కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ఆత్మ నిర్దేశాన్ని అనుసరిస్తున్నారా?

దేవుని ఆత్మ నిర్దేశాన్ని అనుసరిస్తున్నారా?

దేవుని ఆత్మ నిర్దేశాన్ని అనుసరిస్తున్నారా?

“దయగల నీ ఆత్మ సమభూమిగల [‘నీతిగల,’ NW] ప్రదేశమందు నన్ను నడిపించును గాక.”—కీర్త. 143:10.

1, 2. (ఎ) యెహోవా తన సేవకులకు పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చిన కొన్ని సందర్భాలను చెప్పండి. (బి) పరిశుద్ధాత్మ కేవలం ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే పనిచేస్తుందా? వివరించండి.

 పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుందో ఆలోచించినప్పుడు మీకు ఏది గుర్తుకొస్తుంది? గిద్యోను, సమ్సోను చేసిన గొప్ప కార్యాలు మీకు గుర్తుకొస్తుండవచ్చు. (న్యాయా. 6:33, 34; 15:14, 15) లేదా తొలి క్రైస్తవులు కనబర్చిన ధైర్యం, మహా సభ ముందు నిలబడినప్పుడు స్తెఫను కనబర్చిన ప్రశాంతత మీకు గుర్తుకొస్తుండవచ్చు. (అపొ. 4:31; 6:15) అంతేకాక నేడు అంతర్జాతీయ సమావేశాల్లో వెల్లివిరిసే సంతోషం, క్రైస్తవ తటస్థత కారణంగా జైళ్లలో వేయబడిన మన సహోదరులు చూపించే యథార్థత, ఎంతో గొప్ప స్థాయిలో జరుగుతున్న ప్రకటనా పని వంటివన్నీ పరిశుద్ధాత్మ పనిచేస్తుందనడానికి రుజువులే.

2 పరిశుద్ధాత్మ కేవలం అసాధారణ పరిస్థితుల్లో లేదా ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే పనిచేస్తుందా? లేదు. క్రైస్తవులు ‘ఆత్మానుసారంగా నడుచుకుంటారు,’ ‘ఆత్మచేత నడిపించబడతారు,’ ‘ఆత్మను అనుసరించి జీవిస్తారు’ అని దేవుని వాక్యం చెబుతోంది. (గల. 5:16, 18, 25) అంటే, పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఎల్లప్పుడూ పనిచేయగలదని దానర్థం. అందుకే మన ఆలోచనలు, మాటలు, చేతలు ఎల్లప్పుడూ సరిగ్గా ఉండేలా పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని ఇవ్వమని మనం ప్రతీరోజు యెహోవాను వేడుకోవాలి. (కీర్తన 143:10 చదవండి.) మనం పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని అనుసరించినప్పుడు ఇతరులకు సేదదీర్పునిచ్చే, దేవుణ్ణి స్తుతించే లక్షణాలను కనబర్చగలుగుతాం.

3. (ఎ) మనం పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని అనుసరించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) మనం ఏ ప్రశ్నను పరిశీలిస్తాం?

3 మనం పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని అనుసరించడం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే మరో శక్తి పరిశుద్ధాత్మ మనపై పనిచేయకుండా ఆపుతోంది. అంతేగాక, అది మనలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మన పాపభరిత ఆలోచనలను సూచించే మన అపరిపూర్ణ ‘శరీరమే’ ఆ శక్తి అని లేఖనాలు చెబుతున్నాయి. ఆదాము నుండి దాన్ని మనం వారసత్వంగా పొందాం. (గలతీయులు 5:17 చదవండి.) ఇంతకీ దేవుని పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని అనుసరించడానికి, మన పాపభరిత శరీర కోరికలకు లొంగిపోకుండా ఉండడానికి మనం ఏమి చేయాలి? ఆ ప్రశ్నను పరిశీలించడంలో భాగంగా ‘ఆత్మ ఫలములోని’ మిగతా ఆరు లక్షణాలైన “దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” గురించి చర్చిద్దాం.—గల. 5:22, 23.

సాత్వికం, దీర్ఘశాంతం చూపిస్తే సంఘంలో సమాధానం పెరుగుతుంది

4. సాత్వికం, దీర్ఘశాంతం సంఘంలో సమాధానాన్ని ఎలా పెంచుతాయి?

4 కొలొస్సయులు 3:12, 13 చదవండి. సంఘంలో సమాధానం పెరగాలంటే మనకు సాత్వికం, దీర్ఘశాంతం రెండూ అవసరమే. ఈ లక్షణాలుంటే మనం ఇతరులతో దయగా వ్యవహరిస్తాం, వారు కోపం పుట్టించినప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాం, వారు కఠినంగా మాట్లాడినప్పుడు లేదా ప్రవర్తించినప్పుడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటాం. మనకు దీర్ఘశాంతం లేక సహనం ఉంటే, తోటి క్రైస్తవులతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారితో సమాధానపడడానికి గట్టిగా ప్రయత్నిస్తాం. అంతేగానీ మన ప్రయత్నాలను మానుకోం. ఇంతకీ సంఘంలో సాత్వికం, దీర్ఘశాంతం చూపించడం నిజంగా అవసరమా? మనందరం అపరిపూర్ణులం కాబట్టి వాటిని చూపించడం అవసరమే.

5. పౌలు బర్నబాల మధ్య ఏమి జరిగింది? దాన్నిబట్టి మనకు ఏమి తెలుస్తోంది?

5 ఉదాహరణకు, పౌలు బర్నబాల మధ్య ఏమి జరిగిందో పరిశీలించండి. సువార్తను వ్యాప్తిచేయడానికి వారిద్దరు ఎన్నో సంవత్సరాలపాటు కలిసి పనిచేశారు. ఇద్దరిలోనూ మంచి లక్షణాలు ఉన్నాయి. అయినా, ఒకసారి వారిద్దరి మధ్య “తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి.” (అపొ. 15:36-39) దీన్నిబట్టి, దేవుని సమర్పిత సేవకుల మధ్య కూడా కొన్నిసార్లు అభిప్రాయభేదాలు వస్తాయని తెలుస్తోంది. తోటి విశ్వాసుల మధ్య అపార్థాలు తలెత్తినప్పుడు కోపంతో వాదించుకుంటే వారి మధ్య అగాధం ఏర్పడుతుంది. అలా జరగకూడదంటే ఏమి చేయాలి?

6, 7. (ఎ) తోటి విశ్వాసితో ఒకానొక విషయాన్ని చర్చించేటప్పుడు వాదోపవాదాలు తలెత్తకుండా ఉండాలంటే మనం ఏ లేఖన సలహాను పాటించాలి? (బి) ‘వినడానికి వేగిరపడడం వల్ల, మాట్లాడడానికీ కోప్పడడానికీ నిదానించడం వల్ల’ ఎలాంటి ప్రయోజనాలున్నాయి?

6 కొన్ని బైబిలు అనువాదాలను బట్టి, పౌలు బర్నబాల మధ్య ఉన్నట్టుండి భేదాభిప్రాయం ఏర్పడడం వల్ల వారు ఆగ్రహావేశాలకు లోనయ్యారని తెలుస్తోంది. తోటి విశ్వాసితో ఒకానొక విషయాన్ని చర్చిస్తున్నప్పుడు తనకు కోపమొస్తోందని ఓ క్రైస్తవునికి అనిపిస్తే, యాకోబు 1:19, 20లోని సలహాను పాటించడం మంచిది. అక్కడిలా ఉంది: “ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.” వీలైతే, వాదోపవాదాలు తలెత్తకముందే సంభాషణను మార్చవచ్చు, చర్చను వాయిదా వేయడానికి ప్రయత్నించవచ్చు లేదా మెల్లగా అక్కడనుండి లేచి వెళ్లిపోవచ్చు.—సామె. 12:16; 17:14; 29:11.

7 ఈ సలహాను పాటిస్తే మనమెలా ప్రయోజనం పొందుతాం? కోపాన్ని అణచుకోవడానికి, ఆ విషయం గురించి ప్రార్థించడానికి, శ్రేష్ఠమైన విధంగా ఎలా జవాబివ్వాలో ఆలోచించడానికి సమయం తీసుకుంటే మనం పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని అనుసరించగలుగుతాం. (సామె. 15:1, 28) పరిశుద్ధాత్మ సహాయంతో మనం సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని చూపించగలుగుతాం. ఆ విధంగా ఎఫెసీయులు 4:26, 29 వచనాల్లో ఉన్న ఈ సలహాను పాటించగలుగుతాం: “కోపపడుడిగాని పాపము చేయకుడి . . . వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.” మనం సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని అలవర్చుకుంటే సంఘంలో సమాధానానికి, ఐక్యతకు తోడ్పడతాం.

దయతో, మంచితనంతో మీ కుటుంబానికి సేదదీర్పును ఇవ్వండి

8, 9. దయ, మంచితనం అంటే ఏమిటి? వాటివల్ల కుటుంబంలో ఎలాంటి వాతావరణం నెలకొంటుంది?

8 ఎఫెసీయులు 4:31, 32; 5:8, 9 చదవండి. దయ, మంచితనం మండుటెండలో చల్లగాలిలా, చల్లని నీళ్లలా సేదదీర్పునిస్తాయి. వాటివల్ల కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా, వారిని అర్థం చేసుకొని మాట్లాడడం ద్వారా నిజమైన శ్రద్ధ చూపించడమే దయ. దీనివల్ల ఇతరులు మనకు దగ్గరౌతారు. దయలాగే మంచితనం కూడా ఓ చక్కని లక్షణం. మనకు మంచితనం ఉంటే ఇతరులకు ఉదారంగా మేలు చేస్తాం. (అపొ. 9:36, 39; 16:14, 15) అయితే మంచితనం చూపించాలంటే అదొక్కటే సరిపోదు.

9 మంచితనం అంటే నైతిక విషయాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించడమని అర్థం. కాబట్టి, మనం చేసే పనులపై మాత్రమే కాదుగానీ ముఖ్యంగా మన వ్యక్తిత్వంపై అది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక స్త్రీ తన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా పండును కోస్తున్నప్పుడు అది తీయగా ఉందా, ఏ లోపం లేకుండా ఉందా అని చూస్తుంది. అలాగే, పరిశుద్ధాత్మ వల్ల కలిగే మంచితనం ఓ క్రైస్తవుని జీవన విధానమంతటిలో కనబడాలి.

10. కుటుంబ సభ్యులు ఆత్మ ఫలాన్ని అలవర్చుకునేలా చేయడానికి కుటుంబ శిరస్సులు ఏమి చేయవచ్చు?

10 ఓ క్రైస్తవ కుటుంబంలోని సభ్యులందరూ దయను, మంచితనాన్ని ఎలా చూపించవచ్చు? దేవుని వాక్యంలోని ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా చూపించవచ్చు. (కొలొ. 1:9, 10) కొంతమంది కుటుంబ శిరస్సులు తమ కుటుంబ ఆరాధనలో ఆత్మ ఫలంలోని ఏదో ఒక లక్షణం గురించి చర్చిస్తున్నారు. అలా చేయడం సులభమే. మీ భాషలో దొరికే బైబిలు సాహిత్యాన్ని ఉపయోగించి ఆత్మ ఫలంలోని వివిధ లక్షణాల గురించి చర్చించవచ్చు. మీకు దొరికిన సమాచారంలో నుండి ప్రతీ వారం కొన్ని పేరాలు చర్చించండి. ఆ విధంగా మీరు ఒక్కో లక్షణం గురించి ఎన్నో వారాలపాటు పరిశీలించవచ్చు. అధ్యయనం చేస్తున్నప్పుడు అందులోని లేఖనాలను చదివి, చర్చించండి. మీరు నేర్చుకున్నదాన్ని పాటించడానికి ప్రయత్నిస్తూ, మీ ప్రయత్నాలను ఆశీర్వదించమని యెహోవాను కోరండి. (1 తిమో. 4:15; 1 యోహా. 5:14, 15) అయితే, అలా అధ్యయనం చేయడం వల్ల కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు వ్యవహరించే తీరులో నిజంగా మార్పు వస్తుందా?

11, 12. దయ గురించి అధ్యయనం చేయడం వల్ల రెండు కుటుంబాలు ఎలా ప్రయోజనం పొందాయి?

11 ఒక యువ జంట తమ కుటుంబ జీవితాన్ని సంతోషకరంగా మార్చుకునేందుకు ఆత్మ ఫలంలోని లక్షణాల గురించి లోతుగా అధ్యయనం చేయాలని అనుకుంది. దానివల్ల వారెలా ప్రయోజనం పొందారు? భార్య ఇలా చెబుతోంది: “దయ చూపించాలంటే ఒకరికొకరు నమ్మకంగా, విశ్వసనీయంగా ఉండాలని తెలుసుకోవడం వల్ల ఒకరితో ఒకరం వ్యవహరించుకునే తీరులో ఎంతో మార్పు వచ్చింది. మేము అవతలి వ్యక్తి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, ఒకరినొకరు క్షమించుకోవడం నేర్చుకున్నాం. వీలైనప్పుడల్లా ‘థాంక్యూ,’ ‘సారీ’ అని చెప్పడం కూడా నేర్చుకున్నాం.”

12 వైవాహిక సమస్యలున్న మరో క్రైస్తవ జంట తాము ఒకరిపట్ల ఒకరు దయ చూపించుకోవడం లేదని గుర్తించారు. కాబట్టి వారిద్దరూ కలిసి దయ గురించి అధ్యయనం చేయాలని అనుకున్నారు. అలా అధ్యయనం చేయడం వల్ల వారెలా ప్రయోజనం పొందారు? భర్త ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “దయ గురించి అధ్యయనం చేయడం వల్ల ఎదుటి వ్యక్తిని నమ్మగలుగుతున్నాం, వారిలోని మంచిని చూడగలుగుతున్నాం. మేము ఒకరి అవసరాల పట్ల ఒకరం మరింత శ్రద్ధ తీసుకుంటున్నాం. నా భార్య ఏమైనా అన్నప్పుడు ఆమె మాటలను అపార్థం చేసుకోకుండా ఆమె మనసులో ఏముందో చెప్పమని అడగడం ద్వారా నేను దయ చూపించగలుగుతున్నాను. అందుకోసం నేను నా అహాన్ని పక్కనబెట్టాల్సి వచ్చింది. దయను చూపించడం వల్ల మమ్మల్ని మేము సమర్థించుకోవడం తగ్గించాం. దానివల్ల మేము ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం.” ఆత్మ ఫలంలోని లక్షణాల గురించి అధ్యయనం చేయడం వల్ల మీ కుటుంబం కూడా ప్రయోజనం పొందగలదేమో ఆలోచించండి.

ఒంటరిగా ఉన్నప్పుడు కూడా విశ్వాసాన్ని చూపించండి

13. యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేయగల వేటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి?

13 క్రైస్తవులు నలుగురిలోనే కాక ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని అనుసరించాలి. నేటి సాతాను లోకంలో అశ్లీల దృశ్యాలు, దిగజారిన వినోదం అంతకంతకూ ఎక్కువౌతున్నాయి. వాటివల్ల యెహోవాతో మనకున్న సంబంధం దెబ్బతినే ప్రమాదముంది. కాబట్టి క్రైస్తవులు ఏమి చేయాలి? దేవుని వాక్యం ఈ సలహా ఇస్తోంది: “సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.” (యాకో. 1:21) ఆత్మ ఫలంలోని మరో లక్షణమైన విశ్వాసాన్ని పెంచుకోవడం వల్ల మనం యెహోవా దృష్టిలో ఎలా పరిశుభ్రంగా ఉండగలమో ఇప్పుడు పరిశీలిద్దాం.

14. విశ్వాసం లోపించడం వల్ల ఒక వ్యక్తి తప్పు చేసే అవకాశం ఎందుకు ఉంది?

14 మనకు విశ్వాసం ఉంటే యెహోవాను ఒక నిజమైన వ్యక్తిగా ఎంచుతాం. అలా ఎంచకపోతే మనం తప్పు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వం దేవుని సేవకుల విషయంలో ఏమి జరిగిందో పరిశీలించండి. ఇశ్రాయేలీయులు రహస్యంగా హేయమైన పనులు చేస్తున్నారని యెహోవా యెహెజ్కేలు ప్రవక్తకు చెప్పాడు. యెహోవా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.” (యెహె. 8:12) వారలా ఎందుకు ప్రవర్తించారు? ఎందుకంటే, తాము చేసేవాటిని యెహోవా చూస్తున్నాడని వారు నమ్మలేదు. యెహోవాను వారు నిజమైన వ్యక్తిగా ఎంచలేదు.

15. యెహోవాపై బలమైన విశ్వాసం ఉంటే మనమెలా కాపాడబడతాం?

15 దానికి భిన్నంగా ఉన్న మరో ఉదాహరణ చూద్దాం. యోసేపు తన కుటుంబానికి, తన ప్రజలకు దూరంగా ఉన్నప్పటికీ పోతీఫరు భార్యతో వ్యభిచారం చేయడానికి నిరాకరించాడు. ఎందుకు? దానికి గల కారణాన్ని ఆయన చెప్పిన మాటల్లోనే గమనించండి: “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును?” (ఆది. 39:7-9) అవును, యెహోవా నిజమైన వ్యక్తి అని ఆయన నమ్మాడు. మనకు కూడా ఆ నమ్మకం ఉంటే, రహస్యంగా దిగజారిన వినోదాన్ని ఆస్వాదించం లేదా యెహోవాకు ఇష్టంలేని ఏ పనీ చేయం. “నా యింట యథార్థహృదయముతో నడుచుకొందును నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను” అని కీర్తనకర్త తీర్మానించుకున్నట్లు మనమూ తీర్మానించుకుంటాం.—కీర్త. 101:2, 3.

ఆశానిగ్రహాన్ని చూపిస్తూ మీ హృదయాన్ని కాపాడుకోండి

16, 17. (ఎ) సామెతల గ్రంథంలో వివరించబడినట్లు “బుద్ధిలేని పడుచువాడొకడు” ఎలా పాపమనే ఉరిలో పడ్డాడు? (బి) 26వ పేజీలో చూపించబడినట్లుగా, మనం ఏ వయసువారమైనా అలాంటి ఉరిలో పడిపోయే ప్రమాదముందని ఎలా చెప్పవచ్చు?

16 ఆత్మ ఫలంలోని చివరి లక్షణమైన ఆశానిగ్రహం ఉంటే మనం దేవుడు ద్వేషించే పనులను చేయడానికి ఇష్టపడం. అంతేకాక, మన హృదయాన్ని కాపాడుకోగలుగుతాం. (సామె. 4:23) సామెతలు 7:6-23లోని సన్నివేశాన్ని పరిశీలించండి. “బుద్ధిలేని పడుచువాడొకడు” ఓ వేశ్య వలలో ఎలా పడిపోయాడో ఆ లేఖనాలు వివరిస్తున్నాయి. అతడు ఆమె “సందుదగ్గరనున్న వీధిలో” తిరగడం వల్ల ఉరిలో పడ్డాడు. బహుశా కుతూహలంతో అతడు ఆమె ఇంటివైపు వెళ్లివుంటాడు. అతడు ఊహించనంత వేగంగా సంఘటనలు జరగడంతో, “తనకు ప్రాణహాని” తెచ్చే మూర్ఖపు మార్గంలో వెళ్తున్నానని ఆయన గుర్తించలేకపోయాడు.

17 ఆ ఘోరమైన తప్పు జరగకుండా ఉండేందుకు ఆయన ఏమి చేసివుండాల్సింది? “అది నడచు త్రోవలలోనికి పోకుము” అనే హెచ్చరికను పాటిస్తే ఆ తప్పు చేయకుండా ఉండేవాడు. (సామె. 7:25) దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? దేవుని ఆత్మ నిర్దేశాన్ని అనుసరించాలంటే శోధనకు గురిచేసే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మనం ఊరికే టీవీ చానళ్లను మారుస్తూ లేదా ఇంటర్నెట్‌ సైట్‌లను చూస్తూ ఉంటే ‘బుద్ధిలేని పడుచువాడు’ నడిచిన మూర్ఖపు మార్గంలో నడిచే ప్రమాదముంది. అలాచేస్తే, చూడాలనే ఉద్దేశం ఉన్నా లేకపోయినా మనం లైంగికంగా ఉద్రేకపరిచే దృశ్యాలను చూస్తాం. మెల్లమెల్లగా అశ్లీల దృశ్యాలను చూసే అపవిత్రమైన అలవాటుకు మనం బానిసలయ్యే ప్రమాదముంది. దానివల్ల మన మనస్సాక్షి, యెహోవాతో మనకున్న సంబంధం ఎంతగానో దెబ్బతింటాయి. అంతేకాక మన ప్రాణాలను అపాయంలో పడేసుకుంటాం.—రోమీయులు 8:5-8 చదవండి.

18. మనమెలా మన హృదయాన్ని కాపాడుకోవచ్చు? దానికోసం మనకు ఆశానిగ్రహం ఎందుకు అవసరం?

18 లైంగికంగా ఉద్రేకపరిచే దృశ్యం కనిపించిన వెంటనే మనం తగిన చర్య తీసుకోవడం ద్వారా ఆశానిగ్రహాన్ని చూపించవచ్చు, అలా చూపించాలి కూడా. అయితే, అసలు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం ఇంకా మంచిది. (సామె. 22:3) మనం కొన్ని కట్టుబాట్లు విధించుకొని వాటిని విధిగా పాటించాలంటే మనకు ఆశానిగ్రహం ఉండాలి. ఉదాహరణకు, మనకు కంప్యూటర్‌ ఉంటే దాన్ని అందరూ చూడగలిగే స్థలంలో పెట్టడం మంచిది. ఇతరులు ఉన్నప్పుడే కంప్యూటర్‌ను ఉపయోగించడం లేదా టీవీ చూడడం మంచిదని కొంతమంది గ్రహించారు. మరికొందరు అసలు ఇంటర్నెట్‌ కనెక్షనే వద్దనుకున్నారు. (మత్తయి 5:27-30 చదవండి.) ‘పవిత్ర హృదయంతో, మంచి మనస్సాక్షితో, నిష్కపటమైన విశ్వాసంతో’ యెహోవాను ఆరాధించగలిగేలా మనల్ని, మన కుటుంబాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుందాం.—1 తిమో. 1:5.

19. మనం పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని అనుసరిస్తే ఎలా ప్రయోజనం పొందుతాం?

19 పరిశుద్ధాత్మ పనిచేసినప్పుడు మనం చూపించే లక్షణాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సాత్వికం, దీర్ఘశాంతం సంఘంలో సమాధానానికి తోడ్పడతాయి. దయ, మంచితనం చూపించడం వల్ల కుటుంబం సంతోషంగా ఉంటుంది. విశ్వాసం, ఆశానిగ్రహం చూపిస్తే మనం యెహోవాకు సన్నిహితంగా ఉంటాం, ఆయన దృష్టిలో పరిశుభ్రంగా ఉండగలుగుతాం. అంతేకాక, “ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును” అని గలతీయులు 6:8 మనకు అభయమిస్తోంది. క్రీస్తు విమోచన క్రయధనం ఆధారంగా, యెహోవా తన ఆత్మ నిర్దేశాన్ని అనుసరించేవారికి నిత్యజీవాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్మను ఉపయోగిస్తాడు.

మీరెలా జవాబిస్తారు?

• సాత్వికం, దీర్ఘశాంతం సంఘంలో సమాధానానికి ఎలా తోడ్పడతాయి?

• క్రైస్తవులు ఇంట్లో దయను, మంచితనాన్ని ఎలా చూపించవచ్చు?

• విశ్వాసం, ఆశానిగ్రహం వల్ల హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[24వ పేజీలోని చిత్రం]

ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు వాదోపవాదాలు తలెత్తకుండా ఉండాలంటే మీరేమి చేయవచ్చు?

[25వ పేజీలోని చిత్రం]

ఆత్మ ఫలంలోని లక్షణాల గురించి అధ్యయనం చేయడం వల్ల మీ కుటుంబం ప్రయోజనం పొందుతుంది

[26వ పేజీలోని చిత్రం]

విశ్వాసం, ఆశానిగ్రహం చూపించడం వల్ల మనం ఎలాంటి ప్రమాదాలను నివారించవచ్చు?