అపొస్తలుల కార్యాలు 16:1-40

  • పౌలు తిమోతిని ఎంపిక చేసుకోవడం (1-5)

  • మాసిదోనియకు చెందిన వ్యక్తి గురించిన దర్శనం (6-10)

  • ఫిలిప్పీలో లూదియ విశ్వాసురాలు అవ్వడం (11-15)

  • పౌలును, సీలను చెరసాలలో వేయడం (16-24)

  • చెరసాల అధికారి, అతని ఇంటివాళ్లు బాప్తిస్మం తీసుకోవడం (25-34)

  • అధికారులు క్షమాపణ చెప్పాలని పౌలు అడగడం (35-40)

16  పౌలు దెర్బేకు, ఆ తర్వాత లుస్త్రకు+ వెళ్లాడు. అక్కడ తిమోతి+ అనే శిష్యుడు ఉన్నాడు. వాళ్ల అమ్మ ఒక విశ్వాసి, ఆమె యూదురాలు. కానీ వాళ్ల నాన్న గ్రీకువాడు.  తిమోతికి లుస్త్రలో, ఈకొనియలో ఉన్న సహోదరుల దగ్గర మంచిపేరు ఉంది.  పౌలు అతన్ని తన వెంట తీసుకెళ్లాలనే కోరికను వ్యక్తం చేశాడు. తిమోతి తండ్రి గ్రీకువాడని ఆ ప్రాంతాల్లోని యూదులందరికీ తెలుసు కాబట్టి వాళ్లను బట్టి+ పౌలు తిమోతికి సున్నతి చేయించాడు.  వాళ్లు ఒక నగరం నుండి ఇంకో నగరానికి వెళ్తూ యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలు నిర్ణయించిన ఆజ్ఞల్ని సహోదరులకు చెప్పి వాటిని పాటించమన్నారు.+  దానివల్ల సంఘాలు విశ్వాసంలో స్థిరపడుతూ ఉన్నాయి, విశ్వాసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.  అంతేకాదు, వాళ్లు ఫ్రుగియ గుండా, గలతీయ+ దేశం గుండా ప్రయాణించారు. ఎందుకంటే, ఆసియా ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటించకుండా పవిత్రశక్తి వాళ్లను అడ్డుకుంది.  తర్వాత వాళ్లు ముసియకు వచ్చినప్పుడు బితూనియలోకి+ వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే పవిత్రశక్తి ద్వారా యేసు* వాళ్లను వెళ్లనివ్వలేదు.  కాబట్టి వాళ్లు ముసియ దాటి* త్రోయకు వచ్చారు.  అయితే రాత్రిపూట పౌలుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో, మాసిదోనియకు చెందిన ఒక వ్యక్తి పౌలు ముందు నిలబడి, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయి” అని వేడుకుంటున్నాడు. 10  పౌలుకు ఆ దర్శనం రాగానే, మాసిదోనియ వాళ్లకు మంచివార్త ప్రకటించడానికి దేవుడే మమ్మల్ని పిలిపించాడని గుర్తించి మేము అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించాం. 11  కాబట్టి మేము త్రోయ నుండి ఓడ ఎక్కి నేరుగా సమొత్రాకే అనే ద్వీపానికి వెళ్లాం. తర్వాతి రోజు నెయపొలి అనే నగరానికి చేరుకున్నాం. 12  అక్కడి నుండి మేము ఫిలిప్పీ+ అనే రోమా నగరానికి* వెళ్లాం. ఇది మాసిదోనియ ప్రాంతంలో ప్రముఖ నగరం. మేము కొన్ని రోజులు ఆ నగరంలోనే ఉన్నాం. 13  ఆ నగర ద్వారం బయట, నది ఒడ్డున ప్రార్థనా స్థలం ఉంటుంది అనుకొని మేము విశ్రాంతి రోజున అక్కడికి వెళ్లాం. మేము అక్కడ కూర్చొని, అక్కడ సమావేశమైన స్త్రీలతో మాట్లాడడం మొదలుపెట్టాం. 14  అప్పుడు, ఊదారంగు వస్త్రాలు* అమ్ముకునే లూదియ అనే దైవభక్తిగల స్త్రీ మేము చెప్పేది వింటూ ఉంది. ఆమె తుయతైర + నగరానికి చెందినది. పౌలు చెప్తున్నవాటిని శ్రద్ధగా విని, అంగీకరించేలా యెహోవా* ఆమె హృదయాన్ని తెరిచాడు. 15  ఆమె, ఆమె ఇంటివాళ్లు బాప్తిస్మం తీసుకున్నప్పుడు+ ఆమె మమ్మల్ని, “నేను యెహోవాకు* నమ్మకంగా ఉన్నానని మీకు అనిపిస్తే వచ్చి నా ఇంట్లో ఉండండి” అని బ్రతిమాలింది. మొత్తానికి వాళ్లింటికి వెళ్లేలా ఆమె మమ్మల్ని ఒప్పించింది. 16  మేము ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు, చెడ్డదూత* పట్టిన ఒక పనమ్మాయి మాకు ఎదురుపడింది. ఆ దూత వల్ల ఆమె భవిష్యత్తు* చెప్పేది.+ అలా ఆమె తన యజమానులకు ఎంతో లాభం సంపాదించి పెట్టింది. 17  ఆ అమ్మాయి పౌలు వెనక, మా వెనక వస్తూ, “వీళ్లు సర్వోన్నత దేవుని దాసులు.+ వీళ్లు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు” అని అరుస్తూ ఉంది. 18  ఆమె చాలారోజుల పాటు అలా చేస్తూ వచ్చింది. చివరికి పౌలుకు విసుగొచ్చి, ఆమె వైపుకు తిరిగి చెడ్డదూతతో, “యేసుక్రీస్తు పేరున నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఆమెలో నుండి బయటికి రా” అన్నాడు. వెంటనే ఆ చెడ్డదూత ఆమెలో నుండి బయటికి వచ్చాడు.+ 19  ఆమె యజమానులు డబ్బులు సంపాదించుకునే అవకాశం పోయిందని+ గుర్తించినప్పుడు పౌలును, సీలను పట్టుకొని సంతలోకి ఈడ్చి పాలకుల ముందుకు తీసుకెళ్లారు.+ 20  వాళ్లు ఆ ఇద్దర్ని నగర పాలకుల ముందుకు తీసుకెళ్లి ఇలా అన్నారు: “వీళ్లు మన నగరంలో చాలా అలజడి రేపుతున్నారు.+ వీళ్లు యూదులు. 21  రోమీయులమైన మనం స్వీకరించలేని, పాటించలేని ఆచారాల్ని వీళ్లు బోధిస్తున్నారు.” 22  అప్పుడు ప్రజలంతా కలిసి వాళ్ల మీదికి లేచారు. వాళ్ల వస్త్రాలు చింపేసి, వాళ్లను కర్రలతో కొట్టమని నగర పాలకులు ఆజ్ఞాపించారు.+ 23  వాళ్లు పౌలును, సీలను చాలా దెబ్బలు కొట్టి, చెరసాలలో వేశారు. వాళ్లను జాగ్రత్తగా కాపలా కాయమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు.+ 24  కాబట్టి అతను వాళ్లను చెరసాల లోపలి గదిలో వేసి, వాళ్ల కాళ్లను బొండలో బిగించాడు. 25  అయితే దాదాపు మధ్యరాత్రి సమయంలో పౌలు, సీల ప్రార్థిస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు.+ ఖైదీలు అది వింటున్నారు. 26  అప్పుడు ఉన్నట్టుండి పెద్ద భూకంపం వచ్చింది. దానివల్ల చెరసాల పునాదులు కదిలాయి, వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, ప్రతీ ఒక్కరి సంకెళ్లు, బొండలు ఊడిపోయాయి.+ 27  చెరసాల అధికారి నిద్రలేచి చూసేసరికి చెరసాల తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి. దాంతో అతను ఖైదీలు పారిపోయారు అనుకొని తన కత్తి తీసి, తనను తాను చంపుకోబోయాడు.+ 28  అయితే పౌలు, “అలా చేయకు, మేమంతా ఇక్కడే ఉన్నాం!” అని బిగ్గరగా అరిచాడు. 29  అప్పుడు ఆ అధికారి దీపాలు తెమ్మని చెప్పి, లోపలికి పరుగెత్తి, భయంతో వణికిపోతూ పౌలు, సీల ముందు మోకరించాడు. 30  అతను వాళ్లను బయటికి తీసుకొచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. 31  వాళ్లు, “ప్రభువైన యేసు మీద విశ్వాసముంచు. అప్పుడు నువ్వు, నీ ఇంటివాళ్లు రక్షణ పొందుతారు”+ అని చెప్పారు. 32  అప్పుడు వాళ్లు అతనికి, అతని ఇంటివాళ్లందరికీ యెహోవా* వాక్యాన్ని ప్రకటించారు. 33  రాత్రి ఆ సమయంలోనే* అతను వాళ్లను తీసుకెళ్లి వాళ్ల గాయాల్ని కడిగాడు. తర్వాత ఆలస్యం చేయకుండా అతను, అతని ఇంటివాళ్లందరూ బాప్తిస్మం తీసుకున్నారు.+ 34  అతను వాళ్లను తన ఇంటికి తీసుకెళ్లి, వాళ్లకోసం భోజనం ఏర్పాటు చేశాడు. అతను ఇప్పుడు దేవుని మీద విశ్వాసముంచాడు కాబట్టి అతను, అతని ఇంటివాళ్లందరూ చాలా సంతోషించారు. 35  తెల్లవారినప్పుడు నగర పాలకులు రక్షక భటుల్ని పంపి, “వాళ్లను విడుదల చేయి” అని చెప్పారు. 36  చెరసాల అధికారి వాళ్ల మాటల్ని పౌలుకు చెప్తూ, “మిమ్మల్ని విడుదల చేయమని చెప్పడానికి నగర పాలకులు మనుషుల్ని పంపారు. కాబట్టి ఇప్పుడు మీరు బయటికి వెళ్లండి, మీరు విడుదలయ్యారు” అన్నాడు. 37  కానీ పౌలు వాళ్లతో, “రోమీయులమైన మమ్మల్ని+ వాళ్లు విచారణ చేయకుండానే అందరిముందు కొట్టి, చెరసాలలో వేశారు. ఇప్పుడేమో రహస్యంగా బయటికి వెళ్లగొడతారా? లేదు, వాళ్లే స్వయంగా వచ్చి మమ్మల్ని బయటికి తీసుకెళ్లాలి” అన్నాడు. 38  రక్షక భటులు ఈ మాటల్ని నగర పాలకులకు చెప్పారు. వాళ్లు రోమా పౌరులని విన్నప్పుడు ఆ పాలకులు భయపడ్డారు.+ 39  కాబట్టి వాళ్లు వచ్చి, క్షమించమని వేడుకున్నారు. తర్వాత వాళ్లను బయటికి తీసుకొచ్చి, నగరం విడిచి వెళ్లిపొమ్మని బ్రతిమాలారు. 40  అయితే వాళ్లు చెరసాల నుండి బయటికి వచ్చి లూదియ ఇంటికి వెళ్లారు. వాళ్లక్కడ సహోదరుల్ని చూసినప్పుడు వాళ్లను ప్రోత్సహించి,+ అక్కడి నుండి వెళ్లిపోయారు.

అధస్సూచీలు

లేదా “యేసు పవిత్రశక్తి,” అంటే దేవుని నుండి యేసు పొందిన పవిత్రశక్తి.
లేదా “గుండా.”
ఇది ఇటలీ వెలుపల ఉన్న నగరం, ఇక్కడి నివాసులకు ప్రత్యేక హక్కులు ఉండేవి.
లేదా “అద్దకం.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “సోదె.”
పదకోశం చూడండి.
అనుబంధం A5 చూడండి.
అక్ష., “ఆ గంటలోనే.”