న్యాయాధిపతులు 15:1-20

  • ఫిలిష్తీయుల మీద సమ్సోను ప్రతీకారం (1-20)

15  కొంతకాలం తర్వాత, గోధుమల కోతకాలంలో సమ్సోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడడానికి వెళ్లాడు. అతను, “నేను పడక గదిలో* నా భార్య దగ్గరికి వెళ్లాలనుకుంటున్నాను” అన్నాడు. కానీ ఆమె తండ్రి సమ్సోనును లోపలికి వెళ్లనివ్వలేదు.  ఆమె తండ్రి ఇలా అన్నాడు: “నువ్వు ఆమెను నిజంగా ద్వేషిస్తున్నావని నేను అనుకున్నాను.+ అందుకే నీతో ఉన్న యువకుల్లో ​ఒకతనికి ఆమెను ఇచ్చాను.+ ఆమె చెల్లి ఆమెకన్నా అందంగా ఉంటుంది, దయచేసి ఆమెకు బదులు ఈమెను తీసుకో.”  అయితే సమ్సోను ఇలా అన్నాడు: “ఈసారి నేను ఫిలిష్తీయులకు హాని చేస్తే వాళ్లు నన్ను తప్పు పట్టలేరు.”  కాబట్టి సమ్సోను వెళ్లి 300 నక్కల్ని పట్టుకొచ్చి, దివిటీల్ని తీసుకుని, రెండ్రెండు నక్కల తోకల్ని ముడివేశాడు; ఆ రెండు తోకల మధ్యలో ఒక దివిటీ పెట్టాడు.  తర్వాత అతను ఆ దివిటీల్ని వెలిగించి, ఆ నక్కల్ని ఫిలిష్తీయుల పంట చేలల్లోకి పంపించాడు. అతను పనల* నుండి, పంట చేల దాకా ప్రతీదాన్ని, అలాగే ద్రాక్షతోటల్ని, ఒలీవ తోటల్ని తగలబెట్టాడు.  అప్పుడు ఫిలిష్తీయులు, “ఈ పని చేసింది ఎవరు?” అని అడిగారు. “తిమ్నా వాసి అల్లుడైన సమ్సోను ఈ పని చేశాడు. ఎందుకంటే సమ్సోను భార్యను ఆమె తండ్రి సమ్సోనుతో ఉన్న ఒక ​యువకునికి ఇచ్చాడు”+ అని వాళ్లకు చెప్పారు. దాంతో ఫిలిష్తీయులు వెళ్లి ఆమెను, ఆమె తండ్రిని తగలబెట్టారు.+  అప్పుడు సమ్సోను వాళ్లతో, “మీరు ఇలా చేశారు కాబట్టి, మీ మీద పగ తీర్చుకునే వరకు నేను ఊరుకోను” అన్నాడు.+  అతను ఒకరి తర్వాత ఒకర్ని చంపుతూ, అలా చాలామందిని హతం చేశాడు. తర్వాత అతను వెళ్లి, ఏతాము బండలోని గుహలో* నివసించాడు.  తర్వాత ఫిలిష్తీయులు వచ్చి యూదాలో మకాం వేసి, లేహీ+ అంతటా తిరగడం మొదలుపెట్టారు. 10  అప్పుడు యూదావాళ్లు, “మీరెందుకు మా మీదికి వచ్చారు?” అన్నారు. దానికి ఫిలిష్తీయులు, “మేము సమ్సోనును పట్టుకుని,* అతను మాకు చేసినట్టే మేము అతనికి చేయడానికి వచ్చాం” అని చెప్పారు. 11  కాబట్టి 3,000 మంది యూదావాళ్లు ఏతాము బండలోని గుహలో* ఉన్న సమ్సోను దగ్గరికి వచ్చి, “​ఫిలిష్తీయులు మనల్ని ​పరిపాలిస్తున్నారని+ నీకు తెలీదా? మరి నువ్వు మాకు ఎందుకిలా చేశావు?” అన్నారు. అందుకు సమ్సోను, “వాళ్లు నాకు చేసినట్టే నేను వాళ్లకు చేశాను” అన్నాడు. 12  కానీ వాళ్లు అతనితో, “నిన్ను పట్టుకుని* ఫిలిష్తీయులకు అప్పగించడానికి వచ్చాం” అన్నారు. అప్పుడు సమ్సోను వాళ్లతో, “మీరు నన్ను చంపరని నాకు ఒట్టేయండి” అన్నాడు. 13  అందుకు వాళ్లు, “లేదు, మేము నిన్ను బంధించి వాళ్ల చేతికి అప్పగిస్తాం అంతే, మేము మాత్రం నిన్ను చంపం” అన్నారు. వాళ్లు రెండు కొత్త తాళ్లతో అతన్ని బంధించి, ఏతాము బండలో నుండి తీసుకొ​చ్చారు. 14  సమ్సోను లేహీకి వచ్చినప్పుడు, అతన్ని చూడగానే ఫిలిష్తీయులు విజయోత్సాహంతో పెద్దగా కేకలు వేశారు. అప్పుడు యెహోవా పవి​త్రశక్తి సమ్సోనును శక్తిమంతుణ్ణి చేసింది,+ దాంతో అతని చేతులకు ఉన్న తాళ్లు మంటల్లో కాలిన నారపోగుల్లా తెగిపోయాయి, అతని ​చేతులమీద నుండి ఊడిపోయాయి.+ 15  సమ్సోనుకు, మగ గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి కనిపించింది; అతను చెయ్యి చాపి దాన్ని అందుకుని దానితో 1,000 మంది పురుషుల్ని చంపాడు.+ 16  అప్పుడు సమ్సోను ఇలా అన్నాడు: “ఒక గాడిద దవడ ఎముకతో, ఒక కుప్ప, రెండు కుప్పలు వేశాను! ఒక గాడిద దవడ ఎముకతో 1,000 మందిని చంపాను.”+ 17  అతను అలా అన్నాక, ఆ దవడ ఎముకను పడేసి ఆ స్థలానికి రామత్లెహీ*+ అని పేరు పెట్టాడు. 18  అప్పుడు అతనికి బాగా దాహం వేసింది, దాంతో అతను యెహోవాకు ఇలా ​మొరపెట్టాడు: “నువ్వే నీ సేవకుడి చేతికి ఇంత గొప్ప రక్షణను ఇచ్చావు. కానీ ఇప్పుడు నేను దాహంతో చనిపోయి, సున్నతిలేని వాళ్ల చేతుల్లో పడాలా?” 19  కాబట్టి దేవుడు లేహీలో ఒక గుంటను తెరిచాడు, దానిలో నుండి నీళ్లు ​ఉబికాయి.+ నీళ్లు తాగాక సమ్సోనుకు శక్తి* వచ్చింది, అతను ​తేరుకున్నాడు. అందుకే అతను ఆ స్థలానికి ఏన్హక్కోరె* అని పేరు పెట్టాడు, అది ఈ రోజు వరకు లేహీలోనే ఉంది. 20  సమ్సోను ఫిలిష్తీయుల కాలంలో 20 సంవ​త్సరాలు ఇశ్రాయేలులో న్యాయాధిపతిగా ఉన్నాడు.+

అధస్సూచీలు

లేదా “లోపలి గదిలో.”
లేదా “ధాన్యపు వెన్నుల కట్టల.”
లేదా “సందులో.”
లేదా “కట్టేసి.”
లేదా “సందులో.”
లేదా “కట్టేసి.”
“దవడ ఎముకల కొండ” అని అర్థం.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
“వేడుకునే వాని ఊట” అని అర్థం.