’ యేసుక్రీస్తు నాయకత్వంలో ఒక్కమందగా ఉంటారు.—యోహాను 10:14-16 చదవండి.

యెహోవా ప్రజలతో సురక్షితంగా ఉండండి

16. ‘మహాశ్రమ’ తుదిఘట్టానికి చేరుకునేలా యెహోవా ఎలా నడిపిస్తాడు?

16 మహాబబులోను నాశనం తర్వాత, యెహోవా ప్రజలపై తీవ్రమైన దాడి జరుగుతుంది. ఆ సమయంలో సురక్షితంగా ఉండాలంటే మనకు యెహోవా ఇచ్చే కాపుదల అవసరం. ఆ దాడి ‘మహాశ్రమ’ తుదిఘట్టానికి తెరతీస్తుంది కాబట్టి, యెహోవాయే విషయాల్ని నిర్దేశించి, దానికి తెరదించే సమయాన్ని నిర్ణయిస్తాడు. (మత్త. 24:21; యెహె. 38:2-4) అప్పుడు, ‘ఆయా జనములలోనుండి సమకూర్చబడిన జనులపై’ అంటే యెహోవా ప్రజలపై గోగు దాడి చేస్తాడు. (యెహె. 38:10-12) ఆ దాడి జరిగినప్పుడు యెహోవా దేవుడు గోగుమీద, అతని సైన్యంమీద తన తీర్పులు అమలుచేస్తాడు. యెహోవా తన సర్వాధిపత్యాన్ని ఉన్నతపర్చుకుని, తన నామాన్ని పరిశుద్ధపర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ఇలా చెబుతున్నాడు, “నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు నేను ఘనత వహించి . . . వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.”—యెహె. 38:18-23.

‘మహాశ్రమల’ కాలంలో మనం స్థానిక సంఘంతో సన్నిహితంగా సహవసిస్తూ ఉండాలి (16-18 పేరాలు చూడండి)

17, 18. (ఎ) యెహోవా ప్రజలపై గోగు దాడి చేసినప్పుడు, వాళ్లు ఏ నిర్దేశాలు పొందుతారు? (బి) యెహోవా కాపుదలను పొందాలంటే మనం ఏమి చేయాలి?

17 గోగు దాడి మొదలైనప్పుడు, యెహోవా తన సేవకులకు ఇలా చెబుతాడు, “నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.” (యెష. 26:21) ఆ క్లిష్ట సమయంలో, ప్రాణాలను కాపాడే నిర్దేశాలను యెహోవా మనకు ఇస్తాడు. ఆ ‘అంతఃపురములకు’ బహుశా మన స్థానిక సంఘాలతో సంబంధం ఉండవచ్చు.

18 కాబట్టి, మహాశ్రమల కాలంలో యెహోవా ఇచ్చే కాపుదల పొందాలంటే, ఆయనకు భూమ్మీద ప్రజలు ఉన్నారనీ వాళ్లు సంఘాలుగా సంస్థీకరించబడ్డారనీ మనం గుర్తించాలి. మనం వాళ్ల పక్షాన ఉంటూ, స్థానిక సంఘంతో సన్నిహితంగా సహవసిస్తూ ఉండాలి. మనంకూడా కీర్తనకర్తతో గొంతు కలిపి, “రక్షణ యెహోవాది నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక” అని హృదయపూర్వకంగా పాడదాం.—కీర్త. 3:8.